ఆదివారం, డిసెంబర్ 27, 2009

ఓ వైవిధ్య భరితమైన కథ

"నేను ఎప్పటికైనా చూడగలనా..." అని నిరాశ పడిపోతున్న తరుణంలో చూశాను.. ఆపై చదివాను.. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ. ఒకప్పుడు మంచి కథలు ప్రచురించిన 'ఈనాడు ఆదివారం' లో 'బాగుంది' అనిపించిన కథ చదివి చాలా వారాలయ్యింది. కథల పోటీ ప్రకటించినప్పుడు "ఈ రకంగా అయినా మంచి కథలు చదవొచ్చు" అనుకున్నా. ప్రధమ బహుమతికి అర్హమైన కథ ఏదీ లేదని, ద్వితీయ, తృతీయ మరియు కన్సొలేషన్ బహుమతులు ప్రకటించినప్పుడు "అవి ఎలా ఉంటాయో" అన్న కుతూహలం కలిగింది.

అయితే ఆ కుతూహలాన్ని రెండు, మూడు బహుమతులు గెలుచుకున్న కథలు ఇట్టే మింగేశాయి. "అనవసరంగా ఆశలు పెంచుకున్నా.." అని నన్ను నేను తిట్టుకుంటున్న సమయంలో వచ్చిన రెండు కథలు - రెండూ కన్సొలేషన్ బహుమతికి ఎంపికయినవే - చదివినప్పుడు మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. ఆ వెంటనే జడ్జిమెంటు గురించి కూసింత సందేహమూ మొదలయ్యింది. అంతలోనే "వాళ్ళ పోటీ..వాళ్ళిష్టం" అనిపించింది.

ముఖ్యంగా ఇవాల్టి సంచికలో వచ్చిన 'ఎత్తరుగుల అమెరికా వీధి ' కథ.. బహుమతి కథల్లో ఇప్పటివరకూ ప్రచురించిన వాటిలో నాకు బాగా నచ్చిన కథ. 'ఈనాడు ఆదివారం' మార్కు "పిల్లలు అమెరికా వెళ్ళిపోతే వృద్ధులైన తల్లిదండ్రులు ఒంటరిగా పడే వేదన" కథా వస్తువుని కూసింత మార్చి, ముళ్ళపూడినీ, వంశీనీ, మధ్యే మధ్యే శ్రీరమణనీ గుర్తు చేస్తూ సాగిన కథనం ఆసాంతమూ చదివించింది. పడుచు జంట చిలిపి తగువుల ద్వారా కథ చెప్పించడం ద్వారా మొనాటనీ ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించిన రచయితని మనసులోనే అభినందించేశాను. ఈ కథని ఇక్కడ చదవొచ్చు.

గతవారం వచ్చిన 'అడుగుల చప్పుడు' కథ కూడా మరీ 'కన్సొలేషన్ బహుమతి' తో సరిపెట్టాలసింది కాదు అనిపించింది. నిజానికి కథలో కూడా వస్తువు పాతదే.. చాలా సార్లు ఇదే పత్రికలో కొద్దిపాటి మార్పు చేర్పులతో వచ్చినదే. ఆకథలో కూడా ఆకట్టుకున్నది కథనమే. భార్య, భర్తల రోల్ రివర్సల్.. వాళ్ళు పడ్డ ఇబ్బందులు..ఒకరినొకరు అర్ధం చేసుకోడం.. ఇదీ కథ.. ముందుగా చెప్పినట్టు, కథ కన్నా చెప్పిన విధానం ఆకట్టుకుంది.

మొత్తం మీద ఈ పోటీ వల్ల, ముఖ్యంగా ఫలితాలలో ప్రధమ బహుమతికి అర్హమైన కథ ఏదీ లేదన్న ప్రకటన చూశాక, తెలుగులో మంచి కథల కొరత ఎంతగా ఉందో మరోసారి అర్ధమయ్యింది. నిజానికి మంచి కథలు రావడంలేదా? లేక ఈ పోటీలు మంచి కథలకి వేదికలు కాలేక పోతున్నాయా? అన్న సందేహం కూడా కలిగింది. మంచి కథలకి అందుతున్న ప్రోత్సాహం ఏపాటిది? అన్న మరో సందేహం కూడా..

ఒకప్పుడు పత్రికలు ప్రధమ బహుమతి ఇచ్చిన కథలు ఇప్పటికీ చిరంజీవులుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రధమ బహుమతికి అర్హమైన కథలే లేకుండా పోయాయి. ఈ అంశాన్ని గురించి సాహిత్య రంగంలో విశేషంగా చర్చ జరగాల్సి ఉందని ఒక పాఠకుడిగా నాకు అనిపిస్తోంది. పోటీల నిర్వాహకులు సైతం మారుతున్న కాలమాన పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని న్యాయ నిర్ణయం చేయాలేమో..

28 కామెంట్‌లు:

  1. మురళి గారు, ఈ రోజు ఈనాడు ఆదివారం లో వచ్చిన కధ నాకు కూడా బాగా నచ్చింది. శ్రీరమణ గారి మిధునం కధ గుర్తు చేసినా, కధలోని పాయింటు బాగుంది.
    నాకైతే ఒక ఫాంటసీలా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు, 200 టపాలు పూర్తి చేసారు. అభినందనలు. మీరు చెప్పిన కథ కూడా చదువుతాను.

    రిప్లయితొలగించండి
  3. ద్విశతటపోత్సవ శుభాకాంక్షలు.
    రేపు ఉదయం ఆరు గంటలకి ఒకసారి నా బ్లాగు చూడండి.

    రిప్లయితొలగించండి
  4. బాగుందండీ కథ .మీ పరిచయం చూసాకే పుస్తకం తీసి చదివాను .

    రిప్లయితొలగించండి
  5. మురళి గారూ, లాస్ట్ వీక్ కధ నచ్చింది భార్యా భర్తలు ఒకరి కష్టం మరొకరు పది ఆ సాధక బాధకాలు అర్ధం చేసుకొని జీవించడం ! ఈవారం బిజీగా ఉండి పేపరు చూడలేదు కధకూడా రేపు పేపర్తో మూలకేల్లిపోయేదేమో ..మీ టపా చూడకపోతే !ఈ కధని మిస్ ఐపోయేదాన్నిబిక్కవోలు.... మాఊరి పక్కనే ..కాకినాడ ,మండపేట ..అన్నీ అక్కడక్కడే :) కధలోని సుబ్బారాయుడి గుడి ...అక్కడ సుబ్రహ్మణ్య షష్టి చాలాబాగా చేస్తారు .కధలోని అంశం వాస్తవానికి కాస్త దూరం అనిపించినా ఊహించటానికి అందంగా ఉంది .

    రిప్లయితొలగించండి
  6. ఏంటి మురళీ రెండు వందల టపాలు వ్రాసావా !!! ఆ కిటుకేదో కొద్దిగా చెవులో ఊదరూ

    రిప్లయితొలగించండి
  7. రెండువందల టపాలు పూర్తి చేసిన సందర్భంలో హృదయపూర్వక అభినందనలు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  8. బాగా చెప్పారు..
    అలానే లింక్ అందజేసినదుకు ధన్య వాదాలు.
    కధలు లేవు అనే అభిప్రాయం నాకు లేదు. కానీ మంచి కధలను ఇలాంటి పోటీల దాక తీసుకు రావడం లేదని. తద్వారా వాటికి మంచి ప్రచారం కలగజేయడం లేదని నేననుకుంటున్నాను. తెచ్చిన ఒక్కోసారి వాటికి అన్యాయం జరిగే వీలు లేకపోలేదు. అయితే ఇక్కడ రచయితల వద్ద కూడా చిన్న లోపముంది. మంచి కధలను రాసుకుని వారి ఇళ్ళల్లో పెట్టుకుని, సన్నిహితులతో పంచుకోవడమే కాకుండా నలుగురి ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తే చదివిన వారికి కూడా ఆనందాన్ని ఇచ్చిన వారౌతారు అలాగే సద్విమర్సలను పొందగలుగుతారు.

    రిప్లయితొలగించండి
  9. నిన్న మేము రైల్లో వస్తుంటే అదొక్కటే పేపర్ దొరకటంతో అనుకోకుండా ఈ కధ చదివి బావుందనుకున్నానండీ..

    200 వ టపాకు శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  10. 200 నెమలికన్నులు పోగు చేసుకుని మా మురళీధరుడు ద్విశతాక్షుడయ్యారు.
    మరి సహస్రాక్షుడు ఎప్పుడవుతారా అని ఎదురు చేస్తున్నాను.
    అందుకోండి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. Generallu Eenadu stories are redundant in theme and substance, and presentation. But I wondered is it Eenaadu that published this one.

    Not that it is a gr8 story, but is somewhat readable

    రిప్లయితొలగించండి
  12. వామ్మో రెండొందలు దాటేశారు. చదివేందుకు లక్ష్మణ్ లాగా ఉన్నా సెహ్వాగ్‌లా రాసేశారుగా. నాదింకా యాభైకూడా దాటలే. ప్చ్ ద్రావిడ్, మంజ్రేకర్ వారసుడను.

    రిప్లయితొలగించండి
  13. మురళిగారు ముందుగా రెండొందల టపాలు పూర్తిచేసినందుకు అభినందనలు.

    ఈ కథపూర్తిచేశాక మీరే గుర్తొచ్చారు ఖచ్చితంగా పదిల పరచుకుని ఉంటారు అని ఊహించా. నేనూ చదివిన వెంటనే చాలా నచ్చి ఒక కాపీ సేవ్ చేశాను త్వరలో నా బ్లాగ్ లో పెట్టుకోడానికి. గతవారం కథ కూడా బాగానే ఉంది కానీ కాస్త బోరుకొట్టింది.

    రిప్లయితొలగించండి
  14. ద్విశతటపోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  15. బాగుందండీ ఈ కథ మీ టపా చూసాకే చదివాను.. మంచి కథని పరిచయం చేసారు

    రిప్లయితొలగించండి
  16. అయ్యబాబోయ్ ...మురళి గారు , ఎలా గమనించకుండా వెళ్లి పోయానో తెలీటం లేదు .అందులోనూ మీ టపా చూడగానే ఈనాడు కధ చదివే హడావుడిలో అందునా బిక్కవోలు అనేసరికి ....:(
    అప్పుడే ద్విశతం పూర్తిచేశారా ?ద్విశతోత్సవ శుభవేళ అందరికంటే ఆలస్యంగా చెబుతున్నాననుకోక అందుకోండి నా అభినందనలుకూడా !

    రిప్లయితొలగించండి
  17. ప్చ్, నాకెందుకో అంత నచ్చలేదు :( అందమైన రొమాన్స్ తప్ప పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ కనబడటంలేదు.. పైన పరిమళం గారు చెప్పినట్టు ప్రధాన అంశం వాస్తవానికి దూరంగా ఉండటం వలన మనసుని పట్టేయలేకపోయింది..

    రెండొందల టపాలకు శుభాభినందనలు :-)

    రిప్లయితొలగించండి
  18. @బోనగిరి: నిజమేనండీ ఒక అందమైన ఫాంటసీ.. ధన్యవాదాలు.
    @జయ: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: చాలా పెద్ద బహుమతి ఇచ్చారండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @కొత్తపాళీ: Thank you
    @చిన్ని: ధన్యవాదాలండీ..
    @పరిమళం: ఓహ్.. మీ ఊరి పక్కనేనా.. 'గుర్తుకొస్తున్నాయి..' పాడేసుకున్నారా మరి?! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @భాస్కర రామిరెడ్డి: 'హృదయస్పందనల చిరుసవ్వడి' విన్నప్పుడల్లా నాకూ అనిపిస్తుంది, ఇంత అలవోకగా కవితలు ఎలా అల్లేస్తారా? అని.. ఆ కిటుకేదో నాకూ చెప్పండి మరి!! ..ధన్యవాదాలు.
    @లక్ష్మి: ధన్యవాదాలండీ..
    @శివ చెరువు: నిజమేనండీ.. సరైన వేదికలు లేవన్న మీ పాయింటుతో ఏకీభవిస్తున్నా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @తృష్ణ: ధన్యవాదాలండీ..
    @బోనగిరి: వంద తర్వాత లెక్క విషయం పట్టించుకోలేదండీ.. 'సిరిసిరిమువ్వ' గారు చెప్పాకే గమనించాను, రెండు వందల విషయం.. రాయగలిగినన్నాళ్ళు, చెప్పడానికి కబుర్లు ఉన్నన్నాళ్ళు రాస్తూనే ఉంటానండీ.. ధన్యవాదాలు.
    @ప్రియ: I am not saying it is a 'great' story, but definitely it is different from the 'stories' being published in this magazine. Thank you.

    రిప్లయితొలగించండి
  22. @హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
    @సుబ్రహ్మణ్య చైతన్య: మీ ఫోటో చూడగానే వింటర్ అనే విషయం గుర్తొస్తోందండీ :) నేను మీకన్నా ముందుగా మొదలు పెట్టాను కదా.. కాలము-వేగము-దూరము సూత్రం ప్రకారం చూస్తే మీరు మరికొంచం స్పీడు పెంచక తప్పదనిపిస్తోంది!! ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ఇప్పుడే మీ టపా కూడా చదివానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @సునీత: ధన్యవాదాలండీ..
    @అనిత: ధన్యవాదాలండీ..
    @పరిమళం: నేనూ గమనించలేదండీ.. 'సిరిసిరి మువ్వ' గారు గుర్తు చేశారు.. ధన్యవాదాలు.
    @నిషిగంధ: ఆ అందమైన రోమాన్సే నాకు బాగా నచ్చినట్టుందండీ :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. రెండు వందల టపాలు పూర్తి చేసిన సందర్భంలో చాలా ఆలస్యంగాఅభినందనలు తెలుపుతున్నందుకు క్షమించాలి. మీరిలాగే వేవేల టపాలు మంచి మంచివి రాసేసి మమ్మానందింపజేయ ప్రార్థన.!
    అన్నట్టు..ఈ కథ నాక్కూడా నచ్చింది :)

    రిప్లయితొలగించండి
  25. @మధురవాణి: 'మనకి మనకి క్షమాపణలు ఎందుకండీ..' ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి