ఆదివారం, నవంబర్ 21, 2010

ఖాకీ సుమన్

"సంకల్పం గొప్పది" అని మురారి సినిమాలో మహేష్ బాబు చేత ఓ డైలాగ్ చెప్పించాడు కృష్ణవంశీ. నిజమే.. సంకల్పం గొప్పది కాకపొతే తలచినంతనే సుమన్ బాబు ప్రత్యక్షం అవుతాడా? మొన్నామధ్యన కృష్ణాష్టమి నాడు కన్నయ్య కనిపించలేదనే ఆవేదనతో ఓ టపా రాశాను. 'ఎక్కడికి పోతాడు, వచ్చేస్తాడు లెమ్మని' మిత్రులు ఓదార్చారు. కొత్తపాళీ గారైతే తధాస్తు దేవతలు ఉంటారని ఊరడించారు. సంకల్ప బలమో, తధాస్తు దేవతల వరమో తెలీదు కానీ సుమన్ బాబు దర్శన భాగ్యం కలిగింది, ఇవాల్టి ఈనాడు ఆదివారం చివరి పేజిలో.

'నాన్ స్టాప్ కామెడీ' నాటికన్నా కొంచం చిక్కాడు బాబు. ఖాకీ యూనిఫాం వేసుకుని, గంభీరంగా చూడడానికి ప్రయత్నిస్తూనే అప్రయత్నంగా నవ్వు పుట్టించేశాడు. ఎక్కువగా వివరాలేమీ ఇవ్వలేదు. బాబు ఫోటో పెద్దది వెయ్యగా మిగిలిన చోటులో ఆయనకి కుడివైపున నమస్కరిస్తున్న రెండు చేతులు, వాటికింద 'అంకితం' అనీ, ఎడమ వైపున 'ప్రీమియర్ షో త్వరలో ఈటీవీలో...' అని మాత్రమే ఇచ్చారు. ఇక పేజి కింది భాగంలో ఎడమ వైపున దర్శకత్వం ఇంద్రనాగ్ అనీ, నిర్మాత సుమన్ ('బాబు' లేదు, అయినా ఈ విషయంలో ఎలాంటి ప్రకటనా లేదు కాబట్టి నేను సుమన్ బాబు అనే వ్యవహరిస్తున్నా) అనీ వేశారు.

కాస్త పరకాయించి చూస్తే బాబు ధరించింది పోలిస్ యూనిఫాం అని అర్ధమయ్యింది. ఎడమ భుజం మీద 'పోలిస్' లోగో కనబడింది. కుడి జేబు పైన సి. విజయ్ బాబు అన్న పేరు కనిపిస్తోంది. ఇంటి పేరునీ ('సి') బాబునీ మన బాబు వదులుకోక పోవడం తన అసలుపేరు పట్ల ఆయన మమకారాన్ని సూచిస్తోంది. తగు మాత్రంగా ఉన్న బొజ్జని బిగించి పెట్టిన బెల్టు మీద కూడా పోలిస్ లోగో ఉంది. రెండు భుజాలూ నక్షత్రాలు లేకుండా ఖాళీగా ఉన్నాయి కాబట్టి పోలిస్ డిపార్టుమెంటులో నీతినీ, న్యాయాన్నీ కాపాడే కానిస్టేబుల్ పాత్రని బాబు పోషించి ఉండొచ్చని ఊహిస్తున్నాను ప్రస్తుతానికి.


ఈ 'అంకితం' టెలిఫిల్మా లేక సినిమానా అన్న విషయం ఎప్పటిలాగే సస్పెన్స్ గా ఉంచారు సుమన్ బాబు. అలా అని చూస్తూ ఊరుకోలేం కదా. కుంచం కష్టపడి కాసిన్ని విశేషాలు తెలుసుకున్నాను. అందిన సమాచారం మేరకు ఈ 'అంకితం' ఒక టెలిఫిలిం. ఈటీవీలో త్వరలో ప్రసారం కాబోతోంది. థియేటర్ రిలీజ్ బహుశా ఉండకపోవచ్చు. 'నాన్ స్టాప్ కామెడీ' లో నెగిటివ్ ఛాయలున్న అన్నయ్య పాత్ర పోషించిన సుమన్ బాబు 'అంకితం' లో పూర్తి పాజిటివ్ పాత్రని పోషించారు. "కుటుంబ బంధాలకి విలువనిచ్చే" పాత్రలంటే తనకి ఇష్టమని అప్పుడెప్పుడో ఒక ఇంటర్యూ లో చెప్పిన విషయం మనందరికీ గుర్తుంది కదా. ఇది అలాంటి పాత్ర అయి ఉండొచ్చు.

ఇప్పటికే క్రియేటివ్ హెడ్ గా తనని తాను నిరూపించుకున్న ఇంద్రనాగ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయనకి కూడా కుటుంబ బంధాలంటే ఇష్టం కాబట్టి ఇలాంటి కథని ఎంచుకుని ఉండొచ్చు. విధి నిర్వహణలో సిన్సియర్ ఉద్యోగిగా పోలిస్ శాఖకీ, అన్నగా ఇంట్లో కుటుంబ సభ్యులకీ పూర్తిగా అంకితమైన విజయ్ బాబు పాత్రలో సుమన్ బాబు బహుశా పూర్తిగా ఒదిగిపోయి ఉండొచ్చు. పాత్రోచితమైన నటనని ప్రదర్శించడం కోసం కొత్త విగ్గుని వాడడం ఆహార్యం పట్ల బాబు శ్రద్ధకి నిదర్శనంగా అనిపిస్తోంది.

నిజం చెప్పాలంటే ఈ 'అంకితం' ప్రకటన నన్ను కొంచం నిరాశ పరిచింది. 'నాన్ స్టాప్ కామెడీ' తర్వాత సుమన్ బాబు ఓ భారీ జానపద చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడంతో పాటు, అమ్మాయిల కలల రాకుమారుడిగా కథానాయక పాత్ర పోషిస్తారని ఎదురు చూస్తూ వచ్చాను. ఖర్చుకి వెనకాడకుండా సొంత స్టుడియోలో సెట్టింగులు వేయించి, నిర్మాణ విలువల విషయంలో అస్సలు రాజీ పడకుండా సినిమా తీయడం ఆయనకి పెద్ద పనేమీ కాదు. అయితే అస్సలు ఊహించని విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ వైపు మొగ్గు చూపారు. తర్వాత వచ్చేది జానపద చిత్రమే అవుతుందేమో.. ఎదురు చూద్దాం.

30 కామెంట్‌లు:

  1. ఆదివారం పూట ఇదేమి పోస్టండీ, ఎదో నా పాటికి నేను సరదాగా అన్ని బ్లాగులు చదివేస్తుంటేను, ఇలా బెదరగొట్టారే,.., ఐతే కొన్నాళ్ళు ఈ.టివిలో యాడ్స్‌కి చోటు లేదన్నమాట, ఎదో ఈ మధ్యే బాగుపడుతున్నది అనుకున్నాను ఆహా, సుమనుడు వదిలేలా లేదే,
    మిమ్మల్ని నిరాశ పరచినా, మాలంటి అర్భకులకి నాసిలో గైరు, భారీ జానపద చిత్రమా..

    మీటపా చూసి నిజమే అనుకుంటాడెమో సుమా, కేక పుట్టించారుగా.. అదుర్స్

    రిప్లయితొలగించండి
  2. "బాబు ఫోటో పెద్దది వెయ్యగా మిగిలిన చోటులో ఆయనకి కుడివైపున నమస్కరిస్తున్న రెండు చేతులు"
    ఇంకో రెండు చేతులు నావి కూడా.
    "నిజమే.. సంకల్పం గొప్పది కాకపొతే తలచినంతనే సుమన్ బాబు ప్రత్యక్షం అవుతాడా?"
    నిజమే ఈ సంకల్పం ఇంకో వికల్పానికి దారితీస్తుందేమో?తెలుగు సినీ ప్రేక్షకులకి ఇంక మిగిలున్న కొసప్రాణం కూడా జారిపోతుందన్నమాట మరికొద్దిరోజుల్లో.

    రిప్లయితొలగించండి
  3. హిహి.. నేను ప్రొద్దున్నే పేపర్లో చూసి ఆహా! ఏమి శుభావార్త అని కడు ఆనందించితిని.. కానీ అంతలోనే మా దృశ్యశ్రవణ యంత్రం మరమత్తుల్లో ఉన్నదని మరపుకి వచ్చి మిక్కిలి దుఖించితిని.. :(
    ఏది ఏమైనా అధ్యక్షా, మా టి.వి బాగయ్యేవరకూ, ఈ చిత్రరాజాన్ని ప్రదర్శించరాదని నేను సుమన్ బాబు అభిమానుల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.. ఇదీ సంగతి.. చిత్తగించవలెను.. :P

    రిప్లయితొలగించండి
  4. మురళి గారు మీకు సుమన్ బాబు మీద వున్న అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తోంది

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు మీకు సుమన్" బాబు" మీద వున్న అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తోంది
    నేను చాలా రోజుల నుంచి తెలుగు బ్లాగులు ఫాలో అవుతున్నా వ్యాఖ్య చెయ్యడం తెలుగులొ టైపు చెయ్యడం నేర్చుకుని ఇప్పుడే చేస్తున్నా.
    మీ బ్లాగు లో చాలా పుస్తకాల గురించి తెలిసింది. ధన్యవాదాలు - రమ్య

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు ఉదయం ఈనాడు పుస్తకం వెనుక వైపు సుమన్ ఫోటో చూడగానే మీరే గుర్తుకొచ్చారు..మీరు తప్పక దీనిమీద ఓ టపా వ్రాస్తారనుకున్నాను:))

    రిప్లయితొలగించండి
  7. మీరు ఇలాంటి విషయాల మీద టపాలు వ్రాస్తే మీ బ్లాగు చదవడం కష్టమే.

    రిప్లయితొలగించండి
  8. ఏటండి ..సుమన్ అంటే అంతిష్టమా??
    మళ్ళి ఈటివిలో కొన్నిరోజులపాటు ఆయనగారిని భరించాలా:(((

    రిప్లయితొలగించండి
  9. ఏవిటో మురళిగారిని ఈ సుమన్ బాబు వదిలేట్లు లేడు. మిమ్మల్నిద్దర్ని విడదీయాలంటే ఏంచేయాలో కొంచెం చెప్పరూ...ప్లీజ్!!!!!

    రిప్లయితొలగించండి
  10. హ్హహ్హహ్హా.. సుమన్‌బాబు మిమ్మల్ని వెంటాడతాడా? మీరు సుమన్‌బాబుని వెంటాడతారా? ఈనాటి ఈ బంధమేనాటిదో కదా! :) పరకాయించి చూసి మరీ వివరాలు కనిపెట్టి మా మీదకి వదిలారంటే మీ అభిమానానికి బాబుగారి కళ్ళు చమరుస్తున్నాయో లేదో కానీ, నా కళ్ళు చెమరుస్తున్నాయి. ఇలాంటి అభిమాని దొరకడం ఆయన జన్మజన్మల అదృష్టం.

    రిప్లయితొలగించండి
  11. టోపీ మీద ఎంబ్లం మార్చి నాలుగు ఏనుగులు పెట్టాలి కనిపించని ఆ నాలుగో ఏనుగే రా ఈ పోలీసు సుమన్ అంటూ ఊగిపోతూ చెప్తాడేమో డవిలాగు ఏమైనా నా దగ్గర హనుమాన్ చాలీసా ఉంది నాకేం భయం లేదు.

    రిప్లయితొలగించండి
  12. ఆహా ఈ వ్యక్తి మళ్ళీ ఈటీవిని పట్టబోతున్నాడా... పాపం రామోజీ... ప్రీమియర్ అంటున్నాడంటే ఏదైనా టెలీఫిల్మ్ ఏమో... ఏమైనా మీ అభిమానానికి మాత్రం జోహార్లు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  13. మురళీ, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల గురించి పోస్ట్ రాసేప్పుడు ముందు మీరో disclaimer పెట్టాలండి, 'గుండె జబ్బులున్నవారు జాగ్రత్త ' అని! :))

    రిప్లయితొలగించండి
  14. సుమన్ బాబు అభిమాన సంఘం ఒకటి పెడదామా మురళి గారూ,మీరు అధ్యక్షుడిగా,నేను ఉపాధ్యక్షుడుగా.

    రిప్లయితొలగించండి
  15. విశ్వనాధ్ గారు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబదడడానికి కనీసం ఒక సుమన్ సినిమా చూడాలనే requirement ఉంది అనుకుంటా ఆండీ
    మురళి గారు బ్లాగర్లలో మీకు ఉన్నంత ధైర్యం మాకెవరికీ లేదండీ..తొందరగా వాడు ఆ తెలేఫిలం రిలీజ్ చేస్తే టపా కోసం waiting :)

    రిప్లయితొలగించండి
  16. @తార: ప్రకటనలు మరీ ఎక్కువ రావడం లేదండీ ప్రస్తుతానికి. రానురాను పెంచుతారేమో చూడాలి.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: "నిజమే ఈ సంకల్పం ఇంకో వికల్పానికి దారితీస్తుందేమో?" :-) :-) ..ధన్యవాదాలండీ..
    @మేధ; దృశ్య శ్రవణ యంత్రమునకు త్వరితగతిన మరమ్మతు చేయించండి.. నూతన సంవత్సర కానుక అనుకుంటా :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. హహ్హహ్హా.. మురళి గారూ.. సుమన్ బాబు మళ్లీ వస్తున్నాడని తెలియగానే మీరు ఆనంద డోలికల్లో మునుగి తేలుతున్నారని అర్థం అయింది..
    శ్రీనివాస్ పప్పు గారూ..
    >>నిజమే ఈ సంకల్పం ఇంకో వికల్పానికి దారితీస్తుందేమో?
    భలే చెప్పారు..
    విశ్వనాథ్ గారు అన్నట్లు ఒక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసేస్తే సరి..:D:D

    రిప్లయితొలగించండి
  18. @వెన్నెల్లో ఆడపిల్ల: స్వాగతం అండీ.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: మీరిలా రాస్తారని నేనూ అనుకున్నానండీ :-) :-) ..అంత పెద్ద ప్రకటన చూశాక రాయకుండా ఎలా ఉండగలను చెప్పండి? ..ధన్యవాదాలు.
    @బోనగిరి: అంతేనంటారా?? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @రాధిక (నాని): బోల్డంత వినోదం పంచుతారు కదండీ :-) ..ధన్యవాదాలు.
    @జయ: యెంత మాట!! తన సినిమాలూ అవీ ఏమీ చూడకపోవడం వల్ల మీరిలా అంటున్నారు కానీ... ధన్యవాదాలండీ..
    @శిశిర; అందరూ పరకాయించి చూస్తారో లేదో అని రాశానండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @ఆత్రేయ: పాపం.. బాగా తగ్గాడండీ.. ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది కదా.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: టెలి ఫిలిం మాత్రమె అని సమాచారం అండీ.. ధన్యవాదాలు.
    @సవ్వడి: ఏదో మీ అభిమానం :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. @నిషిగంధ: నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తినేశాయ్.. మీరు అర్జెంటుగా సుమన్ బాబు సినిమా ఏదన్నా చూడాల్సిందే :-) ..ధన్యవాదాలండీ..
    @విశ్వనాధ్: అబ్బే.. నాకు పదవులు వద్దండీ.. ఫ్లాగ్ బేరర్ గానే ఉంటాను.. మీరు, హరేక్రిష్ణగారు.. మీరంతా సంఘం పెడితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి? :-) ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: అయితే కొత్త సంవత్సరం వరకూ ఎదురు చూడాల్సిందేనండీ.. ఆయన, మీరు ఆ రెండు పదవులూ తీసుకోండి. :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @నిషిగంధ: నా మనోభావాలు తీవ్రంగా దెబ్బ తినేశాయ్.. మీరు అర్జెంటుగా సుమన్ బాబు సినిమా ఏదన్నా చూడాల్సిందే :-) ..ధన్యవాదాలండీ..
    @విశ్వనాధ్: అబ్బే.. నాకు పదవులు వద్దండీ.. ఫ్లాగ్ బేరర్ గానే ఉంటాను.. మీరు, హరేక్రిష్ణగారు.. మీరంతా సంఘం పెడితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి? :-) ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: అయితే కొత్త సంవత్సరం వరకూ ఎదురు చూడాల్సిందేనండీ.. ఆయన, మీరు ఆ రెండు పదవులూ తీసుకోండి. :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @మనసు పలికే: పైకి ఒప్పుకోడం లేదు కనీ అందరికీ ఆనందమేనండీ.. :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. కాస్త పరకాయించి చూస్తే బాబు ధరించింది పోలిస్ యూనిఫాం అని అర్ధమయ్యింది. ఈ వ్యాక్య బలే నవ్వించింది.
    పాత్రోచితమైన నటనని ప్రదర్శించడం కోసం కొత్త విగ్గుని వాడడం ఆహార్యం పట్ల బాబు శ్రద్ధకి నిదర్శనంగా అనిపిస్తోంది.
    హ..హ..హహ్హా...నవ్వపుకోలేకపోతున్నాను

    రిప్లయితొలగించండి
  25. :) :) భలే భలే.. మీ అభిమానం సుమన్ బాబుకి ఎప్పుడు తెలుస్తుందో ఏవిటో! అదేగానీ జరిగితే ఆనందంతో పిచ్చెక్కిపోగలదు బాబుకి. :)

    రిప్లయితొలగించండి
  26. మురళి గారు, కామెంటాడానికి కొంచెం ఆలస్యమైందండీ..
    ఆదివారం ఈనాడు పత్రిక చూడగానే మీరే గుర్తొచ్చారండీ..
    దాంతో పాటు నా అదృష్టం కొద్దీ 'అంకితం' టీసర్ ని చూసానండీ..
    దాంతో బాబుగారిపై నాకు అంచనాలు అమాంతాం పెరిగిపోయాయి.దానితో మీ టపా పై... బాబు గారు సరే అది సినిమానో టెలిఫిల్మో అని తెలియక మనలాంటి అభిమానులని సస్పెన్స్లో పెడితే మీరు కూడా అలాగే సస్పెన్స్లో పెడుతూ అంచనాలు పెంచుతూ టపా రాసారు. ఎలా ఉంటుందో ఏంటో సినిమా లేక టెలిఫిల్మ్.

    రిప్లయితొలగించండి
  27. @భాను: :-) :-) ..ధన్యవాదాలండీ..
    @మధురవాణి: అంత పని జరగదులెండి :-) :-) ..ధన్యవాదాలు.
    @స్నిగ్ధ: టెలి ఫిలిం అని తెలిసిందని రాశాను కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. అది టెలీ ఫిల్మో ...సీరియలో తెలీదు కాని దాంట్లో సుమన్ బాబుకి బ్రెయిన్ ట్యూమర్ అని ప్రోమో చూసినవారి ద్వారా విన్నాను...ప్చ్ ..గుండె దిటవు చేసుకోండి మురళి గారూ !

    రిప్లయితొలగించండి