బుధవారం, ఏప్రిల్ 01, 2009

గోదారి గాలి

గోదావరి లో నీళ్ళు లేక ఎండిపోయిందని ఓ పత్రిక రాస్తే, అబ్బే అటువంటిది ఏమీ లేదు.. గోదావరిలో జలకళ అంటూ మరో పత్రిక కథనం. ఎవర్ని నమ్మాలో అర్ధం కాక కన్ఫ్యూజన్. గోదారి దర్శనం లేకుండా మా ఊరి ట్రిప్ ఎప్పుడూ పూర్తవ్వదు నాకు, మరీ హడావిడిగా ఒక్కరోజు మాత్రమే ఉండాల్సి వచ్చినప్పుడు తప్ప. ఈసారి పండుగ ముందురోజు సాయంత్రం గోదారి యాత్ర పెట్టుకున్నాను.. ఇంతకీ మా ఊరినుంచి నిండా మూడు కిలోమీటర్లు కూడా వెళ్ళక్కర్లేదు.. గోదారి పలకరించేస్తుంది. హమ్మయ్య.. గట్టుమీంచి చూస్తే నిండా నీళ్ళతో కనపడింది మా అన్నపూర్ణ.

రేవు ఏమీ మారలేదు. అదే గుడి, బాగా వృద్ధుడైన పూజారి గారు, నావ కోసం ఎదురుచూసే వాళ్ళ కోసం ఓ అరుగు, అక్కడ ఒకళ్ళిద్దరు బిచ్చగాళ్ళు. సాయంత్రం ఐదవ్వ బోతున్నా ఎండ చిటపట లాడుతోంది. రేవులోకి వెళ్ళానో లేదో గుడ గుడ మంటూ ఓ మోటారు బోటు వచ్చి ఆగింది. ఇది ఇంతకు ముందు లేదు.. కొత్త డవలప్మెంట్ అన్న మాట. 'అద్దరికి ఐదు నిమిషాల్లో తీసుకెళ్ళి పోద్ది.. వొచ్చే వోళ్ళు రండి..' బోటు కుర్రాడు ఆహ్వానిస్తున్నాడు. ఒకళ్ళిద్దరు వెళ్ళారు. నేను కదలక పోవడం చూసి 'రారా?' అని అడిగాడు. తల అడ్డంగా ఊపాను. నాకు గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యమని అతనికెలా చెప్పడం?

మరి కాసేపట్లో నేను ఎదురు చూస్తున్న నాటు పడవ వచ్చేసింది. అప్పుడే కాన్వెంటు నుంచి వచ్చిన పిల్లలు బిలబిలమంటూ అందులో ఎక్కేశారు. 'అద్దరికా బావూ..' పలకరించాడు సరంగు. 'వెంటనే వచ్చేస్తారా?' అడిగాను నేను. 'ఈల్లనాడ దింపేసి, రైతుల్ని ఎక్కించుకు నొచ్చేద్దారి.. వోయ్.. కూతంత జరిగి బాబుగోరికి సోటివ్వండి..' నాతోటి, పిల్లలతోటి ఒకేసారి మాట్లాడేశాడు. పడవ నెమ్మదిగా కదిలింది.. పిల్లలు హోం వర్క్ చేసుకుంటూనే అల్లరి చేస్తున్నారు. 'నీల్లు బాగానేఉన్నాయే..' నాతోపాటు పడవెక్కిన మరో ప్రయాణికురాలు పలకరించింది సరంగుని. 'అమాస రోజులు..' అన్నాడతను.

పడవ సుతిమెత్తగా సాగుతోంది. కొంచం దూరం వెళ్లిందో లేదో చల్లగాలి తిరిగింది హాయిగా.. గాలి వాలు ఉండడంతో తెరచాప కట్టేశాడు సరంగు. అతను పెద్దగా కష్టపడే అవసరం లేకుండానే పడవ సాగిపోతోంది. పిల్లలతో కబుర్లు మొదలు పెట్టాడతను. వాళ్ళంతా లంక గ్రామంలో ఉండే పిల్లలు. వాళ్లకి ఉన్న ఒకే ఒక్క ప్రయాణ సాధనం పడవ. సూర్యుడి ప్రభావం కొద్దిగా తగ్గింది. అవతలి ఒడ్డున ఆకుపచ్చని లంక గ్రామం ఆహ్వానిస్తోంది. బళ్ళో మేస్టర్ల గురించి, ఊళ్ళో గొడవల గురించి సరంగుతో చెబుతున్నారు పిల్లలు. సరంగు మనవడు 'ఐదరబాదులో ఏ బాదా లేకుండా ఉజ్జోగం' చేసుకుంటున్నాడట.

రేవు రాగానే పిల్లలంతా పుస్తకాల సంచులు నెత్తిమీద పెట్టుకుని నీళ్ళలోకి దూకేశారు. పాల కేన్లు, కూరల సంచులతో గట్టుమీద అప్పటికే పడవ కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. వీళ్ళు దిగడం, వాళ్ళు ఎక్కడం క్షణాల్లో జరిగిపోయింది. పడవ తిరిగి బయలుదేరింది. సూర్యుడికి అభిముఖంగా కూర్చున్నాను. ఆకాశంలో నాకు ఇష్టమైన దృశ్యాన్ని చూడడానికి. మరి కాసేపట్లో గోదారిలోకి కుంగిపోబోతున్న సూర్యుడు నారింజ పండులా ఉన్నాడు. పెద్ద పెద్ద కొంగలు మా మీంచి ఎగురుకుంటూ వెళ్ళాయి. సరంగు, రైతులు పంటల గురించి, ఎన్నికల గురించి తీవ్ర చర్చల్లో ఉన్నారు.

నా దృష్టి మాత్రం ఆకాశం వైపే ఉంది. రెప్ప వేయాలనిపించని విధంగా ఉంది ప్రకృతి. సూర్యుడి నారింజ రంగు నీళ్ళపై ప్రతిఫలిస్తోంది. ఒక్క క్షణం అది అమావాస్య సాయంత్రమా లేక పున్నమి రాత్రా అన్న సందేహం కలిగింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆకుపచ్చని లంక నల్లగానూ, నల్లని నీళ్ళు నారింజ వర్ణంలోకీ మారిపోతున్నాయి. నీళ్ళలోకి కుంగుతున్న సూర్యుడు, సూర్యుడికి అభిముఖంగా ఎగురుతున్న పక్షులు.. పడవ నది మధ్యకి వచ్చింది. 'ఈ జీవితానికి ఇది చాలు' అన్న అనుభూతి. లేత చీకటి తెర కట్టే సమయానికి పడవ రేవుకి చేరుకుంది. గుండెల నిండా గోదారి గాలి పీల్చుకుని 'మళ్ళీ ఎన్నాళ్ళకో' అనుకుంటూ ఇంటికి తిరుగుముఖం పట్టాను.

16 కామెంట్‌లు:

  1. ఏదో అతిశయోక్తికి అనటంలేదు. మీతో కలిసి నేనూ ప్రయాణం చేసినట్టుంది..ఇంతకుముందువరకూ మీర్రాసినవాటిల్లో నాకు బాగా నచ్చిన పోస్టు ఒకటుండేది, దాన్ని స్థానాన్ని ఇది ఆక్రమించేసింది.

    రిప్లయితొలగించండి
  2. మీతో పాటు నేను కూడా చూసేసాగా గోదారి గట్టుని...
    పీల్చేసానుగా గోదారి గాలిని....
    (మీరు అక్కడికి వెళ్ళి చూస్తే నేను ఇక్కడ మీ పోస్టులో చూసేసానుగా!!!!)

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగా వర్ణించారు మురళిగారు... కళ్ళకు కట్టినట్టు చూపించారు గోదారి అందాలని.... ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎప్పటికి కలుగుతుందో!

    రిప్లయితొలగించండి
  4. మేము రాజమండ్రి లో గోదావరి గట్టు మీద ( అంటే పి.వి.నరసింహారావు పార్క్ ) దగ్గరలో., రోడ్డ్/రైల్ బ్రిడ్జి కి దగ్గరలో ఉంటున్నాము. అక్కడకి దగ్గరలో ఉన్న గౌతమీ ఘాట్ దగ్గర చూస్తే నిజంగా ఏడుపు వస్తుంది. గోదావరి దాదాపు ఎండి పోయి, ప్లాస్టిక్ చెత్త తో నిండిపోయింది. పుష్కర్ ఘాట్ దగ్గర కొద్దిగా పర్వా లేదు. ఆతా వేతా చెప్పేదేమిటంటే గోదావరి లో నీళ్ళు నిజంగానే తగ్గిపోయాయి.
    చైతన్య గారికి నా సలహా ఏమిటంటే వర్షాల తరువాత గోదావరి తల్లిని చూడడానికి రండి బాబూ.

    ఫణిబాబు

    రిప్లయితొలగించండి
  5. @ఉమాశంకర్, అశోక్, పద్మార్పిత, చైతన్య, నాబ్లాగు, ఫణి బాబు: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. చాలా చాలా బాగా రాశారు.
    ఇది ఎవరూ మిస్ అవకూడని టపా.

    రిప్లయితొలగించండి
  7. నీళ్ళలోకి క్రుంగుతున్న సూర్యుడు .....ఈ జివితానికిది చాలు ....నిజమే జీవితానికి ఇంకేమి కావాలిఅన్పిస్తుంది .నాకు చదువుతుంటే "ఆనందోబ్రహ్మ " నవల కనబడుతుంది .అందుకేనేమో యండమూరి గోదావరి అందాలు వదలలేక తన జీవిత చరమాంకంలో {?} అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు .చాల చాల బాగా రాసారండి .

    రిప్లయితొలగించండి
  8. కాస్త ఆలస్యంగా పీల్చానండీ మన గోదారి గాలి ...
    "ఐదరబాదులో ఏ బాదా లేకుండా ఉజ్జోగం చేసుకుంటున్నాడట." సుపరిచితమైన భాష (యాస).
    చివరి పేరా చదువుతుంటే సూర్యాస్తమయం కళ్ళముందయినట్టుంది . చాలా కుళ్ళుగా కూడా వుంది ఎన్నేళ్ళు గోదావరి కి దగ్గరలో ఉన్నా లంకలోకి వెళ్ళే భాగ్యం కలగలేదు . ఆ లోటు మీ టపాతో కొంతవరకూ తీరిందండీ ...

    రిప్లయితొలగించండి
  9. @భవాని, చిన్ని, పరిమళం: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  10. మురళి గారూ..
    నాకు భద్రాచలం దగ్గర గోదావరి సుపరిచితమే. కానీ.. అక్కడ పడవలు ఉండవు :(
    పాపికొండలు వెళ్లడానికి లాంచీలు ఉంటాయి. నేను లాంచీలో కూడా ఎప్పుడూ వెళ్ళలేదులే కానీ..మీరు చెప్పినట్టుగా నాకలా పడవలో వెళ్ళాలని చిరకాల కోరిక. మీ పోస్టు చదివి ఆ కోరిక ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది.
    చాలా చాలా బాగా రాశారు. అప్పుడెప్పుడో వెన్నెల తరవాత, మళ్ళీ గోదావరితో.. ఊహల ఉయ్యాలలో ఊరేగేలా చేశారు.
    మరి కాస్త ప్రయత్నించి.. కథలూ.. నవలలూ గట్రా రాసెయ్యరాదూ ;)

    రిప్లయితొలగించండి
  11. Murali garu, inthati nittoorputho raasina mee varnana, neetimattam thaggimpupai mee kalavaram choosthunte meeku godaritho kala parichayam avagatham avuthundi. Navalaloni oka adhyaayaanni chadivinatte undi mee varnana choosthunte!

    Rayalaseema vaasinaina naaku beedu bhoomule thappa neeti pravaaham gurinchi peddaga theliyadu. Baavilo kappa mundhu baahya prapanchapu andaalni varnisthe daanikee choodalane uthsukatha kaluguthundi. Naakoo alaane undi. Okkasaari matram launchlo vellanu kani, padava prayaanam cheyyaledu.

    Ilane blaaguthoo mammalni godatlo, adhe, paaravasyamlo munchandi...!

    Ranga

    రిప్లయితొలగించండి
  12. @మధురవాణి: బాగుంటుందండి పడవ ప్రయాణం.. అవకాశం వస్తే మిస్ కాకండి. కథలూ, నవలలూనా.. అయ్యబాబోయ్... మీ అభిమానానికి ధన్యవాదాలు.
    @రంగరాజన్: మా ఊరు, గోదారి తర్వాత నాకు బాగా ఇష్టమైనది మీ రాయలసీమలోని తిరుపతేనండి.. ఎప్పుడైనా రాయాలి ఆ విశేషాలు కూడా.. ఒక్కో ప్రాంతానిది ఒక్కో అందన్డం.. మా ప్రాంతంలో గోదారి ఉంటే, మీరు ఏడు కొండలవాడినే తెచ్చి మీ ముంగిట్లో నిలుపుకున్నారు.. ధన్యవాదాలు. అన్నట్టు తెలుగులో రాయడానికి ఈ లింక్ మీకు సహాయ పడుతుంది: http://www.google.co.in/transliterate/indic/telugu

    రిప్లయితొలగించండి
  13. చదువుతుంటే నేను ఎప్పుడు (సినిమాల్లో తప్ప) చూడని కోనసీమ కళ్లముందు ప్రత్యక్షమైంది. మనసు దేవులపల్లి వారి గుండెల్లో ఉండాలి కులాసా అని పాడింది

    రిప్లయితొలగించండి
  14. @Subrahmanya Chaithanya Mamidipudi: వరుసగా చదువుతున్నారన్న మాట! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి