ఆదివారం, ఏప్రిల్ 26, 2009

సత్యభామ-2

(సత్యభామ-1 తర్వాత)
ఊరు ఊరంతా మరొక్క సారి ఉలిక్కిపడింది. రామాలయం, రచ్చబండ, నాయుడి కొట్టు, చెరువు గట్టు.. ఇలా ప్రతీ చోటా ఇదే చర్చ. "సత్తెమ్మ గారిని నీళ్ళమీద నడవమని శ్రీకృష్ణుల వారు ఆజ్ఞాపించారట.. స్వామి సెలవిచ్చిన రోజున అమ్మ మన ఊరి చెరువు మీద ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తారట.." కామాక్షి, వామాక్షి ఊళ్ళో ఆడవాళ్ళకి, కుచేలుడు ఊళ్ళో మగవాళ్ళకి చెప్పిన వార్త ఇది. పెద్దగా చదువుకోని, పనిపాటలు చేసుకునే జనమంతా నోరెళ్ళ బెట్టారట. చదువుకున్న వాళ్ళు మాత్రం కొట్టిపారేశారు.

మొత్తం మీద ఊరిలో రెండు వర్గాలు తయారయ్యాయి. ఐతే నమ్మకాల కోసం వాళ్ళెవరూ కొట్లాడుకోలేదు. అమ్మ వాళ్ళ దురదృష్టం ఏమిటంటే, తాతగారు సత్యభామ ప్రకటనని అస్సలు నమ్మలేదు సరికదా "ఆమెకి పిచ్చి ముదిరిపోయింది" అన్నారట. అంతేనా.. పిల్లలెవరినీ పొరపాటున కూడా అటువైపు వెళ్ళద్దని మరోమారు హెచ్చరించారు. సత్యభామ ప్రకటన ఊళ్ళో కన్నా, చుట్టూ పక్కల ఊళ్లలో ఎక్కువ సంచలనం రేపిందట. దానితో ఎక్కడినుంచో భక్తులు బళ్ళు కట్టుకుని మరీ రావడం మొదలెట్టారు.

ఇంట్లో అమ్మమ్మకి మరో రకం సమస్య. కామాక్షి, వామాక్షి రోజూ ఏదో వేళలో పెరట్లోకి వచ్చి ఆవిడకి సత్యమ్మ మహిమలు వర్ణించి వర్ణించి చెప్పి వెళ్ళేవాళ్ళు. దానితో ఆవిడకి 'ఏ పుట్టలో ఏ పాముందో.. నమ్మితే ఏం' అన్న భావన మొదలైంది. అసలే తొమ్మిది మంది పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చెయ్యాలా అన్న దిగులుతో ఉన్న ఆవిడకి సత్యభామ ని నమ్మడం లో తప్పు కనిపించలేదు. అలా అని తాతగారికి ఎదురు చెప్పలేదు . అందుకని, ఉభయతారకంగా, తాతగారు, పెద్ద మామయ్యా చూడకుండా అమ్మ వాళ్ళు సత్యభామ ఇంటికెళ్ళి చూసి రావడానికి ఆవిడ అనుమతిచ్చేసింది.

అమ్మ వాళ్ళ పెద్దక్క, రెండో అక్క ఇలాంటివాటికి కొంచం దూరంగా ఉండేవాళ్ళు. ఇంకా మిగిలిన ఐదుగురూ వంతులేసుకుని సత్యభామ ఇంటికెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు. సత్తెమ్మ గారికి పాద పూజ చేసుకోడం కోసం భక్తులు పోటీలు పడడం చూసి వీళ్ళకి నవ్వాగేది కాదట. వీళ్ళని చూసి ''పాపలూ.. మీరు ఆడ పిల్లలు కాదమ్మా..దేవ కన్యలు.." అనేదట ముద్దు ముద్దుగా.. జామ చెట్టు కాపుకి రావడం తో పాద పూజ చేసిన భక్తులకి కాయనో, పిందెనో ప్రసాదించేదట, చెట్టు మీదనుంచే.. చూస్తుండగానే ఆవిడకి నెమలి కన్నుల విసనికర్ర, వెండి కిరీటం సమకూరాయి.

ఇంటి పెరట్లో అమ్మా వాళ్ళ ఆటల్లో సత్యభామ ఒక భాగమైపోయింది. ఆరోజు సత్యభామ ఇంటి దగ్గర డ్యూటీ చేసినవాళ్ళు మిగిలిన వాళ్లకి తామే ఒకరు సత్యభామగా మరొకరు భక్తుడిగా నటించి చూపేవారట. సమస్యల స్థాయి కూడా నెమ్మదిగా పెరిగింది. కోడిపుంజు, గేదె ల నుంచి పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టు కోవడం, అప్పులు తీర్చడం లాంటి ప్రశ్నలు అడిగే వారట భక్తులు. ఇక ఊళ్ళో సత్యభామని నమ్మని వాళ్ళంతా "ఇంకెప్పుడు నడుస్తుంది చెరువు మీద" అనుకోడం మొదలు పెట్టారు. ఈ విషయం సత్తెమ్మ దాకా వెళ్ళింది. దానితో ఆవిడ ప్రకటించింది.. "రేపు మనూరి చెరువు మీద నడవమని స్వామి సెలవైంది.." (వివరాలు తర్వాతి భాగం లో)

4 కామెంట్‌లు:

  1. తర్వాతి భాగం ఆరు టపాల తర్వాతేనా :) :)

    రిప్లయితొలగించండి
  2. mee blog ,mee rachanaa saili baavundi.. SAMUDRAM tammineni yadukula bhushan gaari rachana ..parichayam chesi visleshna cheyalsindiga manavi ....

    రిప్లయితొలగించండి
  3. తరువాయి భాగం రాయమని మీకు ఎప్పుడు సెలవవుతుందో ఏమో ? రేపు? ఏమో? :) :)

    రిప్లయితొలగించండి
  4. @పరిమళం: చాలా నిశితంగా చదువుతున్నారండి నా బ్లాగుని.. త్వరలోనే పూర్తి చేసేస్తాను.. ధన్యవాదాలు.
    @రిషి: ఈసారి పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు మీరు సూచించిన పుస్తకం తీసుకుంటానండి.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: ఏమోనండి.. సత్తెమ్మ గారిని అడగాలి :) రాసేస్తాను త్వరలో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి