ఆదివారం, ఏప్రిల్ 12, 2009

సత్యభామ-1

అమ్మ తన బాల్యాన్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మర్చిపోకుండా చెప్పే సంగతి ఒకటి ఉంది.. అది 'సత్యభామ' గురించి. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ అక్కచెల్లెళ్ళు కలుసుకున్నప్పుడు మేము సత్యభామ ని గుర్తు చేసేవాళ్ళం. వాళ్ళంతా చిన్న పిల్లలై పోయేవాళ్ళు. తాతగారి ఊళ్ళో క్షురకుడి ఇల్లు చెరువు గట్టున, బడికి దగ్గరగా ఉండేది. ఆ క్షురకుడి భార్య ఉన్నట్టుండి ఒకరోజు తాను సత్యభామ ని అని ప్రకటించుకుంది.

ఈ వార్త వినగానే ఊరంతా ఉలిక్కిపడింది. ఇక అమ్మ వాళ్లకి ప్రతి రోజూ చేతినిండా పని. ప్రతిరోజూ బడికి వెళ్లేముందు, బడినుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు సత్యభామ ఏం చేస్తోందో చూడాల్సిన బాధ్యత వీళ్ళదే కదా. అసలే తాతగారు, పెద్ద మామయ్య 'అటువైపు వెళ్తే కాళ్ళు విరగ్గొడతాం' అని బెదిరించారట కూడాను. సత్యభామ ఇంటిదగ్గర రెండుపూటలా వీళ్ళ హాజరు తప్పని సరి.

సదరు సత్యభామ ఇంటి గుమ్మంలో ఓ జామి చెట్టు ఉండేదట. ఆవిడ పగలంతా ఆ జామిచెట్టు కొమ్మమీద కూర్చుని పిల్లనగోవి ఊదుతూ ఉండేదట. మధ్య మధ్యలో కృష్ణుడితో మాట్లాడుతూ, ఓ గ్రంధం రాస్తూ ఉండేదట. భర్తకీ, కొడుక్కీ పేర్లున్నా భర్త పేరుని 'కాకాసురుడు' అనీ కొడుకు పేరు 'ప్రహ్లాదుడు' అనీ మార్చేసిందిట ఆవిడ. ఆవిడకి దయ్యమో భూతమో పట్టిందని నమ్మిన 'కాకాసురుడు' ఆవిడకి భూత వైద్యం చేయించాలని ప్రయత్నించి విఫలమయ్యాడట.

ఆనోటా, ఆనోటా సత్యభామ గురించి విన్న ఊళ్ళో ఇద్దరు వయసు మళ్ళిన మహిళలు ఆవిడకి శిష్యులుగా మారారు. వాళ్ళిద్దరికీ 'కామాక్షి' 'వామాక్షి' అని పేర్లు పెట్టిందట సత్యభామ. వాళ్ళు మాత్రం ఆమెని 'సత్తెమ్మ గారూ' అని పిలిచే వాళ్ళట. సత్యభామ గా మారిన క్షణం నుంచే ఆవిడ వస్త్ర ధారణా మారిపోయింది. చీరకి బదులు ఓ పొడవాటి గౌను ధరించేది. జుట్టు విరబోసుకునేది. సర్వకాల సర్వావస్థల్లోనూ చేతిలో పిల్లనగోవి తప్పని సరి.

శిష్యుల పుణ్యమా అని సత్యభామ మహిమలు ఇరుగు పొరుగు ఊళ్లకీ పాకాయట. ఎలాంటి సమస్యకైనా ఆవిడ కృష్ణుడితో మాట్లాడి పరిష్కారం చెబుతుందనీ, ఆవిడ ఎప్పుడు పిల్చినా కృష్ణుడు పలుకుతాడనీ బాగా ప్రచారం జరిగింది. కనబడకుండా పోయిన కోడిపుంజు మొదలు, కట్టు తెంపుకు పోయిన గేదె వరకు ఏవైపు వెళ్తే దొరుకుతాయో ఆవిడ చెప్పేదట. రెండు మూడు సార్లు ఆవిడ చెప్పింది జరగడంతో జనం పెరిగారట.

తన కష్టాలు చెప్పుకోడానికి సత్యభామ దగ్గరికి వచ్చిన ఓ బహు కుటుంబీకుడికి 'కుచేలుడు' అని పేరు పెట్టి శిష్య పరివారంలో చేర్చుకుంది సత్యభామ. అప్పటికే ఆమె ఇల్లు ఆశ్రమం రూపు దాల్చింది. భర్త, కొడుకు పరాయివాళ్ళ లాగ మసలే వారట. కుచేలుడి రాకతో సత్యభామ రాసిన గ్రంధాన్ని పరిష్కరించాలన్న కోరిక మొదలైంది శిష్యులలో. అతను కొంచం చదువుకున్నవాడు. ఆవిడ రాసేది భాషే కాదని, కొక్కిరాయి గీతలని బాగా చదువుకున్నవాళ్ళు తేల్చేశారు. సరిగ్గా అప్పుడే సత్యభామ ఓ సంచలన ప్రకటన చేసిందట. (వివరాలు తర్వాతి భాగంలో)

12 కామెంట్‌లు:

  1. మురళి గారూ ! మీరు కూడానా !సంచలన ప్రకటన? :(

    రిప్లయితొలగించండి
  2. మా అమ్మమ్మా వాళ్ళ ఎదురింటి అబ్బులు వున్నట్టుండి ఓ రోజు తనకి శివుడు వంటి మీదకి వస్తాడనో, తానే శివుడిననో ప్రకటించేసాడు. అదీమధ్యనే అంటే దాదాపు పదేళ్ళ క్రితమే జరిగింది. అసలు బడికి వెళ్ళని వాడు శ్లోకాలు చదివేవాడు. అంతా కలిసి అగరు, ధూపాలతో, నారికేళాలతో పూజించేవారు. ఎవరైనా ఏదైనా వెటకారపు మాట అంటే మాత్రం ఆ సమయంలో ఆగ్రహంతో కన్నెర్ర చేసేవాడు, పైగా అసలు వరసతోనే శపించేవాడు. ఉదాహరణకి "నాగన్నయ్యా నీకు పుట్టగతులు లేకుండా చేస్తాను" ఇలా అన్నమాట. ఏతా వాతా తేలిందేమిటంటే తన సవతి తల్లి పెట్టే బాధలకోర్వలేక ఈ దారి పట్టాడు. శివాలయంలో కూర్చుని విన్న మంత్రాలు, శ్లోకాలు బట్టియం వేసి ఆవిడ పని అలా పట్టాడు. ఆవిడాకి వాడంటే పుట్టిన హడలుకి తుంగభద్ర ప్రాంతాలకి తరలిపోయింది. అదొక మానసిక రుగ్మత వంటిది. నా అభిప్రాయం మూఢాచారాలని విమర్శించటం కాదు కానీ అవే అక్కరకు కూడా ఇలా పనికి వస్తాయి అని తెలపటం. ఇక మామూలు మనిషైపోయాడు. "ఇదేనా ఉసక్క రాటం, ఆట్రేలియా కాదంటగా, అమేరికా ఎలిపోయారంట" అని మామూలుగానే గుర్తు పట్టాడు నన్నామధ్య మా వూరు వెళ్ళినపుడు.

    రిప్లయితొలగించండి
  3. ఇలాంటివి ఒకటి రెండు కధలు మా అమ్మమ్మ వాళ్ళా ఊరిలో జరిగాయని మా అమ్మచెపుతూ ఉండేది. చివరిలో "తర్వాతి భాగంలో" అని సత్యభామ కధ కి ఆసక్తి పెంచారండి!

    రిప్లయితొలగించండి
  4. మీకు ఇది భావ్యమా? ఇలా సగం చెప్తే ఊరుకునేది లేదు. తీవ్రంగా ఖండిస్తాం.

    రిప్లయితొలగించండి
  5. నిజంగా జరిగిన సంఘటనేనా?
    "చీరకి బదులు ఓ పొడవాటి గౌను ధరించేది. జుట్టు విరబోసుకునేది. సర్వకాల సర్వావస్థల్లోనూ చేతిలో పిల్లనగోవి తప్పని సరి"---మోడ్రన్ సత్యభామ అన్నమాట.

    రిప్లయితొలగించండి
  6. @కొత్తపాళీ గారు ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను :) బహుశా ఇది "అనంతం" నుండి నేర్చుకుని ఉంటారు .[ఉమా గారికి క్షమాపణలతో }:)

    రిప్లయితొలగించండి
  7. ఏమా సంచలన ప్రకటన? మాకు తెలియాలి... తొందరగా చెప్పండి.. :)

    రిప్లయితొలగించండి
  8. వ్యాఖ్య రాసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అమ్మ, ఆవిడ బంధువులు చెప్పగా చిన్నప్పుడు చాలా సార్లు విని, వాళ్ళ అభినయం చూసి 'సత్యభామ' పట్ల చాలా ఆసక్తి పెంచుకున్నా. ఎంత పెద్ద టపా రాసినా మొత్తం సంగతులను ఒక టపాలో రాయడం నాకు అసాధ్యం., బహుశా సత్యభామ పట్ల నాకున్న ఆసక్తి ఇందుకు కారణం కావొచ్చు. అందుకే ఈ పధ్ధతి ఎంచుకున్నాను. 'సత్యభామ' మిమ్మల్ని కూడా నిరాశ పరచదనే అనుకుంటున్నా..

    రిప్లయితొలగించండి
  9. @ఉష .. సూపర్ కూల్. ఇలాంటిదే చలం కథోటి ఉంది.
    @చిన్ని, ఉమాశంకర్ .. ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోడానికి? :) ఊర్నే సరదాకన్నా. లైట్తీస్కోండి. ఏం లేదు రెండో భాగం తోందరగా చదవాలనే ఆత్రం తప్ప మరోటి కాదు.

    రిప్లయితొలగించండి
  10. క్రొత్తపాళీ గారు, ఈ కథ పేరేమిటండి. మా అబ్బులుకి చెప్తే సంతోషిస్తాడు. నిజానికి కథలు చదివిన దశా చాలా తక్కువ జీవితంలో. ఈమధ్య బొత్తిగా కథలు చదవటం తక్కువైపోయింది, అదీ అంధ్రజ్యోతి, ఈనాడు ఆదివారం ప్రచురణలకి పరిమితమైపోయింది.

    రిప్లయితొలగించండి