బుధవారం, డిసెంబర్ 22, 2010

దీక్షలు

రాష్ట్రంలో ప్రస్తుతం దీక్షల సీజన్ నడుస్తోంది. నల్లని దుస్తుల్లో అయ్యప్ప భక్తులు, ఎర్రని దుస్తుల్లో కనకదుర్గ భక్తులు నిష్టగా రోజులు గడుపుతున్నారు. పూజలు, ఉపవాసాలు, భజనలతో దీక్షలు కొనసాగించే భక్తులని చూడడం కొత్త విషయం కాదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం మన చుట్టూ వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కొందరైతే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటూ ఉంటారు కూడా.

ఈ దీక్షకి కారణం కేవలం భక్తి మాత్రమే కాదంటే ఆశ్చర్యపడనవసరం లేదు. భక్తి తో పాటుగా ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్లకి ఉంటూ ఉంటాయి. ఆయా కారణాలు వాళ్ళని దీక్ష దిశగా ప్రేరేపిస్తూ ఉంటాయి. అయ్యప్ప దీక్షలు పాపులర్ అయ్యాక భవాని దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష లాంటివి నెమ్మదిగా జనంలోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడు చిన్న చిన్న ఆలయాల్లో కూడా దీక్షలు ఇవ్వడం, భక్తులు వాటిని స్వీకరించడం జరుగుతోంది.

అరుదుగా మాత్రమే కనిపించే రెండో రకం దీక్షలూ ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా చర్చనీయం అయ్యాయి. అవును, రాజకీయ నాయకులకి రైతుల సమస్యలు కళ్ళకి కనిపించడంతో వారిలో ధర్మాగ్రహం పెల్లుబికి నిరసన దీక్షకి కూర్చునేలా చేశాయని ఆయా నాయకుల అనునూయులు టీవీ చానళ్ళలో చెబుతున్నారు. ప్రస్తుతం నిరసన దీక్ష జరుపుతున్న ఇద్దరు నాయకుల అంతిమ లక్ష్యమూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడమే అన్నది ఏ ఊళ్ళో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెప్పే మాట.

రైతుల కోసం దీక్ష చేపట్టిన ఇద్దరు నాయకుల్లోనూ ఒకాయన తనకి అపారమైన పాలనానుభావం ఉందన్న విషయాన్ని సందర్భం వచ్చినా రాకపోయినా ఇష్టంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తన అనుభవాన్ని పాలక పక్షం గుర్తించడం లేదన్నది ఆయన నోటినుంచి తరచూ వినిపించే ఫిర్యాదు. సాంకేతికతని అందిపుచ్చుకుని రాష్ట్రానికి బంగారు తాపడం చేసేయాలనే కుతూహలం కారణంగా కావొచ్చు, ఆయన తన పాలనాకాలంలో వ్యవసాయం లాంటి చిన్నచిన్న విషయాలపై దృష్టి పెట్టలేకపోయారు.

ఇప్పుడు తానున్నది అధికారంలో కాక ప్రతిపక్షంలో కావడంతో రైతులవంటి బడుగు జీవుల కష్టాలని గుర్తించ గలుగుతున్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆయనకి ముఖ్యమంత్రి అన్ని రకాల పళ్ళూ తెచ్చి తినిపించబోతుండగా, ఆయన వద్దు వద్దంటూ తన పక్క మంచం మీద మరణ శయ్య మీద ఉన్న రైతుకు వాటిని తినిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్టుగా ఓ దినపత్రిక నిన్నటి సంచికలో వచ్చిన కార్టూను చూసి నవ్వాపుకోడం నా వల్ల కాలేదు. కార్టూన్ అంటేనే వ్యంగ్యం అయినప్పటికీ, మరీ ఇంత వ్యంగ్యమా?

తన 'బలాన్ని' నిరూపించుకోడానికి, ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోకుండా ఉండడానికి సర్వదా సిద్ధంగా ఉన్న యువనేత సైతం రైతులకోసం దీక్ష మొదలు పెట్టారు. వేషాలు లేక మేకప్పులు వెలిసిపోయిన సినిమా వాళ్ళు, రాజకీయ ఊసరవల్లులు ఆయనకి మద్దతు పలికారు, పలుకుతున్నారు. ఆయన సొంత మీడియా చాన్సుని దొరకబుచ్చుకుని 'నేల ఈనిందా? ఆకాశం బద్దలయిందా?' అంటూ జనం మీద 'వార్తలని' రుద్దేస్తోంది.

ఈ యువనేత పదే పదే వల్లెవేసే 'మహానేత' పాలనలోనూ రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నది నివేదికల సాక్షిగా తేలిన నిజం. మరి ఆయన మొదలు పెట్టిన పథకాలు ఎవరికి చేరాయన్నది ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రతిపక్షాలకీ తన సమస్యలమీద చిత్తశుద్ధి లేదన్న సంగతి రైతుకి మళ్ళీ మళ్ళీ అర్ధమవుతోంది. తనని చుట్టుముట్టిన కష్టాలని మర్చిపోయి, కాసేపు హాయిగా నవ్వుకోడానికైనా ఈ చిత్తశుద్ధి లేని దీక్షలు రైతులకి ఉపయోగ పడుతున్నందుకు మనలాంటివాళ్ళం సంతోష పడాలి.

11 కామెంట్‌లు:

  1. హ హ బాగుందండీ ! ఎంత సీరియస్ విషయం ఐనా మీ స్టైల్ లో భలే సున్నితం గా చెబుతారు . ఇంకా అప్పుడేనా జనవరి లో ఎన్ని విచిత్రాలు చూడాలో .
    Get ready to watch ;)

    రిప్లయితొలగించండి
  2. >>తనని చుట్టుముట్టిన కష్టాలని మర్చిపోయి, కాసేపు హాయిగా నవ్వుకోడానికైనా ఈ చిత్తశుద్ధి లేని దీక్షలు రైతులకి ఉపయోగ పడుతున్నందుకు మనలాంటివాళ్ళం సంతోష పడాలి.<<

    మరే బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి ఎప్పటిలాగే. బాగా రాశారు. ఆ కార్టూన్ చూసి ఏంచెయ్యాలో, ఏంచేస్తే అప్పుడు కలిగిన ఒకలాంటి అదేదో రకమైన మానసిక స్థితి నుండి బయటపడతానో అర్ధం కాలేదు. ఏదో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఫీలింగ్.
    సదరు నేత గారి దీక్షని భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసి ఆరుగురు హఠాన్మరణం చెందారట. అదే దినపత్రికలో నిన్న రాశారు. చదివారా?
    ఇక రెండు రోజుల దీక్షలో ఎన్ని అనర్ధాలు జరుగుతాయో! వారి వార్తాపత్రిక చూసే ధైర్యం చేయలేదు ఈరోజు.

    రిప్లయితొలగించండి
  4. <<>>

    ఇది శ్రీధర్ కి పంపించాల్సిందే.. మంచి కార్టూన్ వేస్తాడు.:)

    రిప్లయితొలగించండి
  5. మురళిగారు చాలా బాగా చెప్పారు. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి కే.సీ.ఆర్., ఇప్పుడు వీళ్ళు. రాజధానిలో ప్రతీ రోజు మాలాంటి సామన్యుల జీవితం దుర్భరంగా తయారయ్యింది. చదువు పూర్తిగా చట్టుబండలైపోయింది. దినదినగండంగా ఉంది. మా కోసం కూడా ఎవరైనా దీక్ష చేపడితే బాగుండు:)

    రిప్లయితొలగించండి
  6. ఏ విషయాన్నైనా బలే రాస్తారండి మీరు .వ్యంగ్యంగానైనా,హాస్యంగా నైనా మనసుకి ఎక్కేలా చాలా బాగుంటుంది.
    వేషాలు లేక మేకప్పులు వెలిసిపోయిన సినిమా వాళ్ళు, రాజకీయ ఊసరవల్లులు ఆయనకి మద్దతు పలికారు, పలుకుతున్నారు.బాగా చెప్పారు... అందరూ రాష్ట్రాన్ని ఎలేయాలని కలలు కనేవాళ్ళే..అమ్మో టివి నైన్ లో న్నిన్నంతా ఇదే గొడవ .యాంకర్ రజనికాంత్ వాళ్ళందరి గొడవా చిద్విలాసంగా వింటూ పండగ చేసుకున్నాడు..

    రిప్లయితొలగించండి
  7. భలే!
    నేత = ముతకగా నేసిన గుడ్డ
    మహానేత = సన్నని దారంతో నాజూగ్గా నేసిన వస్త్రం :)

    రిప్లయితొలగించండి
  8. << తనని చుట్టుముట్టిన కష్టాలని మర్చిపోయి, కాసేపు హాయిగా నవ్వుకోడానికైనా ఈ చిత్తశుద్ధి లేని దీక్షలు రైతులకి ఉపయోగ పడుతున్నందుకు మనలాంటివాళ్ళం సంతోష పడాలి. >>

    pai comment lo idi miss ayindi

    రిప్లయితొలగించండి
  9. @శ్రావ్య వట్టికూటి: నిజమనండీ, ఎన్ని చూడాలో... ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @శిశిర: నాకైతే ఆ కార్టూన్ చూడగానే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చిందండీ.. ఆత్మహత్యల వార్తలు చూశానండీ, ఏమిటో మరీ లేత గుండెలు.. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  10. @సవ్వడి: సదరు పళ్ళ కార్టూన్ శ్రీధర్ దే నండీ.. ధన్యవాదాలు.
    @జయ: మనకోసం మనమే దీక్షలు చేసుకుని బ్లాగుల్లో రాసుకోవాలండీ.. అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @రాధిక(నాని): ఎవరిగోల వారిది అనుకోడమే మన పని :-) ధన్యవాదాలండీ..
    @కొత్తపాళీ: భలే బాగుందండీ. మరి యువనేత? పూర్తిగా తయారుకాని వస్త్రమా :-):-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి