శుక్రవారం, మార్చి 04, 2022

అనురాగమూర్తులు

ఒక వ్యక్తి జీవించి ఉన్న సమయంలో వ్యక్తిగతంగా కలిసి ఇంటర్యూ చేసి ఆ వివరాల ఆధారంగా జీవిత చరిత్ర రాయడం ఒక పధ్ధతి. ఆ వ్యక్తి మరణించిన చాలా ఏళ్ళ తర్వాత అతడికి సంబంధించిన అందరితోనూ మాట్లాడి, రిఫరెన్సులు సంపాదించి పుస్తకం రాయడం మరో పధ్ధతి. మొదటి దానితో పోలిస్తే ఈ రెండోది కష్టమైన పని. సమగ్రమైన వివరాలు సేకరించడం, పుస్తకం కూర్చడం ఓ ఎత్తయితే, రాసిన దాంట్లో ఏవన్నా తేడాపాడాలొస్తే అందుకు బాధ్యత వహించాల్సి రావడం మరో ఎత్తు. అసిధారా వ్రతం లాంటి ఈ రెండో పద్ధతిలో రచయిత ఓలేటి శ్రీనివాస భాను వెలువరించిన పుస్తకం 'అనురాగమూర్తులు'. ఒకరు కాదు, ఇద్దరి జీవితచరిత్ర. ఆ ఇద్దరూ వెనుకటి తరం తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ ప్రముఖులు మమ్మీ, డాడీ అని పిలుచుకున్న శాంతకుమారి, పి. పుల్లయ్య.  ఆమె నటి, నేపధ్య గాయని, అతడు సినిమా దర్శకుడు, నిర్మాత. 

కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో ని వెల్లాలలో పుట్టి పెరిగిన సుబ్బమ్మకి చిన్నప్పటినుంచీ చదువు కన్నా సంగీతం మీద మక్కువ ఎక్కువ. శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, సంగీతం టీచరుగా ఉద్యోగం సంపాదించుకుంది కూడా. ఆ రంగంలోనే కృషి చేసి ఉంటే ప్రముఖ శాస్త్రీయ సంగీత విదుషి అయి ఉండేది బహుశా. అయితే, ఊహాతీతంగా ఆమెకి సినిమా అవకాశాలొచ్చాయి. ఆ అవకాశాలని తెచ్చిపెట్టడం వెనుక ఆమె గాత్రానిదే  ప్రధాన పాత్ర. అయితే, సినిమా రంగ ప్రవేశం అంత సులువుగా జరగలేదు. ఆమె అమ్మమ్మ, తన మనవరాలు సినిమాల్లోకి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మనుషుల్ని కెమెరాలో పెట్టి నలిపిన తర్వాతే సినిమా తెరమీద వాళ్ళు కనిపిస్తారన్న అపోహ ఇందుకు కారణం! మొత్తమ్మీద సుబ్బమ్మ శాంతకుమారిగా మారింది. వెండితెరమీద నాయికగా అవతరించింది. 

నెల్లూరు జిల్లా నవాబుపేటకి చెందిన పోలుదాసు పుల్లయ్యది మరో విచిత్ర గాధ. చిన్ననాడే తల్లితండ్రులని పోగొట్టుకుని, అనాధగా బంధువుల సాయంతో పెరిగిన ఆ కుర్రాడు చదువు ద్వారా మాత్రమే జీవితంలో ఏదైనా సాధించగలమని నమ్మాడు. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఆ రోజుల్లోనే డిగ్రీ పూర్తి చేశాడు. ఒకట్రెండు ఉద్యోగాలూ చేశాడు. మిత్రులతన్ని సినిమా రంగంలోకి తీసుకొచ్చారు. నమ్మి దర్శకత్వపు అవకాశం ఇచ్చారు. వారి నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. బొంబాయి సినిమా పారిశ్రమని దగ్గర నుంచి చూసిన అనుభవం, చిన్నప్పుడే అలవడిన పుస్తక పఠనం, కావాల్సింది సాధించుకునే తత్త్వం.. ఇవన్నీ కలిసి అతడు దర్శకుడిగా నిలదొక్కుకోడానికి దోహదం చేశాయి. దక్షిణ భారత దేశంలో సినిమా పరిశ్రమ బలంగా వేళ్లూనుకుంటున్న రోజుల్లో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, పరిశ్రమతో పాటే పెరిగి పెద్దయిన పుల్లయ్య ఆనతి కాలంలోనే నిర్మాతగానూ మారారు. 

ఆ నటీమణీ ఈ దర్శకుడూ కలుసుకున్నది 1937లో. స్థలం బొంబాయిలోని ఫిలింసిటీ, సందర్భం 'సారంగధర' సినిమా షూటింగ్. ఆమె కథానాయిక, అతడు దర్శకుడు. ఆ షూటింగ్ జరిగే కాలంలోనే మనసులు ఇచ్చి పుచ్చుకుని, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె తరపు పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అటుపైన కూడా ఎవరి కెరీర్ వారిదే. అప్పటికే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పుల్లయ్య, పెళ్లయ్యాక నిర్మాత కాగలిగారు. ఆమె కూడా ఎప్పటిలాగే తన నాయిక వేషాలని, నేపధ్య గానాన్ని కొనసాగించారు. క్రమంగా సొంత కుటుంబమూ, సినిమా కుటుంబమూ కూడా పెరిగి పెద్దదయ్యింది. హీరోలు అమ్మా, నాన్నా అని పిలవడం మొదలు పెడితే, సావిత్రి తదితర నాయికలు అత్తయ్య, మావయ్య అని పిలిచే వాళ్ళు.  చిన్నా పెద్దా అన్న భేదం లేకుండా ఏ టెక్నీషియన్ కి ఏ కష్టం వచ్చినా పుల్లయ్య నేనున్నానంటూ వెళ్లి వాలిపోతే, లేడీ ఆర్టిస్టులు తమ కష్టసుఖాలని శాంతకుమారితో పంచుకునే వాళ్ళు. 

రెండు సార్లు తీసిన 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' అంజలి-నాగేసర్రావు జంటగా తీసిన 'జయభేరి' సినిమాలు పుల్లయ్యకి మంచి పేరు తెచ్చాయి. (బాలచందర్-చిరంజీవిల 'రుద్రవీణ' కి 'జయభేరి' తో దగ్గర పోలికలు కనిపిస్తాయి). మొదటిసారి తీసిన 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' లో శాంతకుమారి పద్మావతి పాత్రలో కనిపిస్తే, ఎన్టీఆర్, సావిత్రితో తీసిన సినిమాలో వకుళమాతగా కనిపించారు. సొంత సినిమాల్లో నటించే నాయికలకి తన బంగారు నగలనే అలంకరించే శాంతకుమారి అలవాటు, "అత్తయ్యా, నేనెప్పుడైనా ఇంత ఖరీదైన నగలను కొనగలనా?" అని 'అర్ధాంగి' షూటింగ్ అప్పుడు సావిత్రి అమాయకంగా అడగడం, అదే సావిత్రి 'సిరిసంపదలు' సినిమా నాటికి ఎస్. జానకి గొంతులో అప్పటికే రికార్డు చేసిన 'ఈ పగలు రేయిగా' పాటని సుశీల చేత పాడించమని పట్టు పట్టడం లాంటి విశేషాలు చాలానే పొందుపరిచారు ఈ పుస్తకంలో. 

పుల్లయ్య నిర్మించిన సినిమాలన్నింటినీ వరుసగా విశ్లేషించడంతో పాటు, నాటి పత్రికల్లో వచ్చిన ఆయా సినిమా రివ్యూలని పొందుపరచడం అదనపు ఆకర్షణ. వీటితో పాటుగా, శాంతకుమారి పాడిన పాటల సీడీనీ జతపరిచారు పుస్తకంతో పాటుగా.  శాంతకుమారి-పుల్లయ్యల ప్రేమకథతో కొంచం నాటకీయంగా మొదలయ్యే పుస్తకం, వాళ్ళిద్దరి నేపధ్యాలు వివరిస్తూ సాగి, పుల్లయ్య సినిమాలు, షష్టిపూర్తి విశేషాలు, అందుకున్న అవార్డులు తదితరాలని కవర్ చేస్తూ ముగుస్తుంది. విషయసేకరణకి, సమాచారాన్ని ఓ క్రమంలో పెట్టడానికి రచయిత పడ్డ శ్రమ కనిపిస్తుంది పుస్తకం అంతటా. అరుదైన ఛాయాచిత్రాలని జతపరిచారు. పుల్లయ్య గురించి ఇచ్చిన సమాచారంతో పోల్చితే, శాంతకుమారి సినిమాలు, పాటలని గురించి విశ్లేషణ బహు తక్కువగా ఉండడం ఒక లోటు. 'డు ము వు లు' పేరిట ముందుమాట రాసిన వీఏకే రంగారావు ఈ లోటుని కొంత వరకూ పూరించారు, ఆమెని గురించిన అరుదైన విశేషాలు పంచుకోడం ద్వారా. క్రియేటివ్ లింక్స్ వారి ముద్రణ బాగుంది. పాత సినిమాలని ఇష్టపడే వారిచేత ఆసాంతమూ ఆసక్తిగా చదివించే ఈ  244 పేజీల పుస్తకం వెల రూ. 300. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ దొరుకుతోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి