శనివారం, ఏప్రిల్ 25, 2009

రేగడివిత్తులు

మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇప్పటికీ మన రాష్ట్రం లో అధిక శాతం ప్రజలకి వ్యవసాయమే జీవనాధారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు సాహిత్యంలో వ్యవసాయాన్ని ప్రధానాంశంగా చేసుకుని వచ్చిన రచనలు బహు తక్కువ. గడిచిన దశాబ్ద కాలంలో ఐతే, ఈ రంగాన్ని గురించి వచ్చిన పుస్తకాలను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఈ నేపధ్యంలో వ్యవసాయాన్ని, గ్రామీణ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని చంద్రలత రాసిన నవల 'రేగడివిత్తులు.' ఈ నవల గురించి నా వ్యాసం 'పుస్తకం' లో..

***

‘విత్తనం తో విప్లవం’ ఇది ‘రేగడివిత్తులు’ నవల ద్వారా రచయిత్రి చంద్రలత ఇచ్చిన సందేశం. పుష్కర కాలం క్రితం ఉత్తరమెరికా తెలుగు సభ (తానా) నిర్వహించిన నవలల పోటీలో ప్రధమ బహుమతి రూ. 1.2 లక్షలు అందుకున్న ఈ నవల, నాలుగు దశాబ్దాల కాలంలో వ్యవసాయం లోనూ, వ్యవసాయాన్ని నమ్ముకున్న ఓ పల్లెటూరి కుటుంబంలో వచ్చిన మార్పులని నిశితంగా చిత్రించింది.

వ్యవసాయం తో పాటు, సామాజిక, ఆర్ధిక అంశాలు, తెలంగాణా ప్రాంతంలో దొరతనం, వెనుకబాటు తనం, ఆంద్ర గోబ్యాక్ ఉద్యమం, ఆ సమయం లో తెలంగాణా ప్రాంతం లో ఉన్న ఆంధ్ర కుటుంబాలు ఎదుర్కొన్న సమస్యలు, రెండు ప్రాంతాల ఆచారాలు, వ్యవహారాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు..ఇలా ఎంన్నో అంశాలను స్పృశించింది ఈ నవల.

యాభై-అరవై ల మధ్య కాలంలో మొదలయ్యే కథలో ప్రధాన పాత్ర రామనాధం. గుంటూరు జిల్లా రేపల్లె కి చెందిన వ్యవసాయ కుటుంబంలో రెండో కొడుకు. అన్నగారు రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాధం చదువుకుని గవర్నమెంటులో  ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గల వాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్ల రేగడి నేలను చూసిన రామనాధం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక.

తల్లిని, అన్నగారిని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్య తో కలిసి నడిగడ్డ కి వచ్చిన రామనాధం ఓ దొర దగ్గర పొలం కొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయం లోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాధానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డ కి వలస వస్తుంది.

మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాధం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడం తో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.

మరో పక్క ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం, ప్రజల్ని రెచ్చగొట్టే నాయకులు, చదువుకొనే విద్యార్ధుల — ముఖ్యంగా అమ్మాయిల — సమస్యలనూ చర్చిస్తుంది ఈ నవల. ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయం లోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు.. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా. పెళ్ళయ్యాక పూర్తి కొత్త సంస్కృతిలో ఆ అమ్మాయి ఎదుర్కొనే సమస్యలు, వాటిని ఆమె ఎలా పరిష్కరించుకుంది లాంటి విషయాలు ఆసక్తి గా చదివిస్తాయి.

కల్తీ ఎరువులు, విత్తనాలు, పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్ లో ధర పడిపోవడం, దళారీల పాత్ర.. ఇలా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలనూ స్పృశిస్తూ సాగుతుంది కథ. అదే సమయంలో రాంనగర్ పక్కగా హైవే రావడం, పట్టణ సంస్కృతి ప్రభావం, మనుషుల మధ్య పెరిగే దూరాలనూ కళ్ళముందు ఉంచుతుంది. ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు ఆ కుటుంబానికి ఆనంద విషాదాలు ఏక కాలంలో అనుభవంలోకి రాడాన్ని, ఇటు అమ్మాయి వాళ్ళు, అటు అబ్బాయి వాళ్ళు తమకి కొత్తవైన సంప్రదాయాలను ఆసక్తి గా గమనించడం ఈ నవలలో చూడొచ్చు.

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఎక్కడ మొదలై, ఎలా కొనసాగుతాయి అన్న విషయాన్ని చాలా వివరంగా చిత్రించారు. ముఖ్యంగా డబ్బు మనుషుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు తెస్తుంది అనే విషయాన్ని ఉత్తరార్ధం లో కళ్ళకు కడతారు రచయిత్రి. ఉమ్మడి కుటుంబాన్ని నేపధ్యంగా ఎంచుకోవడం వల్ల విస్తారమైన కేన్వాస్ ఏర్పడింది. పెద్ద తరం ఆలోచనల నుంచి, కుర్రకారు ప్రేమల వరకు ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి.

వ్యవసాయంతో పాటు పర్యావరణ సమస్యలు, ముఖ్యంగా హరిత విప్లవపు అవాంచిత ఫలితమైన ‘కాంగ్రెస్ గడ్డి’ గురించి సందర్భోచితంగా వివరించారు. అలాగే పెద్ద యెత్తున ఎరువులు, పురుగు మందులు వాడకం వల్ల జరిగే పరిణామాలనూ తెలిపారు. రామనాధానికి ఉన్న ఆత్మ విశ్వాసం, ఆశా వహ దృక్పధం, తొణకని నైజం, కుటుంబ సభ్యులతో పాటు తోటి రైతుల గురించీ ఆలోచించే అతని తత్త్వం కథకి బలాన్ని ఇచ్చాయి. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాధం. ఆశావహ దృక్పధం తో ముగుస్తుంది కథ.

ఈ నవలలో లోపాలు లేవా అంటే ఉన్నాయి.. కొన్ని పాత్రలు అర్ధంతరంగా మాయమవడం, అక్కడక్కడ వచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు, కొన్ని సన్నివేశాలు అతి వివరంగా రాసి మరి కొన్నింటిని రెండు మూడు డైలాగులతో దాట వేయడం.. ఇత్యాదులు.  ఐతే ఇవేవీ నవల చదవడానికి అడ్డు కాదు. వదలకుండా చదివించే గుణం ఈ నవలకున్న ప్లస్ పాయింట్. తానా అవార్డు కమిటీ సభ్యులు అభిప్రాయ పడినట్టుగా ఈ నవలకు చక్కటి ఎడిటింగ్ అవసరం.

పల్లెటూళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళు, వ్యావసాయిక నేపధ్యం ఉన్నవారు ఈ నవలను పూర్తిగా ఆస్వాదిస్తారు. ఈ అంశాలపై ఆసక్తి ఉన్నవారిని కూడా వదలక చదివిస్తుంది ఈ నవల. తానా ప్రచురించిన 420 పేజీల ‘రేగడి విత్తులు’ (Regadi Vittulu – Chandralatha) నవల వెల రూ. 195. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది.

4 కామెంట్‌లు:

  1. అర్థవంతమైన, అవసరమైన సాహిత్యం సృష్టిస్తున్న రచయిత(త్రు)ల్లో ఒకరు చంద్రలత. ముఖ్యంగా “మార్పు” నేపధ్యంలో పల్లెబ్రతుకుల్ని(రేగడివిత్తులు), పట్నవాస సంధి బ్రతుకుల సందిగ్ధతను (‘ఇదం శరీరం’లో కొన్ని కథలు),పునరావాస వ్యతలకు(దృశ్యాదృశ్యం) గొంతుకనిస్తున్న తీరు అభినందనీయం. (మీరు)పుస్తకం డాట్ నెట్ వీరి మిగతా రచనల పరిచయం కూడా చెయ్యాలని ఎదురుచూస్తాను.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారూ!వ్యాసం మీ శైలిలో చక్కగా రాశారు .అభినందనలు .

    రిప్లయితొలగించండి
  3. ఓ మంచి పుస్తకం పరిచయం చేసారు. వ్యవసాయ నేపధ్యం కల కుటుంబం నుండి వచ్చిన దాన్ని అవటం మూలానేమో ఈ పుస్తకంలోని కొన్ని సన్నివేశాలు మా జీవితాలలోనుండి వ్రాసినట్లుగా ఉంటాయి. నేనూ ఈ పుస్తకం గురించి వ్రాసి ఉంచాను పుస్తకం వారికి పంపుదామని:).
    మీరన్నట్టు కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా వదలకుండా చదివించే పుస్తకం ఇది.

    రిప్లయితొలగించండి
  4. @కత్తి మహేష్ కుమార్, పరిమళం: ధన్యవాదాలు
    @సిరి సిరి మువ్వ: అయ్యో.. నేను తొందర పడ్డానన్న మాట.. 'నవతరంగం' వాళ్ళు ఒక సినిమాపై ఎన్ని సమీక్షలైనా వేస్తారండి. 'పుస్తకం' వాళ్ళ సంగతి నాకింకా తెలియదు.. ఒకవేళ అక్కడ వీలు కాకపొతే, మీ బ్లాగు లోనైనా ప్రచురించండి.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి