మంగళవారం, డిసెంబర్ 15, 2009

కుర్రాళ్ళు

నిన్న మొన్నటి వరకూ మిత్రుల మధ్య జరిగే చర్చల్లో ఈతరం కాలేజీ కుర్రాళ్ళ గురించి టాపిక్ తరచూ వస్తూ ఉండేది. ఇప్పటి పిల్లలు మరీ 'కెరీర్ ఓరియంటెడ్' గా తయారయ్యారనీ, తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకునే ఓపికా తీరికా వాళ్లకి లేవనీ ఏకాభిప్రాయానికి వచ్చేవాళ్ళం. ఏం జరుగుతోందో తెలుసుకునే ఆసక్తే లేని వాళ్ళనుంచి ఇక స్పందన ఏం ఆశిస్తాం??

మహాత్మాగాంధీ, వివేకానందుడూ లాంటి పెద్దల మొదలు యెంతో మంది ఎన్నో రకాలుగా యువతకి కర్తవ్య బోధ చేశారు. యువతే దేశానికి చోదక శక్తి అన్నారు. స్వాతంత్ర సంగ్రామం లో భగత్ సింగ్ లాంటి యువకుల పాత్ర ప్రత్యేకం, ఉత్తేజభరితం. మహాత్ముడు ప్రారంభించిన (మధ్యలో ఆపేసిన అనేక నిరసనలతో సహా) ప్రతి ఉద్యమంలోనూ యువత పాత్ర కీలకం.

స్వాతంత్ర్యం వచ్చాక.. అప్పటి వరకూ కన్న కలలు ఒక్కొక్కటిగా కరిగిపోవడం మొదలు పెట్టాక.. నిరుద్యోగ సమస్య దేశ ప్రజల్లో నిర్వేదాన్ని నింపేశాక 'మేము కొత్త వెలుగు చూపిస్తాం' అంటూ వచ్చాయి వామపక్షాలు. వ్యవస్థలో వేరుపురుగులా ప్రవేశించిన 'రాజకీయాన్ని' సంస్కరించాలంటే ఉద్యమ బాట పట్టడమే ఏకైక పరిష్కారం అని మనసా వాచా నమ్మారు వేల మంది. ఇక్కడా అగ్ర తాంబూలం యువతకే.

డెబ్భై, ఎనభై దశకాల్లో కాలేజీల్లోనూ, యూనివర్సిటీ కాంపస్ లలోనూ విద్యార్ధులు 'ఎర్రట్ట పుస్తకాలు' పట్టుకుని తిరగడం సామాన్య దృశ్యం. విద్యార్ధి రాజకీయాలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. విద్యార్ధి సమస్యల మొదలు విధాన నిర్ణయాల వరకూ ఎన్నో అంశాల మీద వీధులకెక్కి పోరాటాలు చేశారు చైతన్యవంతులైన విద్యార్ధులు. ఉద్యమం కోసం తమ ప్రాణాలు బలిపెట్టడానికి సైతం సిద్ధ పడ్డారు.

విద్యార్ధి లోకంలో మండల్ కమిషన్ నివేదిక రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. గడిచిన రెండు దశాబ్దాలలో అంత తీవ్రమైన విద్యార్ధి ఉద్యమం మరొకటి జరగలేదనే చెప్పాలి.. ఓ పక్క రాజకీయ యవనికపై జరిగిన మార్పులతో చీలికలు పీలికలైన వామపక్ష రాజకీయం, మరోపక్క ప్రపంచీకరణ ఫలితంగా అన్నిరంగాలలోనూ పెరిగిన కార్పోరేటీ కరణ.. వెరసి దశాబ్ద కాలం లోపే సామాజికంగా ఊహించని మార్పులు.

విద్యారంగం ప్రభుత్వం నుంచి ప్రైవేటు వైపుకి పయనిస్తుండడంతో విద్యాలయాల్లో 'క్రమశిక్షణ' పెరగడం, అన్నిరంగాలలోనూ పెరిగిన పోటీ ఫలితంగా చదువునుంచి దృష్టిమళ్లిస్తే కెరీర్లో వెనుకబడతామన్న భయం విద్యార్ధులని ఉద్యమాలకి దూరం చేసింది. ఇదిగో ఈ నేపధ్యం నుంచి వచ్చిన వ్యాఖ్యే ఇప్పటి పిల్లలు మరీ కెరీర్ ఓరియంటెడ్ గా తయారయ్యారనీ, చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకునే ఓపికా, తీరికా వాళ్లకి లేవనీ..

ఉన్నట్టుండి ఇప్పుడు ఒకటి కాదు, ఏకకాలంలో రెండు ఉద్యమాలు మొదలయ్యాయి రాష్ట్రంలో. మాలాంటి వాళ్ళని ఆశ్చర్య పరుస్తూ ఈ రెండు ఉద్యమాలలోనూ కీలక పాత్ర పోషిస్తున్నది విద్యార్ధులే. బస్సులని, ఆస్తులని ద్వంసం చేయడం మొదలు తమని తాము దగ్ధం చేసుకోడం వరకూ ఎంతకైనా తెగించి పోరాడుతున్నారు తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల విద్యార్ధులు. కేవలం ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే వాళ్ళు మాత్రమే కాదు, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్ధులూ ఈ ఉద్యమాలలో పాల్గొంటున్నారు.

యువకుల్లో పొంగే వేడి రక్తం ఆవేశాని రగిలిస్తుంది. ఆవేశం పెరిగిన చోటా సహజంగానే ఆలోచన నశిస్తుంది. ఫలితంగా.. తాము నమ్మిన నాయకుడు ఇచ్చిన ఆదేశాలని అమలు పరచడానికి మాత్రమే పరిమితమవుతారు కుర్రాళ్ళు. జరుగుతున్న పరిణామాలని విశ్లేషించుకునే ఓపికా, తీరికా వాళ్లకి ఉండవు. అసలు ఆ దిశగా ఆలోచనలే సాగవు.

ప్రాణాలను పణంగా పెట్టి సాగించే పోరాటం వల్ల ఈ కుర్రాళ్ళు ఏం సాధిస్తారన్నది పూర్తిగా నాయకుడి మీద ఆధార పడుతుంది. ఆ నాయకుడు మహాత్ముడైతే వాళ్ళది దేశ స్వాతంత్ర్య సంగ్రామం అంతటి ఉదాత్త ఉద్యమం అవుతుంది.. స్వార్ధ రాజకీయ నాయకుడైతే అర్ధం లేని త్యాగం అవుతుంది.

16 కామెంట్‌లు:

  1. మురళి ఉద్యమాన్ని నడపడానికి సరయిన నాయకుడు కావాలిఅందర్ని ఆశ్చర్య పరచే విదంగా మన యువత స్పూర్తిదాయకంగా పోరాడుతున్నారు,గత రెండు వారాల్లో వారి పోరాటపటిమ ఎటువంటిదో చూస్తూనే వున్నాం.రాబోయే రోజుల్లోపని చేసే వారికోసం ప్రపంచమంతా మన వైపే
    చూస్తుందట.మన దేశమునకి ఉన్నంత మానవ వనరులు (యువత )ఇంకెక్కడా లేవని చదివాను.మన దేశ ఆర్ధికాభి వ్ర్యద్దిలో వారిదే పాత్రకాబోతుంది .

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడు ఉద్యమం పేరుతో హింసాకాండ జరుపుతున్న కొంతమంది నిజంగా విద్యార్దులేనా లేక ఆ ముసుగులో ఉన్న మరొకరా అని సందేహం...ఇక 'కెరీర్ ఓరియంటెడ్' గా తయారయ్యేరని మీరనుకొనే అభిప్రాయం కూడా సరైనదే అనిపిస్తుంది నాకు. ఏందుకంటే యూనివర్శిటీలో ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు ఎవ్వరూ ఈ ఉద్యమాల జోలికి అస్సలు రారు...వచ్చేది ఆర్ట్స్ వాళ్ళు మాత్రమే...వారిలోనూ ఓ డబ్బై శాతం మంది ఇటువైపు ఉంటారు..మిగిలిన వారు టైం దొరికిందని ఏ సివిల్సో, గ్రూప్ వన్ లాంటివి ప్రిపేరవ్వటంలో బిజీగా ఉంటారు...ఓ న్యూస్ చానల్లో పని చేసే మిత్రుడు చెప్పిన మాటలివి.

    రిప్లయితొలగించండి
  3. రాజకీయ నాయకులకన్నా కూడా నేడు విధ్యార్ధులు తెలంగాణ ,సమైక్యాంధ్రా ఉద్యమాలలో చురుకైన పాత్ర పొషిస్తున్నారు.
    కానీ వాళ్లు ఆవేశాలకు లోనై,ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వాళ్లమీదే యెన్నో ఆశలు పెట్టుకొన్న వాళ్ళ తల్లి తండ్రుల పరిస్థితి ఏంటి?

    రిప్లయితొలగించండి
  4. నిన్న భగవద్గీత చదువుతుంటే ఒక వాక్యం కనపడింది, "ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరుతుందో అప్పుడు నేను జన్మించి ధర్మాన్ని స్థాపిస్తాను", అది చదివి మా కొలీగ్ తో అన్నా ఇన్ని ఘోరాలు, ఇంత అన్యాయాలు జరుగుతుంటే కృష్ణుడుకి మళ్ళా ఎందుకు జన్మించాలి అనిపించలేదో అంటే ఇవేవీ అధర్మం కాదనా లేకపోతే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చస్తారనా అని.

    ఇప్పటి యువతకి మెదడు ఎప్పుడు సరిగా పని చేస్తుందో, ఎప్పుడు పని చెయ్యదో నాకైతే నిజంగానే అర్థం కావటం లేదు. వాడెవడో పనికిమాలిన నాయకుడొచ్చి మీకు అన్యాయం జరిగిపోయింది అనగానే శివాలెత్తిపోయి అడ్డగోలు పనులు చెయ్యటం, కాల్చుకు చావటం వంటివి కాక అప్పటి, ఇప్పటి సాంఘిక పరిస్థితులని కనీసం ఎందుకు బేరీజు వేసుకోలేకపోతున్నారో, వెనక్కి తిరిగి ఇంతకాలం మీరందరూ ఎక్కడ నిద్రపోతున్నారు ఇంత కాలం మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెయ్యలేదు అని అడగలేకపోతున్నారో ఊహూ నాకైతే అర్థం కావటం లేదు.

    నిజంగా మన యువత వారి శక్తి యుక్తులని సక్రమంగా ఉపయోగించుకుని ఉండి ఉంటే చైనా జపాన్ సింగపూర్ వంటి దేశాలతో సమంగా మనం కూడా అభివృద్ధి చెంది ఉండేవారము కామా? మనవారు తమ శక్తిని మొత్తం వేరు కుంపటి పెట్టటానికి కాక కలిసి ఎదగాలి అని అన్న దిశగా ఉపయోగించి ఉంటే ఈ పాటికి ఆంధ్ర దేశంలో ఇంత వెనకబాటు తనం ఉండేదా?

    రిప్లయితొలగించండి
  5. యువకులే కాదండి. యువతులు కూడా ఉద్యమాల్లో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. నాకు తెలిసే కొంతమంది ఉన్నారు. కెరియర్ ఓరియంటెడ్ అన్నది కరెక్టే గాని, వారు కూడా సహకరిస్తూనే ఉన్నారు. నాదృష్టిలో కె.సి.ఆర్. కన్నా విద్యార్ధులు సాధించిందే ఎక్కువ. భగత్ సింగ్ కాలపునాటి పరిస్థితులు కావు ఇవి. విద్యార్ధులను స్వార్ధపూరితులు ఉపయోగించుకుంటున్నత కాలం విప్లవాలకు అమాయక యువత బలౌతూనే ఉంటుంది. సరి అయిన నాయకత్వం గురించి ఆలోచించే దెవరు. వీళ్ళ ల్లోని ఆవేశానికి సరి అయిన మార్గం చూపి ప్రగతి పధం వైపు మరలించే వాళ్ళు ఇంకా ఉంటారంటారా? ఇహ తల్లితండ్రుల గురించి ఆలోచించేదెవరు. పిల్లలను ఇళ్ళనుంచి బయటకు రాకుండా తల్లితండ్రులే బాధ్యత వహించాలనేగా ఈ సెలవలు. వీళ్ళ చదువు ఎవరికి కావాలి? యువత భవిష్యత్తు రాష్ట్ర విభజనల కన్నా ముఖ్యం కాదా? అన్ని రాష్ట్రాల వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో స్థిరపడుతునే ఉన్నారుగా. ఎవరు ఏ రాష్ట్రంలో ఉంటే ఏమి? విదేశాలకు వెల్తున్నవారు లేరా? మాత్రుభూమిని గౌరవిస్తున్నవారు లేరా? ఇంకా చాలానే రాయాలని ఉందండి. కాని వొద్దులెండి. నాక్కూడా ఆవేశం వొచ్చేసేటట్లుంది:)

    రిప్లయితొలగించండి
  6. ఈ టపాకు టైటిల్ "యువత" అని పెడితే బాగుండేదేమోనండీ...ఈ జరుగుతున్న పరిమాణాలను,హింసను చూసి నే రాసిన భావాలు ఈ టపాలో ఉన్నాయి...వీలైతే చూడండి..
    http://trishnaventa.blogspot.com/2009/12/blog-post_07.html

