శనివారం, ఏప్రిల్ 09, 2011

జయప్రదం

ఈమధ్య కాలంలో నేను దాదాపు క్రమం తప్పకుండా చూసిన టీవీ కార్యక్రమాలలో ఒకటి గతంలో లోకల్ టీవీలో ప్రసారమై ఈ మధ్య వరకూ మాటీవీలో ప్రసారమైన 'జయప్రదం.' వెండి తెర మీద సౌందర్యానికి చిరునామాగా నిలబడ్డ జయప్రద ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత కావడమే ఇందుకు కారణం. అసలు జయప్రద అనగానే ఓ సరితమాధవి కళ్ళముందు మెదులుతారు. తనతో తెరని పంచుకున్న తారలనూ, అవకాశాలిచ్చిన సాంకేతిక నిపుణులని మాత్రమే కాక నేటి నటులు, నట వారసులు, సాంకేతిక నిపుణులనూ ఈ వేదిక ద్వారా ఇంటర్వ్యూ చేశారు జయప్రద.

ఇటు నటనలోనూ, అటు రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసిన జయప్రద, తొలిసారిగా బుల్లితెర మీద వ్యాఖ్యాత పాత్ర పోషించడం ఈ 'జయప్రదం' ప్రత్యేకత. ఇంటర్వ్యూలు చేయడం మంరీ అంత సులభమేమీ కాదని జయప్రదకి ఈ సరికి అర్ధమై ఉండాలి. కొందరు అతిధులతో ఆమె ఎంత చక్కగా మాట్లాడారో, మరికొందరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంతగా తడబడ్డ సంగతి ప్రేక్షకులకి అర్ధమైపోయింది. నావరకు నాకు "జయప్రదది చక్కటి కాన్వెంట్ ఇంగ్లీష్" అన్న భ్రమలు ప్రారంభ ఎపిసోడ్స్ చూడగానే తొలగిపోయాయి.

నిజానికి ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఆమె తెలుగూ అంతంత మాత్రమే అనిపించింది కొన్ని ప్రశ్నలని ఆమె 'సంధించిన' తీరు గమనించినప్పుడు. 'ఆయొక్క' 'మీయొక్క' లాంటి వాడుకలో లేని పదాలని వెతికి పట్టుకొచ్చి, ఒకటికి పదిసార్లు వాడి విసుగు రప్పించింది. అయిన దానికీ, కానిదానికీ పగలబడి నవ్వడం మరో మైనస్. సమయమూ, సందర్భమూ లేకుండా నవ్విన ఆ మాయల ఫకీర్ నవ్వు చూస్తే తనకి తాను కితకితలు పెట్టుకుని నవ్వుతున్నట్టుగా అనిపించింది. అయితే, వచ్చిన అతిధులకి అనుగుణంగా ఆమె ప్రవర్తిస్తున్నట్టుగా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అర్ధమయ్యింది.

జయప్రద అస్సలు శ్రద్ధ తీసుకొని మరో అంశం ఆహార్యం. కొన్ని ఎపిసోడ్లలో చాలా కృతకంగా, అసలు ఈమె జయప్రదేనా? అనిపించేలా ఉంది ఆమె మేకప్, వస్త్రధారణ. ముఖ్యంగా రాధిక ఎపిసోడ్లో జయప్రద మేకప్ చూసి కనీసం కొందరు చిన్న పిల్లలైనా జడుసుకుని ఉంటారని నా అంచనా. యువ నటులని ఆమె ఇంటర్వ్యూ చేసిన దాదాపు అన్ని ఎపిసోడ్స్ లోనూ ఆమె అలంకరణ కృతకంగానే ఉంది, వయసుని దాచుకునే ప్రయత్నం విఫలం కావడం వల్ల కావొచ్చు. అయితే కే. విశ్వనాధ్, అనుష్క, జయసుధల ఎపిసోడ్లలో మాత్రం జయప్రద 'స్టన్నింగ్' అంతే!

అసలు ఈ షో జయప్రద మాత్రమే ఎందుకు చేయాలి? ఎందుకంటే, అతిదుల్లో చాలామందితో ఆమికి సుదీర్ఘ పరిచయం ఉంది కాబట్టి. ఏ ఇతర వ్యాఖ్యాత కన్నా ఆమెకి రాపో ఎక్కువ కాబట్టి సహజంగానే కార్యక్రమం మరింతగా రక్తి కట్టించడానికి అవకాశం ఉంది. అయితే, వాస్తవంలో జరిగింది వేరు. కమల్ హాసన్ ని ఇంటర్వ్యూనే తీసుకుంటే వాళ్ళిద్దరూ బొత్తిగా అపరిచితుల్లాగా అనిపించారు. జయసుధతో కూడా మొదట చాలా మొహమాటంగా మాట్లాడి, రాను రాను ఆమె చూపిన చనువు వల్ల జయప్రద సహజంగా ప్రవర్తించడం చూసేవాళ్ల దృష్టిని దాటిపోలేదు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో చేసిన ఎపిసోడ్ సరదాగా సాగుతూనే, సీరియస్ విషయాలనీ చర్చించగా, చిరంజీవి ఎపిసోడ్ హాస్యభరితంగా సాగింది. విశ్వనాధ్ ఎపిసోడ్ కొంచం గంభీరంగానూ, ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ సీరియస్ గానూ సాగాయి. కృష్ణంరాజు షోలో ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అతిధుల సంబంధీకులు, అభిమానులు మాట్లాడిన వీడియోలు చూపించడం, అతిధుల బయోగ్రఫీని క్లుప్తంగా వివరించడం ఆకట్టుకున్నాయి. మొత్తం మీద నటీనటులు తెర మీద అలా కనిపించడం వెనుక, తెరవెనుక సాంకేతిక నిపుణుల కృషి ఎంత ఉంటుందో మరింత బాగా అర్ధమయ్యేలా చేసిన కార్యక్రమం ఈ 'జయప్రదం.'

14 కామెంట్‌లు:

  1. నేనూ మొదట్లో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూసేదాన్ని..ఈ మధ్య ఎప్పుడో తప్ప చూడటంలేదు. జయప్రద నవ్వుని అసలు భరించలేకపోతున్నాం. ఒక్కోసారి ప్రశ్నల్లో కూడా కంటిన్యూటి ఉండదు. ఏదేమయినా ఆమెకున్న పరిచయాలని అంతగా ఉపయోగించుకోలేకపోతుందని నా అభిప్రాయం.

    విశ్వనాథ్ గారితో చేసినప్పుడు నా బజ్జులో ఓ నాలుగు మాటలు వ్రాసా..అవే మళ్లీ ఇక్కడ:)

    జయప్రదం కార్యక్రమాన్ని సెలెబ్రిటీలతో చెయ్యటం మూలాన జయప్రదని భరిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఈ మధ్య జయప్రదని అసలు చూడబుద్ది కావటం లేదు..తనకి నప్పని మేకప్పు, కేశాలంకరణ...అసలు ఈమె జయప్రదేనా అని ఆమె అభిమానులు ఒకింత నిరాశపడే ఆహార్యం. కానీ రాత్రి మరి ఎదురుగా ఉన్నది విశ్వనాథ్ అవటం మూలానేమో కాస్త మునుపటి జయప్రదని చూడకలిగాం. సామాన్యంగా గంభీరంగా ఉండే విశ్వనాథ్ గారు బాగానే నవ్వించారు.

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటి టాక్ షో లు నిర్వహించాలంటే గ్లామర్ మాత్రమే సరిపోదు.
    వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి కావాలి.
    చాలామందితో ఆమె తగిన స్థాయిలో మాట్లాడలేకపోయింది.
    ముఖ్యంగా రాం గోపాల్ వర్మతో అస్సలు కుదరలేదు.

    రిప్లయితొలగించండి
  3. ఏవో ఒకటి రెండు చూసి విసుగొచ్చి , ఆ తరువాతా ఆ ప్రోగ్రాం జోలికి పోలేదు . ఐతే కొంచం పర్వాలేదన్నమాట :)

    రిప్లయితొలగించండి
  4. నాకు చాలా ఇష్టమైన జయప్రద ఈ ప్రోగ్రాం లో చాలా సార్లే చూడాలనిపించటంలేదు. మీ రిచ్చిన వివరణ చూస్తుంటే కొన్ని సార్లు నిజమే అనిపిస్తోంది.
    మురళి గారు మీకోసం శుభం:)

    రిప్లయితొలగించండి
  5. appropriate and accurate review.
    I agree with all your observations.
    కానీ ఒకటి వొప్పుకోవాలి. రాంచరణ్, జూ ఎంటీయార్ దగ్గర్నించీ దాసరి, కె. విశ్వనాథ్ వరకూ అందరూ చాలా ఓపెన్‌గా హాయిగా మాట్లాడారు అనిపించింది. జయప్రద ప్రశ్నలు అడిగిన తీరు గొప్పగా ఉండడం వల్ల కాదు. కె. విశ్వనాథ్ వంటి వారికి ఆమె యెడల ఒక వాత్సల్యం, చిరు, బాలు, కృష్ణంరాజు వంటి వారికి ఒక ఆత్మీయత ఉండొచ్చు. కానీ ప్రకాష్ రాజ్ మొదలుకొని తరవాతి తరానికి ఆమెతో అటువంటి ఆత్మీయత ఉండే అవకాశం లేదనుకుంటున్నా. మొత్తానికి ఆమెలోని ఏదో "ఛార్మ్" వారిని అలా హాయిగా మాట్లాడేలా చేసిందని అనుకోవాలి. నేను ఎప్పుడూ సినీతారల జీవితాల విశేషాల్ని పట్టించుకున్న వాణ్ణి కాదు. అందుకని, వాళ్ళకి వాళ్ళు తమ సినీప్రస్థానాల్లో ఏవేవి ముఖ్య మజిలీలు అనుకున్నారో వినడం సంతోషం కలిగించింది.

    రిప్లయితొలగించండి
  6. నిజమేనండీ, సందర్భం లేకుండా ఆమె నవ్వుతుంటే విసుగు పుడుతుంది. కానీ తెలుగుని మరీ ఖూనీ చేసేవాళ్లతో పోలిస్తే ఫర్వాలేదులెండి, క్షమించెయ్యొచ్చు.

    రిప్లయితొలగించండి
  7. ఈ మధ్య నేను ఒకింత ఆసక్తితో చూసిన ప్రోగ్రాములలో ఇదొకటి. మొదట్లో చాలా బాగున్నట్టనిపించినా మొత్తానికి నిరాశే మిగిల్చింది.
    నాకు బాగా చిరాకనిపించిన విషయాలు.
    1 . సందర్భ శ్రుతి ఏమాత్రం లేని ఆమె నవ్వు .
    2 కార్యక్రమం మొదట్లో ఆయా వ్యక్తుల్ని పరిచయం చేస్తూ వీడియో క్లిప్పింగులని చూపిస్తున్నప్పుడు వాడిన భాష పరమ కృతకంగా ఉంటుంది. వాళ్ళని ఆకాశాని కేత్తేయడమే పరమావధిగా, అర్ధంలేని ఉపమానాలతో ఉండి విసుగు తెప్పిస్తుంది.
    ౩. చివరిది, అసలు అన్నిటికంటే దారుణమైనది. ఒక ఏంకరుగా ఎదురుగా ఉన్నవారు మాట్లాడుతున్నప్పుడు తెలివిగా వారిని ఇంకా ఎక్కువసేపు మాట్లాడించాలి. అలాంటిది వాళ్ళు మాట్లాడేది పూర్తికాకుండానే ,మధ్యలోనే దూరి ఇంకేవో సందర్భంలేని ప్రశ్నలు వేయటం. నేను చూసిన చాలా ఎపిసోడ్లలో అవతలివాళ్ళు ప్రేక్షకులకి ఆసక్తి కలిగించే విషయమేదో చెప్తున్నప్పుడే ఆమె ఇలా చేయడం జరిగింది.

    రిప్లయితొలగించండి
  8. మీకు నచ్చని విషయం కూడా ఎంత సున్నితం ఆ చెప్తారో :0

    రిప్లయితొలగించండి
  9. నాకైతే ఆవిడ ప్రతి ఎపిసోడ్ కూడా ఎందుకు ఒప్పుకున్నానో ఈ కార్యక్రమం చేయడానికి అని బాధపడుతూ, ఇబ్బందిపడుతూ ముక్కుతూ, మూలుగుతూ బండి లాగించిందనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు. చాలా వివరంగా,ఓపిగ్గా విశ్లేషించారు మీరు. మీకు నచ్చిన కథానాయిక కదా. :)

    రిప్లయితొలగించండి
  10. @సిరిసిరిమువ్వ: నేను కొంచం ఒపిగ్గానే చూశానండీ :)) మీరన్నది నిజమే.. ఆమె ఇంకా చాలా బాగా ప్రోగ్రాం చేసి ఉండొచ్చు.. ధన్యవాదాలు.
    @బోనగిరి: అవునండీ.. బాగా పేలవంగా ఉన్న షో లలో వర్మతో చేసింది ఒకటి.. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: పర్లేదండీ.. కానీ ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @జయ: అయితే మీరు రెగ్యులర్ గా చూడలేదా?!! అన్నట్టు శుభం పలికేశానండీ.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: "మొత్తానికి ఆమెలోని ఏదో "ఛార్మ్" వారిని అలా హాయిగా మాట్లాడేలా చేసిందని అనుకోవాలి." నేనూ చాలాసార్లే అనుకున్నానండీ ఈ మాట.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @బాలు: అర్ధమయ్యిందండీ :))) ఒప్పుకుంటున్నా.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: అబ్బ.. చాలారోజుల తర్వాత ఇంత వివరంగా.... మొదటి పాయింట్ తో వంద శాతం ఏకీభవిస్తున్నా.. రెండో పాయింట్లో గొంతు ఆవిడది కాదు.. అయితే అతిధులని బాగా పొగడడం అన్న 'సంప్రదాయం' పర్లేదు కాబట్టి మనమే సద్దుకోవాలేమోనండీ.. ఇంకా మూడోది, నిజంగా నిజం... చాలా అంటే చాలాసార్లే కోపం వచ్చేసిందండీ జయప్రద మీద.. తను అడగదు సరి కదా, చెప్పనివ్వక పోవడం... ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @శ్రావ్య వట్టికూటి: :)) ...ధన్యవాదాలండీ..
    @శిశిర: అవునండీ.. కానీ ఆ నచ్చడం వెనుక ఎందరి కృషి ఉందో ఈ ప్రోగ్రాం చూశాక బాగా అర్ధమయ్యింది :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి