మంగళవారం, నవంబర్ 10, 2009

నవ్వినా కన్నీళ్ళే..

ఒకటి కాదు.. రెండు కాదు.. పద్దెనిమిదేళ్ళ నా నిరీక్షణ ఫలించింది. అవును 'నవ్వినా కన్నీళ్ళే..' అనే నవల కోసం నేను అక్షరాలా పద్దెనిమిదేళ్ళు ఎదురు చూశాను.. ఎన్నో చోట్ల వెతికాను.. యెంతో మందిని అడిగాను. చివరికి చాలా యాదృచ్చికంగా నిన్న సాయంత్రం నా కంట పడింది ఈ పుస్తకం. ఇంతకీ ఏమిటీ నవల ప్రత్యేకత? సమాధానం ఒకే ఒక్క మాట.. ఈ నవల ఆధారంగానే 'సీతారామయ్య గారి మనవరాలు' అనే సినిమా తీశారు.

మొదటిసారి సినిమా చూడడం పూర్తవ్వగానే నేను చేసిన మొదటి పని కథ ఎవరిదీ అని ఎంక్వయిరీ చేయడం. 'మానస' రాసిన 'నవ్వినా కన్నీళ్ళే..' నవల ఆధారం గా సినిమా తీశారని తెలిసింది. అది మొదలు ఆ నవల చదవాలని ప్రయత్నం. ఆ నవల 'ఆంధ్ర ప్రభ' లో ప్రచురించారని తెలిసి ఆ దిశగానూ ప్రయత్నాలు చేశాను..ప్చ్.. దొరకలేదు. గత పద్ధెనిమిదేళ్ళలోనూ సినిమాని వందల సార్లు (అక్షరాలా కొన్ని వందల సార్లు) చూశాను.. టైటిల్స్ చూసిన ప్రతిసారీ ఒకటే అసంతృప్తి.. నవల చదవలేక పోయాను కదా అని..

నిన్న సాయంత్రం పుస్తకాల షాపుకి వెళ్లి, ముందుగా అనుకున్న రెండు పుస్తకాలూ తీసుకుని, కొత్తగా ఇంకేం వచ్చాయా అని చూస్తున్న సమయంలో బాపు కవర్ పేజీతో వచ్చిన ఓ బరువైన పుస్తకం నా దృష్టిలో పడింది. పుస్తకం పేరు 'మదర్పిత...తాంబూలాది...' కథల సంపుటం. రచన 'మానస' . బుర్రలో బల్బు వెలిగింది.. నేను వెతుకుతున్న మానస ఈ మానస ఒక్కరే అయితే తప్పకుండా 'నవ్వినా కన్నీళ్ళే..' గురించిన వివరం ఈ పుస్తకంలో దొరుకుతుంది.

ఓ పక్కగా నిలబడి ముందుమాట చదువుతూ, ఎగిరి గంతెయ్యాలనే కోరిక బలవంతంగా అణచుకున్నాను. ముందుమాట లోనే నాక్కావలసిన వివరం దొరికేసింది.. అంతే కాదు.. అదే పుస్తకం చివర్లో ఆ చిన్న నవలనీ జత చేశారన్న తీపి కబురు కూడా . తర్వాత నేను ఏంచేశానో వివరంగా రాయక్కర్లేదు.. ఓ నవలని సినిమాగా తీసినప్పుడు చాలా మార్పులు, చేర్పులు చేస్తారాన్ని విషయాన్ని బాగా గుర్తు చేసుకుని చదవడం మొదలు పెట్టాను.

కథానాయిక సమీర పాతికేళ్ళ అమ్మాయి. బెజవాడ లోని తాతగారింట్లో తన మేనత్త కూతురి పెళ్ళికి అమెరికా నుంచి వస్తుంది. పెళ్ళికూతురు మినహా మిగిలిన బంధువులంతా ఆమెని ఆహ్వానించడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తారు. మద్రాస్ విమానాశ్రయంలో ఆమెని రిసీవ్ చేసుకోడానికి వెళ్ళిన పెద్ద బావ సుందర్ ఇంటి పరిస్థితి అంతా వివరంగా చెబుతాడు సమీరకి.

తాతగారు పరంధామయ్య (ఈ పేరు సాహిత్యం లో మాత్రమే కనిపిస్తుంది) ఎనభై కి దగ్గర్లో ఉంటే బామ్మ అనసూయమ్మకి డెబ్బై దాటేశాయి. సమీర తలిదండ్రులు ఇండియా వదిలి వెళ్ళిపోడానికి కారణం ఆమె తండ్రి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వర్ణాంతర వివాహం చేసుకోవడమే. తాతగారు మనవరాలికి కుటుంబంలో కలుపుకోలేరు, ఆమె తల్లిది వేరే కులం అన్న కారణంగా..

బామ్మగారికి మాత్రం సమీరని సుందర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. ఇందుకోసం ఒక వృధా ప్రయత్నం కూడా చేస్తుంది ఆవిడ. సుందర్, అతని తమ్ముళ్ళ ప్రేమ కథలు, సమీర కాలేజీ లెక్చరర్ గా పనిచేయాలనుకోవడం, అక్కడి సమస్యలు, ఆమె మేనమామ రాజశేఖరం కుటుంబం.. ఇలా నవల్లో ఎన్నో కొత్త పాత్రలు, కొత్త సన్నివేశాలు ఉన్నాయి.

తాతయ్య-బామ్మ లతో మనవరాలి అనుబంధాన్ని రేఖామాత్రంగానే స్పృశించారు. అనసూయమ్మగారి హఠాన్మరణంతో యోగిగా మారిపోతారు పరంధామయ్యగారు. సమీర తలిదండ్రులు ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన ప్రమాదం లో మరణించారన్న నిజం సుందర్ కి తెలియడమే నవల ముగింపు. ఊహించినట్టుగానే నవలకీ, సినిమాకీ చాలా భేదం ఉంది. అయితేనేం.. ముందుమాటలో అవసరాల రామకృష్ణారావు చెప్పినట్టు 'నవ్వినా కన్నీళ్ళే..' నవల లేకపొతే 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా లేదు.

దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం రాసిన ఈ నవల అప్పట్లో 'ఆంధ్రప్రభ' నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి గెలుచుకుంది. 'మానస' అన్నది రచయిత ఉన్నవ వెంకట హరగోపాల్ కలం పేరు. స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన హరగోపాల్ తన భార్య 'మానస' పేరు మీద రాశారీ నవలని అప్పట్లో. ఈ నవలని సినిమా కథగా మార్చి యెంతో మందిని కలవడం, చివరికి క్రాంతికుమార్ సినిమా గా తీయడం, ఆనాటి తన అనుభవాలు, అనుభూతులు ముందుమాటలో రాసుకున్నారు రచయిత.

నాకైతే నవల చదువుతున్నంత సేపూ సినిమా కోసం కీరవాణి చేసిన నేపధ్య సంగీతం చెవుల్లో వినిపిస్తూనే ఉంది. దానికి తోడు మొన్నరాత్రే సినిమాని మరో సారి చూశాను, కాకతాళీయంగా.. ఈ నవలతో పాటుగా 'మదర్పిత..తాంబూలాది..' తో సహా నలభై కథలున్నాయి.. వాటన్నింటినీ చదవాల్సి ఉంది, వరుసగా... ('మదర్పిత..తాంబూలాది..' పేజీలు 422, వెల 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

34 కామెంట్‌లు:

  1. tappa kumda komTaanu, nd mee visleashana chala bagumTumdi, nijamga venTanea koneyyalanna exiting vastumdi

    రిప్లయితొలగించండి
  2. పుస్తకాలు, అందునా నవలలు, ఇంతహడావుడి జీవితంలో ఇంత బాగా గుర్తు పెట్టుకుని
    మరీ చదువుతున్నారంటే , మీ పఠనాభిలాషను ఎలా మెచ్చుకోవాలో తెలియట్లేదు నాకు. కుడోస్.

    రిప్లయితొలగించండి
  3. ఆపుస్తకం కనిపించగానే మీలో ఆతృత, ఉద్వేగం కనిపించిందడి.

    రిప్లయితొలగించండి
  4. నాకు కూడా ఈ సినిమా చాలా ఇష్టం. పుస్తకం చూడగానే ఎన్నాళ్లో వేచిన హృదయం పాట పాడుకున్నారన్నమాట :)

    రిప్లయితొలగించండి
  5. ఓపిగ్గ ఇన్ని పుస్తకాలు చదివే మీకు మాత్రం హాట్సాఫ్ మురళి గారు. నాకు మీ లైబ్రరీ చూడాలని ఉంది. నా ఊహల్లో, మీ ఇల్లంటే ఒక లైబ్రరీ కనిపిస్తుంది. ఏనాడన్న ఒక పుస్తకం చదవాలంటే, నా మనసు స్థిరంగానే ఉండదు. ఎప్పుడు ఏవేవో ఆలోచనలు నన్ను వదలనే వదలవు. నా దగ్గిర ఎన్నో బుక్స్ ఉన్నాయి. కాని నామమాత్రంగా ఉండిపోతున్నాయి.

    రిప్లయితొలగించండి
  6. మురళిగారు,
    నేను చదవాల్సిన లిస్ట్ పె౦చేస్తున్నారు..
    జయగారి కామె౦ట్ చూశాక అవును కదా??మురళిగారి లైబ్రరి ఎలా ఉ౦డి ఉ౦టు౦దా అనిపిస్తు౦ది..ఓసారి తప్పక వస్తాను మీ లైబ్రరి చూడటానికి.

    రిప్లయితొలగించండి
  7. ఈ పుస్తకం గురించి, రచయత గురించి చదవటం ఇదే మొదటిసారి. బెంగుళూరులో ఇప్పుడు పుస్తక ప్రదర్శన వుంది. అక్కడ దొరుకుతుందో చూస్తాను.

    రిప్లయితొలగించండి
  8. మీ పుస్తకాల, కథల అన్వేషణలు భలే ఉంటాయండీ మురళీ! మిగతా కథలెలా ఉన్నాయో కూడా చదివాక రాయండి మర్చిపోకుండా! ఎదురు చూస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  9. మురళీ!

    ఈ నవల కోసం ప.ద్దె.ని.మి.దే.ళ్ళు. వెతికారా? ఇంత నిరీక్షణకు గురిచేసిన పుస్తకం యాదృచ్ఛికంగా కనిపించటమే అసలైన మజా!

    > ఎగిరి గంతెయ్యాలనే కోరిక బలవంతంగా అణచుకున్నాను.

    అప్పటి మీ ఉద్వేగాన్ని చక్కగా రాశారు!

    ఈ నవల నేను చదవలేదు కానీ, సినిమా నాకు బాగా నచ్చింది. కానీ, మీరు ‘వందల సార్లు’ చూశారా? అది చాలక, మళ్ళీ మొన్నరాత్రే మరో సారి కూడానా? :)

    రిప్లయితొలగించండి
  10. అన్వేషణ ఫలించగా చదివే పుస్తకాలు గొప్ప ఆనందానిస్తాయి. నేను మీ పోస్టులో చూడగలుగుతున్నాను.
    ప్లంబరుడు పదప్రయోగం బావుంది. :-)

    బొల్లోజు బాబా

    రిప్లయితొలగించండి
  11. నాకు కూడా చాలా ఇష్టమయిన మూవీ ఇది.
    మొత్తానికి బుక్ సంపాదించారు.
    కంగ్రాట్స్

    రిప్లయితొలగించండి
  12. నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి సీత రామయ్యగారి మనవరాలు. అందులో ఊళ్లల్ల్లో (ఎక్కువగా) ఉండే ఆప్యాయతలు, అనుబంధాలు అద్భుతంగా చిత్రీకరించారు క్రాంతి కుమార్ గారు. ఎన్ని సార్లు చూసినా చూసిన ప్రతీ సారి సినిమాని అనుభవించ గలుగుతాను. ఈ సినిమాకి మూలం ఒక పుస్తకమని ఇప్పుడే తెలిసింది.

    రిప్లయితొలగించండి
  13. "నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి" పాట గురించి రాసేరేమో అనుకుంటు మె పోస్ట్ మొదలెట్టేను.. నాకు అసలు నవలనే విషయం కూడా తెలియదు.. పేర్లు వేసేప్పుడు వేసేరా సినిమా లో.. నేను అంత పట్టించుకోలేదేమో.. నేను మరీ 100ల సార్లు కాదు కాని 10ల సార్లు చూసిన సినిమా.. బాగుంది మీ వివరణ.. ఎన్ని పుస్తకాలు చదవ వలసినవి తెలిసి పోతునాయో మీ బ్లాగ్ చదువుతుంటే.. మీ అడ్ద్రెస్స్ ఇవ్వండి మాస్టారు ఇద్దరు దోపిడీ దొంగలను పంపిస్తా మీ లైబ్రరీ కొల్ల గొట్టెయ్యటానికి. అది ఈజీ ఇంకా :-)

    రిప్లయితొలగించండి
  14. మీ ఎదురుచూపులు, ఉద్వేగం అన్నీ తెలుస్తున్నాయి.. అయితే ఇంకో రెండు రోజులు కడుపునిండా విందుభోజనమన్నమాట(పుస్తక భోజనం) :))

    రిప్లయితొలగించండి
  15. మురళిగారు , విక్రమార్కుని తమ్ములన్నమాట మీరు !మొత్తానికి సాధించారు ! అన్నట్టు మీరు ముగింపు చెప్పిన మొదటి పరిచయమనుకుంటా కదండీ !అందరూ సినిమా చూసేసి ఉంటారని కదూ !

    రిప్లయితొలగించండి
  16. పుస్తకం కోసం ఇంత ఆర్తా ..! మొత్తానికి అనుకున్న పుస్తకాన్ని సాధించినందుకు అభినందనలు. సుజాత, దుప్పల రవికుమార్, సౌమ్య, మీరు.. విపరీతంగా పుస్తకాలు చదివడంలో మీరంతా ఒక బడి.

    అన్నట్టు, నాకు ఇద్దరు పరంధామయ్యలు తెలుసు. మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఒకాయన ఉండేవారు. ఆయన్ని పరందరామయ్య అని పిలిచేవాళ్ళు. ఇంకొకాయన మా ఊళ్ళో.. - అయన్ను పరందయ్య అంటారు. :)

    రిప్లయితొలగించండి
  17. ఈ పుస్తకం గురించి మీ ద్వారా ఇప్పుడే తెలిసింది. ఆ పుస్తకం కనపడగానే ఎన్నాళ్లో వేచిన హృదయం...గుర్తుకొచ్చిందా? నాకయితే మీ టపా చదువుతుంటే ఆ పాటే గుర్తుకొచ్చింది. మీ ప్రతి టపాలో ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది.

    'మదర్పిత..తాంబూలాది....ఈ పుస్తకం ప్రచురణకర్తలు ఎవరో?

    @భావనా..నేనుకూడా నా శాయశక్తులా ఈ విషయంలో నీకు తోడ్పడతాను:)

    రిప్లయితొలగించండి
  18. సీతారామయ్యగారి మనవరాలు నాకూ ఇష్టమైన సినిమా . సి . డి వుంది .ఎన్నిసార్లు చూసానో గుర్తులేదు ! అది నవల ఆధారమని తెలీదు . ఇక నవల తప్పక కొంటాను .
    మీరు పుస్తకాలకోసం వెతుకుతుంటారుకదా , ఆ సమయములో " ఆవాహన " , ముదిగొండ శివప్రసాద్ రాసింది ఎక్కడైనా తగులుతే నాకు చెప్పరూ ప్లీస్ . నా చిన్నప్పుడు చదివానా నవలని . దాని గురించి చాలా ఏడ్ల నుండి వెతుకుతున్నాను .

    రిప్లయితొలగించండి
  19. నిర్విరామంగా వెతికి మరో ఆణిముత్యాన్ని మీ గ్రంధాలయాభరణంలో పోదిగినందుకు అభినందనలు మురళి గారూ..!!

    రిప్లయితొలగించండి
  20. @హను: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @సునీత: ఆ సినిమా మీద ఇష్టం చాలా వరకు కారణం అండి.. అందుకే బాగా గుర్తుపెట్టుకున్నాను.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: నిజం.. నేను సరిగ్గా రాయలేక పోయానేమోనండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @విశ్వ ప్రేమికుడు: లేదండి.. 'సీతారామయ్య గారి మనవరాలు' నేపధ్య సంగీతం గుర్తొచ్చింది పదే పదే.. ధన్యవాదాలు.
    @జయ: అయ్యో.. మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారండీ.. మరీ అన్ని పుస్తకాలు లేవు.. అవునూ.. మీ ఇంట్లో పుస్తకాలు ఉండీ మీరు చదవరా?? అప్పుడప్పుడూ ఒక్కో పుస్తకం తిరగేసి బ్లాగులో రాస్తూ ఉండండి, మా లాంటి వాళ్ళ కోసం.. ధన్యవాదాలు.
    @సుభద్ర: వస్తే నిరాశ పడతారండీ :) ఎక్కువ బుక్స్ లేవు.. చదివిన పుస్తకాలన్నింటి గురించీ రాయడం వల్ల మీకలా అనిపిస్తోందేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @విజయవర్ధన్: బాపు గారి కవర్ పేజ్ హాస్యరస భరితంగా ఉంటుందండీ.. చూడగానే ఆకర్షించే గెటప్.. చదవండి.. ధన్యవాదాలు.
    @సుజాత: పుస్తకం చదవడం పూర్తవ్వగానే ఆపనే చేస్తానండీ.. ధన్యవాదాలు.
    @వేణు: వారానికి ఒకసారైనా తప్పకుండా చూస్తానండీ.. మొత్తం చూడక పోయినా సెలెక్ట్ సన్నివేశాలైనా తప్పదు.. డైలాగులు, నేపధ్య సంగీతం తో సహా మొత్తం సినిమా నోటికొచ్చు :):) ముఖ్యంగా నేపధ్య సంగీతం.. ఎలాంటి మూడ్ లో సినిమా చూడడం మొదలు పెట్టినా ఒకలాంటి ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి పోతుంది.. సినిమా మొదటిసారి చూసినప్పటినుంచీ పుస్తకం కోసం వెతకడం మొదలు పెట్టానండీ.. నిజంగానే చాలా సంతోషంగా అనిపించింది ఆ క్షణం లో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @బొల్లోజు బాబా: నేను నా అనుభూతిని పూర్తిగా అక్షరీకరించ లేక పోయానేమో అనిపిస్తోందండీ.. నిజంగానే ఆక్షణం చాలా చాలా సంతోష పడ్డాను.. అయితే మా ప్లంబరుడు మీక్కూడా నచ్చాడన్న మాట :) ..ధన్యవాదాలు.
    @మా ఊరు: ధన్యవాదాలండీ..
    @వాసు: నాక్కూడా చూసిన ప్రతిసారీ ఒక కొత్త అనుభూతి కలుగుతుందండీ.. అందుకే అన్నిసార్లు చూస్తున్నానేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @భావన: దోపిడీ దొంగలా? :):) వాళ్ళు నాతో పాటు మిమ్మల్ని కూడా తిట్టుకుంటారు.. ఏమీ దొరకలేదని.. ధన్యవాదాలు.
    @మేధ: అవునండీ.. ఆ పనిలోనే ఉన్నాను.. ధన్యవాదాలు.
    @పరిమళం: ప్రయత్నించి సాధించింది కాదు కదండీ.. యాదృచ్చికంగా కంటబడింది.. ఆఫ్కోర్స్, చాలా ప్రయత్నాల తర్వాత.. గతం లో కొన్ని టపాల్లో ముగింపు చెప్పానండీ.. ఈ నవల విషయంలో మీరన్నది నిజం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @చదువరి: చిన్న సవరణ.. బళ్ళో మీరు చెప్పిన వాళ్ళంతా బహు సీనియర్లు.. భవదీయుడు లాస్టు బెంచీ :):) నాకు బయట ఒక్క పరంధామయ్య కూడా తెలీదండీ.. సాహిత్యం లో మాత్రం చాలామంది తెలుసు.. అందుకే ఆ పేరు పుస్తకాల్లో తప్ప బయట ఉండదేమో అనుకున్నాను.. ధన్యవాదాలు.
    @సిరిసిరి మువ్వ: నాకు 'సీతారామయ్య గారి మనవరాలు' కోసం కీరవాణి చేసిన సంగీతం గుర్తొచ్చిందండీ.. ముఖ్యంగా 'వెలుగు రేకల వారు..' ట్యూన్.. రచయితా స్వయంగా ప్రచురించుకున్నారండీ పుస్తకాన్ని.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @మాలాకుమార్: తప్పక వెతుకుతానండీ 'ఆవాహన' కోసం.. శివ ప్రసాద్ గారి నవలలు మళ్ళీ ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాను ఆమధ్య.. కాబట్టి త్వరలోనే మీకు దొరుకుతుంది.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  27. అప్పుడెప్పుడో మీ వలన మొదలుపెట్టిన 'కొని చదవాల్సిన ' పుస్తకాల లిస్ట్ కి దుమ్ము దులిపి మళ్ళీ పైకి తీశాను :-) ఏంటో ఈ లిస్ట్ తోనే ఒక పుస్తకమయ్యేట్లుంది :-)
    సీతారామయ్యగారి సినిమాని చాలాసార్లే చూశాను కానీ టైటిల్స్ ఎప్పుడూ పట్టించుకోలేదు.. సో, దానికో మూలకధ ఉందని మీవలనే తెలిసింది.. మీరన్నట్టు కొన్ని కధలు ముందే తెలిసినా వాటిలోని భావోద్వేగాలు మళ్ళీ అనుభవించడం కోసమైనా చదవాలనిపిస్తుంది!

    రిప్లయితొలగించండి
  28. మీ ఇన్నాళ్ల అన్వేషణ ఫలించినందుకు సంతోషం కలిగిందండీ. ఆ వెతుకులాటలోని ఆరాటం, దొరికితే కలిగే ఆనందం నాకు అనుభవమే. కాకపోతే పుస్తకాల విషయంలో కాదు కొన్ని పాటల విషయంలో.
    ఈ సందర్భంగా మీ శ్రీమతిగారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానండీ. ఎందుకంటే ఇంతటి "passion" కొనసాగటానికీ, అది ఉన్న మనిషిని(మంచివాడైనా) భరించటానికీ తప్పకుండా చాలా సహనవంతులైన పార్ట్నర్ ఉండి ఉండాలి. ఈ సంగతి నాకు మా నాన్నగారి ద్వారా అనుభవం. మా నాన్నగారికి ఉన్న passions కొనసాగటానికీ, వాటిని భరించిన సహనవంతురాలైన మా "అమ్మ" నాకు తెలిసిన పెద్ద ఉదాహరణ.

    రిప్లయితొలగించండి
  29. @నిషిగంధ: లిస్టు పుస్తకమయ్యేలా ఉందా? మీరు బహుశా కొన్న పుస్తకాలని లిస్టు నుంచి తొలగించడం మర్చిపోతున్నట్టున్నారు... అంతే కదండీ? :-) ..ధన్యవాదాలు.
    @తృష్ణ: నేనైతే ఈ పుస్తకం ఇక దొరకదు అనుకున్నానండీ.. అంట యాదృచ్చికంగా దొరికేసరికి నిజంగానే భలే సంతోష పడ్డాను.. మీరు చెప్పిన పాయింటు ఆలోచించాల్సిందే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. మురళి గారు ,
    ఆవాహన సంపాదించానండి . రచయిత దగ్గరకే వెళ్ళి తెచ్చుకున్నాను . కావాలంటే ఇంకా ఆయన దగ్గర కాపీలున్నాయి . తొందరలోనే మార్కెట్ లో పెడతారట .

    రిప్లయితొలగించండి
  31. @మాలాకుమార్: మంచి వార్త చెప్పారు.. పుస్తకం పూర్తి చేశాక మర్చిపోకుండా ఒక టపా రాయండి..

    రిప్లయితొలగించండి
  32. @రహ్మనుద్దీన్ షేక్: http://nemalikannu.blogspot.in/2009/11/blog-post_21.html

    రిప్లయితొలగించండి
  33. మానస కలం పేరు.... అసలు పేరు వున్నవ వెంకట హరిగోపాల్

    రిప్లయితొలగించండి