శుక్రవారం, ఏప్రిల్ 10, 2009

మనసు బాగోనప్పుడు...

మనసు బాగోకపోవడం అన్నది అందరికీ ఏదో ఒక సమయంలో వచ్చే సమస్య. బాగుండక పోడానికి ఒక్కోసారి కారణాలు ఉంటాయి. చాలా సార్లు ఉండవు.. కొన్ని సార్లు కారణాలు ఉన్నా మనకి వెంటనే తోచవు. పాడైన మనసుకు సాధ్యమైనంత తొందరగా మరమ్మతు చేయకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయన్నది స్వానుభవం. మరి ఈ మరమ్మతు చేయడం ఎలా?

నావరకైతే చాలా ఉన్నాయి. ఏకాంతంగా గడపడం, పాటలు వినడం, సినిమా చూడడం, పుస్తకాలు చదవడం, గతంలో జరిగిన మంచి విషయాలు జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, కుటుంబ సభ్యులతోనో మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులతోనో మాట్లాడడం.. ఇలా ఏదో ఒకటి చేసి మామూలై పోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను.

ఏకాంతంగా గడపడం వల్ల మన చిరాకుని మరొకరి మీద చూపించ కుండా తప్పించుకోవచ్చు. దానితో పాటు సమస్య గురించి కొంచం జాగ్రత్తగా ఆలోచించి పరిష్కారం వెతుక్కోడానికీ కృషి చేయచ్చు. ఒంటరిగా ఉండలేకపోయినప్పుడు ఇష్టమైన పాటల్ని తోడు తెచ్చుకోవచ్చు. టీనో కాఫీనో తాగుతూ నచ్చిన పాటల్ని వింటుంటే మూడ్ సగం బాగుపడుతుంది.

మూడ్ బాగోనప్పుడు సినిమా చూడడంలో ఓ చిన్న రిస్కు ఉంది. సినిమా బాగుంటే మూడ్ బాగుపడడానికి ఎంత ఛాన్స్ ఉందో, సినిమా చెత్త ఐతే మూడ్ మరింతగా దిగజారే ప్రమాదమూ ఉంది. ఇలాంటప్పుడు చూడడానికి నేను ఓసారి చూసి బాగుంది అనుకున్న సినిమాలనే ప్రిఫర్ చేస్తాను.

పుస్తకాలూ అంతే.. అసలు ఇలాంటప్పుడు చదవడానికి నవలల కన్నా కథలు బాగుంటాయి. బయటకి వెళ్ళే మూడ్ ఉంటె నేను వెళ్ళే మొదటి చోటు పుస్తకాల షాపు. రాకుల్లో ఉన్న పుస్తకాలను చూస్తుంటే సమస్యలనే కాదు, నన్ను నేనే మర్చిపోతూ ఉంటాను. కాసేపు పుస్తకాల మధ్య తిరిగి, అక్కడ పని చేసే నా ఫ్రెండ్స్ తో మాట్లాడి (నేను రెగ్యులర్గా వెళ్ళే అన్ని షాపుల లోను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు) ఒకటో రెండో పుస్తకాలు కొనుక్కుని వస్తుంటాను.

కుటుంబ సభ్యులతో, మిత్రులతో మాట్లాడడం అన్నది అవతలి వాళ్ళ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. పరిస్తితులు అనుకూలంగా లేనప్పుడు మనం మౌనంగా ఉండడమే ఉత్తమమన్నది నా అనుభవం. నగర పొలిమేరలను చూసి రావడం కూడా నన్ను మామూలు మనిషిని చేస్తుంది. నీళ్లనో పంట పొలాలనో, ఎగిరే పక్షులనో చూస్తే చాలు రీచార్జ్ ఐపోతా..

విచిత్రం ఏమిటంటే కొన్ని సార్లు వీటిలో ఏపనీ చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు ఆత్రేయ గారిని తలుచుకుని కాసేపు నిద్రపోయే ప్రయత్నం చేస్తూ ఉంటా.. ఆత్రేయ గారిని తల్చుకోడం ఎందుకంటే ఆయనే కదా 'మూగమనసుల'కి 'కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది..' అని చెప్పారు.

10 కామెంట్‌లు:

  1. కుటుంబ సభ్యులతోను ,మిత్రుల తోను మాట్లాడడం వారి మూడ్ మీద ఆధారపడి వుంటాద!....నిజమే మనస్సు బాగోపోతే నా మటుకు నేను మౌనం నే ఆశ్రాయిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. మనసు బాగోగ పోటానికి ప్రధాన కారణాలు - మనసు పదే పదే తనకి కలిగిన షాకులను నెమరువేస్కోటమే. జ్ఞాపకాల పుండుని రేపుతుంటుంది మనసు. నాకు మనసు బాగోదు చాలా సార్లు. కారణం - జీవితంలో నేకోల్పోయిన అతివిలువైన వాటిని "కోల్పోయిన విధానం"తో సహా మళ్లీ కళ్లముందే సాక్షాత్కరించి ఓ సినిమా రీలులా ప్లే చేసి పచ్చిపుండులా చేస్తుందీ మనసు.
    అప్పుడు ఓ కమ్మని కాఫీకొట్టి, మావాడితో ఆడతా. లేక కార్ క్లీన్ చేస్కుంటా. లేక ఒక గుడ్డ తీస్కుని ఇల్లంతా శుభ్రంగా తుడుస్తా అంటే కిటికీలు, టివి, డివిడి ప్లేయర్ ఇలా. అవి ఇవి కాకపోతే లాండ్రీకె వెళ్తా. అసలు ముందు నాకు అంత సమయం ఉండదు అనుకోండి. ఇరవైనాలుగు గంటల్లో సూరిగాడు నలభై రెండు గంటలు, పిల్ల ఆరు గంటలు తినేస్తున్నారు. :):)

    రిప్లయితొలగించండి
  3. నేనైతే ఒక బౌల్ నిండా ఐస్ క్రీం వేసుకు తిని నిద్రపోతాను.. పుస్తకాలు, పాటలు, సినిమాలు ఎంత మంచివైనా సరే ఆ భారాన్ని ఇంకాస్త పెంచుతాయి (నా అభిప్రాయం).. మనసు బాగోనప్పుడు చేయాల్సింది ఆలోచించడం మానేయడం.. తాత్కాలికంగా! కాసేపు బొజ్జుని లేస్తే ఆలోచనా పధం సవ్యంగా ఉంటుంది :-)

    రిప్లయితొలగించండి
  4. అలాంటప్పుడు నేను తప్పనిసరిగా చేసేపని ఒకటుంది.అది ఏదైనా పెద్ద షాపింగుమాల్ కెళ్ళి ఒక మంచి బెంచీ చూసుకొని కూర్చొని వచ్చేపోయే జనాలని చూస్తూ ఉండటం.

    సినిమాలు కూడా చూస్తా.ముఖ్యంగా నేనుచూడని,నా లిస్టులో రేటింగు చూసుకొని మరీ పెట్టుకున్న హారర్ లేదా థ్రిల్లర్ సినిమాలు.దెబ్బకు దయ్యం వదులుతుంది. పాటలు కూడా వింటా ముఖ్యంగా నిద్రపోయేముందు.

    రిప్లయితొలగించండి
  5. గత ఐదు నెలలుగా మాత్రం మీ అందరి బ్లాగుల్లోకి తొంగిచూస్తున్నా...అలాగని రోజూ మనసు బాగోదనుకునేరు :)
    వీలయితే షాపింగ్ , పార్క్ లేదంటే మా ఇంట్లో రాధాకృష్ణుల పైంటింగ్ కొంతసేపు చూస్తె చాలు ...

    రిప్లయితొలగించండి
  6. @అరవింద్: ధన్యవాదాలు
    @చిన్ని: మాట్లాడి గొడవలు పెంచుకోవడం కన్నా మౌనంగా ఉండడమే మంచిదని నా అనుభవం అండి. ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: కొన్ని విషయాలు ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా మరచిపోలేం. విచిత్రం అంటే పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే ఏవేవో గుర్తొచ్చి మనసు పాడైపోతూ ఉంటుంది. ధన్యవాదాలు.
    @నిషిగంధ: కొన్నాళ్ల క్రితం వరకూ నేనూ హిమక్రీములు తినడం కోసం అవకాశాలు వెతుక్కునే వాడినండి.. నాకేమిటో ఒక్కోసారి పిలవగానే నిద్ర రాదు.. ధన్యవాదాలు
    @ఉమాశంకర్: నేనూ షాపింగ్ చేస్తానండి.. కాకపొతే మనసు బాగోనప్పుడు అనవసరమైనవి కొనేస్తున్నానని గ్రహించి అలాంటప్పుడు వెళ్ళడం తగ్గించా.. ధన్యవాదాలు
    @మాధవ్: ధన్యవాదాలు.
    @పరిమళం: నిజమేనండి..ఇప్పుడు బ్లాగులు ఉన్నాయి చూడడానికి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. నా మనసు బాలేదంటే గోడ వైపు తిరిగి పడుకొని అలా ఆలోచిస్తూ ఉంటా. అలా ఎంత సేపు ఉంటానో నాకే తెలియదు. ఆ భంగిమ మారెవరకు మయ అమ్మకి టెన్షన్. నన్ను పిలవడు కానీ నేను ఎప్పుడు ఆ మూడ్ నుంచి బయటకు వస్తానో అని ఎదురు చూస్తుంది.

    రిప్లయితొలగించండి
  8. @Subrahmanya Chaithanya Mamidipudi: ఏదో ఒక ఔట్లెట్ ఉండాలండి.. లేకపొతే ఆ ప్రభావం మనం చేసే ఇతర పనుల మీద పడుతుంది.. ఎవర్నీ నొప్పించకుండా, ఇంట్లో వాళ్లకి అర్ధమయ్యేలా...మీరు చేస్తున్నది బాగుంది.. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి