మంగళవారం, సెప్టెంబర్ 20, 2011

లేడి చంపిన పులి నెత్తురు

ఎమ్వీయస్ హరనాధ రావు పేరు వినగానే చాలామందికి ఓ సినీ సంభాషణల రచయిత గుర్తొస్తాడు. కానీ అంతకన్నా ముందు ఆయనొక కథకుడు. పదునైన కథలెన్నో రాసినవాడు. బహుశా, ఆ కథల్లో అలవోకగా పలికించిన నాటకీయత తర్వాతి కాలంలో సినిమా రచనని సులువుగా చేసేయడానికి దోహద పడిందేమో అనిపిస్తూ ఉంటుంది. హరనాథ రావు రాసిన 'లేడి చంపిన పులి నెత్తురు' ఆసాంతమూ ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతూ, ఓ మంచి కథని చదివిన అనుభూతితో పాటు కొన్ని ప్రశ్నలనూ పాఠకుల ముందుంచే కథ.

కథా స్థలం ఊరిచివర హరిజనవాడ. నాయిక ఆ వాడలో ఉండే అరుంధతి. కానైతే వాడంతా అరుంధతిని నాయికలా చూడదు. చెడిపోయిన దానిని చూసినట్టుగా చూస్తుంది. ఎందుకంటే అరుంధతి చెడిపోయింది. చెడిపోతూనే ఉంది. రోజూ సాయంత్రం అవ్వడం ఆలస్యం కొడుకు కోటేశు పూలమాల తెచ్చి స్వయంగా అలంకరిస్తాడు అరుంధతిని. దగ్గరుండి మరీ 'పెద్ద దొర' కొష్టానికి తీసుకెళతాడు. తెల్లారాక, తల్లిని తీసుకుని వాడకి తిరిగి వస్తాడు.

ఆ ఊళ్ళో గాలీ, నీరూ, దేవుడూ, సత్యం, ధర్మ, న్యాయం తప్ప మిగిలినవన్నీ పెద్ద దొరవే. అటువంటి పెద్ద దొరకి ఎదురు తిరిగిన వాడు దాసు, అరుంధతి భర్త. దొరకి వ్యతిరేకంగా తన వాళ్ళని కూడగట్టాలన్న దాసు ప్రయత్నం ఫలించలేదు. దొరతో దాసు మాటల యుద్ధం మాత్రం, కొంత కాలానికే కర్రల యుద్ధంగా మారింది. అదిగో, అప్పుడు గూడెం నుంచి మద్దతు దొరికింది దాసుకి. మొదటిసారిగా ఒక అడుగు వెనక్కి వేస్తాడు దొర. అదీ ఆ ఒక్కరోజే.

వారం తర్వాత ఊరి చివర ఓ శవం. నాలుగు రోజుల క్రితం కలెక్టరాఫీసుకి వెళ్ళిన దాసు ఇంకా తిరిగి రాలేదు. కుక్కలు ముఖం పీక్కు తినేసిన ఆ భయంకరమైన శవం ఎవరో అడుక్కునే వాడిదని రిపోర్టు తయారైపోయింది. అంతకు ముందు రోజు రాత్రి దాసు పెద్ద దొర బీరువా తాళాలు బద్దలు కొట్టి పారిపోయాడని మరో రిపోర్టు కూడా. పోలీస్ ఇన్స్పెక్టర్ పెద్ద దొరకి స్వయానా మేనల్లుడు మరి. దొరికిన శవం దాసుది కాదన్న రిపోర్టు మీద వేలిముద్ర వేసిన అరుంధతి ఆ తర్వాత కొద్ది రోజులకే దొరకి లొంగిపోయింది.

అరుంధతి చేసిన పనిని హరిజనవాడ హర్షించలేదు. సూటి పోటి మాటలో చిత్రవధ చేసింది ఆ తల్లీ కొడుకులని. ఆమెని ఆ పల్లెలో తిట్టని వాళ్ళంటూ ఉంటే నోరులేని దేవుడూ, నోరున్నా మాట్లాడలేని పసి పాపలు మాత్రమే. చప్పుడు కాకుండా రోదించిందే తప్ప తన పధ్ధతి మార్చుకోలేదు అరుంధతి. తల్లిని దగ్గరుండి ప్రతి రాత్రీ దొర కొష్టానికి తీసుకెడుతూనే ఉన్నాడు కోటేశు. అరుంధతి ఇంటికి నిప్పు పెట్టాలా, అక్కరలేదా అన్న ఆలోచనలో పడింది పల్లె.

ఉన్నట్టుండి ఓ రోజున పెద్ద దొర చచ్చిపోయాడు. దక్షిణంవైపు పొలం దగ్గర చంపబడి ఉన్నాడు. పక్కన రక్తసిక్తమైన గొడ్డలి. ఇన్స్పెక్టర్, ఇతర పెద్దలూ రాగానే కోటేశు చెప్పడం మొదలు పెట్టాడు: "రాత్తిరి మామూలుగా మాయమ్మను తీసుకుని కొట్టం కాడికి వత్తున్నానండి. దారిలోనే అయ్యగారు కనిపించినారు. ఆల్లిద్దరినీ జతసేసి ఎనక్కు తిరిగాను. పెద్ద దొర ఎర్రి కేక పెట్టినాడు. వెనక్కి తిరిగి సూశాను. మా అయ్య.. ఆ గొడ్డలి తీసుకుని పెద్ద దొర ఎదురుగా నిలబడి 'ఎర్రి నాకొడకా - నీ ఇనప్పెట్టె కాదురా నీ తల బద్దలు కొడతాను. నా పెళ్ళాన్ని సెడగొడతావురా' అని నెత్తిమీద గొడ్డలేసిండు...."

"బిడ్డకు తల్లి పాలు ఎలా ఇస్తుందో శాస్త్ర ప్రకారం చెప్పే డాక్టరు వల్ల బిడ్డకు కడుపు నిండదు. పాలిచ్చే తల్లికావాలి. సమస్యలకు ప్రణాళికలు, ఉపన్యాసాలు కాదు కావాల్సింది. పరిష్కారాలను అమలుపరిచే చిత్తశుద్ధి, నైతిక బలం కావాలి," అంటారు హరనాథ రావు. 1977 లో తొలిసారి ప్రచురితమైన ఈ కత ఆధారంగానే రాజేంద్రప్రసాద్-యమునలతో 'ఎర్రమందారం' సినిమా తీశారు.

"ఈ కథలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉంది. కథనంలో ఆసక్తిని రేకెత్తించే సస్పెన్స్ ఉంది. వాక్య నిర్మాణంలో పడునుంది. రచయిత వ్యాఖ్యానంలో ధ్వని ఉంది. ముగింపులో చైతన్య స్పోరకమైన సూచన ఉంది. ఇంతకంటే ఓ మంచి కథకేం కావాలి?" అని అడుగుతారు దర్శక, రచయిత వంశీ, తన 'వంశీకి నచ్చిన కథలు' సంకలనంలో ఈ కథని చేర్చడానికి కారణాలు చెబుతూ. కా..నీ, వ్యక్తులని చంపడం ద్వారా మాత్రమే వ్యవస్థలో మార్పు సాధ్య పడుతుందా???

3 వ్యాఖ్యలు:

 1. ఈ కథ నేను చాలా సార్లు చదివి ఉంటాను. కథ వెలువడినాక ముప్పయి నాలుగేళ్ళ తర్వాత కూడా ఇదే పరిష్కారమని..అనిపించకపోతే మనం చాలా నాగరికమైన సమాజంలో,భాద్యత గల పౌరులుగా చట్టాన్నిగౌరవించి,న్యాయాన్ని పూజించే వ్యవస్థలొకి ప్రయాణం చేసామని అర్ధం. అంతటి అదౄష్టం కూడానా? వంశీ గారి సుతిమెత్తని మనసు ప్రశ్నేమో కదండీ! మురళీ గారు అంత కన్న మంచి పరిష్కారం దొరకదు కదండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కథ చదువుతూ ఇది ఎర్ర మందారం సినిమాగా వచ్చింది అని చెప్పాలనుకున్నాను . నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసి అది కాస్తా మీరే చెప్పేసారు . సినిమా కూడా బాగా తీసారండి. సినిమా చూస్తూ నేను ఏడ్చినట్టు గుర్తు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @వనజ వనమాలి: చివరి ప్రశ్న వంశీది కాదండీ, నాది.. నిజమే మీరు చెప్పింది.. ధన్యవాదాలు.
  @లలిత: అవునండీ.. సినిమా బాగా వచ్చింది.. యమున ఆపాత్ర ఒప్పించగలుగుతుంది అనుకోలేదు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు