బుధవారం, మార్చి 16, 2022

సద్గతి

'పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు ఏవీ కట్టుకుని పోము' లాంటి తత్వాలు పాడుకోడానికి, వినడానికి బాగుంటాయి కానీ ఆచరణలో అన్నివేళలా సాధ్యం కాదు. పుట్టుక దగ్గర ఎలా ఉన్నా,  మరీ ముఖ్యంగా చావు దగ్గర. ఓ మనిషిని అతను జీవించి ఉన్న రోజుల్లో చుట్టూవున్న నలుగురూ దాదాపు ఒకే దృష్టితో చూడొచ్చు, కానీ ఆ మనిషి తనువు చాలించిన వెంటనే ఆ నలుగురే ఒక్కొక్కరూ ఒక్కోలా చూస్తారు. బతికుండగా అవసరం పడని చాలా విషయాలు, పోయాక అత్యవసరం అవుతాయి. మృత్యువు సమవర్తే కానీ, పాంచ భౌతిక దేహాన్ని ప్రకృతిలో కలపడానికి మాత్రం అనేక పద్ధతులు, అవి కూడా మనిషి పుట్టిన నేపధ్యాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ ఓ కథలో ఇమిడ్చి, ఆద్యంతమూ ఆపకుండా చదివించేలాంటి ఆసక్తికరమైన కథ రాశారు మధురాంతకం నరేంద్ర. ఆ కథ పేరు 'సద్గతి'. 

సైకిలు మీద ఇంటింటికీ తిరిగి తనకి తెలిసిన వైద్యం చేసే సంచికట్టు వైద్యుడు 'బహదూర్ సారు' తన పేషేంట్లలో ఒకరైన రాఘవరెడ్డి ఇంటి అరుగు మీద పడక్కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఒరిగిపోయాడు. అయన ప్రాణం పోయిందని నమ్మడానికి రెడ్డి ఇంట్లో వాళ్ళకి సమయం పట్టింది. బహదూర్ ఇక లేకపోవడం నిజమే అని అర్ధమయ్యాక ఆయన తాలూకు వాళ్ళ కోసం వెతుకులాట మొదలయ్యింది. ఇరవయ్యేళ్లుగా బహదూర్ ఏ ఇంట్లో అయితే అద్దెకున్నాడో, ఆ ఇంటి ఓనరే బహదూర్ ఊరు ఫలానా అని చెప్పలేకపోయాడు. బహదూర్ ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు, అతనికోసం బంధు మిత్రులెవరూ ఇంటికి రాలేదు. అంత్యక్రియలు చేయడానికి రాఘవరెడ్డి ముందుకొచ్చాడు. తన బిడ్డకి వైద్యం చేసి బతికించడమే కాకుండా, అపర ధన్వంతరిలా తన ఇంటిల్లిపాదికీ మందులిచ్చి కాపాడిన బహదూర్ కి అంత్యక్రియలు చేయడం తన అదృష్టం అంటాడు. తాను చేస్తున్న కార్యాన్ని గురించి బంధువులందరికీ కూడా తెలియాలి కాబట్టి, వాళ్ళకీ వార్త చెప్పమని కొడుక్కి పురమాయించాడు. 

శవాన్ని దహనం చేయాలా, పూడ్చిపెట్టాలా లాంటి సంశయాలన్నీ దాటి ఇహనో ఇప్పుడో బహదూర్ అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందనగా టౌన్ నుంచి ఓ వ్యక్తి దిగి,  ప్రతి రంజాన్ కి, బక్రీదుకి  బహదూర్ మసీదుకి వచ్చేవాడనీ, అతను ముస్లిం అనడానికి అంతకన్నా ఆధారం ఏం కావాలని ప్రశ్నిస్తాడు. ఊళ్ళో సాయిబులంతా బహదూర్ శవాన్ని తమ వాడకి తీసుకెళ్లిపోతారు. ముస్లిం పద్ధతిలో ఖననానికి ఏర్పాట్లు మొదలవుతాయి. తన భార్యకి పెద్ద జబ్బు చేసినప్పుడు మందిచ్చి బాగుచేసిన బహదూర్ అంతిమయాత్ర తన ఆధ్వర్యంలోనే జరగాలని పట్టుబడతాడు పాచ్చా సాయిబు. రాఘవరెడ్డి ఇంటి ముందు టెంటు  బిగించిన మదీనా సప్లయర్స్ కుర్రాళ్ళు, శవం వెనుకే టెంటుని తీసుకుని సాయిబు ఇంటి ముందు బిగిస్తారు. పనుల మీద పక్కూర్లకి వెళ్లిన సాయిబులకి కబుర్లు పంపడం, గంధం తీయడం, వేడినీళ్లు కాచడం పనులన్నీ ఆఘమేఘాల మీద జరుగుతూ ఉంటాయి. బహదూర్ అంత్యక్రియలు చేసే అవకాశం తనకి తప్పిపోయినందుకు బాధపడుతూ, జరుగుతున్న తతంగాన్ని గమనిస్తూ ఉంటాడు రాఘవరెడ్డి.

బహదూర్ పూర్తి పేరు బహదూర్ జాన్ అనీ, చాన్నాళ్లుగా తమ చర్చికి చందా కడుతున్నాడనీ క్రైస్తవులకి తెలుస్తుంది. చర్చి పాస్టర్ కూడా అయినా రైల్వే స్టేషన్ మాస్టరు జాన్ పాల్ హుటాహుటిన శవాన్ని తన ఇంటికి తీసుకుపోయి, శవపేటిక కోసం ఆర్దరిస్తాడు. బహదూర్ సార్ లాంటి పయస్ క్రిస్టియన్ శవాన్ని బరీ చేయడం తన అదృష్టంగా భావిస్తాడు, శవం వెనుకే మదీనా సప్లయర్స్ వారి టెంటు స్టేషన్ మాస్టర్ ఇంటికి చేరుతుంది. తమ మనుషులతో రాఘవరెడ్డి, పాచ్చా సాయిబూ కూడా అక్కడికి చేరుకుంటారు. కొత్తగా పాన్ బ్రోకర్ వ్యాపారం మొదలుపెట్టిన పొరుగు రాష్ట్రపు వ్యాపారికి బహదూర్ పూర్తి పేరు 'బహదూర్ జైన్' ఏమో అని సందేహం వస్తుంది. వడ్రంగం పనిలో తనకెన్నో మెళకువలు చెప్పాడని, ఆయన వడ్రంగే అయి ఉండొచ్చని అంటాడు ఊరి వడ్రంగి. దళిత వాడలో ఏ పెళ్లి  జరిగినా తప్పక హాజరయ్యే బహదూర్ తమ వాడేమోనని అక్కడివాళ్లు అనుకుంటారు. అతడు ఏ మతాన్ని అవలంబించాడు అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. జాన్ పాల్ జబర్దస్తీ చేసి క్రైస్తవ పద్ధతిలో ఖననం చేసేస్తున్నాడని భావిస్తారు అందరూ. ఇంతకీ బహదూర్ అంత్యక్రియలు ఎలా జరిగాయన్నదే 'సద్గతి' కథ ముగింపు. 

కథా రచనలో నరేంద్రది అందెవేసిన చేయి. పైగా కథా స్థలం చిత్తూరు జిల్లాలో బస్తీ వాసనలు సంతరించుకుంటున్న పల్లెటూరు. తమ పెత్తనం చెల్లాలని భావించే మణెగారు, రాఘవరెడ్డి లాంటి మనుషులతో పాటు, మారిన కాలానికి అనుగుణంగా ఆధునికత సంతరించుకున్న పాత్రలూ కనిపిస్తాయి. వాళ్లందరికీ బహదూర్ పట్ల చాలా గౌరవం ఉంది. అయితే, శవానికి అంతిమ సంస్కారం జరపడం ద్వారా తమ చిన్న చిన్న ప్రయోజనాలని నెరవేర్చుకోవాలనే తాపత్రయమూ ఉంది. మనుషుల్లో ఈ తాపత్రయమే లేకపోతే అనాధ ప్రేత సంస్కారం అనేది ఓ పెద్ద విషయం అయి ఉండేది కాదు. చుట్టూ ఉండే వాళ్ళ భిన్నమనస్తత్వాలతో పాటు, కథా ప్రారంభంలోనే శవంగా మారిపోయిన బహదూర్ పాత్ర చిత్రణ ఈ కథని ప్రత్యేకంగా నిలిపింది. అతడు వైద్య విద్య అభ్యసించిన వాడు కాదు. తనకి తెలిసిన మందుల్ని ఊరూరా తిరుగుతూ అవసరమైన వాళ్ళకి ఇచ్చి వైద్యం చేసేవాడు. 'హస్తవాసి' ని నమ్మే కాలం కావడంతో జనానికి అతనిమీద గురి కుదిరింది. ఎందరు పెద్ద డాక్టర్లు బోర్డులు కట్టినా, రాఘవరెడ్డి లాంటి వాళ్లకి వైద్యుడంటే బహదూరే. ఉత్కంఠభరితంగా సాగే కథకి రచయిత ఇచ్చిన హృద్యమైన ముగింపు పాఠకులు బహదూర్ ని మర్చిపోకుండా చేస్తుంది. 'వెదురుపువ్వు' కథా సంకలనంలో ఉందీ కథ.

2 కామెంట్‌లు: