గురువారం, డిసెంబర్ 17, 2009

కథ రాశాను..

అవును.. మొదటిసారిగా ఒక కథ రాశాను.. నిజానికి ఇది నా బాల్య జ్ఞాపకాల సమాహారం.. గతం లో ఒకటి రెండు జ్ఞాపకాల టపాలు చదివిన బ్లాగ్మిత్రులు కథ రాయమంటూ సూచించినా ఆ దిశగా ప్రయత్నం చెయ్యలేదు.. నా చిన్నప్పటి నేస్తం వెంకాయమ్మ గారి గురించి వివరంగా ఒక టపా రాయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ జ్ఞాపకాలన్నీ గుది గుచ్చి ఒక చోట చేర్చి 'బెల్లం టీ' పేరుతో 'పొద్దు' కి పంపాను. 'కథ' వర్గం లో నా రచనని ప్రచురించిన జాల పత్రిక 'పొద్దు' వారికీ, నన్ను ప్రోత్సహించిన ఆ పత్రిక సంపాదక వర్గ సభ్యులు, బ్లాగరి 'చదువరి' గారికీ నా కృతజ్ఞతలు. నా టపాలు చదివి తమ విలువైన అభిప్రాయాలు చెబుతున్న బ్లాగు మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

*     *     * 

"బాబూ.. మొహం కడుక్కుని రా. తల దువ్వుతాను. నాన్నగారు నిన్ను వెంకాయమ్మ గారింటికి తీసుకెళ్తారుట..." తల దువ్వించుకోవడం నాకు చాలా చిరాకైనా పనైనా, ఆ చివరి మాటలు వినగానే మంత్రించినట్టుగా నూతి దగ్గరకి పరిగెత్తే వాడిని చిన్నప్పుడు, మొహం కడుక్కోడం కోసం. వెంకాయమ్మ గారింటికి వెళ్ళడం అంటే ఒక చిన్న సైజు పండుగ అప్పట్లో.

బెల్లం పాకం తో చుట్టిన జీడిపప్పు ఉండలు, బెల్లం పూతరేకులు, గోర్మిటీలు, మడత కాజాలు.. వీటిలో కనీసం రెండు రకాల మిఠాయిలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి అందిస్తారా.. అవి తినడం పూర్తి కాకుండానే ఓ పేద్ద ఇత్తడి గ్లాసు నిండా నురుగులు నురుగులుగా బెల్లంటీ ఇచ్చేస్తారు. మనం ఇంకేమీ అనడానికి ఉండదు. బుద్ధిగా తాగేయ్యడమే.. పైగా నాన్న కూడా 'వద్దు' అనరు.

రెండు చేతులతోనూ గ్లాసుని గట్టిగా పట్టుకుని, ఊదుకుంటూ తాగుతుంటే బెల్లంటీ ఎంత బాగుంటుందంటే.. ఆ రుచి వర్ణించడానికి రాదు. తియ్యగా, వగరుగా, అదోలాంటి వాసనతో.. అంత పేద్ద గ్లాసు చూడగానే అస్సలు తాగ గలమా? అనుకుంటాం.. కానీ తాగుతుంటే ఇంకా తాగాలని అనిపిస్తుంది.. మన ఇంట్లో పాలు తాగినట్టు బెల్లంటీ చివరి చుక్కవరకూ తాగ కూడదు.. ఎందుకంటే గ్లాసు అడుగున నలకలు ఉంటాయి.. అందుకని కొంచం వదిలెయ్యాలి.

వెంకాయమ్మ గారు.. మా ఊళ్ళో పరిచయం అక్కర్లేని పేరు. ఆవిడ మామూలుగా మాట్లాడిందంటే నాలుగు వీధులు వినిపిస్తుంది.. ఇంక కోపం వచ్చిందంటే ఊరంతటికీ వినిపించాల్సిందే. యాభయ్యేళ్లు పైబడ్డ మనిషైనా అంత వయసులా కనిపించేది కాదు. నల్లని నలుపు, చెయ్యెత్తు మనిషి.జరీ నేత చీర,ఐదు రాళ్ళ ముక్కు పుడక, బేసరి, చెవులకి రాళ్ళ దిద్దులు, మెడలో నాంతాడు, చంద్రహారాలు, కంటె, కాసుల పేరు, చేతులకి అరవంకీలు, గాజులు, కాళ్ళకి వెండి కడియాలు, పట్టీలు..ఆవిడ పేరంటానికి వచ్చిందంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి నడిచొచ్చినట్టు ఉందని అనేది అమ్మ. వీటిలో సగం నగలు నిత్యం ఆవిడ వంటిమీద ఉండాల్సిందే.. మా ఊరి గుళ్ళో అమ్మవారి మెడలో మంగళ సూత్రాల తర్వాత, మళ్ళీ అంత పెద్ద సూత్రాలు ఆవిడ మెడ లోనే చూశాను నేను.

