శుక్రవారం, ఏప్రిల్ 01, 2022

వేపపువ్వు

'ఉగాది పచ్చడి' అనే చక్కని పేరున్నా 'వేపపువ్వు పచ్చడి' అన్న పేరే స్థిరపరిచేశారెందుకో. 'చేదు పచ్చడి' అనడం కూడా కద్దు. చెరుకు ముక్కలు, మామిడి పిందెల ముక్కలు, అరటి పండు, కొబ్బరి, బెల్లం, పచ్చి మిరప, చింతపండు పులుసు, ఉప్పు, ఇంకా ఎవరి అభిరుచిని, అందుబాటునీ బట్టి వాళ్ళు అనేక దినుసులు చేర్చేసినా ఏమీ అనుకోని పండగ ప్రత్యేక వంటకం ఇది. పచ్చడి కదా అని కర్వేపాకు తగిలించి నేతితో ఇంగువ పోపు వేసేవాళ్ళూ ఉన్నారు. ఎన్ని వేసినప్పటికీ మోడర్న్ వంటల్ని కొత్తిమీరతో 'గార్నిష్' చేసినట్టుగా, ఉగాది పచ్చడికి చివర్లో వేపపువ్వు అలా పడాల్సిందే. ఎవరి చేతిలోనన్నా శాస్త్రోక్తంగా పచ్చడి వేయాలంటే, ముందుగా వేపపువ్వు వేసి, తిననిచ్చి, అప్పుడు మిగిలిన మిశ్రమాన్ని వడ్డించాలి. తలంటులో కుంకుడు పులుసు పడి కళ్ళు మండితే మిగిలిన రోజుల్లో ఉప్పుకల్లు అద్దిన చింతపండు తినే సౌలభ్యం ఉండేది కానీ, ఉగాది రోజున మాత్రం మొదటగా తినాల్సింది వేపపువ్వు పచ్చడినే. 

మార్చి మూడోవారం మొదలు ఏప్రిల్ మొదటి వారం లోగా ఎప్పుడైనా వచ్చే పండుగ ఉగాది. వేసవి మొదలైపోతుంది. ఉక్కపోత, చెమట సరేసరి. వేపచెట్లు పూతకొస్తాయి. పండుగ కాస్త ముందుగా వచ్చేస్తే వేపపువ్వుకి బదులుగా మొగ్గలు పడతాయి పచ్చడిలో. కాస్త ఆలస్యం అయి, పిందెలు మొదలైపోయినా పువ్వైతే దొరుకుతుంది. వినాయక చవితి పండక్కి పత్రి కోసుకోడానికి బోల్డన్ని నిబంధనలుండేవి. కొన్ని చెట్లనుంచి కోసీ కోయనట్టు ఒకట్రెండు ఆకులు మాత్రమే తుంపాలి, మరికొన్ని మొక్కలు, చెట్ల జోలికి వెళ్లనే కూడదు ఇలా అన్నమాట. అయితే, వేపపువ్వు విషయంలో ఈ నియమాలేవీ ఉండేవి కాదు. ఎంత పువ్వు కోసుకున్నా ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. కానైతే, కొయ్యడానికే మనసొప్పేది కాదు. పువ్వు వృధా పోకూడదని అంతా పచ్చట్లో వేసేస్తే తినాల్సింది మనమే అన్న జ్ఞానం కాస్త తొందరగానే కలిగింది. ఇలాంటి జ్ఞానాన్ని పత్రీ, ఇతరత్రా పువ్వులూ కలిగించలేక పోయాయి. 

Google Image

రాములవారి గుడి గోడని ఆనుకుని పెద్ద వేపచెట్టు ఉండేది. మొదలు గుడి లోపల ఉంటే, కొమ్మలు గోడ మీంచి వాలి ఉండేవి. చెట్టు మొదట్లో కండ చీమలు పుట్టలు పెట్టుకుని ఉండడమూ, ప్రహరీ గోడ నెరజలు తీసి ఉండడంతో పిల్ల మేళానికి చెట్టెక్కే సాహసం ఉండేది కాదు. గోడ బయట రాతి సోఫా మీద నిలబడి, పొడవాటి కర్రతో వేప కొమ్మల్ని వంచుకుంటే పువ్వు కోసుకోవచ్చు. అయినా, ఎంత పువ్వు కావాలి కనుక? చిక్కేవిటంటే, వేపపువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కోయడానికి లేదు. ఉదయమో, సాయంత్రమో మాత్రమే కొయ్యాలి. సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఓ గోధుమవన్నె ముసలి తాచుపాము వ్యాహ్యాళికి తిరిగేది. ఆ పాము ఎవరినీ ఏమీ చేసేది కాదు, ఆ పామునీ ఎవరూ ఏమీ చేసేవారు కాదు. పిల్లలు తెలిసో తెలియకో రాయి విసురుతారని పెద్దవాళ్ళ భయం. అందుకని, ఆ వ్యాహ్యాళి వేళల్లో కూడా అటువైపు వెళ్లడం నిషిద్ధం. అలా వేపపువ్వు కోసం పంచాంగం చూసి ముహూర్తం పెట్టినంత హడావిడి జరుగుతూ ఉండేది. అన్నట్టు, ఆ చెట్టు వేప పుల్లలకి ఎంత డిమాండ్ అంటే, లెక్కేస్తే దాదాపు  ఊళ్ళో సగం దంతధావనాలకి ఆ ఒక్క చెట్టే దోహదం చేసి ఉంటుంది, కొన్ని దశాబ్దాల పాటు.  

గణాచారి చేతిలో వేపమండల్లాంటి, పువ్వులున్న వేపకొమ్మలు ఇంటికి తేవడంతోనే పనైపోయినట్టు కాదు. తెచ్చిన వేపపువ్వు నుంచి మొగ్గల్నీ, పసిరి మొగ్గల్నీ వేరు చేసే పని కూడా పిల్లలదే. పసిరి మొగ్గల్ని ఎప్పుడూ ఉండనిచ్చే వాళ్ళం కాదు కానీ, మొగ్గల్ని ఒక్కోసారి ఉంచేయాల్సి వచ్చేది. ఉగాది ముందే వచ్చేసి, చెట్టు పూర్తిగా పూత అందుకోక పొతే మొగ్గలోనే పూలని చూసుకోవాలి కదా మరి. పూలు కోసేశాక, ఆ మిగిలిన పుల్లల్ని పడేయకూడదు. వేలెడేసి చొప్పున విరిచి, చిన్న పురికొస ముక్క ముడేసి, ఏ గూట్లోనో గుర్తుగా దాస్తే, గబుక్కున వచ్చే చుట్టాలకి పొద్దున్నే పళ్ళు తోముకోడానికి ఇవ్వొచ్చు. ఈ జ్ఞానమూ ఊరికే వచ్చింది కాదు. ఓ పండగెళ్ళిన పాతనాడు వచ్చిన చుట్టానికి పొద్దుపొద్దున్నే వేపపుల్ల సమకూర్చాల్సి వచ్చి, అష్టకష్టాలూ పడినప్పుడు కలిగింది. తాటాకు ముక్కదేం వుంది, పెరట్లో ఉన్న పాక పైకప్పు నుంచి లాక్కోవచ్చు, వేపపుల్ల అలా కాదు కదా? ఇంతకీ, అలా వేరు చేసిన వేపపువ్వుని చిన్న గిన్నె లోకో, ఖాళీ కొబ్బరి చిప్పలోకో తీసి పెట్టేస్తే అప్పటికి పనైపోయినట్టే. 

పండుగనాడు పొద్దున్నే పచ్చడి నోట్లోవేసుకోగానే కలిగే మొదటి కోరిక 'తియ్యగా ఉంటే బాగుండును'. ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే, మొదట వేపపువ్వు చప్పరించాకే మిగిలిన పచ్చడి చేతిలో పడుతుంది. శ్రేష్టమైన వేపచెట్టు కొమ్మన పూసిన పువ్వు తియ్యగా ఎలా ఉంటుంది? పైగా, ప్రకృతి ఇష్టారాజ్యంగా కాకుండా ఓ పద్ధతిగా నడిచిన రోజుల్లో? అయితే, ఉగాది మరీ అంత చేదుగా ఏమీ మొదలయ్యేది కాదు. అప్పటికే పచ్చడిలో నాని ఉండడం వల్ల వేపపూలకి కాస్త పులుపు, తీపి అంటి ఉండేవి. పైగా, చేదు తిన్నందుకు గాను, పచ్చట్లో చెరుకు ముక్కని ఎంచి చేతిలో వేసేవాళ్ళు. ఈసారి వేపపూత అంటుకున్న చెరుకు ముక్క. ఏ ఒక్క రుచో దొరకదు. అన్ని రుచులూ కలగలిసే నాలిక్కి తగులుగూ ఉండేవి. నిజానికి అదో ప్రత్యేకమైన రుచి. ఇదీ అని ప్రత్యేకంగా చెప్పలేం. కావాలనుకోలేం, వద్దనీ అనుకోలేం. మళ్ళీ రుచి చూడాలనిపిస్తుందా అంటే, సందేహమే. ఆ రుచి పేరు 'జీవితం' అని అర్ధమవ్వడానికి కొన్నేళ్లు పట్టింది. మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు!!

4 కామెంట్‌లు:

  1. మురళిగారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ, కొంచం ఆలస్యంగా మీక్కూడా పండుగ శుభాకాంక్షలు!!

      తొలగించండి
  2. //పువ్వు వృధా పోకూడదని అంతా పచ్చట్లో వేస్తే తరువాత తినాల్సింది మనమే అన్న జ్ఞానం కాస్త తొందరగానే కలిగింది. ఇలాంటి జ్ఞానాన్ని పత్రి, ఇతరత్రా పువ్వులు కలిగించలేక పోయాయి// :-) :-) 'పండగెళ్ళిన పాతనాడు' అంటే ఏంటండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పండగ మర్నాడు అండీ.. పండగ రోజు వరకూ ప్రిపరేషన్ హడావిడి ఉంటుంది. పండుగ నాటి సందడి సరేసరి. మర్నాడు ఇంకేమీ ఉండదు కదా, ముందురోజు మిగిలిన వంటలు తింటూ విశ్రాంతి తీసుకోడం తప్ప.. అందుకని ఆరోజుని పండగెళ్ళిన పాతనాడు అనేవాళ్ళు .. ధన్యవాదాలండీ.. 

      తొలగించండి