బుధవారం, మార్చి 02, 2022

వైద్య విద్య

'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఇది. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తడం, ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులు స్వదేశాలకి చేరుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేయడం మొదలయ్యాక సహజంగానే యుద్ధ సంబంధ విషయాలు వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ సింహభాగాన్ని ఆక్రమించాయి. ఈ యుద్ధం పట్ల భారతదేశం తటస్థ వైఖరి తీసుకున్నప్పటికీ ఆలోచనాపరుల్లో కొందరు రష్యావైపు, మరికొందరు ఉక్రెయిన్ వైపు నిలబడి మాట్లాడుతున్నారు. బలహీన దేశం అవ్వడం చేత కావొచ్చు, ఉక్రెయిన్ కి కొంచం ఎక్కువ మద్దతే దొరుకుతోంది. 

కర్ణాటకకి చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప ఉక్రెయిన్ లో జరిగిన కాల్పుల్లో మరణించడంతో చర్చ 'విదేశీ విద్య' వైపుకి మళ్లింది. విదేశాల్లో - మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న ఇరవై వేల మంది విద్యార్థులని గురించి ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. వేలాది మంది విద్యార్థులు అక్కడ చదవడం వల్ల భారతీయులకి చెందిన కోట్లాది రూపాయలు ఆ దేశానికి చేరుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మనదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్య సమృద్ధిగా దొరుకుతోంది. ఏటా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు 'ఉన్నత విద్య' కోసం విదేశాలకి, మరీ ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకి, ప్రయాణం అవుతున్నారు. ఎందుకన్నది బహిరంగ రహస్యమే. కానీ, వైద్య విద్య కథ పూర్తిగా వేరు. 

మన దేశంలో మెడిసిన్ లో ప్రవేశం కోసం నిర్వహించే 'నీట్' పరీక్షకి ఏటా సుమారు పదహారు లక్షల మంది హాజరవుతూ ఉండగా, ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య కేవలం ఏడు లక్షలు మాత్రమే. వీరిలో కూడా మెడిసిన్ చదివే అవకాశం కేవలం రెండులక్షల లోపు మందికి మాత్రమే ఉంది. ఎందుకంటే మన దేశం మొత్తం మీద ఉన్న సీట్ల సంఖ్య అంతే కాబట్టి. మరి, వైద్య విద్య చదవాలని కోరుకునే మిగిలిన విద్యార్థుల పరిస్థితి? ఇక్కడే 'విదేశాల్లో వైద్య విద్య' అక్కరకొస్తోంది. పేపర్లలోనూ, టీవీల్లోనూ  'చైనాలో ఎంబీబీఎస్' తరహా ప్రకటనలు విస్తారంగా దర్శనమిస్తున్నాయి. "మా అబ్బాయికి మెరిట్ ఉన్నా, ప్రభుత్వ కాలేజీలో సీటు రాలేదు. ప్రయివేటు కాలేజీలో కోటి రూపాయలు పైగా ఫీజు చెల్లించే స్తోమతు లేక ఉక్రెయిన్ పంపించాం" కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి తండ్రి చెప్పిన ఈ మాటలు ఇండియాలో వైద్య విద్య ఎంత ఖరీదో చెప్పకనే చెబుతున్నాయి. 

Google Image

కోట్లాది రూపాయలు విదేశాలకి తరలి పోవడాన్ని గురించి ఆందోనళ చెందిన ప్రధానమంత్రి, అలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్న వైపుకి వెళ్ళలేదు. 'జవహర్లాల్ నెహ్రు తగినన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించక పోవడం వల్ల' అనే జవాబు విజ్ఞులైన ప్రజలందరికీ దొరికేసి ఉంటుందని ప్రధాని భావించి ఉండొచ్చు. అయితే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం విదేశాల్లో వైద్య విద్య చదువుతున్న భారతీయ విద్యార్థుల 'అర్హత' ని శంకించారు. "వారిలో చాలా మంది నీట్ పరీక్ష ఉత్తీర్ణులు కాలేదు" అని ప్రకటించారు. ఆసరికి, నీట్ పాసైన అందరికీ దేశంలో మెడిసిన్ సీట్లు దొరికేస్తున్నట్టు. పోనీ మంత్రి గారి సందేహం నిజమే అనుకుందామన్నా, అలా చదువుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు అర్హత పరీక్ష పాసైతే తప్ప ఇక్కడ వైద్య వృత్తి ప్రారంభించలేరు. కాబట్టి, వాళ్ళ వల్ల దేశానికి ఇతరత్రా నష్టాలేవీ లేనట్టే. వాళ్ళ డబ్బు విదేశాలకి తరలిపోకుండా చూడడం అన్నది తరలిపోతోందని ఆవేదన చెందినంత సులువు కాదు.

మరీ ఇంజనీరింగ్ కాలేజీలంత పెద్ద సంఖ్యలో కాకపోయినా, మన దేశంలో మెడికల్ కాలేజీలు బొత్తిగా విస్తరించక పోడానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రభుత్వానికైనా, ప్రయివేటు వారికైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అన్నది బాగా ఖర్చుతో కూడిన వ్యవహారం (ఇంజనీరింగ్ కాలేజీల కన్నా అనేకరెట్లు ఎక్కువ). పైగా నిర్వహణ భారమూ ఎక్కువే. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తన పాత్రని పన్నుల వసూళ్లకు మాత్రమే కుదించుకుంటున్న నేపథ్యంలో, ప్రయివేటు రంగాన్ని గురించి మాత్రమే ఆలోచించినా అంత ఖర్చు చేసి కాలేజీలు ఏర్పాటు చేస్తే సీట్ల సంఖ్య మొదలు ఫీజులెంత వసూలు చేయాలోవరకూ సమస్త విషయాల్లోనూ ప్రభుత్వమే పెత్తనం చేస్తుంది, నియంత్రణ పేరుతో. పెట్టుబడి, నిర్వహణ వ్యయం, వాటికి వడ్డీలు కలిపి తడిపి మోపెడు. మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్ముకోగలగడం లాంటి చిన్న చిన్న సౌలభ్యాలు ఉన్నప్పటికీ, మెడికల్ కాలేజీ ఖర్చుతో నాలుగైదు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి త్వరగానూ, బాగానూ ఆర్జించే వీలు కనిపిస్తోంది. 

మరి విదేశాలు తక్కువ ఫీజుకే వైద్య విద్యని ఎలా అందించగలుగుతున్నాయి? ఎందుకంటే, ఆయా కాలేజీలు ఇప్పుడు నిర్వహణ వ్యయాన్ని మాత్రం ఆర్జించుకుంటే సరిపోతుంది. ఉక్రెయిన్ విషయమే తీసుకుంటే కాలేజీలన్నీ గతకాలపు సోవియట్ రోజుల్లో మొదలైనవే. కాబట్టి పెట్టుబడి తాలూకు రాబట్టుకోవడం అనే బాదరబందీ వాటికి లేదు. విద్యా వ్యవస్థని రక్షించాలంటున్న సోషల్ మీడియా మెసేజీల దగ్గరికి వస్తే, ఓ పక్క ఉన్న ఆస్తులనే అయినకాడికి  తెగనమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వైపునుంచి మన విద్యార్థుల సంఖ్యకి తగినన్ని కాలేజీల ఏర్పాటుని ఆశించలేం. పైగా విద్య, వైద్యం ప్రభుత్వం పనికాదన్న వాదన ఒకటి ఏలినవారి పనుపున బాగా ఊపందుకుంది.  ప్రైవేటు కాలేజీలు ఏర్పాటైనా తక్కువ ఫీజు అన్నది ఆచరణలో సాధ్య పడేది కాదు. కాబట్టి, మెజారిటీ విద్యార్థులు చదువు కొనక తప్పదు. సోషల్ మీడియాదేముంది, మరో కొత్త విషయం దొరికితే అటు మళ్లిపోతుంది. 

7 కామెంట్‌లు:

  1. బాగా వ్రాశారు. యుక్రేయిన్ లో ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్థి నవీన్ తండ్రి 97% వచ్చినా రిజర్వేషన్ విధానం వల్ల తన కుమారుడికి ఇక్కడ మెడికల్ సీటు రాలేదు అని వాక్యం పూర్తి చేసేలోపు ఛానళ్ల విలేకరులు మైకులు తీసుకుని వెళ్ళిపోయారు.

    ఇంజనీరింగ్ లో ఇప్పటికే అవసరానికి మించిన సీట్లు ఉన్నాయి. 80% కాలేజీలలో బోధన, నాణ్యత ప్రశ్నార్థకం. వైద్య విద్య అభ్యసించిన వారు కూడా 30-35 సం. వచ్చేదాకా స్థిరపడ్డ లేక పోతున్నారు.

    It is extremely difficult for a general category candidate to get PG medical seat.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 92% వచ్చిన మా ఫ్రెండ్ తమ్ముడికి సీట్ వొచ్చిందే మరి?

      తొలగించండి
    2. @బుచికి:  మైకులు తీసిన వీడియో నేను చూడలేదండీ.. పీజీ విషయంలో మీరన్నది నిజం.. ధన్యవాదాలు..   

      తొలగించండి
  2. చక్కటి విశ్లేషణాత్మకమైన పోస్ట్ . 
    సింపుల్ గా చెప్పాలంటే demand and supply పరిస్ధితి. ప్లస్ ఖర్చు ప్లస్ నాణ్యత 

    ఇటువంటిదే మేం కుర్రవాళ్ళుగా ఉన్నప్పుడు మేధావులందరూ గుండెలు బాదుకుంటూ జపించిన తారకమంత్రం  “బ్రెయిన్ డ్రెయిన్” లాగా ప్రస్తుతం  ఈ విదేశీవైద్యవిద్య అంశం దొరికింది … పడికట్టు పదాలతో చర్చా జాతర చెయ్యడానికి (రెండూ పూర్తిగా ఒకటే కాదనుకోండి, కొంచెం తేడా ఉంది. ఇక్కడ తయారైన ఉత్పత్తి ఇక్కడ ఉపయోగ పడకుండా విదేశాలకు తరలి పోవడం “బ్రెయిన్ డ్రెయిన్”  ముఖ్య లక్షణం  ముడిసరుకే వెళ్ళిపోవడానికి పెద్ద ఉదాహరణ విదేశీ వైద్యవిద్య … అని నాకు తోచిన నిర్వచనాలు). అయితే ఏదీ ఆగదు, బ్రెయిన్ డ్రెయిన్ నడుస్తూనే ఉంది, విదేశీ వైద్యవిద్య అంశం కూడా నడుస్తూనే ఉంటుంది. 

    కొన్ని రోజులు కాలక్షేపం. // “ సోషల్ మీడియాదేముంది, మరో కొత్త విషయం దొరికితే అటు మళ్లిపోతుంది.” //  లెస్స పలికితిరి. అసలు ఈ సోషల్మీడియా ఓ శక్తివంతమైన లాబీగా తయారవడం … తయారవనివ్వడం … ఆశ్చర్యకరం. ఒకప్పటి ప్రింట్ మీడియా అంటే బాధ్యతాయుతంగా ఉండేది, విషయపరిజ్ఞానం ఉండేది. 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆమాటకొస్తే ఇప్పుడు ఇండియాలో మెడిసిన్ చదువుతున్న వాళ్లలో కూడా ఇక్కడ ఉండేవాళ్ళు తక్కువేనండీ.. అప్పటి బ్రెయిన్ డ్రెయిన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. చదువుకోడానికి వెళ్లి విదేశాల్లో స్థిరపడిపోయే వాళ్ళు ఇప్పుడు అదనంగా చేరారు. అవకాశాలని వెతుక్కుంటూ వెళ్లడాన్ని తప్పుపట్టలేం కదా.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  3. "విద్య,వైద్యం ప్రభుత్వం పని కాదన్న వాదన". నిజంగా? మౌలికమైన వాటి విషయంలోనే చేతులెత్తేస్తే మరిక ప్రభుత్వం ఉన్నది దేనికట?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలాంటి ప్రశ్నకి 'గమ్యం' సినిమాలో గాలిశీను చెప్పే జవాబు నాకు చాలా ఇష్టమండీ.. మీకోసం: "ఐదేళ్లకోసారి ఎలచ్చన్ పెట్టుద్దిగా" 
      ...ధన్యవాదాలు.. 

      తొలగించండి