ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే కేవలం ఒక నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేయడమా? ప్రస్తుతం మన రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే ఈప్రశ్నకి సమాధానం అవుననే వస్తుంది. రాజధాని నగరం మినహా ఆ స్థాయిలో అభివృద్ధి చేసిన నగరం మరొకటి కనిపించదు మనకి. అభివృద్ధి కేంద్రీకరణ గత పదిహేనేళ్ళలో వేగవంతం అయ్యిందన్నది ఎవరూ కాదనలేని నిజం. ఫలితంగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి రాజధాని నగరానికి వలసలూ అదే స్థాయిలో వేగవంతం అయ్యాయి.
ఒక పక్క ఖాళీ అవుతున్న మారుమూల గ్రామాలు, మరో పక్క కిక్కిరిసిన, కిక్కిరిసిపోతూనే ఉన్న, నానాటికీ విస్తరిస్తున్నా అదే స్థాయిలో సమస్యలనీ పెంచుకుంటున్న రాజధాని నగరం. రాష్ట్రంలోని పెద్ద పారిశ్రామిక వేత్తల పెట్టుబడులు మాత్రమే కాదు, విదేశీ పెట్టుబడులూ ఒక్క రాజధానిలో మాత్రమే కేంద్రీకృతమయ్యాయి. రాజధాని నగరం కావడం వల్ల పెట్టుబడులు రావడం మొదలైతే, వాటిని ఆకర్షించేందుకు పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం తదితర వనరుల అభివృద్ధి మొదలయ్యింది.
అభివృద్ధి కేంద్రీకరణ వల్ల కలగబోయే దుష్ఫలితాలను గురించి సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అధికారం లో ఉన్నవాళ్ళు తాము చేయదల్చుకున్నది చేశారు. వారి చర్యల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జనాభా పెరుగుదల కారణంగా వనరుల కొరత, కనీస సౌకర్యాల కొరత, పెరిగిన మురికి వాడలు, శాంతిభద్రతల సమస్య..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అంతు లేదు.
రాష్ట్రంలో రాజధాని నగరం మినహా, ఏ ఇతర నగరమూ పెట్టుబడులకి అనువుగా లేదా? ఈ ప్రశ్నకి సమాధానం 'కాదు' అనే చెప్పాలి. పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సిన కనీస వనరులు భూమి, నీరు, మానవ వనరులు, శాంతి భద్రతలతో కూడిన వాతావరణం ఇంకా అనుకూలమైన రవాణా సౌకర్యాలు. ఇలా చూసినప్పుడు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు పెట్టుబడులకి అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే రాజధాని తర్వాత ప్రధాన నగరాలుగా చెప్పబడుతున్న విశాఖపట్నం, విజయవాడ నగరాలు, తిరుపతి పట్టణం పెట్టుబడులకి అనుకూలమే.
ఈ మూడు ప్రాంతాలలోనూ విశాఖ లో పారిశ్రామిక అభివృద్ధి ఈ మధ్యకాలంలోనే ఊపందుకుంది. మొదటినుంచీ పారిశ్రామిక నగరమే అయినా, ఇప్పుడు విదేశీ పెట్టుబడులని ఆకర్షించడం లో రాజధానితో పోటీ పడుతోంది ఈ నగరం. భూములు అందుబాటులో లేకపోవడం, ఖరీదు చుక్కలని అంటడం విజయవాడ నగరంలో పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి సమస్య అంటున్నారు. నిజానికి ఈ నగరం నుంచి పొరుగు రాష్ట్రాలకి నేరుగా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
పాలకుల దృష్టిలో తిరుపతి ఇప్పటికీ ఒక యాత్రా స్థలం మాత్రమే. అటు బెంగుళూరుకీ, ఇటు చెన్నై కి మధ్యలో ఉన్న ఈ పట్టణంలో పరిశ్రమల స్థాపనకి, అభివృద్ధికి ప్రధాన సమస్య నీటి సరఫరా. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కేవలం ఈ ప్రాంతాలు మాత్రమే కాదు, తృతీయ శ్రేణి పట్టణాలలో సైతం సౌకర్యాలని మెరుగు పరచడం ద్వారా పెట్టుబడులని ఆకర్షించి ఆయా ప్రాంతాలని అభివృద్ధి చేయొచ్చు. పాలసీ మేకర్స్ కి చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యమేమీ కాదు.
హైదరాబాదుకి వచ్చిన పెట్టుబడుల్లో సింహభాగం ఐటీరంగానికి చెందినవి. స్వభావంరీత్యా ఇవి మహానగరాల్లోనే నెలకొల్పాల్సిన పరిస్థితి. మనం బెంగుళూరు, చెన్నైలకి ధీటుగా పొరుగురాష్ట్రాలతో పోటీపడాలంటే నగరాన్ని అభివృద్ధి చెయ్యడమే మార్గంగా తోచింది అప్పట్లో. కానీ అదేసమయంలో మిగతాప్రాంతాలపై దృష్టిపెట్టక పోవడమే చేసినతప్పు. దురదృష్తవశాత్తూ తృతీయశ్రేణి నగరాల్లోసైతం నెలకొల్పగల్గిన ఉత్పత్తిదాయక పరిశ్రమలకు మనరాష్ట్రంలో ప్రోత్సాహం తక్కువ. ఏదేమైనా ఈవాపుకి మూల్యమే ఇప్పటి అనిశ్చితి.
రిప్లయితొలగించండిపాలకులకు పట్టణీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్య తేడా తెలీకపోవటం మానకు శాపం. అతి సర్వత్రా వర్జయేత్.
మితిమీరిన కేంద్రీకరణ వల్ల చాలా దుష్పలితాలు వస్తాయి.
రిప్లయితొలగించండిఅందులొ మనం ఎక్కువ గుర్తించనిది భూముల విలువ మితిమీరి పెరుగుతె జరిగేది. పెట్టుబడులు మొత్తం భూమిలోకే పోతాయి. అదే బ్లాక్ మనికి మూలం. భూముల ధర బ్లాకుమనికి సూచిక.
ఇప్పుడు హైద్రాబాద్ లో జరిగింది అదే. ఇక్కడ అన్నిటి కంటె రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం పెద్దది. పెద్ద పెద్ద వారి పెట్టుబడులు చాలా వరకు ఈ వ్యాపారం లోకి వెళ్లినాయి. ఆ భూమాఫియానే రాజకీయాలను శాసిస్తుంది. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం మొత్తం ఈ పెట్టుబడులు కాపాడుకోవటానికే.
maMchi విశ్లేషణ. పాలకులకు తమ ఆస్తులు కూడపెట్టుకోవదానికే సమయం సరిపోవడం లేదు. అందుకే ఈ దుస్థితి.
రిప్లయితొలగించండిమన దేశం లో ఎదుర్కొంటున్న సమస్యలు చాల వరకు రిజినల్ డిస్పారిటి నుండి ఉద్భవించినవే .ఆయా ప్రాంత అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యెక పధకాలు ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించి ఆర్ధికంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి .ఇప్పుడున్న సమస్య రాజకీయ లభ్ది కోసం రాజకీయ నాయకులు ఆడే చదరంగం .
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య చైతన్య: సరిగ్గా చెప్పారు.. 'అతి సర్వత్రా వర్జయేత్..' నిజానికి ఐటీ పరిశ్రమని కూడా కేవలం ఒక నగరానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు.. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్లా అలా చేశారనిపిస్తుంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సమతలం: బూం అన్నది ఏ రంగంలోనూ మంచిది కాదండీ.. క్రమమైన అభివృద్ధి ఉండడమే ఆరోగ్యకరం.. బుడగ పెరిగే కొద్దీ పేలిపోయే అవకాశాలూ పెరుగుతాయి.. ధన్యవాదాలు.
@కేక్యూబ్ వర్మ: వ్యక్తిగత ఆస్తుల సంగతి ఎలా ఉన్నా, పబ్లిక్ ప్రాపర్టీస్ ని కేంద్రీకరించడం చాలా దుష్పరిణామాలకి దారి తీస్తుందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి అనేది రాత్రికి రాత్రే సాధ్యపడేది కాదండీ.. జరుగుతున్నదానికి కేవలం రాజకీయ పోరాటం మాత్రమే అనలేమేమో.. ధన్యవాదాలు.
ఏ నగరాన్ని కూడా మెట్రో రైళ్ళు అవసరమయ్యేంతవరకు పెరగనివ్వకూడదు.
రిప్లయితొలగించండిశాంతి భద్రతలు కాపాడడం కాని, ప్రజల కనీస అవసరాలు తీర్చడం కాని అతిగా పెరిగిన నగరానికి చాలా కష్టం.
నిజానికి అన్ని కష్టాలు పడుతూ నగరాల్లో నివసించడం ఎవరికీ ఇష్టం ఉండదు.
కాని బతుకుతెరువు వేరే ఎక్కడా దొరకక నరకాన్ని అనుభవిస్తున్నారు.
కనీసం నగరాలతొ పెద్దగా సంబంధంలేని ప్రభుత్వరంగ సంస్థలు, కార్యాలయాలు చిన్న పట్టణాలకు తరలించవచ్చు.
@బోనగిరి: అప్పుడు, నగరాల్లో సెటిలైన ఆయా సంస్థల ఉద్యోగులు ఇబ్బందులు పడతారు కదండీ.. నిజానికి ఇది రాత్రికి రాత్రే పరిష్కారమయ్యే సమస్య కాదు.. పాలకులకి ముందు చూపు లోపించడం వల్ల వచ్చిన సమస్య.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి