మంగళవారం, మార్చి 02, 2010

చిత్ చోర్

మూడున్నర దశాబ్దాల క్రితం.. రాజశ్రీ సంస్థ నుంచి సినిమా అంటే ఆడంబరంగా జరిగే గొప్పింటి పెళ్ళిళ్ళు, నడిచే నగల దుకాణాల్లా కనిపించే స్త్రీ పాత్రలు, అరగంటకో, ముప్పావు గంటకో ఒకసారి 'బిజినెస్ టూర్' అంటూ కాసేపు అదృశ్యమై మిగిలిన సమయం అంతా ఇంట్లోనే తింటూ, తాగుతూ, ఆట పాటలతో గడిపే పురుష పాత్రలూ, అంత గొప్పవాళ్ళతోనూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే పనివాళ్ళూ ఉండే కథతో వచ్చే సినిమా.. అన్న ముద్ర పడ్డానికి చాలా ముందు.. ఆ సంస్థ నుంచి వచ్చిన ఒకానొక సున్నితమైన ప్రేమకథ 'చిత్ చోర్, ' ఇదో మధ్యతరగతి మందహాసం.

'మానస చోరుడి'గా (చిత్ చోర్) ప్రధాన పాత్ర పోషించిన వాడు అమోల్ పాలేకర్. డెబ్భైల నాటి సగటు మధ్యతరగతి యువకుడికి అచ్చమైన ప్రతిరూపం. నిజానికీ ఇదీ పెళ్లి కథే.. కానీ ఒక భిన్నమైన కథ. మధుపూర్ అనే ఒక పల్లెటూళ్ళో స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న పీతాంబర్ చౌధురి (ఏ.కే. హంగల్) మూడో కూతురు గీత (జరీనా వహెబ్ - 'గాజుల కిష్టయ్య' లో మన సూపర్ స్టార్ కృష్ణ తో నటించిన అమ్మాయి) పెళ్లి కథ. ఆమెకో మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలన్నది చౌధురి కుటుంబ సభ్యులందరి ఆశ.

ఎస్సెల్సీ చదువుతూ, అర్ధిమేటిక్ పేపర్ పాసవ్వగలనా లేదా అని భయపడే గీతకి పసితనం పోదు. ఏడెనిమిదేళ్ళ బుడతడు దీపక్ కుమార్ అగ్నిహోత్రి అలియాస్ దీపు (మాస్టర్ రాజు శ్రేష్ఠ) తో ఆమెకి స్నేహం. ఇద్దరూ కలిసి రోజంతా ఆడే ఆటలు పతంగులు ఎగరేయడం, నీళ్ళలో పడవలు వదలడం, చెట్టునున్న కాయలని రాళ్ళతో గురి చూసి కొట్టడం.. "నువ్వు పెద్దదానివి అవుతున్నావు గీతా" అని తల్లి (దీనా పాఠక్) చేసే హెచ్చరికలని ఏమాత్రం పట్టించుకోదు గీత. ఆమె ఆటపాటలు ఆమెవి.

ఒకరోజు చౌధురి కి బొంబాయి లో ఉంటున్న పెద్ద కూతురు మీరా నుంచి ఒక ఉత్తరం వస్తుంది. తనకి తెలిసిన ఇంజినీర్ మధుపూర్ లో బ్రిడ్జి కట్టడానికి వస్తున్నాడనీ, అతనికి గీత గురించి చెప్పాననీ, అతను ఇష్టపడితే అది తమ కుటుంబానికి పెద్ద అదృష్టమనీ రాస్తుంది మీరా. గీతని అతనితో మాట్లాడనివ్వమని తల్లికి చెప్పమనీ, మరీ పాత పద్ధతుల్లో వుండొద్దనీ సూచిస్తుంది. కూతురు రాసిన ప్రకారం రాబోయే ఇంజనీర్ కోసం ఒక పెద్ద ఇల్లు చూసి ఉంచి, అతన్ని రిసీవ్ చేసుకోడానికి స్టేషన్ కి వెళ్తాడు చౌధురి.

బొంబాయి నుంచి వచ్చిన వినోద్ (అమోల్ పాలేకర్) చౌదురిని కలుసుకుని, అతని ఇంటికి వచ్చి ఆతిధ్యం అందుకుంటాడు. గీత పరిచయం అవుతుంది. మొదట్లో అతన్ని అంతగా ఇష్టపడని గీత, క్రమక్రమంగా అతని మీద ఇష్టం పెంచుకుంటుంది. అతని దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటుంది. వినోద్-దీపు మంచి స్నేహితులవుతారు. వినోద్ గీతని ఇష్ట పడడాన్ని సంతోషంగా గమనిస్తారు చౌధురి దంపతులు. పెళ్ళికి ముహూర్తం పెట్టించాలని అనుకుంటుండగా మీరా నుంచి మరో ఉత్తరం వస్తుంది. తను చెప్పిన ఇంజనీర్ ప్రయాణం అప్పుడు వాయిదా పడిందనీ, ఇప్పుడు రాబోతున్నాడనీ..




మరి వినోద్ ఎవరు? సదరు ఇంజనీర్ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి. ఇంజనీర్ సునీల్ కిషన్ (విజయేంద్ర ఘట్గే) ని తన ఇంటికి తీసుకు వస్తాడు చౌధురి. అది తన ఇల్లే అన్నట్టు హడావిడి చేస్తాడు వినోద్. అతను తీసుకునే అతి చనువు చౌధురి దంపతులకి నచ్చదు. పైకి ఏమీ అనలేరు. గీత కి మాత్రం చెప్పేస్తారు. వినోద్ ని మర్చిపోమ్మనీ, సునీల్ కిషన్ ఆమెని ఇష్టపడితే అతనికిచ్చి పెళ్లి చేస్తామనీ. గీత-వినోద్ లు కలుసుకోకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. మరో పక్క సునీల్ గీత గురించి వినోద్ అభిప్రాయం అడుగుతాడు. గీత-కిషన్ ల పెళ్లి చేయాలని అనుకుంటున్నారనీ, మొదట తనని సునీల్ గా పొరబడ్డారనీ అర్ధం అవుతుంది వినోద్ కి. గీత తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది ముగింపు.

బసు చటర్జీ స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఈ కథ మన ఎదురింట్లోనో, పొరుగింట్లోనో జరుగుతోందా? అనిపిస్తుంది. పాత్రలని మలచిన తీరు మరీ ప్రత్యేకమైనది. ఎక్కడా నాటకీయత అన్నది కనిపించదు. అమోల్, జరీనా పోటీ పడి నటించారు. మిగిలిన పాత్రల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చౌధురి భార్య గా నటించిన దీనా పాఠక్, ఆవిడని చూస్తున్నంత సేపూ సినిమాలో పాత్ర అని అస్సలు అనుకోలేం. అంత సహజంగా చేసింది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ అంటూ లేని ఈ సినిమా ఆసాంతమూ నవ్వుల్ని పూయిస్తుంది. సున్నితమైన భావోద్వేగాలు ప్రతి సన్నివేశం లోనూ కనిపిస్తాయి.

సంగీతాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ఇది. గీత రచన, సంగీత దర్శకత్వం బాధ్యతలని రవీంద్ర జైన్ విజవంతంగా పూర్తి చేశారు. పాటలన్నీ దక్షిణాది గాయకుడు జేసుదాస్ పాడారు, హేమలత తో కలిసి. ముందుగా చెప్పుకోవాల్సిన పాట గురించి బోల్డన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. ప్రతి పాటా మొదట చెప్పుకోవాల్సిందే అయినప్పటికీ నా చాయిస్ మాత్రం 'గోరి తేరా గావ్ బడా ప్యారా.." అసలు ఈ పాట ప్రారంభంలో వచ్చే హమ్మింగే మనల్ని ఒక మూడ్ లోకి తీసుకెళ్ళి పోతుంది. తన ఇంటికి బొకే తో వచ్చిన గీత, దీపులని కూర్చోపెట్టి మధుపూర్ అందాలని వర్ణిస్తూ వినోద్ పాడే పాట ఇది.

గీత-వినోద్ పాడుకునే పాట 'జబ్ దీబ్ జలే ఆనా..' ఎక్కడికో వెళ్ళిపోతాం ఈ పాట వింటున్నప్పుడు. వినోద్ గీతకి సంగీతం నేర్పించి, సునీల్ ఎదురుగా ఆమెచేత పాడించే/ఆమెతో కలిసి పాడే పాట 'తుజో మేరె సుర్ మే..' ఇది కూడా మనసుని తాకేదే. మొదటి సగం హుషారుగానూ, రెండో సగం బరువుగానూ సాగే పాట 'ఆజ్ సే పెహలే..' గీత, సునీల్, వినోద్, దీపు కలిసి పిక్నిక్ కి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ వినోద్ పాడే గీతం. తిరుగు ప్రయాణంలో, సునీల్-గీత ల పెళ్లి గురించి తెలిసినప్పుడు వినోద్ పాడే చరణాన్ని జేసుదాస్ పాడిన తీరు, అమోల్ అభినయించిన తీరూ పోటీ పడ్డాయి. గీతకి మాత్రమే కాదు, ప్రేక్షకులకీ 'చిత్ చోర్' అయిపోతాడు వినోద్.

ఈ కథ మీద రాజశ్రీ సంస్థ కి ఎంత ప్రేమ అంటే, మధ్య తరగతి నేపధ్యాన్ని గొప్పింటికి మార్చేసి ఇదే కథ ని 'మై ప్రేమ్ కీ దీవానీ హూ' గా తీసి విడుదల చేశారు ఏడేళ్ళ క్రితం. 'చిత్ చోర్' డీవీడీ ని మోజర్ బేర్ సంస్థ విడుదల చేసింది. వెల రూ. 45. తొంభై ఐదు నిమిషాల నిడివి ఉండే ఈ బుల్లి సినిమా మనం 'రీ ఛార్జ్' అవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు చూడదగ్గది.

24 కామెంట్‌లు:

  1. నాకిష్టమైన బసుదా సినిమాల్లో ఇదీ ఒకటి. ఇహ జేసుదాస్ పాటల గురించి మాట్లాడే పనే లేదు. మంచి పరిచయం అనడం మీ బ్లాగుకొచ్చి అనవసరం.

    రిప్లయితొలగించండి
  2. తెలుగులో ఇలాంటి సినెమా చూసినట్టు గుర్తు...చంద్రమోహన్ హీరో...

    రిప్లయితొలగించండి
  3. It's a very nice movie. I saw this movie several times. My favourite song in the film is "Gori tera gav bada pyara".

    రిప్లయితొలగించండి
  4. ఇదేవిటీ ట్విస్టు..ఆ మధ్యన ఎప్పుడో హిందీ పెద్దగా తెలిదు అన్నట్టున్నారు? ఇలా హటాత్తుగా సర్ ప్రైజ్ చేసేశారు.
    ఈ సినిమాలో జేసుదాస్ గారు తన గాత్రం తో అందరిని మంత ముగ్ధుల్ని చేసేశారు.
    ఇకపోతే సునీత గారన్నట్టు..మీ బ్లాగ్ కి వచ్చాక, ఇది మంచి టపా అని ప్రత్యేకించి ఏ ఒక్క టపా గురించీ చెప్పనవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  5. ఈసారి 'లీడర్ 'ని చూపించడానికో లేక 'ఏమ మాయ చేసావే' అని మాదగ్గర చెప్పుకోడానికో వస్తారనుకుంటే ఎంత చక్కని క్లాసిక్ ప్రేమకధని మళ్ళీ మ కళ్ళముందు నిలిపారండి!!

    బసు ఛటర్జీ సినిమాల్లో పాత్రలన్నీ మన చుట్టు పక్క తిరిగుతూ మనకి పరిచయమైన వ్యక్తుల్లానే ఉంటారు.. ఆయన సినిమాల్లో చిత్ చోర్ తోపాటు ఖట్టా మీఠా, బాతో బాతో మే, ఛోటీ సీ బాత్ `కూడా నాకు చాలా ఇష్టం..

    ఈ సినిమాలో పాటలన్నీ బావున్నా నా మొదటి ఛాయిస్ మాత్రం 'గోరి తెరా' నే! :-)

    రిప్లయితొలగించండి
  6. ఏనాటికీ మరచి పోలేని చాలా చక్కటి సినిమా అండి. మళ్ళీ 'గొరి తెర గావ్ బడా ప్యారా' అనే అన్నారుగా:)

    రిప్లయితొలగించండి
  7. "ఈ కథ మీద రాజశ్రీ సంస్థ కి ఎంత ప్రేమ అంటే, మధ్య తరగతి నేపధ్యాన్ని గొప్పింటికి మార్చేసి ఇదే కథ ని 'మై ప్రేమ్ కీ దీవానీ హూ' గా తీసి విడుదల చేశారు"
    మరే మనం "గారెలు" వండుకుని,మళ్ళీ వాటినే పెరుగులో నానపెట్టి"ఆవళ్ళు" గా పేరు మార్చి తిన్నట్టే.ఏదేమయినా దేని రుచి దానిదే అలాగన్నమాట.(మనకి చిత్-జిహ్వ చాపల్యం,వారికి చిత్ర చాపల్యం అనుకోవాలేమో).

    రిప్లయితొలగించండి
  8. నాకు కథ సరిగ్గా గుర్తులేదుకానీ ,ఈసినిమా ఎప్పుడో దూరదర్శన్ లో వేస్తే చూసాను .గోరితెరా పాట నాకునచ్చిన పాత హిందీ పాటలలో ఒక్కటి .

    రిప్లయితొలగించండి
  9. బలే మంచి సినిమా కదు. నాకు కూడా ఇష్టం. బలే గుర్తు చేసేరు.

    రిప్లయితొలగించండి
  10. ఈ సినిమా చూళ్ళేదు కానీ, ఇదే కథ చంద్రమోహన్, జయసుధ, శరత్ బాబు (?) నటించగా చిన్నప్పుడెప్పుడో చూసినట్టు గుర్తొస్తోంది :-)
    జేసుదాస్ పాటల గురించి కొత్తగా ఏం చెప్పగలం..మళ్ళీ మళ్ళీ విని ఆనందించడం తప్ప :-)

    రిప్లయితొలగించండి
  11. ఇదే స్టొరీ తో తెలుగు లో సినిమా చూసినట్టు గుర్తు. ఇప్పుడే డౌన్లోడ్ చేసానండి పాటలు.............. ధన్యవాదాలు.....

    రిప్లయితొలగించండి
  12. కధకు ఎన్ని పాత్రలుంటే చాలో, కేవలం అన్నే పాత్రలతో నడిచే కధా, అధ్బుతమైన మ్యూజిక్, చెవుల్లొ అమృతం పోసినట్టుండే యేసుదాస్ గారి గాత్రం. మార్వలెస్.అసలు ఆయన గళంలోంచి వచ్చే ఏ పాటైనా మధురాతి మధురమే.. ఈ సినిమాలో మరీనూ.. మరువలేని సినిమా. చూసినప్పుడే కాదు తలుచుకున్నప్పుడు కూడా ఎంతో హాయిని గొలిపే సినిమా. తెలుగులో దీనిని 'అమ్మాయి మనసూ అనే పెరుతో చంద్రమోహన్, జయసుధలతో తీసారు. మూడో పాత్ర ఎవరో గుర్తు లేదు. ఇలాంటి పాత్రలని అలవాటుగానూ, అలవోకగానూ పోషించే శరత్బాబు అయివుండవచ్చు. తెలుగులో నాకేమీ నచ్చలేదు ఈ సినిమా.. రాజుని చూసిన కళ్ళతో. అనుకోవచ్చేమో..

    రిప్లయితొలగించండి
  13. @సునీత: ధన్యవాదాలండీ..
    @రాజ్: 'అమ్మాయి మనసు' అంటున్నారండీ బ్లాగ్మిత్రులు.. మీరూ ఆలోచించండి.. ధన్యవాదాలు.
    @సత్య సోమ శేఖర్ సింగ్: ఎన్ని సార్లు చూసినా విసుగు రాకపోవడం ఈ సినిమా ప్రత్యేకత అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @ప్రణీత స్వాతి: తోడా తోడా మాలూం హై జీ.. ధన్యవాదాలు.
    @నిషిగంధ: స్టార్లు మరియు వారసులకీ నాకూ పెద్దగా పడదండీ.. అదీ సంగతి.. అన్నట్టు మీరు చెప్పిన సినిమాలు నా జాబితాలో ఉన్నాయ్ :-) చూడబోతే అందరి వోటూ 'గోరి తేరా..' కే పడినట్టు ఉందండీ.. ధన్యవాదాలు.
    @జయ: అవునండీ.. నేను మాట మీద నిలబడతాను :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @అభిజ్ఞాన: ధన్యవాదాలండీ..
    @శ్రీనివాస్ పప్పు: 'చిత్ చోర్' ని మీరు నేతి గారెలతో పోల్చినా అభ్యంతర పెట్టను కానీ, ఆ రెండో సినిమాని 'ఆవడలు' అనడం మాత్రం అన్యాయమండీ :-) మీరు చెప్పిన సామ్యం మాత్రం భలేగా ఉంది.. ధన్యవాదాలు.
    @రాధిక (నాని); దూరదర్శన్ లో అప్పుడప్పుడూ ఈ సినిమా, కొంచం తరచుగా పాటలూ వస్తుంటాయండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @భావన: ధన్యవాదాలండీ..
    @మధురవాణి: 'అమ్మాయి మనసు' అంటున్నారండీ ఆ సినిమా.. వీలైనప్పుడు ఈ సినిమా చూడండి.. ధన్యవాదాలు.
    @శ్రీకర్ బాబు: అప్పుడే వినడం మొదలు పెట్టేశారన్న మాట!! ..ధన్యవాదాలండీ..
    @ప్రసీద: "ఇలాంటి పాత్రలని అలవాటుగానూ, అలవోకగానూ పోషించే శరత్బాబు అయివుండవచ్చు." భలే నవ్వించారండీ.. మన మిత్రులంతా శరత్ బాబు అనే అంటున్నారు.. నిజమేనండీ పాటల గురించి యెంత చెప్పినా తక్కువే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. అవునండీ ...అమ్మాయి మనసు సినిమానే ...హిందీ భాష రాకపోయినా సినిమాలు చూసేస్తాను :) జీసినిమా చానల్లో చూసినట్టు గుర్తు ! అయినా మీ పరిచయం చదవటం అదో ఆనందం !

    రిప్లయితొలగించండి
  18. its really a good movie

    Aug 04 2009
    అయ్యయ్యో.. మీ 'ఎయిట్ పాయింట్ సంవన్' సీరియల్ కోసం ఎదురు చూస్తుంటే, ఇలాంటి కబురు చెప్పారు మీరు.. త్వరలో ఓ లాప్టాప్ వారవ్వాలని కోరుకుంటూ....

    March 04 2010
    మురళి గారు ఇప్పటికి అయ్యిదండీ లాప్టాప్ తీసుకోవడం..మొదటి కామెంట్ మీదే

    thank you :)

    రిప్లయితొలగించండి
  19. మంచి సినిమాకు మంచి పరిచయం :-) బాగుందండీ. పాటలు అన్నీ బాగుంటాయ్ కానీ ’గోరి తెరా’ పాట పదే పదే వినడం తో మిగిలినవి వెనక పడిపోతాయ్ :-)

    రిప్లయితొలగించండి
  20. @పరిమళం: నా హిందీ కూడా అంతంత మాత్రమేనండీ.. ఈ సినిమా బాగా నచ్చుతుంది నాకు.. ధన్యవాదాలు.
    @హరేకృష్ణ: కొంచం తరచుగా మీ టపాలు చూడొచ్చన్న మాట.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: 'గోరి తేరా..' నిజమేనండీ.. నాకైతే ఆ పాట విన్నాక కాసేపు ఇంకేమీ వినాలని అనిపించదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. చాలా బాగా పరిచయం చేసారండి సినిమాని.నేను ఈ సినిమాని ఇంతవరకు చూడలేదు,ఇప్పుడు తప్పకుండా చూస్తాను.ఇలా ఆణిముత్యాల లాంటి సినిమాలను మాకు తప్పక పరిచయం చెయ్యండి.

    Thanks for introducing this movie.I will watch it ASAP.I used google transliterator and wrote in telugu,if there are problems reading the text,please tell me.

    రిప్లయితొలగించండి
  22. @స్వాతి: అభినందనలండీ.. విజయవంతంగా తెలుగులో వ్యాఖ్య రాసినందుకు.. సినిమా మిమ్మల్ని నిరాశ పరచదనే అనుకుంటున్నా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. hello muraligaru,
    మంచి సినిమా గుర్తు చేసారండి. అసలు అమోల్పాలేకర్ సినిమాలే ప్రేత్యకమినవి.ఎంతో ఇష్టపడి చూస్తాను నేను.అందులో ఇదో ఒకటి.ఇక గోరి తేరా పాటకి నిజమే మరోలోకానికి వెళ్లినట్టు వుంటుంది.మీకు మరోసారి థాంక్స్.

    రిప్లయితొలగించండి