వాళ్ళ ఇల్లు చూస్తే కోనసీమ మొత్తాన్ని చూసేసినట్టే. వీధివైపు కొబ్బరి చెట్లు. మల్లె పొదలు, జాజితీగలు, బంతి, కనకాంబరం మొక్కలు. దాటి లోపలి వెళ్తే పేద్ద పెంకుటిల్లు. పెరటి వైపున వంటకి ఇంకో చిన్న వంటిల్లు. ఓ పక్కగా కోళ్ళ గూడు, మరో పక్క వంట చెరకు. కాస్త దూరంలో నుయ్యి. నూతి గట్టుని ఆనుకుని వాళ్ళ కొబ్బరి తోట, కొంచం ముందుకెళ్తే వాళ్ళదే వరి చేను. ఈవిడ వంటగదిలో నుంచి కేకేసిందంటే పొలంలో కూలీలు ఉలిక్కి పడి, మాటలు ఆపి పని మొదలు పెట్టాల్సిందే.

నేనూ, నాన్నా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ పెరటి అరుగు మీద కూర్చునే వాళ్ళం. ఆవిడ వంట ఇంట్లో పని చేసుకుంటూనే, ఓ పక్క నాన్నతో మాట్లాడుతూ మరో పక్క పొలంలో పనిచేసే కూలీల మీద అజమాయిషీ చేసేది. చిన్నప్పుడు నన్ను 'మనవడా' అనీ, నేను కొంచం పెద్దయ్యాక 'మనవడ గారా..' అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో 'వెంకాయమ్మా..' అనీ కొంచం జ్ఞానం వచ్చాక 'నానమ్మ గారూ..' అనీ పిల్చేవాడిని. నాన్నని 'అబ్బాయి' అనీ అమ్మని 'కోడలు గారు' అనీ అనేది. నేనంటే భలే ముద్దు ఆవిడకి.

మా ఊరివాడైన నరసింహ మూర్తి గారిని పెళ్లి చేసుకుని తన పన్నెండో ఏట మా ఊరికి కాపురానికి వచ్చిందట వెంకాయమ్మ గారు. ఆవిడ పుట్టిల్లు మా ఊరికి నాలుగైదు ఊళ్ళు అవతల ఉన్న మరో పల్లెటూరు. జీడి తోటలకీ, మావిడి తోటలకీ ప్రసిద్ధి. కలిగినింటి ఆడపడుచు కావడంతో భూమి, బంగారం బాగానే తెచ్చుకుందని మా ఇంట్లో అనుకునే వాళ్ళు. ఆవిడ వచ్చాకే నరసింహ మూర్తి గారికి దశ తిరిగిందిట. ఆయన స్వతహాగా అమాయకుడు. కష్టపడతాడు కానీ, వ్యవహారం బొత్తిగా తెలీదు.

నలుగురు పిల్లలు బయలుదేరగానే ఇంటి పెత్తనం మొత్తం వెంకాయమ్మగారు తన చేతుల్లోకి తీసుకుందిట. వాళ్లకి ఆరుగురు ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లాడు. మొదటి నుంచీ ఆవిడకి ఆడపిల్లలంటే చిన్నచూపు, ఆస్తి పట్టుకుపోతారని. కొడుకంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ పెత్తనం తీసుకున్నాక అప్పటివరకు ఖాళీగా పడున్న పోరంబోకు భూమిని మెరక చేసి కొబ్బరితోట గా మార్చింది. ఉన్న పొలానికి తోడు, మరికొంత పొలం కౌలుకి తీసుకుని వరి, అపరాలు పండించడం మొదలు పెట్టింది. పాడికి పశువులు, గుడ్లకి కోళ్ళు సర్వకాలాల్లోనూ ఇంట్లో ఉండాల్సిందే.

చివరి సంతానానికి నీళ్ళూ, పాలూ చూడడం అయ్యేసరికి పెద్ద కూతురి పిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు. అంత సంసారాన్నీ ఈదుతూనే ఊరందరికన్నా ముందుగా తన ఇల్లంతా గచ్చు చేయించింది వెంకాయమ్మ గారు. "ఎదవ కోళ్ళు.. కొంపంతా నాసినం చేసి పెడతన్నాయి..వందలు తగలేసి గచ్చులు సేయించినా సుకం లేదు" అని విసుక్కుందోసారి. "మరెందుకు కోళ్ళని పెంచడం? తీసేయొచ్చు కదా?" అని నేను జ్ఞానిలా సలహా ఇచ్చాను, ఆవిడ పెట్టిన లడ్డూ కొరుక్కుంటూ.

"మీ మావలొచ్చినప్పుడు కోడి గుడ్డట్టు కంచంలో ఎయ్యకపోతే మీ అత్తలు ముకం మాడ్సరా నాయినా? ఈటిని తీసేత్తే గుడ్లెక్కడినుంచి అట్రాను?" అని అడిగిందావిడ. "మా ఆడపడుచుల చేత ఇల్లలికించారు.. మా తోటికోడలు కష్ట పడకూడదని గచ్చులు చేయించేశారు అత్తగారు" అని వేళాకోళం చేసింది అమ్మ. ఊళ్ళో వాళ్ళు ఆవిడ నోటికి జడిసినా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మొదట తొక్కేది ఆవిడ గడపే. ఇంటికి వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపదని పేరు. "అవసరం రాబట్టే కదా మన్ని ఎతుక్కుంటా వచ్చారు.. మనకి మాత్తరం రావా అవసరాలు?" అనేది ఆవిడ.

పొలం పనుల రోజుల్లో వాళ్ళిల్లు పెళ్ళివారిల్లులా ఉండేది. పెరట్లో గాడి పొయ్యి తవ్వించి పెద్ద పెద్ద గంగాళాల్లో ఉప్మా వండించేది.. ఓ పెద్ద ఇత్తడి బిందెలో బెల్లం టీ మరుగుతూ ఉండేది. "కడుపు నిండా ఎడతాది.. మారాత్తల్లి" అనుకునే వాళ్ళు కూలీలు. పని కూడా అలాగే చేయించేది. గట్టున నిలబడి అజమాయిషీ చేయడమే కాదు, అవసరమైతే చీరని గోచీ దోపి పొలంలోకి దిగిపోయేది. సాయంత్రానికి కూలీ డబ్బులు చేతిలో పెట్టి పంపించేది. "ఆళ్ళని తిప్పుకుంటే మనకేవన్నా కలిసొత్తాదా" అంటూ.

వెంకాయమ్మ గారికి భక్తి ఎక్కువే. కార్తీక స్నానాలకీ, మాఘ స్నానాలకీ సవారీ బండి కట్టించుకుని గోదారికి బయలుదేరేది. ఎప్పుడైనా సినిమా చూస్తే అది భక్తి సినిమానే అయ్యుండేది. ఆవిడ సవారీబండి కట్టించిందంటే అది మా ఇంటి ముందు ఆగాల్సిందే. మేము బండిలో కూర్చోవాల్సిందే. నాన్నని నోరెత్తనిచ్చేది కాదు. "ఆయమ్మని నువ్వూ ఎక్కడికీ తీస్కెల్లక, నన్నూ తీసుకెళ్ళనివ్వక.. ఎట్టా నాయినా?" అని గదమాయించేది.

ఎప్పుడైనా నాన్న ఊరికి వెళ్ళాల్సి వచ్చి, ఇంట్లో మేము ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తే రాత్రులు మాకు సాయం పడుకోడానికి వచ్చేది ఆవిడ. పనులన్నీ ముగించుకుని ఏ పదింటికో తలుపు తట్టేది. "ఉడుకు నీల్లతో తానం చేసొచ్చాను కోడలగారా.. మా మనవడు సెవటోసన అనకుండా" అనేది. అది మొదలు అమ్మా, ఆవిడా అర్ధ రాత్రివరకూ కష్టసుఖాలు కలబోసుకునే వాళ్ళు. నేను నిద్రపోయానని నిశ్చయం చేసుకున్నాక, ఆవిడ బయటికి వెళ్లి అడ్డ పొగ పీల్చుకుని వచ్చేది. నాకు తెలిస్తే నవ్వుతానని ఆవిడ భయం. నాకు తెలిసినా తెలీనట్టు నటించే వాడిని. ఆవిడ సాయానికి వచ్చినప్పుడు అమ్మ నిద్రపోయేది కాదు. దొంగాడెవడైనా వెంకాయమ్మ గారి నగల మీద కన్నేసి, ఆవిడ మా ఇంట్లో ఉండగా పట్టుకుపోతే ఆ పేరు ఎప్పటికీ ఉండిపోతుందని అమ్మ భయం.

నాకు జ్వరం వస్తే టీ కాఫీలు తరచూ ఇమ్మని చెప్పేవారు డాక్టరు గారు. నేనేమో బామ్మ తాగే కాఫీ అయినా, వెంకాయమ్మ బెల్లం టీ అయినా కావాలని గొడవ చేసేవాడిని. అమ్మకేమో అంతబాగా చేయడం వచ్చేది కాదు. ఒక్కోసారి వారం పదిరోజుల వరకూ జ్వరం తగ్గేది కాదు. అలాంటప్పుడు ఖాళీ చేసుకుని నన్ను చూడ్డానికి వచ్చేది వెంకాయమ్మ గారు. "వెంకాయమ్మ ఇచ్చే టీ లాంటిది కావాలని గొడవ చేస్తున్నాడు మనవడు. నాయనమ్మగారు ఏం మందు కలిపి ఇస్తారో మరి" అనేది అమ్మ.

"అదేవన్నా బాగ్గెవా బంగారవా నాయినా.. మీ సిన్నత్త సేత అంపుతానుండు.." అనడమే కాదు, మర్చిపోకుండా వాళ్ళ చిన్నమ్మాయికిచ్చి పంపేది. ఎప్పుడు జ్వరం వచ్చినా "వెంకాయమ్మ బెల్లం టీ తాగితే కానీ నీ జ్వరం తగ్గదురా" అని ఏడిపించేది అమ్మ. టీ ఒక్కటేనా? పత్యం పెట్టే రోజున వాళ్ళ పెరట్లో బీరకాయలో, ఆనపకాయో ఎవరో ఒకరికి ఇచ్చి పంపేది.

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాగానే వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది వెంకాయమ్మ గారు. అతనికి పెద్దగా చదువు అబ్బలేదు.వ్యవసాయం పనులు గట్టుమీద నిలబడి అజమాయిషీ చేయడం కూడా అంతంతమాత్రం. వెంకాయమ్మ గారు బలపరిచిన ఆస్తి పుణ్యమా అని సంబంధాలు బాగానే వచ్చాయి. ఆవిడ అన్నలే పిల్లనిస్తామని ముందుకొచ్చారు.ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలున్న ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుంటే కొడుక్కి ముచ్చట్లు జరగవని తన తమ్ముడి ఏకైక కూతురితో కొడుకు పెళ్ళికి ముహూర్తం పెట్టించింది.

ఆవిడ పుట్టిన ఊళ్ళో, పుట్టింట్లోనే కొడుకు పెళ్లి. మా ఊరి నుంచి ఎడ్ల బళ్ళు బారులు తీరాయి. కేవలం మాకోసమే ఒక సవారీ బండి ఏర్పాటు చేసింది వెంకాయమ్మ గారు. పెళ్లింట్లో మాకు ప్రత్యేకమైన విడిది.. మాకు కావలసినవి కనుక్కోడానికి ప్రత్యేకంగా ఒక మనిషి. అంత సందట్లోనూ ఆవిడ మమ్మల్ని. మర్చిపోలేదు. మధ్యలో తనే స్వయంగా వచ్చి ఏం కావాలో కనుక్కుంది. పుట్టి బుద్దెరిగిన ఆ పదేళ్ళ లోనూ అంతటి పెళ్లి నేను చూడలేదు. పెళ్లి కాగానే ముత్యాల పల్లకీలో ఊరేగింపు. పల్లకీ మా ఊళ్లోకి రాగానే కొడుకునీ, కోడలినీ మా ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ.

ఆవిడ కోరుకున్నట్టే అల్లుడిని బంగారంతో ముంచెత్తడమే కాక, కొత్త మోటారు సైకిల్ కొనిచ్చాడు మావగారు. మా ఊళ్ళో కొత్త మోటర్ సైకిల్ నడిపిన మొదటి వ్యక్తి వెంకాయమ్మ గారి అబ్బాయే. మూడు బళ్ళ మీద సామాను వేసుకుని కాపురానికి వచ్చింది కొత్త కోడలు.పందిరి మంచం, అద్దం బల్లా, బీరువా.. ఇలా.. అందరిలా ఊరికే ఒక లడ్డూ, మైసూరు పాక్, అరటిపండూ కాకుండా సారె కూడా ఘనంగా తెచ్చుకుంది. మొత్తం తొమ్మిది రకాల మిఠాయిలు. ఊరందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అన్ని మిఠాయిలు సారె తెచ్చుకునే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అమ్మకి కచ్చితంగా చెప్పేశాను.

నేను పొరుగూరు హైస్కూలు చదువులో పడడంతో వాళ్ళింటికి పెత్తనాలు తగ్గాయి. అదీ కాక ఆ కొత్త కోడలంటే తెలీని బెరుకు. పాపం ఆవిడా బాగానే మాట్లాడేది. అయినా మునుపటి స్వేచ్చ ఉండేది కాదు. కాలం తెలియకుండానే గడిచిపోతోంది. ఒకరి తర్వాత ఒకరు వెంకాయమ్మ గారికి ఇద్దరు మనవరాళ్ళు బయలుదేరారు. 'మగ పిల్లలు కావాల్సిందే' అని పంతం పట్టడమే కాక, ఆ పంతం నెగ్గించుకుంది ఆవిడ. తర్వాత వరుసగా ఇద్దరు మనవలు. "సొంత మనవలు వచ్చేశారు.. నానమ్మగారికి ఇంక ఈ మనవడు ఏం గుర్తుంటాడు లెండి" వాళ్ళ చిన్న మనవడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అన్నాను. "ఎంత మాట నాయినా.. నీ తరవాతోల్లే నీ తమ్ముల్లు" అందావిడ ఆప్యాయంగా.

నేను కాలేజీ లో చదవడం ఆవిడకి ఎంత సంతోషమో. "మీరూ అన్నయ్య గారిలా సదుంకోవాలి" అనేది తన మనవల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని. వయసు పెరగడం, ఆవిడకి ఓపిక తగ్గడం తో వ్యవహారాల్లో కొడుకు జోక్యం పెరిగింది.. ఆవిడ జోక్యం క్రమంగా తగ్గింది. చేతినిండా డబ్బు ఆడుతుండడంతో అతను వ్యసనాలకి అలవాటు పడ్డాడు. ఒకటీ రెండూ కాదు, వ్యసనాల జాబితాలో ఉండే వ్యసనాలన్నీ అతనికి అలవడి పోయాయి. విపరీతమైన ప్రేమ కొద్దీ కొడుకు మీద ఈగని కూడా వాలనిచ్చేది కాదు వెంకాయమ్మ గారు. ఎక్కువరోజులు పుట్టింట్లోనే ఉండడం మొదలు పెట్టింది ఆవిడ కోడలు.

ఉద్యోగం వెతుక్కుంటూ నేను ఇల్లు విడిచిపెట్టాను. ఇంటికి రాసే ఉత్తరాల్లో మర్చిపోకుండా వెంకాయమ్మ గారి క్షేమం అడిగేవాడిని. జవాబులో ముక్తసరిగా ఒకటి రెండు వాక్యాలు రాసేది అమ్మ. దొరికిన ఉద్యోగం చేస్తూ, మంచి ఉద్యోగం వెతుక్కునే రోజుల్లో ఇంటికి రాకపోకలే కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలూ తగ్గాయి. ఫలితంగా కొన్నాళ్ళ పాటు ఆవిడ విషయాలేవీ తెలియలేదు నాకు. కొంచం కుదురుకున్నాక ఊరికి వెళ్లాను, రెండు రోజులు సెలవు దొరికితే. వెళ్ళినరోజు సాయంత్రం ఇంటికి వచ్చిందావిడ. "మనవడు గారికి ఈ నానమ్మ గుర్తుందో లేదో అని ఒచ్చాను నాయినా.." అనగానే నాకు సిగ్గనిపించింది. "రేపు నేనే వద్దామనుకుంటున్నానండీ," అన్నాను.

ఆవిడెందుకో ఇబ్బంది పడుతోంది అనిపించింది కానీ, విషయం పూర్తిగా అర్ధం కాలేదు. "పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయేమో చూసిరా బాబూ," అంది అమ్మ. నేనక్కడ ఉండకూడదని అర్ధమై, అక్కడి నుంచి మాయమయ్యాను. ఆవిడ వెళ్ళిపోయాక కూడా అమ్మెందుకో ఆ విషయం మాట్లాడడానికి పెద్దగా ఇష్ట పడలేదు.. "వాళ్ళ పరిస్థితి ఇదివరకట్లా లేదు" అంది అంతే.. మళ్ళీ ఏడాది వరకూ ఊరికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. ఊళ్లోకి అడుగు పెట్టగానే చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు నానమ్మగారి బెల్లం టీ కూడా గుర్తొచ్చింది. ఈసారి మిస్సవ్వకూడదు అనుకున్నాను.

మర్నాడు మధ్యాహ్నం ప్రయాణమయ్యాను వెంకాయమ్మగారింటికి. "టీ తాగి వెళ్ళు బాబూ.." అంది అమ్మ. "నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను," అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. "రండి మనవడ గారా.. రండి" ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది. ఆవిడలోనే కాదు, వాళ్ళింట్లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. పాత చీరలో, మెళ్ళో పసుపు తాడుతో ఉందావిడ. నేను చూడడం గమనించి కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. మనిషి బాగా వంగిపోయినా మాటలో కరుకుదనం తగ్గలేదు. నరసింహ మూర్తిగారు మంచంలో ఉన్నారు. కొంచం ఇబ్బందిగా అనిపించిది నాకు ఆ వాతావరణం.

"ఉజ్జోగం సేత్తన్నారంటగా.. అబ్బాయి సెప్పేడు. జాగర్త నాయినా.. అమ్మా, నాయినా జాగర్త.. ఆళ్ళ పేనం నీమీదే ఉన్నాది.. నువ్వే దాటించాలి.." ఆవిడ గొంతులో నేనెప్పుడూ వినని వైరాగ్యం. ఇది నేను ఊహించని వాతావరణం. కోడలు ఎక్కడా కనిపించలేదు. "అమ్మాయ్.. మనవడగారొచ్చేరు.. టీ ఎట్టియ్యి.. పనజ్దారెయ్యకు.. ఆరికి బెల్లం టియ్యంటే ఇష్టం.." అన్నేళ్ళ తర్వాత కూడా ఆవిడ నా ఇష్టాన్ని గుర్తు పెట్టుకోడం కదిలించింది నన్ను. అంతకు మించి లోపలి గదిలో నుంచి ఎలాంటి స్పందనా రాక పోవడం ఆలోచనలో పడేసింది. అప్పుడు చూశాను వంటింటికి తాళం. పరిస్థితి పూర్తిగా అర్ధమయ్యింది.

"అమ్మిచ్చిందండీ.. ఇప్పుడే తాగేను.. ఇంక ఇప్పుడేమీ తాగలేను" అన్నాను నమ్మకంగా.. కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశాను. ఆవిడా, నరసింహ మూర్తిగారూ వాళ్ళ గంజి వాళ్ళు వేరుగా కాచుకుంటున్నారుట. మిగిలిన కాసింత భూమినైనా తన పిల్లలకి మిగల్చాలని మొత్తం పెత్తనం కోడలు తీసుకుందిట. పరిస్థితి అంతవరకూ వచ్చినా వెంకాయమ్మగారు కోడలినే తప్పు పడుతోంది తప్ప, కొడుకుని పల్లెత్తు మాట అనడం లేదుట.. వంటి మీది నగలన్నీ కరిగిపోవడంతో ఇల్లు కదిలి రాలేకపోతోందిట. తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా రాత్రి వేళ మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర చేబదులు పట్టుకెడుతోందిట. నేను గుచ్చి గుచ్చి అడిగితే అమ్మ చెప్పిన సంగతులివి.

బస్సులో వెళ్తున్నాను కానీ ఆలోచనలన్నీ వెంకాయమ్మ గారి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాంటి మనిషి..ఎలా అయిపోయింది.. ఊరందరి అవసరాలకీ ఆదుకున్న మనిషికి ఇప్పుడు ఒకరి ముందు చెయ్యి సాచడం ఎంత కష్టం? "నాన్నగారు వాళ్ళింటికి వెళ్ళడం కూడా ఆవిడ ఇష్ట పడడం లేదు.. ఎప్పుడో ఓసారి తనే వస్తోంది.. కొబ్బరి తోట దింపుల మీద వచ్చే డబ్బులతో ఆయనా, ఆవిడా కాలక్షేపం చేస్తున్నారుట," అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చాయి. బాధ పడడం మినహా ఏం చేయగలను నేను?

కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి అతిధి మాత్రమే అనే నిజం నెమ్మదిగా అర్ధం కావడంతో కష్టపడి మా ఇంట్లో ఫోన్ పెట్టించారు నాన్న. టెలిఫోన్ కనెక్షన్ కోసం జనం ఏళ్ళ తరబడి తపస్సు చేసిన రోజులవి. వారానికో ఉత్తరం, ఒక ఫోన్.. అలా ఉండేది కమ్యూనికేషన్. ఓ ఆదివారం సాయంత్రం ఇంటికి ఫోన్ చేసినప్పుడు "ఉదయాన్నే నరసింహ మూర్తి గారు పోయార్రా.. నాన్నగారింకా వాళ్ళింటి దగ్గరే ఉన్నారు" అని అమ్మ చెప్పిన వార్త పిడుగు పాటే అయ్యింది నాకు. అమ్మతో సహా అందరూ వెంకాయమ్మ గారి పసుపు కుంకాల గురించి మాత్రమే బాధ పడుతున్నారు.. కానీ అంత పెద్ద వయసులో, రాజీ పడ్డం అలవాటు లేని మనస్తత్వం ఉన్న ఆవిడ ఒంటరిగా ఎలా బండి లాగించగలదు?

దేవుడు ఆవిడకి తీరని అన్యాయం చేశాడనిపించింది.. డక్కామక్కీలు తినగలిగే వయసులో చేతినిండా భాగ్యాన్నీ, అధికారాన్నీ ఇచ్చి, సాఫీగా సాగాల్సిన చివరి రోజుల్లో ఇన్ని పరిక్షలు పెట్టడం ఏమి న్యాయం అనిపించింది.. ఏ పని చేస్తున్నా నా ఆలోచనల నిండా వెంకాయమ్మ గారే. కేవలం కొడుకు మీద చూపించిన అతి ప్రేమకి ఇంత శిక్ష అనుభవిస్తోందా? అనిపించింది. మూడు రోజుల తర్వాత, ఆఫీసుకి ఫోనొచ్చింది. ఇంటినుంచి అమ్మ.. "వెంకాయమ్మ గారు చనిపోయారు.. " అదిరి పడ్డాను నేను.

"నరసింహ మూర్తి గారు పోయినప్పటి నించీ తిండి తినలేదు, నీళ్ళు తాగలేదు.. నిద్ర అన్నది అసలే లేదు.. పొద్దున్నే ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. డాక్టరుని తీసుకొస్తే ఆయన చెప్పాడు ఆవిడ చనిపోయిందని... అదృష్ట వంతురాలు.. పసుపుకుంకాలతో పార్వతీదేవిలా..." అమ్మ చెబుతూనే ఉంది కానీ నాకు వినిపించడం లేదు.. తర్వాత ఇంకెప్పుడూ నాకు బెల్లం టీ తాగాలనిపించలేదు.

31 కామెంట్‌లు:

  1. నిషిగంధగారు రాసిన మాటలేనండీ నావీను...బంధుత్వం లేకపోయినా చిన్నప్పటినుంచీ నేను "అమ్మమ్మగారూ" అని పిలిచే ఒకావిడ గుర్తొచ్చారండీ వెంఠనే. తాతగారు పోయి నెలైంది...మీ "వెంకాయమ్మగారి" గురించి చదవగానే నాకు "అమ్మమ్మగారే" గుర్తొచ్చారు...

    రిప్లయితొలగించండి
  2. aa kadha chadivi mee blog ki vachesariki mee post vundi..chala bavundi kadha.eppatilane super

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు ,అభినందనలు ! కధ చదివాను "బెల్లం టీ " రుచి నాలుకకి తాకక పోయినా ...మనసుకి తెలిసిందండీ ..

    రిప్లయితొలగించండి
  4. అన్నట్టు కధ సరే ...నా కవిత మాట మర్చిపోయారా :(

    రిప్లయితొలగించండి
  5. Hello
    aa proddu dot net lo font and editing/paragraphing maree chandaalam gaa undi. I think its very difficult to read properly. you should post it in your blog itself. Probably it would have better reading.

    zilebi.

    రిప్లయితొలగించండి
  6. ఇంకొక మెట్టెక్కారన్నమాట. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. సూపర్బ్...చాలా చాలా బాగా రాసారండి..చదివిన వెంటనే మనసు చాలాసేపు వెంకాయమ్మ గారి ఇంటి పరిసరాల్లోనే ఉండిపోయింది. టపా ఆద్యంతం చదవాలనిపించేలా రాసారు.

    రిప్లయితొలగించండి
  8. ఇప్పటికే మీ కధ చదివెయ్యడమూ, కామెంటు రాసెయ్యడమూ ఐపోయిందోచ్చ్.

    రిప్లయితొలగించండి
  9. మురళీ గారూ..
    మీ కథ చదువుతూ మీతో పాటు మీ జ్ఞాపకాల్లో నేనూ తిరిగొచ్చాను.
    నిజం చెప్పాలంటే 'బెల్లం టీ' చుట్టూనే ఇంకా తిరుగుతోంది మనసు. ఇంకా వెనక్కి రాలేదు.
    మొదటి కథ ఇంత హృద్యంగా రాసినందుకు, పొద్దులో ప్రచురించబడినందుకు..మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
    మీనుండి మరిన్ని మంచి మంచి కథలు రావాలని ఎదురుచూస్తాను.

    రిప్లయితొలగించండి
  10. పొద్దు లో నా కామెంట్ రాలేదు. ఎందుకో మరి? పబ్లిష్ ఐన కామెంటే ఎగిరిపోయింది.

    నేను రాసిన కామెంటు ఇదీ--
    చదివాక కొద్దిగంటలపాటు మనస్సు వెంకాయమ్మగారితోనే ఉండి పోయింది. నిషిగంధ గారి కామెంటు తో నేను ఏకీభవిస్తున్నాను.ఐతే మిసెస్ మురళీ గారి పేరు ఏమిటో?ఎందుకంటే "పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అన్ని మిఠాయిలు సారె తెచ్చుకునే అమ్మాయినె పెళ్ళి చేసుకుంటానని అమ్మకు కచ్చితంగా చెప్పేసాను" అవునో కాదో కనుక్కుందామని":-)

    రిప్లయితొలగించండి
  11. అభినందనలు.. అదే చేత్తో 'బెల్లం టీ' చేయడమెలాగో అసలు సిసలు రెసిపీ కూడా చెప్పండి, ప్లీజ్ :-)

    రిప్లయితొలగించండి
  12. మురళి గారు కథ చాలా బాగుందండి. కథ చెప్పిన విధానం ఎంతో బాగుంది. కోనసీమ అందాలు చూసిన తృప్తి, ముగింపు చదవగానే ఎగిరి పోయింది. చాలా మంది సరియిన ముందుచూపు లేక ఈ విధంగా బాధలు పడటం చూస్తుంటే ఎంతో బాధనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  13. మురళి గారు, ఎప్పటిలానే మీ శైలిలో అద్భుతం గా రాసారు. నాకైతే, కథ కన్నా, మీ బ్లాగు చదువుతున్నట్టే అనిపించింది. హ్మ్... అసలు కథ ఒక ఎత్తైతే, నాకు నచ్చిన ఒక వాక్యం: "కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి అతిధి మాత్రమే అనే నిజం నెమ్మదిగా అర్ధం కావడంతో ..." ఎంత సింపుల్ గా రాసారు? నాకు వెంటనే నా జాబ్ వచ్చిన తరువాత మొదటి సారి ఇంటికి వెళ్ళటం గుర్తు వచ్చింది. నన్ను హైదరాబాద్ ట్రైను ఎక్కించి, టా టా చెప్తున్న మమ్మిని చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరగటం, ఏదొ పని ఉండి, నన్ను సీ ఆఫ్ చెయ్యడానికి రాని డాడీ ఆ విషయం తెలుసుకుని, నేను ఎలమంచిలి చేరేసరికి నాకు కాల్ చేసి తను ఏడవటం...
    అవును, నేను పుట్టిపెరిగిన ఇంటికి నేను ఎప్పటికీ అతిథినే అనే విషయం నన్ను ఇంకా తొలిచేస్తూనే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  14. మురళి గారు, మీ బ్లాగు ప్రతి టపాను క్రమం తప్పకుండా చదువుతుంటాను. మొదటిసారి మీ బ్లాగులో వ్యాఖ్యానిస్తున్నాను.

    మీ కధ చదవడం మొదలుపెట్టగానే ఒక్కసారిగా మా ఊరు, మా ఇల్లు, నా చిన్నతనం, మా అమ్మమ్మ, వీధిలో మిగిలిన అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు వరసగా గుర్తుకొచ్చారు. వెకాయమ్మగారు చిన్నప్పుడు నేను రోజూ చూసిన మా ఊరి వాళ్ళలో ఒకరే అనిపించింది. చిన్నతనం గుర్తొచ్చి చాలా ఆనందమనిపించింది. కాని కధ చివరకి వచ్చేసరికి గుండె బరువయ్యింది. మా ఇంటి పక్క అమ్మమ్మ గుర్తొచ్చింది. ఆవిడ జీవితంలో వెలుగుల్ని, చీకటినీ చాలా దగ్గరనుండి చూశాను నేను. ఈ మధ్యనే పోయారని తెలిసి బాధనిపించినా, తప్పో ఓప్పో తెలియదుగాని ఇప్పటికైనా సుఖపడ్డారనిపించింది.

    రిప్లయితొలగించండి
  15. మురళి గారు, అద్భుతంగా ఉంది మీ కథనం. వెంకాయమ్మ గారిని సాహితీలోకానికి చక్కగా పరిచయం చేశారు. ఇంతకాలం మీ బ్లాగు చదువుతూ మీరీపాటికే మంచి కథకులనుకున్నాను. ఇన్నాళ్ళకైనా మీ టాలెంట్‌కు న్యాయం చేశారు. అభినందనలు.
    -బు.
    తా.క.రామయణంలో పిడకలవేట అనుకోకపోతే కథలో నాకు మింగుడుపడని రెండు వాక్యాలు.
    1) "బాబూ మొహం కడుక్కుని రా..."
    2) "పొయ్యి మీద పాలు పొంగుతున్న్యేమో చూసిరా బాబూ"
    ఈ బాబూ పిలుపెందుకో ఒక అమ్మ నోటి నుండి అసహజంగా ఉంది. నా ఒక్కడికే అలా ఉందా?

    రిప్లయితొలగించండి
  16. అభినందనలు.

    మీ నుండి ఇంతకన్నా మంచి కథని ఆశించాను.

    రిప్లయితొలగించండి
  17. పొద్దులో వ్యాఖ్య రాసాను. అయినా మరల అభినందనలు తెలియజేస్తూ...

    రిప్లయితొలగించండి
  18. మురళి గారు,

    నిజంగా చెయ్యితిరిగిన రచయిత ఇపొయరండి.
    చాల బాగుంది.

    రిప్లయితొలగించండి
  19. @తృష్ణ: కొన్ని కొన్ని బంధాలు చాలా చిత్రంగా ఏర్పడతాయండీ.. ధన్యవాదాలు.
    @వెన్నెల కోన: ధన్యవాదాలండీ..
    @పరిమళం: కవిత... బహుశా దానికీ టైము రావాలేమోనండీ.... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @జిలేబీ: ఇప్పుడు పేరాగ్రాఫ్స్ ఇచ్చారు చూడండి.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: ధన్యవాదాలండీ..
    @శేఖర్ పెద్దగోపు: రాస్తున్నంత సేపూ గతంలోకి వెళ్లిపోయానండీ.. అన్నిరకాల భావోద్వేగాలనూ అనుభవించాను.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @సునీత: 'పొద్దు' లో కామెంట్ మోదేరేషణ్ ఉందండీ.. ఇప్పుడు మీ వ్యాఖ్య ఉందక్కడ.. ఈరోజుకీ మా వూళ్ళో వెంకాయమ్మ గారి కోడలు సారె రికార్డు అలాగే ఉందండీ.. 'అనుకున్నామని జరగవు అన్నీ..' ..ధన్యవాదాలు.
    @మధురవాణి: ధన్యవాదాలండీ..
    @నిషిగంధ: పంచదార బదులు బెల్లం పొడి వేసి ప్రయత్నించ వచ్చండీ.. అమ్మ అలాగే చేసేది.. వెంకాయమ్మ గారి టీ రుచి మాత్రం రాదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @జయ: చేదుగా అనిపించే నిజం అండీ ఇది.. ధన్యవాదాలు.
    @రూత్: ఆ వాక్యం రాసేటప్పుడు నాక్కూడా ఊరు విడిచిపెట్టిన మొదటి రోజులు గుర్తొచ్చాయండి.. ఆడపిల్లలైతే కనీసం ఏడ్చే అవకాశం ఉంటుంది.. అబ్బాయిలు వాళ్ళ ఉద్వేగాలను ప్రకటించ కూడదు కదా.. అమ్మ కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండడానికి చాలా కష్ట పడాల్సి వచ్చేది.. కొన్ని కొన్ని తప్పవండీ.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  23. @సృజన: ధన్యవాదాలండీ..
    @శిశిర: వెంకాయమ్మ గారు చనిపోయినప్పుడు మా ఊళ్ళో చాలామంది అదే మాట అనుకున్నారండీ.. ధన్యవాదాలు.
    @బుడుగు: అమ్మ నన్ను పిలిచే పిలుపు అదేనండీ.. బహుశా మీకు సినిమాటిక్ గా అనిపించి ఉంటుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @అబ్రకదబ్ర: మొదటి ప్రయత్నం అండీ.. మీరు గమనించిన లోపాలు చెప్పండి, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాను.. ధన్యవాదాలు.
    @కేక్యూబ్ వర్మ: ధన్యవాదాలండీ..
    @మహీపాల్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  25. బెల్లం టీ కమ్మగా ఉంది, చివరలొ కాఫీ లాగ చేదు తగిలింది కాని అది కూడ బాగుంది !

    రిప్లయితొలగించండి
  26. కథ చాలా బాగుంది మురళిగారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. @మాలాకుమార్: ధన్యవాదాలండీ..
    @శ్రావ్య వట్టికూటి: టీ కాఫీలు ఒకేసారి తాగినట్టు అనిపించిందన్నమాట మీకు :):) ..ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  28. లోపాలున్నాయని కాదు. ఇంతకన్నా మంచి, విభిన్నమైన ఇతివృత్తం ఎన్నుకుంటారు అనుకున్నాను. ఈ మూసలో చాలామంది రాశారు, రాస్తున్నారు కదా. మీరూ అలాంటిదే రాస్తారనుకోలేదు. అంతే.

    రిప్లయితొలగించండి