    రిప్లయితొలగించండి
  7. ఆవును మురళి. యువత కు ఆవేశం తప్ప ఆలోచనే లేదు, మేము చదువు కుంటునప్పుడు ఎన్. టీ. ర్ రిజర్వేషన్ లు పెంచాడని అనుకుంటా తెగ సమ్మే చేసేము.. ఎందుకు చేసేమో ఏంఇ సాధించామో కూడా గుర్తు లేదు. ఏండ అనక వాన అనక తిరిగి ఓ ఆవేశ పడి పోయాము. అది గుర్తు వస్తోంది ఈ పిల్లలను చూస్తుంటే... (మనలో మన మాట మా స్నేహితురాలు చెయ్య కోసుకుని బొట్టు కూడా పెట్టీనట్లు గుర్తు ఆ వుద్యమ నాయకుడికి మే బీ ఆ వూరి M.L.A అనుకుంటా)

    రిప్లయితొలగించండి
  8. @చిన్ని: ధన్యవాదాలండీ..
    @శేఖర్ పెద్దగోపు: మీ మిత్రుడు చెప్పింది నిజమేనండీ.. కానీ ఈ ఉద్యమంలో ప్రైవేటు కాలేజీల విద్యార్ధులూ కనిపిస్తున్నారు, అక్కడక్కడా.. ధన్యవాదాలు.
    @రాధిక: ఆవేశం, ఆలోచనని దగ్గరకి రానివ్వదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
    @లక్ష్మి: ఆవేశం ప్రధానంగా సాగే ఉద్యమాలలో ఆలోచనకి చోటు ఉండదండీ.. నాయకులు నడిపించినట్టు నడుస్తారు, ప్రజలు. ధన్యవాదాలు.
    @జయ: ఇంకా రాసి ఉండాల్సిందండీ.. నిజమే అమ్మాయిలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు ఉద్యమాలలో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @తృష్ణ: చదివానండీ.. ధన్యవాదాలు.
    @భావన: నాయకత్వం వహించేవారు ఆలోచనాపరులైతే సత్ఫలితాలు ఉంటాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. "నాయకుడు మహాత్ముడైతే వాళ్ళది దేశ స్వాతంత్ర్య సంగ్రామం అంతటి ఉదాత్త ఉద్యమం అవుతుంది.."నిజమే కాని ఇప్పుడు ఏ పదవీ కాంక్షా , స్వార్ధమూ లేని మహాత్ములున్నారంటారా మురళిగారూ !

    రిప్లయితొలగించండి
  12. యూనివర్సీటీల్లో 'పూర్వీకులు‌' అన్న మకుటంతో కొంతమంది ఉంటారు. వీళ్ల చదువులు దశాబ్దాల క్రితమే పూర్తయినా, వీళ్లజూనియర్లు అక్కడే మాస్టార్లుగా చేరినా వీళ్ళుమాత్రం కాంపస్ను వదలరు. అలాంటివాళ్ళే ఇప్పుడు జరుగుతున్న రెండుసమాంతర ఉద్యామాల్లో విద్యార్థుల ట్యాగుతో పాల్గొంటున్నారు.
    సామాన్యప్రజల కష్టాలను తీర్చేలా ఆలోచించలేని, సగటుమనిషికి కనీసం ప్రాతినిద్యం వహించలేని నాయకులు నేతృత్వం వహిస్తున్న ఉద్యమాలనుంచి సమాజానికి, యువతకు మేలెలా జరుగుతుంది చెప్పండి.

    రిప్లయితొలగించండి
  13. @పరిమళం: సమస్య అక్కడే వస్తోందండీ.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: ఈ 'పూర్వీకుల' గురించి ఒక పుస్తకమే రాయొచ్చండీ.. మీరన్నది నిజమే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మంచి విషయం. దీన్ని గురించి ఇంకొంచెం పరిశీలన అవసరం.
    నేను చూసినంతలో ఒకటి అనిపిస్తుంది. యువతకి విపరీతమైన శక్తి ఉంటుంది నిద్రాణంగా. చదివే చదువు దానికి తగిన ఛాలెంజ్ ఇవ్వటల్లేదు, అది ఎటువంటి కోర్సయినా. మధ్యతరగతి కుటుంబాల్లోనైతే సుమారు పాతికేళ్ళొచ్చేదాకా పెద్దగా బాధ్యతలంటూ కూడా ఏమీ లేవు. ఇక ఆ శక్తి ఏమి కావాలి .. ఎక్కడో ఓ చోట వినియోగం కావాలి.

    రిప్లయితొలగించండి
  15. @కొత్తపాళీ: నిజమేనండీ.. కానీ ఆ శక్తి 'సద్వినియోగమ'యితేనే వాళ్ళకీ, వాళ్ళ కుటుంబాలకీ, దేశానికీ కూడా మంచిది కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి