సోమవారం, సెప్టెంబర్ 05, 2011

గురుదక్షిణ

నా హైస్కూలు చదువు ఐదేళ్లలోనూ ముగ్గురు హెడ్మాస్టర్లు మారారు మాకు. ముగ్గురిలోనూ నాకు బాగా నచ్చినవారూ, ఇప్పటికీ తరచూ గుర్తు చేసుకునే వారూ శ్రీరామ్మూర్తి గారు. స్పురద్రూపం..పచ్చని పసిమిచాయ...మడత నలగని ఇస్త్రీ దుస్తుల్లో ఠీవిగా ఉండడమే కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు కూడా. ఆయన మా స్కూలికి రానిక్రితం వరకూ మాకు హెడ్మాస్టర్ అంటే సింహస్వప్నం. మేం ఆయన రూముకి వెళ్ళాల్సి వచ్చినా, ఆయన మా క్లాసుకి వచ్చినా గడగడా వణికే వాళ్ళం.

కానీ, శ్రీరామ్మూర్తి మేష్టారు మిగిలిన వాళ్ళలా కాదు. ఏ క్లాసుకి మేష్టారు లేకపోయినా, ఆయన ఆక్లాసుకి వెళ్ళిపోయి పిల్లలందరితోనూ మాట్లాడుతూ ఏదో ఒక పాఠం చెప్పేవాళ్ళు. ఈయనకి ముందు హెడ్మాస్టర్లతో మాట్లాడే అవకాశం కేవలం క్లాసు లీడర్లకి మాత్రమే ఉండేది. కానీ ఈయనొచ్చాక పద్ధతులు మారిపోయాయి. స్కూల్లో అందరూ ఆయనతో నేరుగా మాట్లాడొచ్చు. ఇబ్బందులేవన్నా ఉంటే చెప్పుకోవచ్చు. ఆయన ప్రసన్నవదనంతో చివరికంటా విని, అంత పెద్ద సమస్యనీ చిటికెలో పరిష్కరించేసే వాళ్ళు. పుస్తకాలు కొనడానికీ, ఫీజు కట్టడానికీ టైమిమ్మని అడిగేవాళ్ళు చాలామంది పిల్లలు.

రోజూ జరిగే స్కూల్ అసెంబ్లీలో కూడా చాలా మార్పులు చేశారు శ్రీరామ్మూర్తి గారు. ప్రతిజ్ఞ కేవలం తెలుగులోనే కాకుండా ఇంగ్లిష్, హిందీల్లోనూ చెప్పాలనీ, ప్రతిరోజూ వార్తలు చదవాలనీ, ఒక సూక్తి చెప్పాలనీ ఇంకా అసెంబ్లీ చివర్లో హెడ్మాస్టర్ ప్రసంగం... ఇలా ఆయన చేసిన మార్పుల పుణ్యమా అని పక్కూళ్ళ నుంచి వెళ్ళే మాలాంటి పిల్లలందరం అసెంబ్లీ టైముకే బళ్ళో ఉండేలా ముందుగానే బయల్దేరేసేవాళ్ళం. పక్క స్కూళ్ళలో పోటీలు జరుగుతుంటే మమ్మల్ని ప్రోత్సహించి పంపడం, మేష్టర్లెవరికన్నా బదిలీ అయినా, రిటైర్ అయినా తప్పకుండా ఫేర్వెల్ ఏర్పాటు చేయడం...ఇవన్నీ ఆయన చేసిన ఏర్పాట్లే.

ఎప్పటిలాగే ఆవేళ ఉదయం కూడా స్కూల్లో హడావిడిగా ఉంది. అసెంబ్లీకి ఇంకా టైం ఉండడంతో డ్రిల్లు మేష్టారు పిల్లలందరిచేతా గ్రౌండ్ లో ఉన్న చెత్త కాగితాలు ఏరిస్తున్నారు. నేను ఎస్పీఎల్ అవ్వడంతో, ఆఫీసు రూముదగ్గర ఓపక్క పేపరు చూసి వార్తలు రాసుకుంటూ, మరో పక్క ప్రతిజ్ఞ ఎవరు ఏభాషలో చెప్పాలో, సూక్తి చెప్పాల్సింది ఏ క్లాసు వాళ్ళో చూసుకుంటున్నాను. గుమస్తాగారేదో కబురు తేవడంతో ఉన్నట్టుండి స్టాఫ్ రూములో వాతావరణం మారిపోయింది. సోషలు మేష్టారొచ్చి "ఇవాల్టికి ఇవేమీ వద్దమ్మా" అన్నారు. అర్ధం కాలేదు నాకు.

పిల్లలందరూ అసెంబ్లీకి వచ్చి నిలబడగానే సోషలు మేష్టారు చెప్పారు. "ఇవాళ మన స్కూలుకి ప్రత్యేకంగా సెలవు ప్రకటిస్తున్నాం. మన హెడ్మాస్టరు గారి అబ్బాయి చనిపోయాడు. మీరంతా అల్లరి చెయ్యకుండా పుస్తకాలు తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపొండి.." పిల్లలెవరికీ కూడా సెలవొచ్చిందన్న సంతోషం ఏకోశానా లేదు. నేను స్టాఫ్ రూము దగ్గరే ఆగిపోయాను. అక్కడ తెలిసిన విషయాలు ఏమిటంటే, మా హెడ్మాస్టరు గారికి ఒక్కడే కొడుకు. డాక్టర్ కోర్సు చదువుతున్నాడు. ఎందుకో తెలీదు కానీ ఉరిపోసుకుని చనిపోయాడు. మా హెడ్మాష్టారు గుర్తొచ్చి చాలా బాధనిపించింది. అప్పటివరకూ ఒక్కసారి కూడా చూడకపోయినా సరే వాళ్ళబ్బాయి మీద చాలా కోపం వచ్చింది.

ఇంచుమించు ఓ నెల్లాళ్ళ తర్వాత మా హెడ్మాస్టరు మళ్ళీ స్కూలుకి వచ్చారు. ఎప్పటిలాగే అసెంబ్లీ ఏర్పాట్లలో ఉన్నాను.. ఒక్కసారిగా ఆయన్ని చూసేసరికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. మనిషి బాగా చిక్కిపోయారు. పెద్ద జ్వరం వచ్చి తగ్గినట్టుగా నీరసం తెలుస్తోంది. ఆయన ముఖంలో నవ్వన్నదే కనిపించలేదు. "ఒకవేళ నేను చచ్చిపోతే నాన్నకూడా ఇలాగే అయిపోతారా?" ఆలోచనకే ఉలిక్కి పడ్డాను నేను. మాస్టార్లందరూ ఆయన్ని పలకరిస్తున్నారు. పిల్లలు దూరం నుంచే చూస్తున్నారాయన్ని. అసెంబ్లీ మొదలయ్యింది. అయన వచ్చి నిలబడ్డారు. ప్రధానోపాధ్యాయుడి ప్రసంగం అని ఎస్పీఎల్ ప్రకటించాలి. ఆయన మాట్లాడతారో, లేదో.. సోషల్ మేష్టారి వైపు చూశాను నేను. మాట్లాడతారని సైగ చేశారాయన.

"మీకందరికే తెలిసే ఉంటుంది... నేను ఉద్యోగం మానేద్దామా అనుకున్నాను... చెయ్యాలని కూడా అనిపించలేదు.. కానీ మీ అందర్లోనూ వాణ్ణి చూసుకోవచ్చు అన్నారు మన మేష్టార్లు...నాకూ నిజమే అనిపించింది. ఈ వయసులో ఇంత కష్టం తట్టుకుని నేను నిలబడగలిగానంటే ఒకటే కారణం. పుస్తకాలు చదవడం. చిన్నప్పటి నుంచీ కనిపించిన పుస్తకమల్లా చదివాను నేను. ఉద్యోగం వచ్చినప్పటినుంచీ ప్రతి నెలా జీతం రాగానే ముందు కొనేది పుస్తకాలే. మా ఇంట్లో ఐదారు బీరువాల పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవన్నీ ఒకళ్ళు చెప్పడం కన్నా, ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం బాగుంటుంది. మీరు పెద్దై ఉద్యోగాల్లో చేరాక, మీ సంపాదనలో కనీసం పది శాతం అంటే నూటికి పది రూపాయలు పుస్తకాల కోసం ఖర్చు పెట్టండి. ఇది మాత్రం మర్చిపోకండి..."

మాలో చాలామందికి పుస్తకాలంటే గౌరవం పెరిగింది. అవే లేకపొతే మా హెడ్మాస్టారు మళ్ళీ కనిపించే వారు కాదేమో అన్న ఆలోచనే కారణం. అప్పటికే అమ్మ పుణ్యమా అని పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన నాకు, ఆయన మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి. పెద్దయ్యాక తప్పకుండా మేష్టారు చెప్పినట్టుగా పుస్తకాలు కొనుక్కోవల్సిందే అని నాలో నేనే గట్టి నిర్ణయం తీసేసుకున్నాను. కా..నీ.. ఇవాల్టి రోజున వెనక్కి తిరిగి మేష్టారి మాటలు జ్ఞాపకం చేసుకుంటే సిగ్గు కలుగుతోంది. ఆయన చెప్పిన పది శాతం కాదు, కనీసం అందులో పదో వంతైన ఒక్క శాతం కూడా పుస్తకాల మీద వెచ్చించడం లేదు నేను. "ఇలా చేస్తున్నావేమిటి?" అని ఆయన నన్ను ప్రేమగా మందలిస్తున్నట్టుగా అనిపిస్తోంది అప్పుడప్పుడూ.. (ఈ టపా రాయడానికి పరోక్ష కారణమైన బ్లాగ్మిత్రులు వేణూశ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు)

19 వ్యాఖ్యలు:

 1. ఏవో సరదా జ్ఞాపకాల ఊయల ఊగిస్తారని చదవడం మొదలు పెడితే, ఎంత మరిచిపోలేని సంగతి ముద్ర వేసేసారు మా మనసులపై. మీ శ్రీ రామ మూర్తి మాష్టారి మాట మా దాకా తీసుకొచ్చారు. ధన్యవాదాలు. పుస్తకాలు కాలం చేసిన గాయాలకు మహత్తరమైన మందు. ఏదో ఒక డోసేజీలో అందరం వాడినదే. ఒప్పుకుని తీరాల్సిన నిజం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మనసు ఆర్ధ్రమైపోయింది.
  ఇంత గుండెను పిండే టపాలో కూడా నాకో ఆనందం మిగిలింది. నేను పుస్తకాలు కొనడం కోసమే నా గ్రాడ్యుయేషన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీయే, ఎమ్మే వాళ్లకి తెలుగు మాస్టర్నై నా ఆదాయాన్నంతా దాదాపు పుస్తకాల మీదే వెచ్చిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హ్మ్ ! మాటలు లేవండి మీ పోస్టు చదివాకా :(

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళిగారు, మీ సమీక్షల ద్వారా మీరు చదివిన మంచి పుస్తకాలను నలుగురికీ పరిచయం చేస్తూ వాళ్ళచేత కూడా చదివించే ప్రయత్ర్నం చేస్తున్నారు. మీ మాస్టారు భావాల్ని నలుగిరికీ పంచారు, ఇది కూడా మీరు ఆయనకిచ్చే గొప్ప గురుదక్షిణ అనుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నిన్న వచ్చాను. ఏమని వ్యాఖ్యానించాలో మాటలు రాలేదు.

  ఇప్పుడూ... మళ్ళీ చదివి స్పందన వ్రాద్దామంటే... ఇంకా మనసంతా బరువుగానే...!

  మీరు పంచుకున్న అనుభూతులు, అనుభవాల్లో ఇది ఎప్పటికీ గుర్తిండిపోతుంది... మనసులో వాన కథలా

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మా హెడ్మాస్టారు పుణ్యమూర్తుల శ్రీరామచంద్రమ్మూర్తి గారు గుర్తొచ్చారు

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @కొత్తావకాయ: తర్వాత నాక్కూడా చాలాసార్లే అనుభవంలోకి వచ్చిందండీ.. ఆయనకి మనసులోనే ఎన్ని థాంకులు చెప్పుకున్నానో.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: ఏదో తెలియని బాధండీ రాస్తున్నంతసేపూ.. ధన్యవాదాలు.
  @పక్కింటబ్బాయి: నిజమా!! అభినందనలండీ మీకు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @శ్రావ్య వట్టికూటి: స్పందనకి ధన్యవాదాలండీ..
  @హేమ బొబ్బు: చిన్న మాటలో ఎంత చక్కని భావం!! ధన్యవాదాలండీ..
  @శ్రీ: .........ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @గీతిక: స్పందనకి ధన్యవాదాలండీ..
  @లలిత: మా హెడ్మాస్టర్ గారి గురించి రాయల్సినవి ఇంకా చాలానే గుర్తొస్తున్నాయండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ముగించేసరికి మనసంతా బరువుగా అయిపొయింది. :-(

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @పద్మ: రాస్తున్నపుడు నా పరిస్థితీ అదేనండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఎందుకో ఈ పోస్ట్ చదవలేదు నేను. ఇప్పుడే చూస్తున్నాను. మీరంతా అదృష్టవంతులు. మీ మాస్టారు గురించి చదివించి మమ్మల్నీ ఇన్స్పైర్ చేశారు...

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ma mamagari peru srirama chandra murthy garu. He worked in many places in tg district as headmaster. He also lost his elder son..but not sure about his reading habits. any ways.good one.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @ప్రసూన: మా హెడ్మాస్టారు గారికి ఒక్క కొడుకేనండీ.. ఏకైక సంతానం.. ..ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. పుస్తకాన్ని మించిన నేస్తం లేదండీ - ముఖ్యంగా బాధలో - మనసుకి నెమ్మదినిస్తుంది - మీ హెడ్ మాస్టారికిలాగే :(

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @లలిత టీఎస్: అవునండీ.. తర్వాత్తర్వాత అనుభవానికొచ్చింది.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు