ఆదివారం, సెప్టెంబర్ 04, 2011

పచ్చబొట్టు

ఎడమ మోచేయి మొదలు మణికట్టు వరకూ ఉండే లోపలి భాగం పచ్చబొట్టు పొడిపించుకోడానికి అనువైన ప్రదేశంగా చలామణీ అయ్యింది చాలాకాలం పాటు. పేర్లూ, బొమ్మలూ, గుర్తులూ ఒకటేమిటి? కాదేదీ పచ్చబొట్టుకి అనర్హం. కొంతమంది వాళ్ళ పేరు రాయించుకుంటే, మరికొందరు తల్లిపేరో, తండ్రి పేరో, ఇష్టమైన వాళ్ళ పేరో లేక ఇష్టదైవం పేరో పచ్చబొట్టుగా పొడిపించుకునే వాళ్ళు. బొమ్మల్లో ఎక్కువగా దేవుళ్ళవీ, అందులోనూ నాగ దేవతవి ఎక్కువగా కనిపించేవి.

వేసంకాలం మధ్యాహ్నాల్లో వీధుల్లో తిరిగే రకరకాల వాళ్ళలో 'పచ్చబొట్లేస్తాం..' అని అరుస్తూ తిరిగేవాళ్ళు కూడా అడపాదడపా ఊళ్లోకి వచ్చేవాళ్ళు. నన్ను కనీసం ఆటలకి కూడా వెళ్ళనివ్వకుండా బంధించి వాళ్ళ మటుక్కి వాళ్ళు హాయిగా నిద్రపోయే ఇంట్లో వాళ్ళమీద కోపం ఏస్థాయిలో ఉండేదంటే (అప్పుడూ ఇప్పుడూ కూడా మధ్యాహ్నం నిద్ర అలవాటు లేదు నాకు) ఆ పచ్చబొట్టు వాళ్ళని పిలిచి చేతిమీద ఏదో ఒక పచ్చబొట్టు పొడిపించేసు కోవాలనిపించేది. ఊరికే ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశమే తప్ప పచ్చబొట్టుగా ఏది రాయించుకోవాలన్న విషయంలో ఇదమిద్దంగా ఓ అభిప్రాయం లేదు.

చిన్నప్పటి నుంచీ చాలామంది చేతులకి పచ్చబొట్లు చూడడమే కాదు, పచ్చబొట్ల గురించి చాలానే విన్నాను కూడా. మరీ ముఖ్యంగా పచ్చబొట్టుని సూది కాల్చి వేస్తారనీ, అది వేసినప్పుడు చెయ్యి మంట పెట్టడమే కాకుండా, ఒకటి రెండు రోజులు జ్వరం కూడా వస్తుందనీ, ఒకసారి పచ్చబొట్టు వేయించుకుంటే దాన్నింక చెరపడం కుదరదనీ... ఇలా కావలసినవీ, అక్కర్లేనివీ బోల్డన్ని విషయాలు. పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నారు? అని చాలామందినే అడిగాను. కొందరు 'సరదాకి' అని చెప్పారు, ఇంకొందరు ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదు.

సినిమాల్లో చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు పెద్దయ్యాక వాళ్ళింట్లో వాళ్ళని కలుసుకోడానికి చిన్నప్పుడు ఆనందంగా పాడుకున్న పాటతో పాటు, ఇదిగో ఈ పచ్చబొట్టు కూడా అనేకానేక సందర్భాల్లో ఉపయోగపడింది. ఈ విషయంలో పుట్టుమచ్చలు కూడా చాలా రోజుల పాటు ప్రముఖమైన పాత్రనే పోషించాయి. అలాగే హీరోగారు హీరోయిన్ పేరుని పచ్చబొట్టు పొడిపించుకోవడం, తర్వాత కథ మలుపు తిరగడంలాంటివీ సినిమాల్లో వచ్చేశాయ్. పచ్చబొట్లు పొడిపించుకునే విషయంలో హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్లు అంతగా రిస్కులు తీసుకోలేదనే చెప్పాలి.

సినిమాల్లోనే కాకుండా, బయట ప్రపంచంలోకూడా ప్రేమకీ పచ్చబొట్టుకీ అవినాభావ సంబంధం ఉందని కొందరు మిత్రులని చూసినప్పుడు అర్ధమయ్యింది. వాళ్ళు ప్రేమించిన అమ్మాయి పేరుని నేరుగా కొందరు ధైర్యశాలులూ, వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే కోడ్ భాషలో కొందరు జాగ్రత్తపరులూ, ఇష్టదైవానిదో ఇంట్లోవాళ్ళదో పేరు కూడా కలిసొచ్చేసే విధంగా కొందరు తెలివైనవాళ్ళూ పొడిపించుకున్న పచ్చబొట్లని చూసినప్పుడు. రాను రాను జబ్బలూ, ఛాతీ కూడా పచ్చబొట్టుకి అనువైన ప్రదేశాలుగా మారిపోయాయ్.

అన్నిచోట్లా మార్పులు వచ్చేసినట్టే పచ్చబొట్లలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చేశాయ్. టాటూ అనేది ఇప్పుడో ఫ్యాషన్ స్టేట్మెంట్. ఒక్క చెయ్యనేముందీ, అంగుళం ఖాళీ లేకుండా ఒంటినిండా టాటూలు వేయించేసుకుంటున్నారు టీనేజీ పిల్లలు. ఇప్పుడిప్పుడు టాటూ వేయించేసుకోవడం ఇదివరకంతా కష్టం కాదు. ఏమాత్రం నొప్పిలేని వ్యవహారం. అంతేనా? ఇప్పటి పచ్చబొట్టు శాశ్వితం కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేకప్ తుడుచుకున్నంత సులువుగా తుడిచేసుకోవచ్చు.

ఏదో నలభయ్యేళ్ళ క్రితం కాబట్టి నాగేసర్రావూ, వాణిశ్రీ "పచ్చబొట్టూ చెరిగిపోదూలే.. పడుచు జంటా చెదిరీ పోదూలే..." అని పాడేసుకున్నారు. ఇప్పుడు పచ్చబొట్లు చెరిగిపోతున్నాయి.. పడుచు జంటలుకూడా ఎవరికెవరన్నది కూడా ఇట్టిట్టే మారిపోతున్నాయి. సినిమాల్లోనే తీసుకున్నా, హీరో, హీరోయిన్నూ చివర్రీలులోనన్నా ఒకరితో ఒకరు ప్రేమలో పడతారో పడరో దర్శకుడిక్కూడా తెలియడం లేదు. సినిమాలు సమాజాన్ని ప్రతిబింబించడమో లేదా సమాజం సినిమాలని అనుకరించడమో జరుగుతోన్నట్టేనా? పచ్చబొట్లలో వచ్చినట్టే ప్రేమలోనూ మార్పులు వచ్చేస్తున్నాయా?

7 వ్యాఖ్యలు:

 1. మీరు రాయని/రాయలేని టాపిక్ లేదనిపిస్తుంది.. చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగుంది..మురళీ గారు. పైకి వెళ్ళాక భూలోకం నుండి ఏం తెచ్చావు అని అడిగితే "పచ్చ" తెచ్చాను అంటే గొప్పగా స్వర్గలోక ప్రవేశముంటుందని..చెపితే..నిజమనుకుని పచ్చవేయించుకునే నా స్నేహితులు గుర్తుకు వచ్చారు.నా పేరు ని పచ్చ వేయించుకున్న స్నేహం గుర్తుకు తెప్పించారు. పచ్చబొట్టు చెరిరిగిపోదులే .. ఆ చెలిమి విలువకే చిగిర్చె నా మనసు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మురళి గారు, మీరు encyclopedia ని మిక్సీలో వేసి జూసు తీసి తాగేసారా? అసలు ఇన్ని విషయాల్లో పరిజ్ఞానం ఎలా ఉంటుందండి మీకు?
  మీరన్నట్టు ప్రేమ-పచ్చబొట్టు అవినాభావ సంబంధం కాలానుగుణంగానే ఉన్నట్టుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బాగుంది!పచ్చబొట్టు కోసం పెద్ద అమ్మమ్మను పీడించి డబ్బులూ, అరిశెలూ లంచంగా కొట్టేయడం గుర్తు చేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పచ్చబొట్ల కబుర్లు బాగున్నాయ్. మీరు స్పృశించని విషయం ఉందా? ఇంత వైవిధ్యం మీకే చెల్లు. :)

  A man without tattoo is invisible to the God. - Iban proverb.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @కృష్ణప్రియ: చాలా ఉన్నాయండీ.. ఉదాహరణకి స్పోర్ట్స్ గురించి నేను రాయలేను :( ..ధన్యవాదాలు.
  @వనజ వనమాలి: మీ పేరు వేయించుకున్నారా స్నేహితులు? అంతటి మిత్రులు దొరికిన మీరెంత అదృష్టవంతులండీ.. ధన్యవాదాలు.
  @శ్రీ: ఏమీ లేదండీ.. ఏదో గుర్తొచ్చినవి, రాయాలనిపించినవి రాసుకుంటూ ఉండడం.. అంతే.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @సునీత: మీకూ ఉన్నాయన్న మాట పచ్చబొట్టు జ్ఞాపకాలు.. చక్కగా పంచుకోవచ్చు కదండీ.. మీ బాల్యం సిరీస్ మధ్యలోనే ఆపేశారు మీరు :( ..ధన్యవాదాలు.
  @కొత్తావకాయ: ప్రోవెర్బ్ చాలా బాగుందండీ.. నేను స్పృశించనివీ చాలానే ఉన్నాయ్!! ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు