బుధవారం, మార్చి 30, 2022

భారతీయ సీయీవో

కేరళ మూలాలున్న ప్రవాస భారతీయుడు రాజ్ సుబ్రమణియం 'ఫెడెక్స్' సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా  ఎంపిక కావడంతో భారతీయుల నాయకత్వ లక్షణాలపై మరోసారి చర్చ మొదలైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ మొదలుకుని ట్విట్టర్ వరకూ దాదాపు ఇరవై భారీ మల్టి-నేషనల్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులు రాణిస్తుండడంతో రాజ్ నియామకం మరీ పెద్ద వార్త కాలేదు. కొంచం స్పష్టంగా చెప్పాలంటే 'భారతీయ సీయీవో'  అనేది ప్రపంచానికి అలవాటైపోయినట్టుగా అనిపిస్తోంది. నావరకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల ఎంపిక జరిగినప్పటి హడావిడి గుర్తొచ్చింది. గడిచిన ఏడెనిమిదేళ్లలో ఏడాదికి రెండు మూడు కంపెనీలన్నట్టుగా భారతీయుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నాయి. సదరు వ్యక్తులు కూడా పదవుల్ని అలంకారంగా భావించకుండా, తమ శక్తి సామర్ధ్యాలని కంపెనీల అభివృద్ధికి వెచ్చిస్తూ అహరహం శ్రమిస్తున్నారు. వాళ్ళ విజయాలు కూడా తాజా ఎంపికలో ఎంతోకొంత పాత్ర పోషిస్తూ ఉండొచ్చు, మిగిలిన వాటితో పాటుగా. 

పెద్దపెద్ద అమెరికన్ కంపెనీలు కీలక స్థానాల్లో భారతీయుల్ని ఎందుకు కూర్చోబెడుతున్నాయి? అన్న ప్రశ్నకి అనేక జవాబులు తడుతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సంఖ్యాబలం. అమెరికా వలసదారుల్లో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు చేసే వాళ్లలో అధిక సంఖ్యాకులు భారతీయులే. నాలుగున్నర దశాబ్దాల క్రితం వలసలకి అమెరికా తలుపులు తెరిచినప్పుడు, ముప్ఫయ్ ఏళ్ళ క్రితం నిబంధనల్ని మరింత సరళతరం చేసినప్పుడూ, మరీ ముఖ్యంగా అగ్ర రాజ్యాన్ని వణికించిన 'వైటూకే' సందర్భంలోనూ పెద్ద ఎత్తున ఆ దేశంలో అడుగు పెట్టిన వాళ్ళు భారతీయులే.  జనాభా ఎక్కువ, అవకాశాలు తక్కువా ఉన్న దేశం కనుక సహజంగానే పెద్ద ఎత్తున నిపుణుల్ని సరఫరా చేయగలిగింది. (వలసల సంఖ్యలో భారత్ కి దరిదాపుల్లో ఉన్నది అత్యధిక జనాభా ఉన్న మరోదేశం చైనా కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.) తత్ఫలితంగా  అమెరికాలోని కీలక ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ భారతీయలు బాగా కుదురుకోగలిగారు. 
Google Image

సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన ఉన్నతోద్యాగాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయా? కీలకమైన పోస్టులకి ఎంపిక చేసేస్తారా? ఇవి కూడా చాలా సహజమైన ప్రశ్నలే. ఉద్యోగం వెతుక్కుంటూ ఇప్పుడు ఆ దేశానికి బయల్దేరే వాళ్ళకన్నా, ముందు నుంచీ అక్కడ ఉంటున్న/ఆ దేశానికి అలవాటు పడ్డవాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది కాదనలేని నిజం. హైదరాబాదులో ఉద్యోగానికి, హైదరాబాదు నుంచి ఒకరూ, ఆముదాలవలస నుంచి ఒకరూ అప్లై చేసినప్పుడు, ఎంత సమానావకాశాలు ఇచ్చే వాళ్ళైనా హైదరాబాద్ అభ్యర్థికే తొలి ఓటు వేస్తారు. రెండు మూడు తరాలకి ముందు మొదలైన భారతీయుల అమెరికా విస్తరణ, ఇప్పటి తరానికి వినియోగానికి వస్తోంది. ఈ భారతీయ సీయీవోల్లో కొందరు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళైతే, మరికొందరు ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే ఉద్యోగంలోనూ, జీవితంలోనూ స్థిరపడిపోయిన వాళ్ళు. వీళ్ళలో మెజారిటీ భారతీయులం అని చెప్పుకుంటారు తప్ప, భారత్ కి తిరిగి వెళ్లడం అనే ఆలోచన పెట్టుకోరు, పెట్టుకోలేరు కూడా. 

ఇంతకీ నాయకత్వ లక్షణాలు అనగా ఏవి? విజేతల చరిత్రలు తిరగేసినప్పుడు వాళ్ళందరూ చాలా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడుపుతారని, సమయపాలనకి విలువ ఇస్తారని, చాలా సహనంగానూ, దయతోనూ ఉంటారనీ, స్థితప్రజ్ఞత వారి సొత్తనీ, ఒక పని పూర్తి చేసేందుకు వంద మార్గాలని ఆలోచించి పెట్టుకుంటారనీ, పోరాట పటిమ కలిగి ఉంటారనీ... ఇలా ఓ పెద్ద జాబితా కనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే కెరీర్ లో పైకెదగాలనే తపన ఉన్న భారతీయులందరికీ వీటిలో చాలా లక్షణాలు సహజాతాలు. వీళ్లంతా ఎంసెట్ ర్యాంక్ కోసం ఎల్కేజీ నాటి నుంచీ కష్టపడి చదివిన వాళ్ళే. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అడుగు పెట్టనివ్వని పరీక్షలు రాసి రేంకులు తెచ్చుకున్న వాళ్ళే. 'స్కూలు బస్సు రాకపోతే బడిమానేద్దాం' అనే ఆలోచన లేకపోగా, ప్రేయరుకి ముందే బళ్ళో ఉండడానికి మార్గాలు అన్వేషిస్తూ పెరిగిన వాళ్ళే. చిన్నప్పటి నుంచీ వీళ్ళు నెగ్గుకొచ్చేది అల్లాటప్పా పోటీలో కాదు, కట్ త్రోట్ కాంపిటీషన్లో. 

ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఈ భారతీయ సీయీవోల్లో మెజారిటీ మధ్యతరగతి నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళే. 'బతకడానికి నీకున్న ఒకేఒక్క దారి చదువు మాత్రమే' అన్న బోధలు నిత్యం వింటూ పెరిగిన వాళ్లే. ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండడం, అదే సమయంలో పరిమితమైన వనరులు, అపరిమితమైన పోటీ వీళ్ళని యుద్ధానికి సిద్ధపడేలా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించి ఉంటాయి. ఎదగాలనే తపనని ఉగ్గుపాలతో రంగరించి మరీ నింపి ఉంటారు వీళ్ళ పెద్దలు. ప్రతిభని మెరుగు పరుచుకోడం, ఆపైన తమకి తగిన అవకాశాలని వెతుక్కుంటూ ఎంతదూరమైనా వెళ్ళడానికి మానసికంగా సిధ్దపడడం వాళ్లకి తెలియకుండానే రక్తంలో ఇంకి ఉంటుంది. సర్దుకు పోవడం, సర్దుబాటు చేసుకోవడం లాంటి లక్షణాలు కూడా వృత్తిలో ఎదగడానికి దోహదం చేసే ఉంటాయి. బహుశా అందుకే తమ భారతీయ మూలాలని కొంచం తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. 'సీయీవో' అనే చక్కెర పూత వెనుక ఉన్న చేదు వాళ్లకన్నా బాగా ఇంకెవరికి తెలుసు?

2 కామెంట్‌లు:

  1. "సర్దుకు పోవటం సర్దుబాటు చేసుకోవటం లాంటి లక్షణాలు కూడా వృత్తిలో ఎదగడానికి దోహదం చేసి ఉంటాయి"
    నిజం. హంగ్రీ ఫర్ వర్క్. హంగ్రీ ఫర్ ఫుడ్.జేబుల్లోడబ్బులు లేవు. కార్ డ్రైవింగ్ రాదు. చేసేది కంప్యూటర్ తో పని. లంచ్ ఫ్రీగా పెట్టేవాళ్ళు. సాయంత్రం కూడా పనిచేస్తే డిన్నర్ ఫ్రీ. ఇంటికి పోయి చేసేదేముంటుంది. అక్కడే కూర్చుంటే క్లిష్టమైన కంప్యూటర్ ప్రోగ్రాములు సులువుగా వచ్చేవి.కడుపు చల్లగా ఉంటే పని త్వరగా అవుతుంది.
    ఇది యాభై ఏళ్ళ నాటి నా పరిస్థితి. అటువంటి నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారో. పనిచేసే వారుంటే కంపెనీలు వృద్ధి అవక ఎక్కడికి పోతాయి?.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Heart touching...
      దూరపు కొండలు నునుపు కాదని తెలిసినా, మరీ ఇంత గరుగ్గా ఉంటాయని ఇలాంటి అనుభవాలు విన్నప్పుడే అర్ధమవుతుందండీ.. ధన్యవాదాలు.. 

      తొలగించండి