చిరంజీవికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ని, రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ నీ తీసుకొచ్చిన సినిమా ఖైదీ (1983). మాధవి, సుమలత హీరోయిన్లు. చిరంజీవి డాన్సులు, ఫైట్లు, అలాగే చిరంజీవి-మాధవి జోడీకి క్రేజ్ పెరిగిందీ ఈ సినిమా నుంచే. చిరంజీవి-మాధవిల కోసం వేటూరి రాసిన హృద్యమైన యుగళగీతం 'గోరింట పూసింది.. గోరింక కూసింది..' సాహిత్యానికి తగ్గట్టుగా సంగీతం, గానం, చిత్రీకరణ, సినిమాలో ప్లేస్మెంట్.. ఇలా అన్నీ చక్కగా కుదిరిన పాట ఇది.
లలితగీతంలాగా, భావకవితలాగా అనిపించే సాహిత్యం తర్వాతి కాలంలో చిరంజీవికి చాలా తక్కువ పాటలకే సాధ్య పడింది. 'ఖైదీ' తో ఒక్కసారిగా మాస్ వెల్లువ ఆవహించేసింది కదా మరి.తమ కష్టాలు తీరి, మంచిరోజులు వచ్చాయని, రానున్న రోజులన్నీ తానూ తన ప్రియుడూ సంతోషంగా గడపబోతున్నామనే నాయిక ఊహల నుంచి పుట్టిన డ్రీమ్ సాంగ్ ఇది.
గొడవేమిటే రామ చిలక.. నే తీర్చనా తీపి అలక
కోరిందిలే రామచిలక.. నీ ముద్దుల ముక్కుపుడక
రతనాల రంగుల్తో రంగవల్లులు తీర్చి
ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే
సొదలేమిటే రామచిలక .. సొగసిచ్చుకో సిగ్గు పడక
పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే నిశి రాత్రి తోడుంటే
కొదవేమిటే గోరువంక.. కడకొంగుతో కట్టుపడక
జాజిపూలతో శయ్య వేసి, పండు వెన్నెలని పిండేసి పన్నీరుగా మార్చి చిలకరించాను. మనతో జాగారం చేయడానికి చిక్కటి రాత్రి సిద్ధంగా ఉండగా, చెంగుముడికి ఇంకా కావాల్సిందేవిటి? అంటోంది ఆమె. ప్రేమికులు మాట్లాడుకునే స్వీట్ నథింగ్స్ ని కూడా అర్ధవంతంగా మలచగలిగే కవి ఉన్నప్పుడు, ప్రేమగీతమంటే కేవలం ట్యూన్ ని నింపే పదాల కూర్పుగా మాత్రమే ఉండదు. అలాగని సమాస భూయిష్టంగా నోరు తిరగని విధంగానూ ఉండదు.
పరాగ్గా వింటే ఇళయరాజా బాణీ అనిపించే ఈ పాటకి చక్రవర్తి స్వరం చేశారు. బాలు-సుశీల పాడారు. కోయిల కూతని గుర్తు చేసే ప్రారంభాన్నీ, మధ్యలో వినిపించే జానపద బాణీ కోరస్ నీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాహిత్యానికి తగ్గట్టుగానే తొలి చరణాన్ని పగటి పూట, మలి చరణాన్ని రాత్రి వేళ చిత్రీకరించారు దర్శకుడు కోదండరామి రెడ్డి. చిత్రీకరణలో ఎక్కడా భారీతనం, ఒళ్ళు విరిగే స్టెప్పులు ఉండవు, కానీ పాటని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చిరంజీవి-మాధవి హిట్ పెయిర్, అభిమానులకి మోస్ట్-వాంటెడ్ పెయిర్ ఎందుకయ్యారో తెలుసుకోడానికి ఈ పాటొక్కటీ చూస్తే చాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి