శుక్రవారం, సెప్టెంబర్ 09, 2011

లలిత సంగీతపు తొలి స్వరం

ప్రముఖ స్వరకర్తా, గేయ రచయితా అయిన తొంభై రెండేళ్ళ పాలగుమ్మి విశ్వనాథం లలిత సంగీతాన్ని తెలుగు లోగిళ్ళకి చేర్చే బృహత్కార్యానికి ఆద్యుడు . తెలుగు సంగీతపు ప్రముఖులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, తొలి తెలుగు సిని నేపధ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు మొదలు, నేటి మేటి గళాలు వేదవతీ ప్రభాకర్, చిత్తరంజన్, కేబీకే మోహన్ రాజు వంటి ఎందరెందరో కళాకారులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలగుమ్మి శిష్యరికం చేసిన వారే.

'అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా.. ' 'మా ఊరు ఒక్కసారి పోయిరావాలి' లాంటి ఎన్నెన్నో లలితగీతాలు తెలుగువారిళ్ళలో వినబడుతూనే ఉంటాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి కలం నుంచి జాలువారిన 'నీపదములే చాలు రామా..' 'రామచరణం..' లాంటి భక్తి పాటలూ, 'నారాయణ నారాయణ అల్లా అల్లా...' వంటి సమైక్య గీతాలూ పాలగుమ్మి విశ్వనాథం స్వర రచన చేసిన వాటిలో కేవలం కొన్ని మాత్రమే. మహాత్ముడి 'గాంధీ శకాన్ని' గుర్తుకు తేవడం కోసం, స్వతంత్ర సమరంలో పాల్గొన్న ఎందరో కవులు ఆలపించిన దేశభక్తి గేయాలని ఎంతో శ్రమదమాదులకోర్చి సేకరించడమే కాదు, వాటిని అవే బాణీలలో భద్రపరిచారు కూడా.

విశ్వనాథం కేవలం స్వరకర్త మాత్రమే కాదు, శక్తివంతమైన గొంతున్న గాయకుడు కూడా. సంగీత కార్యక్రమాల రూపకర్తగా ఆకాశవాణి కి సుదీర్ఘ సేవలందించిన క్రమంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి నుంచి పుట్టపర్తి నారాయణాచార్యుల వరకూ, దాశరధి మొదలు డాక్టర్ సి. నారాయణ రెడ్డి వరకూ ఎందరెందరో కవుల కవితలకి స్వరాలద్దారు. బసవరాజు అప్పారావు, మల్లవరపు విశ్వేశ్వర రావు, బాలాంత్రపు రజనీకాంత రావు, చింతా దీక్షితులు, అడివి బాపిరాజు, గుంటూరు శేషేంద్ర శర్మ ప్రభుతుల గీతాలెన్నో నేటికీ చిరంజీవులుగా ఉన్నాయంటే అందుకు కారణం పాలగుమ్మి స్వర రచనే.

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూళ్ళో 1919 లో జన్మించిన పాలగుమ్మి విశ్వనాథానికి సంగీతం చిన్ననాడే పరిచయమయ్యింది. అమ్మ, నాయనమ్మ పాడుకునే తరంగాలూ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ ఆయన్ని ప్రభావితం చేశాయి. కథకుడిగా, నవలా రచయితగా ప్రసిద్ధుడైన పాలగుమ్మి పద్మరాజు ఈయనకి స్వయానా అన్నగారు కావడంతో సాహిత్యాభిలాషా మొదలయ్యింది. "అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి 'సంగీత భూషణ' పురస్కారం అందుకున్న కాకినాడ వాసి మర్ల సూర్యనారాయణ మూర్తి నా తొలిగురువు. అటుపై, విఖ్యాత వైణికులు ఈమని శంకర శాస్త్రి శిష్యరికమూ చేశాను," అంటూ గుర్తు చేసుకుంటారు విశ్వనాథం. ఈమని ప్రభావంతో వీణనీ సాధన చేశారు.

చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ స్టూడియోస్ లో ఈమని స్వరకర్తగా చేరడంతో, విశ్వనాథం కూడా చెన్నపట్టణం చేరారు. ప్రముఖ నర్తకుడు ఉదయ శంకర్ బృందంలో సంగీత కళాకారుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. "ఉదయ శంకర్ నిర్మించిన 'కల్పన' సినిమాకి, విష్ణుదాస్ సరాళి సంగీత బృందంలో పని చేశాన్నేను. అదే సమయంలో, వాగ్గేయకారుల కృతులపై సాధికారికత ఉన్న సంగీతజ్ఞుడు ఎస్. రామనాథాన్ని కలిశాను. కర్ణాటక సంగీతంలో కొత్త కోణాలని తెలుసుకునేందుకూ, ఈ సంగీతాన్ని ఇతర సంగీత ప్రక్రియల్లో ఉపయోగించుకోగలిగే మెళకువలని అర్ధం చేసుకోడానికీ సాయపడిందీ పరిచయం," అంటారీ సంగీతజ్ఞుడు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1955 లో ఉద్యోగంలో చేరడం విశ్వనాథం సంగీత ప్రయాణంలో ఓ మేలిమలుపు. అప్పటికే అక్కడ ఉద్యోగులుగా ఉన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, గోపీచంద్, నాయని సుబ్బారావు వంటి ఎందరో కవులు, కళాకారుల సాహచర్యం దొరికిందాయనకి. "రేడియో వినే సామాన్య శ్రోతలకి శాస్త్రీయ సంగీతపు సారాన్ని లలిత సంగీతం ద్వారా అందించే ప్రయత్నం చేశాన్నేను," అని చెప్పే విశ్వనాథం, కృష్ణశాస్త్రితో కలిసి ఎన్నో సంగీత రూపకాలు రూపొందించారు. ఆరోజుల్లో వీరిరువురి సారధ్యంలో వచ్చిన గీతం లేకుండా ఆకాశవాణిలో ఒక్క ఉగాది కార్యక్రమమూ లేదన్నది అతిశయోక్తి కాదు.

"ఆరోజుల్లో నేను వీణ వాయిస్తుంటే, ఆ వీణా నాదానికి అనుగుణంగా కృష్ణశాస్త్రి ఆశువుగా గేయాలల్లేవారు," అంటారు విశ్వనాథం. వీరద్దరి కలయికలో వచ్చిన గీతాల్ని ఇప్పటికీ 'లలిత సంగీతపు స్వర్ణయుగ సంపద' గా గుర్తు చేసుకుంటారు సంగీత ప్రేమికులు. 'రసతరంగిణి,' బాలమురళి పాటలతో చేసిన 'సాహిత్యంలో చందమామ,' ప్రపంచవ్యాప్తంగా ఉన్న లాలిపాటలపై తులనాత్మక అధ్యయనం 'ఉయ్యాల జంపాల' ...ఇవి విశ్వనాథం రూపుదిద్దిన కొన్ని అరుదైన సంగీత రూపకాలు. చిరంజీవత్వం సాధించుకున్న ఈపాటలన్నీ ఆకాశవాణి భాండాగారాన్ని పరిపుష్టం చేశాయి. 'రవీంద్ర సంగీత్' ప్రభావంతో టాగోర్ గీతాలకు తెలుగులో స్వేచ్చానువాదం చేసి బాణీలు కట్టారు.

పిల్లల కోసం, పరిశ్రమలలోనూ, పొలాల్లోనూ పని చేసే కార్మికుల కోసం, మహిళల కోసం విశ్వనాథం స్వరపరిచిన లలితగీతాలు ఇప్పటికీ రేడియోలో ప్రసారమవుతున్నాయి. ఆకాశవాణిలో పదవీ విరమణ అనంతరం డచ్ కి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ హ్యూబర్ట్ కోరిక మేరకు సికిందరాబాద్ లో ఉన్న అమృతవాణి క్రైస్తవ మిషన్ కి భక్తి గీతాలు సమకూర్చారు విశ్వనాథం. వీటికి తన సంగీత ప్రస్థానంలో విలువైన చోటుందంటారు. రేడియో సిలోన్ తో పాటుగా ఫిలిప్పీన్స్ కి చెందిన రేడియో వేరిటాస్ లోనూ ప్రసారమయ్యాయీ గీతాలు. ఆడపిల్లని అత్తవారింటికి పంపాక ఆమె తల్లిదండ్రులు పడే బాధకి అక్షర రూపమిస్తూ 'అమ్మదొంగా..' పాటని రచించి స్వరపరిచారాయన.

లలిత సంగీతాన్ని బోధనాంశంగా చేర్చడానికీ, అవసరమైన అధ్యాపకుల్ని తయారు చేయడానికీ పాలగుమ్మి విశ్వనాథం సేవలని అర్ధించింది తెలుగు విశ్వవిద్యాలయం. "నేనెంతో భక్తితో నిర్వహించానా బాధ్యతని. పాఠాలనీ, అధ్యాపకులనీ తయారు చేయడంతో పాటుగా, లలిత సంగీతం పుట్టుక, విస్తరణని వివరిస్తూ విశ్వవిద్యాలయం కోసం ఓ పుస్తకాన్ని కూడా రాశాను," అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'హంస' అవార్డుతో పాటుగా, ఎన్నో సంస్థల సత్కరాలనీ అందుకున్నారు విశ్వనాథం.

(నేనింకా శారదా శ్రీనివాసన్ రేడియో అనుభవాల అనుభూతుల్లో ఉండగానే, ఇవాల్టి ఉదయం 'Straddling the world of light music' శీర్షికతో Friday Review సంచికలో పాలగుమ్మి విశ్వనాథం గురించి ఓ కథనాన్ని ప్రచురించింది The Hindu దినపత్రిక. గుడిపూడి శ్రీహరి గారి కథనాన్నితెనిగించే ప్రయత్నం ఇది. ఫోటో సౌజన్యం The Hindu).

13 కామెంట్‌లు:

  1. ఆయన గురించి వినడమే తప్ప ఇన్ని విషయాలు తెలియవు. అమ్మా దొంగా పాట బాగా విన్న పాట. ఈయనని చూసే అదృష్టం కూడా కలిగినందుకు మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. Thank you MURULIGARU, I JUST READ YOUR POST.. VERY GOOD AND QUITE INFORMATIVE..NEXT TIME I WILL DEFINITELY TRY TO SEND A TELUGU COMMENT..

    రిప్లయితొలగించండి
  3. కొన్ని కొన్ని కలయికలు పాలసముద్రమనే జీవితంలో అమృతాన్ని చిలికి బయటకి తీసి మనలాంటి సామాన్యులు ఆస్వాదించటానికి ప్రసాదిస్తాయి. అవే పాలగుమ్మి విశ్వనాథం గారి తెలుగు సంగీత ప్రముఖుల తోటి కలయికలు, వాటినుండి వచ్చినవే మనం చిరకాలం వినగలిగే లలిత సంగీత సప్త స్వరాలు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  4. చాలా మంచి పరిచయం చేసారు మురళి.

    "అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా.." పాట సాహిత్యం, స్వర రచన అద్భుతం. చుట్టుపక్కల ప్రశాంతంగా, నిశ్శబ్ధంగా ఉన్నప్పుడు ఈపాట వింటుంటే కూతురికి దూరమైన ఆ తల్లి భావనలు కళ్లముందు నిలిచినట్టుగా ఉంటుంది..

    రిప్లయితొలగించండి
  5. చాలా విలువైన పరిచయం. నేను ఓ..బాంక్ పనిలో వేచి ఉన్న సమయంలో పాలగుమ్మి గారి గురించి హడావిడిగా చదివాను. ఇప్పుడు ఇక్కడ వివరంగా..బాగుంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. అమ్మ దొంగా నాకు చాలా ఇష్టమైన పాట ... ధన్యవాదములు పరిచయం చేసినందుకు

    రిప్లయితొలగించండి
  7. జీవితం అనే కాన్వాసుపైన కొన్ని అందమైన రంగు రంగుల మరకలు! అలాటి ఒక మరకే నాకు పాలగుమ్మి వారి పరిచయం.

    దాదాపు ఇరవై యేళ్ళ క్రితం ఒకానొక కొలీగ్ "నీకొక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను, మా ఇంటికి మధ్యాహ్నం రమ్మన్నారు". అప్పటికి నాకింకా పెళ్ళవలేదు, అదే కాలనీలో హాస్టల్లో ఉండేదాన్ని. వెళ్ళగానే మా కొలీగ్ నన్ను పరిచయం చేసారు. ఎక్కువగా మాట్లాడకుండా, "ఒక పాట పాడమ్మా!" అన్నారు. అయితే మా కొలీగ్ ఆయనెవరో నాకు చెప్పలేదు! నేను ఈయన ఎవరబ్బా అనుకుంటూనే ఒక మీరా భజన్ పాడాను. ఆయన తల పంకించి ఇంకెవరితోనో మాటల్లో మునిగిపోయారు. ఆ వచ్చినావిడ ఏదో ప్రశ్న అడిగింది. ఆయన ఆమెని ఆగమని సైగ చేసి నా వైపు తిరిగి, "నువ్వు ఇంకో పాట పాడమ్మా" అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను. ఇంకోపాట పాడాను. ఇంతలో భోజనాలకి లెమ్మన్నారు. మెల్లిగా లోపలికెళ్ళి మా కొలీగ్ వాళ్ళావిడని అడిగాను, "ఆయనెవరూ?" అని. ఆవిడ నిర్ఘాంతపోయారు! "ఆయనెవరో తెలీదా? మా మావగారు, విశ్వనాథం గారూ" అన్నారు. నాకు ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. (అప్పటివరకూ నాకు రేడియోలో భక్తి రంజనిలో పాల గుమ్మి విశ్వనాథం గారన్న పేరే పరిచయం).
    భోజనాల తర్వాత దాదాపు మూడు నాలుగు గంటలు కేవలం సంగీతం గురించే మాటలు. నా పాటనూ, నా గొంతులో రేంజినీ చాలా చాలా మెచ్చుకున్నారాయన. అయితే నేను ఈ గవర్నమెంటు ఉద్యోగం వదిలేసి రోజుకు పదహారు గంటలు సాధన చేయాలని సలహా ఇచ్చారు. ఆయన మాటలు నేను మరిచిపోలేను. "ఉద్యోగాలూ లెక్కలూ చాలా మందే చేయగలరు. కొంతమందికి మాత్రమే సంగీతం పూర్వ జన్మ సుక్రుతం వల్ల ఆబుతుంది. నీ గొంతలాటిది. దానికి పదును పెట్టి పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత నీమీదుంది," అన్నారు.
    (ఆయన సలహా పాటించేంత ధైర్యం నాకప్పుడు లేకపోయింది. ఇప్పుడేమనుకొని ఏం లాభం!)
    తర్వాత ఆయన నాకు తన భక్తి రంజని రికార్డింగు వున్న కేసెట్టు ఇచ్చాక గానీ నాకు ఆయనెవరో అర్ధం అయి కాళ్ళొనకటం మొదలు కాలేదు.
    ఆ తర్వాత చాలా సార్లు ఆ వూళ్ళోనూ, హైదరాబాదులోనూ ఆయనని కలిసాను. మా మధు పుట్టినప్పుడు ఫోన్ చేసి చెప్తే, "చక్కటి రాగం పేరు పెట్టూకున్నావే!" అని మెచ్చుకున్నారు.
    ఆయన పరిచయాన్నీ, ఆయన మాటలనీ నేనీ జన్మకి మరచి పోలేను. మంచి ఙ్ఞాపకాలు పంచుకోవటానికి మీ టపా ఉపయోగించుకున్నాను. మన్నించాలి మురళి గారూ!

    రిప్లయితొలగించండి
  8. @రసజ్ఞ : నేను కలవలేదండీ.. ఇంగ్లిష్ పేపర్లో వచ్చిన కథనాన్ని తెనిగించే ప్రయత్నం చేశాను, అంతే.. ధన్యవాదాలు.
    @గోదావరి: ధన్యవాదాలండీ.
    @రావు ఎస్. లక్కరాజు: నిజం కదండీ!! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @రవికిరణ్: అవునండీ.. చాలా మంచి పాట.. ధన్యవాదాలు.
    @వనజ వనమాలీ: ధన్యవాదాలండీ..
    @పరుచూరి వంశీకృష్ణ: అసలా పాటని ఇష్టపడని వాళ్ళు ఉండరేమోనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @శారద: 'మన్నించాలి మురళి గారూ!' ఇది తప్ప మిగిలిన వ్యాఖ్య అంతా అద్భుతంగా ఉందండీ.. యెంత గొప్ప అనుభవమో కదా.. ఆయనెవరో తెలిస్తే మీరు అంత ఫ్రీగా పాడి ఉండేవారు కాదేమో.. ఆయన సలహా పాటించడం అంటే.. జీవితావసరాలు ఎప్పుడూ మనల్ని వేరే దారి పట్టిస్తూనే ఉంటాయి కదండీ.. ధన్యవాదాలు.
    @మైత్రేయి: ధన్యవాదాలండీ..
    @కొత్తపాళీ; ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. Thanks for the post. I had great opportunity to have sung for Balanandam Sangita Rupakalu.He was very children friendl. Sang many recordings and satge shows in his music.Also went to his house aften as Our Graet sangita Guru is also Sri. Marla Garu.Planning to see him when I go to India this time.Had graet days in life to be with Turaga Janaki Rani garu, sarada Srinivasan Garu, Srinivasan garu,Jyotsna garu, Chittaranjan garu and many more wonderful artists.Grew up in that Akasavani...

    Thanks for reminding me those days one more time.

    రిప్లయితొలగించండి