సోమవారం, మార్చి 14, 2022

చెయ్యిస్తుందా?

స్వాతంత్రం వచ్చిన పదేళ్లలోపే భారతదేశం ఎదుర్కొన్న మొదటి సమస్య ఆహార సంక్షోభం. అప్పటి అమెరికా ప్రభుత్వం సాయానికి ముందుకొచ్చింది. ఆహారధాన్యాలు ఎగుమతి చేయడం మొదలు పెట్టింది, 'పీఎల్ 480' లో భాగంగా. తిండిగింజలతో పాటే ఓ కలుపు మొక్క దేశంలోకి ప్రవేశించింది. దానిపేరు 'పార్తీనియం'. ఈ మొక్క త్వరగా విస్తరించడమే కాదు, నివారణకి లొంగదు. ఈ మొక్క పుప్పొడి కారణంగా మనుషులకీ, పశువులకీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూసారాన్ని పీల్చుకోడానికి, పరిసరాలని కలుషితం చేయడానికి పెట్టింది పేరు. పొలంగట్ల మీద, తోటల్లోనూ ఇష్టారాజ్యంగా పెరిగే ఈ మొక్కల్ని పీకడానికి ఇప్పటికీ రైతులు ఏటా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. ఈ మొక్క మన దేశానికి రావడం వెనుక అమెరికా కుట్ర ఉన్నదని ఓ ప్రచారం ఉంది. తెలుగులో 'వయ్యారిభామ' అనే అందమైన పేరుకూడా ఉన్న ఈ మొక్కని వాడుకలో 'కాంగ్రెస్ గడ్డి' అంటారు రైతాంగం. కాంగ్రెస్ కాలంలో దేశంలోకి వచ్చింది కదా మరి.

మా ఊరి కాంగ్రెస్ అరుగు (రచ్చబండ పేరు) దగ్గర రోజూ చేరి కష్టసుఖాలు మాట్లాడుకునే రైతుల మాటల్లో ఈ 'కాంగ్రెస్ గడ్డి' ప్రస్తావన తప్పక వచ్చేది. యేవో కారణాలకి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు "ఈ కాంగ్రెస్సూ, కాంగ్రెస్ గడ్డీ ఎప్పటికీ మనకి తప్పవు" అనేవాళ్ళు. ఈ మాట బాగా గుర్తుండిపోయింది. గత వారం ఉత్తర ప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం, ఐదుచోట్లా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం, 'ఇక కాంగ్రెస్ పని అయిపోయింది' అంటూ మీడియా అంతా కోడై కూస్తున్న సందర్భంలో మా ఊరి రైతుల మాట మళ్ళీ గుర్తొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, అరవయ్యేళ్లు చక్రం తిప్పిన పార్టీ ఇప్పుడిలా చతికిలపడడం ఆశ్చర్యాన్ని కలిగించడం కన్నా ఎక్కువగా ఆలోచనల్లో పడేస్తోంది. ఎందుకంటే, జాతీయ స్థాయిలో ఓ బలమైన ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఎప్పుడూ లాగే ఇప్పుడూ ఉంది. సొంత ఇమేజి, బలమైన సంస్థాగత నిర్మాణం, ఇప్పటికీ తనదైన ఓటు బ్యాంకూ ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయ పార్టీ, బొత్తిగా ఉనికిని చాటుకోలేని పరిస్థితుల్లో పడిపోవడం తాలూకు ప్రభావం రానున్న రోజుల్లో దేశం మీద ఏమేరకు ఉండబోతోందోనని ఓ ఆలోచన.

వయసైపోయిన మామిడి చెట్టుకి బదనికలు రావడం, పూల చెట్లకి రానురానూ గుంటపూలు పూయడం అసహజమైన విషయాలేవీ కాదు. కానైతే, యజమాని వాటినలా చూస్తూ ఉండిపోకుండా చేతనైన చికిత్సలు చేసో, చేయించో మళ్ళీ పూతా, కాపూ వచ్చేలా చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ/మహాసంస్థ యాజమాన్యం ఘనత వహించిన గాంధీ కుటుంబం చేతిలో ఉంది. వారసత్వంగా వచ్చిన కుటుంబ ఆస్తిని రక్షించుకుందామనే ధోరణి ఆ కుటుంబానికి ఉందో లేదో తెలియడం లేదు. ప్రధాని పదవిని తృణప్రాయంగా తిరస్కరించిన 'త్యాగమూర్తి' సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ రెండు ఎన్నికలు గెలిచి పదేళ్ల పాటు దేశాన్ని పాలించింది. యేవో స్కాములూ అవీ వెలుగు చూశాయంటే, రాజకీయాల్లో అవన్నీ మామూలే. ఆ పార్టీ ఉక్కు మహిళ ఇందిరా గాంధీనే 'కరప్షన్ ఈజ్ గ్లోబల్ ఫినామినా' అని ప్రకటించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వయోభారం, అనారోగ్యం తదితర కారణాలతో సోనియా పార్టీ పగ్గాలని ఒదులు చేశాక, వాటిని అందుకోవాల్సిన యువకిశోరం రాహుల్ గాంధీ అందుకు అంతగా సముఖత చూపకపోవడంతో సంక్షోభం మొదలైంది.

Google Image

తాతలు, తండ్రులు చక్రాలు తిప్పిన చోట వారసులు బొంగరాలు తిప్పడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే పరిమితమైన సమస్య కాదు. కుటుంబ పార్టీలుగా ముద్ర పడ్డ చాలా ప్రాంతీయ పార్టీలకీ ఈ సమస్య ఉంది. యువరాజుల్ని పట్టాభిషేకానికి సిద్ధం చేయకపోవడం, వాళ్ళు సిద్ధ పడిపోతే తమ కాళ్ళ కిందకి నీళ్లొస్తాయేమో అని పెద్ద తరం కాస్త వెనుకముందాడడం, సదరు వారసులకి రాజకీయాలకన్నా ఇతరేతర విషయాల మీద ఆసక్తి మెండుగా ఉండడం లాంటి కారణాల వల్ల చాలా రాష్ట్రాల్లో యువతరం పార్టీ పగ్గాలు పూర్తిగా అందుకోలేదు. పగ్గాలు అందుకున్న వాళ్ళు కూడా స్వతంత్రంగా కాకుండా సవాలక్ష ఆంక్షల మధ్య పనిచేయాల్సి రావడం, ఈ కారణంగా పార్టీ మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడం జరిగాయి. రాహుల్ కూడా ఇందుకు మినహాయింపు కాదనీ, కొత్త ఆలోచనలతోనే వచ్చినా, ఊహించని కట్టడుల కారణంగా పార్టీ వ్యవహారాల మీద అతనికి శ్రద్ధ తగ్గిపోయిందనీ కొందరు కాంగ్రెస్ కురు వృద్ధులు ప్రచారం చేస్తున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

కాంగ్రెస్ పార్టీకున్న ప్రధానమైన సమస్య వృద్ధ నాయకత్వం. దశాబ్దాల తరబడి పార్టీలో విశ్వాసపాత్రులుగా కొనసాగుతున్న వాళ్ళని పొమ్మనలేరు, పక్కన పెట్టలేరు. వాళ్ళు సలహాలు ఇవ్వక మానరు. ఈ కాలానికి అవి ఎంతవరకూ పనికొస్తాయన్న ప్రశ్న ఒకటైతే, పరస్పర విరుద్ధమైన సలహాలిచ్చే గ్రూపులు మరో సమస్య. ఈ గ్రూపులు పార్టీ సంస్కృతిలో భాగమైపోయాయి. తన అవసరాల కోసం ఒకప్పడు పార్టీ అధినాయకత్వమే వీటిని పెంచి పోషించింది. ఇప్పుడు తుంచలేదు. ఈ నాయకులు, గ్రూపుల బాధ పడలేక, పార్టీలో ఇమడలేక, సొంత వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం ఉన్న నాయకులు ఇతర పార్టీలకి మళ్లిపోయారు. 'పోయింది పొల్లు' అనుకోడానికి లేకుండా, అలా వెళ్లిన వాళ్లలో చాలామంది ఇవాళ ప్రముఖ రాజకీయ నాయకులుగా పరిణమించారు.  పార్టీలో విపరీతంగా పెరిగిపోయిన 'అంతర్గత ప్రజాస్వామ్యం' కారణంగా మిగిలిన నాయకుల్లో కూడా సయోధ్య లేదు. ఎందుకో అందుకు పార్టీని వీధిన పెడుతూనే ఉన్నారు. పార్టీ వీళ్ళని భరించలేదు, పొగబెట్టి పొమ్మననూ లేదు. అనేకానేక ఆత్మహత్యా సదృశ నిర్ణయాల తర్వాత, ఇవాళ అంపశయ్య మీదకి చేరే పరిస్థితిని చేతులారా తెచ్చుకుంది.

కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగితే దేశానికి వచ్చిన నష్టం ఏమిటి? 'కత్తికి ఎదురు లేకపోవడం' అన్నది రాచరికంలో చెల్లుతుంది కానీ, ప్రజాస్వామ్యంలో కాదు. ప్రతిపక్షం లేని చోట ప్రజాస్వామ్యానికి, రాజరికానికీ తేడా ఉండబోదు. 'చెక్స్ అండ్ బేలన్సెస్' ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. ఏకపార్టీ స్వామ్యం ఇష్టారాజ్యం కాకుండా చూడడం కోసం ప్రతిపక్షం ఉండాలి. ఓ జాతీయ పార్టీ కళ్ళముందే అంతరించిపోతున్నప్పుడు చర్చ జరగాల్సింది ప్రత్యామ్నాయాన్ని గురించి. ఒకప్పుడు విఫలమైన 'ఫ్రంట్' ప్రయోగం మళ్ళీ జరిగే అవకాశం ఉన్నా, అనేక చీలిక పీలిక పార్టీలని ఏకతాటిపై తెచ్చే నాయకులెవరన్న ప్రశ్న వస్తోంది. సంస్థాగత సమస్యల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులెవరైనా జాతీయ నేతలుగా ఆవిర్భవిస్తారా? ఎవరంతటి వారు వారైన మిగిలిన నేతలు ఈ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి. 'సమోసాలో ఆలూ ఉన్నంత వరకూ బీహార్ రాజకీయాల్లో లాలూ ఉంటాడు' అన్నది లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారంలో పెట్టిన స్లోగన్. ఇప్పుడా నాయకుడు లైంలైట్ లో లేడు. సమోసా స్టఫింగ్ లోనూ  చాలా మార్పులు  వచ్చేశాయి. ఎక్కడో తప్ప ఆలూ సమోసా కనిపించడం లేదు. ఇంతకీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతే మన రైతుల 'కాంగ్రెస్  గడ్డి' సమస్య పరిష్కారమవుతుందా??

2 కామెంట్‌లు: