గురువారం, ఏప్రిల్ 07, 2011

అలా మొదలైంది

"చాలా ఆలస్యమైంది.." సినిమా చూడడం పూర్తి చేసి థియేటర్ నుంచి బయటికి వస్తూ నాలోనేను అనుకున్న మాట ఇది. ఓ కొత్త దర్శకురాలు తీసిన చిన్న సినిమా విడుదలై, విజయవంతంగా ప్రదర్శితమవుతున్నా ఇన్నాళ్ళ వరకూ చూడడం వీలు పడలేదు నాకు. దాదాపుగా నా మిత్రులందరూ సినిమాని చూడడం, బాగుందని చెప్పడం జరిగిపోయింది. సినిమా చూశాక నాక్కలిగిన అభిప్రాయం కూడా ఇదే.

మిత్రులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఒక ఫీల్ గుడ్ సినిమా చూడడానికి సిద్ధమై థియేటర్ కి వెళ్ళడం వల్ల, ప్రారంభ సన్నివేశం కొద్దిగా కన్ఫ్యూజ్ చేసింది నన్ను. ఓ కిడ్నాప్ తో కథ మొదలయ్యింది. నాయికా నాయకులు నిత్య (నిత్య మీనన్) గౌతం (నాని) లు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని, ఒకరిమీద ఒకరికి ఎలాంటి అభిప్రాయమూ ఏర్పడక ముందే విడిపోయి, అనుకోకుండా మళ్ళీ కలుసుకుంటూ, విడిపోతూ, అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ అప్పడప్పుడూ వాటిని మార్చుకుంటూ చివరికి ఏం చేశారన్నదే కథ.

నిజానికి ఈ సినిమాకి కథ కన్నా కథనమే ప్రాణం పోసింది. మామూలు కథని వైవిధ్య భరితంగా చెప్పడానికి కొత్త దర్శకురాలు నందినీరెడ్డి నమ్ముకున్నది స్క్రీన్ ప్లే ని. స్క్రీన్ ప్లే ని శ్రద్ధగా రాసుకుంటే మామూలుకథతో సినిమా తీసినా ప్రేక్షకులని మెప్పించవచ్చు అనడానికి ఉదాహరణ ఈ సినిమా. ఎందుకంటే సినిమా చూడడం పూర్తయ్యాక కథ ఏమిటి? అనుకున్నప్పుడు "ఇందులో కొత్త ఏముంది?" అనిపించక మానదు మరి.

అలాగే సినిమా అంతా కనిపించే అర్బన్ పోకడలు ఇది మల్టిప్లెక్స్ సినిమా అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉంటాయి. సంభాషణల్లో తెలుగు కన్నా ఇంగ్లీషే ఎక్కువగా వినిపించింది. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా హీరోయిన్ అరిచినట్టుగా డైలాగులు చెప్పడం ఎందుకో అర్ధం కాలేదు. బహుశా దానిని 'బబ్లీగా ఉండడం' అనుకోవాలేమో. గే కామెడీ ని అపహాస్యానికి కాకుండా హాస్యానికి వాడుకోవడాన్ని అభినందించాలి.

హాస్యం కోసం హాస్యం అన్నట్టుగా కాకుండా హాస్య సన్నివేశాల ద్వారా సందేశం ఇవ్వడానికీ ప్రయత్నించారు దర్శకురాలు. మొబైల్ ఫోన్లు విపరీతంగా వాడడాన్ని గురించి, మీడియా అతి గురించీ ఇంకా కుటుంబ బంధాల గురించీ బరువైన విషయాలని హత్తుకునేలా చెప్పడానికి హాస్యాన్ని వాడుకోవడంలో సఫలీకృతులయ్యారు నందిని. పాటలు మొదటిసారి విన్నది థియేటర్లోనే. సంగీతం మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనిపించింది.

నటీనటుల్లో మొదట ప్రస్తావించాల్సింది నిత్య గురించే. తొలి సినిమా అయినా చక్కగా చేసింది. ఇప్పటి సినిమాలతో పోలిస్తే కొద్దో గొప్పో నటించడానికి అవకాశం ఉన్న పాత్ర కావడం ఆమెకి కలిసొచ్చింది. మొదట చెప్పినట్టుగా డబ్బింగ్ మరికొంచం జాగ్రత్తగా చేయాల్సింది. నానికి వైవిధ్య భరితమైన పాత్రలు దొరుకుతున్నాయి. ఇందులో అతను టీవీ ఛానల్ రిపోర్టరా, కెమేరమేనా లేక దర్శకుడా అన్నది అర్ధం కాలేదు. చాలా కాలానికి రోహిణి కనిపించింది, తల్లిపాత్రలో. ఇప్పటి సినిమాల తల్లిపాత్రకి అచ్చమైన ప్రతిరూపం ఆమె పోషించిన రేవతి పాత్ర.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జాన్ గా నటించిన ఆశిష్ విద్యార్ధి గురించి. చాన్నాళ్ళకి ఓ వైవిధ్యభరితమైన పాత్ర దొరికింది ఇతనికి. చాలా బాగా చేశాడు కూడా. జాన్ పాత్రకి ఆశిష్ ని ఎంచుకోవడం కాస్టింగ్ పరంగా ఓ తెలివైన నిర్ణయం. ఐశ్వర్య రాయ్ కి నకలుగా చెప్పుకునే స్నేహ ఉల్లాల్ ఓ పాట నాలుగు సీన్ల అతిధి పాత్రలో కనిపించింది. ముగింపు సన్నివేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రమేశ్ నటన గుర్తుండిపోతుంది. మంచి సినిమాని ఇచ్చిన నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకురాలు నందినిరెడ్డి లకి అభినందనలు. మొత్తం మీద నందిని నుంచి మరిన్ని మంచి సినిమాలకోసం ఎదురు చూడొచ్చన్న ఆశ మొదలైంది.

10 కామెంట్‌లు:

  1. నిజం గా మంచి సినిమా అండీ.. పాటలు కూడా దాదాపు అన్నీ బావుంటాయి.. మరో సారి విని చూడండీ. ముఖ్యంగా నిత్యామీనన్ పాడిన రెండు పాటలూ సూపరు. :) :)

    రిప్లయితొలగించండి
  2. హమ్మయ్య, ఈ సంవత్సరం కనీసం ఓ తెలుగు సినిమా పర్లేదన్నమాట. ఈ అమ్మాయి మొన్నేదో టీవీ షోలో వచ్చింది. క్యూట్‌గా ఉంది. పాటకూడా బాగా పాడింది.

    రిప్లయితొలగించండి
  3. ఆశిష్ విద్యార్ధిని ఇలాంటి పాత్రలకి పరిచయం చేసింది పవన్ గుడుంబా శంకర్లో, అందులో ఇంకా భలే చేస్తాడు. కాని అలా మొదలైంది మాత్రం కెవ్.. చాలా రోజుల తర్వాత ఓ మాంచి సినేమా చిన్న బడ్జెట్ లో :). నిత్య మీనన్ మళయాల కుట్టి. తెలుగులో మొదటి సినేమా అంతే.

    రిప్లయితొలగించండి
  4. అవునండి. ఈ సినిమా చాలా బాగుంది. శిశిర చెప్పినప్పుడొకసారి, అనుకోకుండా మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసాను. రెండోసారి చూసినా నాకు బోర్ అనిపించలేదు. వెరీ ఈజీ గోయింగ్ మూవీ. నిత్యా, నిత్య పాడిన పాటలు, తన హస్కీ వాయిస్ నాకు చాలా నచ్చింది. దర్శకత్వం స్త్రీ కదా:) అందుకే బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. heroine achhu maa ammaaila vundani anthaa antunte yenthavaraku nijama ani chudataaniki monnaa madya hyd vellinapudu cinima chusanandee:) .cinima naaku nachhindi ee madyakaalaam lo chusina o manchi cinima..asalu bore kottaledu

    రిప్లయితొలగించండి
  6. @వేణూరాం: నిజమేనండీ.. వినగా వినగా బాగా అనిపిస్తున్నాయి.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: దాదాపు అన్ని తెలుగు చానళ్ళనీ చుట్టేసినట్టు ఉందండీ :-) ..ధన్యవాదాలు.
    @గిరీష్: మల్లూ అని అర్ధమయ్యిందండీ:-) :-) ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. @జయ: 'దర్శకత్వం స్త్రీ కదా' ..వింటున్నాం..వింటున్నామండీ :-) ..ధన్యవాదాలు.
    @చిన్ని: నాకుమాత్రం కెరీర్ తొలినాళ్లలో మీనా గుర్తొచ్చిందండీ కొన్ని ఫ్రేమ్స్ లో నిత్యని చూసినప్పుడు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. నేనూ చూశా.. నేనూ రాశా. :) సినిమా బాగుందండి.
    జయగారు,
    రెండవసారి కూడా చూసేసారా? చూశారా! దర్శకురాలు ఎన్నిసార్లు సినిమా చూసేలా చేస్తున్నారో. :)

    రిప్లయితొలగించండి
  9. @శిశిర: ఇప్పుడే చదివానండీ మీ టపా.. సినిమా గురించి కన్నా ప్రయాణాన్ని గురించి కొంచం ఎక్కువగా రాసినట్టున్నారు!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. అవునండి. నేను సినిమా చూసిన అనుభవం గురించి రాసాను. సినిమా గురించి కాదు. :)

    రిప్లయితొలగించండి