మంగళవారం, ఏప్రిల్ 07, 2009

కొయిటా ఉత్తరం

రాయడం, చదవడం త్వరగా నేర్చేసుకువడంతో కనిపించిన ప్రతి కాగితం చదవడం అలవాటైపోయింది చిన్నప్పుడు. ఉత్తరాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాతయ్య నాకు, నాన్నకి ఉత్తరాలు రాసేవారు. అత్తయ్యలు, బాబాయిలు కూడా నాన్నకి ఉత్తరాలు రాసేవాళ్ళు.

తాతగారు, పెద్దమ్మలు, పిన్నిలు, మావయ్యల నుంచి అమ్మకి ఉత్తరాలు వచ్చేవి. ఇవి కాక దూరపు బంధువులు కూడా అప్పుడప్పుడు ఓ కార్డు ముక్క రాసి పడేసే వాళ్ళు, క్షేమ సమాచారాలు కాని, శుభాశుభ వార్తలు కాని. ఒకరి ఉత్తరాలు మరొకరు చదవకూడదు లాంటి నియమం ఏదీ ఉండేది కాదు. పైగా మా మధ్యాహ్న భోజనాల సమయంలో పోస్ట్ వచ్చేది.

ఉత్తరం ఓ సారి నాన్నకి చూపిస్తే ఎవరు రాశారో చూసి చదవమనే వాళ్ళు. కొన్నాళ్ళకి చేతి రాత గుర్తుపట్టడం వచ్చేసి ఎవరు రాశారో నేనే చెప్పేసే వాడిని. వారానికి రెండు సార్లైనా మా ఇంట్లో భోజనాలు అయ్యే టైం కి ఒకరో, ఇద్దరో, నాన్న కోసం ఎదురు చూస్తూ వీధిలో కూర్చునే వాళ్ళు, చేతిలో సెంటు వాసన వచ్చే పొడవాటి రంగుల కవర్లు పట్టుకుని.. వాళ్ళు 'కొయిటా' వాళ్ళు.

అంటే వాళ్ళ పిల్లలు పని కోసం గల్ఫ్ దేశాలు వెళ్లారన్న మాట. వ్యవసాయ భూమో, స్థిరమైన ఉద్యోగమో ఉన్నవాళ్ళకి మా కోనసీమ భూతల స్వర్గమే అయినా, ఆ రెండూ లేని వాళ్లకి మాత్రం చాలా ఇబ్బందులు ఉండేవి. వ్యవసాయ పనులు సంవత్సరం పొడవునా ఉండకపోవడం, ఉపాధి కల్పించే పరిశ్రమలు వేరేవీ లేకపోవడం తో చాలా మంది 'కొయిటా' బాట పట్టారు. టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బొంబాయి వెళ్ళడంతో మొదలైన ఈ వలస, ఆ తర్వాత కూలీలకీ పాకి, ఇప్పటికీ కొనసాగుతోంది.

వాళ్ళు తెచ్చిన ఉత్తరాన్ని శ్రద్ధగా చదివి వినిపించే వాళ్ళు నాన్న. కొన్నాళ్ళు పోయేసరికి కొయిటా ఉత్తరాలు చదివే పని నాకు తెలియకుండానే నా దగ్గరికి వచ్చేసింది. ఒకటి రెండు సార్లు నాన్నఊళ్ళో లేక పోవడం, అమ్మ ఇంటి పనుల్లో ఉండడంతో నేను చదివాను. వాళ్లకి అది నచ్చడంతో ఇక నాతోనే చదివించుకునే వాళ్ళు.

కొయిటా ఉత్తరాలు చాలా పెద్దగా ఉండేవి. పది పదిహేను పేజీల వరకు. లేత రంగు పూలున్న పల్చని కాగితాల మీద, బాల్ పాయింట్ పెన్ గట్టిగా నొక్కిపెట్టి రాసేవాళ్ళు. వెళ్ళిన వాళ్ళంతా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళే కావడం తో అక్షరాలూ కుదురుగా ఉండేవి కాదు. భాష కూడా కొంచం తేడాగా ఉండేది.

చదవగా, చదవగా నాకు కొయిటా ఉత్తరాలు తడబడకుండా చదవడం వచ్చేసింది. వాళ్ళు డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టమనీ, ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకొమ్మని, పిల్లల్ని బడి మానిపించొద్దనీ రాసేవాళ్ళు. ఇంకా ఊళ్ళో విశేషాలు అన్నీ అడిగేవాళ్ళు. అందరి కుశలాలు, ముఖ్యంగా మావి (ఉత్తరాలు మా ఇంట్లో వాళ్ళే చదువుతారని, జవాబులు రాస్తారని వాళ్లకి తెలుసు) అడిగేవాళ్ళు.

ఉత్తరాలు చదివి వినిపిస్తుంటే రకరకాల భావోద్వేగాలతో వినేవాళ్ళు. అక్కడ పని కష్టంగా ఉందని రాసినా, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని రాసినా వీళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకునే వాళ్ళు. విషయం అర్ధమయ్యాక నేను కొద్దిగా మార్చి చదివేవాడిని.. ఇక్కడ పని బానే ఉంది...అలా (పాపం శమించు గాక) ప్రతి నెలా చెక్కులు వచ్చేవి. మంచి భూమి చెక్క ఏదైనా అమ్మకానికి వస్తే బేరం చేయమని, పిల్లల పెళ్ళిళ్ళ గురించీ వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. వీటివల్ల వాళ్ళ ఇళ్ళ సంగతులు కూడా నాకు తెలుస్తూ ఉండేవి.

కొన్నాళ్ళకి నేనొకటి గమనించాను. ఉత్తరాలు వచ్చేవాళ్ళంతా నా చేత చదివించుకోడానికి, నాన్న చేత జవాబు రాయించుకోడానికి ప్రయత్నించేవాళ్ళు. ఈ కిటుకేమితో అర్ధం కాలేదు చాలారోజులు. విషయం ఏమిటంటే నా చేత చదివించుకోడం వల్ల వాళ్లకి కావాల్సిన విషయాలు మళ్ళీ మళ్ళీ చదివించుకోవచ్చు, మొహమాటం లేకుండా. నేను పెద్ద అక్షరాలు రాసేవాడిని. అందువల్ల నేను రాస్తే సగం విశేషాలు కూడా అవ్వకుండానే కవరు నిండిపోయేది. నాన్న చేతి రాత చీమల బారు. చాలా సంగతులు పట్టేవి కవర్లో.

నేను హైస్కూలుకి వెళ్ళేసరికి మా పోస్టు వేళలు మారిపోయాయి. సాయంత్రం వచ్చేవి ఉత్తరాలు. కొయిటా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ కూర్చునే వాళ్ళు. అప్పట్లో రేడియోలో వచ్చే అక్షరాస్యతా కార్యక్రమాలు విని చైతన్యం పొంది, 'మీకు నేను చదువు చెబుతాను, నేర్చుకోండి' అన్నాను. 'మీరు సదివి ఇనిపిత్తారు కదా బాబూ' అన్నారు కానీ, ఒక్కళ్ళు కూడా ఆసక్తి చూపించలేదు. తర్వాత కొయిటా వెళ్ళిన వాళ్ళ పిల్లలు చదువుకోవడం తో వాళ్ళ ఉత్తరాలు వాళ్ళే చదువుకో గలిగే వాళ్ళు.

కొయిటా ఉత్తరాలు చదివి వినిపించడం వల్ల కొన్ని బహుమతులు కూడా వచ్చేవి. ఉత్తరాలు రాసేవాళ్ళు ఊరికి వచ్చినప్పుడు ఫారిన్ సబ్బో, సెంటు సీసానో, షర్టు పీసో తెచ్చి ఇచ్చేవాళ్ళు ప్రేమగా.. అలా నాకు పెర్ఫ్యుమ్ ల మీద ఇష్టం మొదలైంది. ఈ ఉత్తరాలు చదివి పెట్టడం వల్ల ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలిసేది.

ఉద్యోగం కోసం ఊరు వదిలాక, నేనూ అలాగే ఆలోచించేవాడిని. ఇంటికి ఉత్తరం రాసినప్పుడల్లా వాళ్ళ ఉత్తరాలు గుర్తొచ్చేవి. సుధామూర్తి రాసిన 'అమ్మమ్మ చదువు' కథ తిరగేస్తుంటే ఈ సంగతులన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి.

6 కామెంట్‌లు:

  1. కొయిటా ఉత్తరాలు మా చిన్నప్పుడూ ఇలాంటి అనుభవాలనే ఇచ్చేవి.
    కొన్ని మన సాధారణ అనుభవాలను అసాధారణంగా కవిత్వీకరించటం ఈ కవిత చూస్తే తెలుస్తుంది. ఈ కవిత దళిత బాక్ గ్రవుండుతో ఉండి చాలా ఆర్ధ్రంగా గుండెల్ని పిండేస్తుంది. కవిత పేరే "కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం". అదే పేరుతో కవితా సంకలనాన్ని కూడా తీసుకువచ్చాడు.
    కవి పేరు రాం.
    http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2007/30-12/kavita

    భవదీయుడు
    బాబా
    ఆ కవిత

    రిప్లయితొలగించండి
  2. చిన్నతనంలోనే,మనకితెలీకుండానే,జీవితం అంటే ఏమిటో తెలియజేస్తాయి ఇలాంటి సందర్భాలు.

    రిప్లయితొలగించండి
  3. వాళ్ళు పని కష్టం తలుచుకుంటే చాల భాద అన్పిస్తుంది ,ఈ మాత్రం బ్రతుకు మన ఇండియా లో బ్రతకలేరా అనిపిస్తుంది ,నాకు అర్ధం కానిది అదే సతతం హరితంగా వుండే కోనసీమ స్థానికులకు కనీస ఉపాధి కల్పించలేకపోతుంద ,లేక అత్యాశ అటు వుసిగోల్పుతుందా అర్ధం కాదు . మీకు చాల మంచి అనుభవం .సామన్యుని చదివే అవకాశం

    రిప్లయితొలగించండి
  4. బావుందండీ భావోద్వేగాల సమ్మేళనం మీ కొయిటా ఉత్తరం ...'అమ్మమ్మ చదువు'టి వి లో వచ్చినప్పుడు చూశాను .అంజలీదేవి అమ్మమ్మగా చేశారు .ఆ కధ సుధామూర్తిగారిదే కదా ?

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా వ్రాశారు.
    హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతి సోమవారం
    మా నాన్నగారి దగ్గరనుండి ఉత్తరం వచ్చేది.
    వారం రోజులు ఎంత ఆత్రంగా చూసేదాన్నో.
    ఆ జ్ఞాపకాలను గుర్తుచేశారు.

    రిప్లయితొలగించండి
  6. @బొల్లోజు బాబా: ఆర్ద్రత ఉన్న కవితను పరిచయం చేశారు. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: నిజమేనండి..ఒక్కోసారి చిన్న చిన్న సంఘటనలే పెద్ద విషయాలు నేర్పిస్తాయి. ధన్యవాదాలు.
    @చిన్ని: అత్యాశ కాదండి.. అవసరం. కొంచం మెరుగైన జీవితం గడపాలన్న మామూలు కోరిక. కోనసీమలో పెద్ద యెత్తున ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏవీ లేకపోవడం పెద్ద లోటే.. ధన్యవాదాలు.
    @పరిమళం: మనవరాలి దగ్గర చదువు నేర్చుకునే ఓ అమ్మ కథే సుధా మూర్తి 'అమ్మమ్మ చదువు.' అంజలి దేవి గారి టీవీ ప్రోగ్రాం చూడలేదండి. ధన్యవాదాలు.
    @భవాని: అలాంటి అనుభవాలు నాకూ ఉన్నాయండి.. ధన్యవాదాలు.
    @కృష్ణ: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి