శుక్రవారం, ఏప్రిల్ 22, 2011

కథలగురించి మళ్ళీ..

హమ్మయ్య.. చాలారోజుల తర్వాత బ్లాగుల్లో తెలుగు కథల గురించి చర్చ జరుగుతోంది. అప్పుడెప్పుడో కథల నాణ్యత గురించి ఇక్కడే నా గోడు వెళ్ళబోసుకున్నాను. ఇప్పుడు మన 'తెలు-గోడు' అబ్రకదబ్ర గారు గడిచిన ఇవరయ్యేళ్ళలో వచ్చిన రెండువందల యాభై కథలు చదివి, ఆపై తన గోడుని మనతో పంచుకున్నారు. ఇప్పుడొస్తున్న కథల్లో గుర్తు పెట్టుకోగలిగేవీ, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేవీ అత్యంత అరుదన్నది నిర్వివాదం. మరి, ఇందుకు కారణాలు?

ఇవాల్టికీ తెలుగు కథ అనగానే మొదట గుర్తొచ్చే పేర్లు శ్రీపాద, పాలగుమ్మి పద్మరాజు, చాసో... ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన గత తరం కథకులవి మాత్రమే. తర్వాతి తరం రచయితలలో సర్వజనామోదం పొందిన వాళ్ళూ, వారి రచనల్లో అందరి ఆమోదం పొందినవీ వెతకడం కష్టమైన పని అనే చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆనాటి రచనలు అప్పటి పాఠకులని అలరించడమే కాకుండా, ఇప్పటికీ చిరంజీవులుగా నిలబడ్డాయి. ఇప్పటి రచనల్లో అలా నిలబడగలిగేవి ఏవీ?

ఏ రచన అయినా సమాజాన్ని ప్రతిబింబించాలి. చదివించే గుణం ఉండాలి. కథలో నవ్యతతో పాటు, కథనంలో వేగమూ ఉండాలి. మరి ఇప్పటి కథల్లో కనిపిస్తున్న సమాజం ఏమిటి? పల్చబడిపోతున్న కుటుంబ బంధాలూ, పెరిగిపోతున్న వ్యాపారీకరణ, కెరీరిజం, పల్లెల్లో మారుతున్న జీవన చిత్రం, రైతు సమస్యలూ, సెజ్లు, గతమెంతో ఘనకీర్తి టైపు నాష్టాల్జియా మరియు ప్రేమకథలు. గడిచిన ఇరవై యేళ్ళలోనూ సమాజంలో వచ్చిన మార్పులని కథా సాహిత్యం ఏమన్నా రికార్డు చేసిందా అంటే, అది కేవలం కార్పోరేటీకరణ తాలూకు దుష్ఫలితాలు, ఇంకా కెరీరిజం లో నలిగిపోతున్న యువత గురించి మాత్రమే అని చెప్పాలి.

మన సమాజంలో ఇంతకు మించి ఎలాంటి మార్పూ రావడం లేదా? లేక వస్తున్న మార్పుని సమర్ధవంతంగా రికార్డు చేయడంలో రచయితలు విఫలమవుతున్నారా? లేదా రికార్డు చేస్తున్న విధానం రొటీన్ గా ఒకే మూసలో పోసినట్టుగా ఉంటోందా? ఎలాంటి మార్పూ లేకుండా రోజులు గడిచిపోవడం అసంభవం కాబట్టి, దానిని రికార్డు చేయడం అన్నది సంతృప్తికరంగా సాగటం లేదని అంగీకరించాలి. అలాగే రికార్డు చేయడానికి ఉపయోగిస్తున్నభాష, భావ వ్యక్తీకరణ తీరు కూడా సంతృప్తికరంగా లేకపోవడం మూలంగానే ఈ చర్చలు. ఇందుకు కారణం ఎవరు?

పోతనామాత్యుడు భాగవతం మొదలు పెడుతూ "పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుడట.." అన్నాడు. మరి తెలుగు కథకి సంబంధించి ఇవాల్టి రోజున పలికించే వాళ్ళు ఎవరు? పత్రికలు, పాఠకులు తమ వంతు పాత్రని ఎంతవరకూ నిర్వర్తిస్తున్నారు? రచయితల్నీ, రచయిత్రులనీ వెతికి పట్టుకుని వాళ్ళ చేత నాణ్యమైన రచనలు చేయించుకోవాలన్న కమిట్మెంట్ ఉన్న సంపాదకులు ఇవాళ ఎంతమంది ఉన్నారు మనకి? టీవీ సీరియళ్ళ కారణంగా పడిపోతోందని చెబుతున్న పత్రికల సర్క్యులేషన్ పెంచుకోడానికి తంటాలుపడడంలో తలమునకలైన సంపాదకులకి కథల గురించి ఆలోచించే తీరిక లేదనే అనుకోవాలి.

సాహసించి ఓ రచయితో, రచయిత్రో తన కథలతో ఓ సంకలనం వేసుకుంటే ఆదరించే పాఠకులు ఎంతమంది? సొంతంగా పుస్తకం వేసుకోవడం అన్నది 'చేతి చమురు' వ్యవహారం తప్ప మరొకటి కాదన్నది బహిరంగ రహస్యమే. రాసిన కథలని అటు పత్రికలూ, ఇటు పాఠకులూ ఆదరించనప్పుడు ఆ రచయిత/రచయిత్రి ఏం చేయాలి? కష్టపడి చేసిన రచనకి పారితోషికం అందుకోవాల్సింది పోయి, సొంత డబ్బు ఖర్చు పెట్టడం, నష్టపోవడం.. ఇది సొంతంగా పుస్తకాలు ప్రచురించుకున్న వాళ్ళలో మెజారిటీ రచయితల అనుభవమని ఓ పబ్లిషర్ మిత్రుడి ఉవాచ. కథలు రాసిన వాళ్ళకి దక్కుతోన్నది ఏమిటి? ఉన్న కొద్దిపాటి పత్రికల్లోనూ, కథా సంకలనాల సంపాదక బృందంలోనూ ఉన్న మూసల కారణంగా ఆయా మూసల్లో ఇమిడిపోయే కథలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయిప్పుడు.

ఒకప్పుడు పత్రికలు సినిమాకి ప్లాట్ఫాం గా ఉండేవి. పత్రికల్లో వచ్చిన కథలనీ, నవలల్నీ సినిమాలు తీయడం, అందుకోసం మూల రచయితకి క్రెడిట్ తో పాటు కొంత పారితోషికం ఇవ్వడమో, లేక కథా విస్తరణలో సహకారం తీసుకోవడమో జరిగేది. ఫలితంగా రచయితకి ఆత్మతృప్తి తో పాటు పేరు, డబ్బూ మిగిలేవి. మరి ఇవాల్టి రోజున? సినిమా కి కథ అన్నదే అవసరం లేదు.. దర్శకుడికి నచ్చిన పాయింట్ ని కథగా మలచవలసిన రచయితకి కథా రచయితగా పేరు ఉండకపోవడమే పెద్ద అడ్వాంటేజ్. టీవీ సీరియళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకోబోవడం కూడా అనవసరమే. మరి కథలూ, రచయితలూ ఎవరికి కావాలి?

కాబట్టి, నాణ్యమైన తెలుగు కథ అంతరించి పోవడం, రచయితలు కనుమరుగైపోవడం అన్న పరిణామానికి కేవలం ఒకటో రెండో కారణాలు చూపించలేము.. ఒకప్పుడు ఉచ్ఛ దశని చవి చూసిన వార పత్రికలు అనే మాధ్యమానికి ఇది సంధియుగం. అత్యంత సహజంగానే ఆ దశలో ఓ వెలుగు వెలిగిన కథలకీ, రచయితలకీ కూడా ఇది సంధి యుగమే. పత్రికలు మళ్ళీ పూర్వ వైభవం పొందుతాయా? లేని పక్షంలో వాటికి ప్రత్యామ్నాయం ఏమిటి? భవిష్యత్తులో పాఠకుల సంఖ్య పెరుగుతుందా లేక తగ్గుతుందా? కథా రచనకి డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకి దొరికే సమాధానాల ఆధారంగా తెలుగులో నాణ్యమైన కథలు రాగలిగే అవకాశాలని అంచనా వేయగలుగుతాం.

8 వ్యాఖ్యలు:

 1. ఇప్పుడు ఏదైనా వ్రాద్దామంటే మరీ సులువైపోయింది -- ఇంటర్నెట్ వలన. కాబట్టి లక్షలకొద్దీ బ్లాగుల్లో ఏ బ్లాగు, ఏ కథ బాగుంటాయన్నది తెలియట్లేదు. కథా జగత్ లాంటి వెబ్సైట్లు అన్ని కథలనూ ఒక చోట పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి - సఫలం అయ్యాయి అనే చెప్పుకోవాలి. కాకపోతే ప్రేక్షకులు రేటింగ్ ఇవ్వడం, మంచి కథలకు ఏదైనా బహుమతి ఇవ్వడం వంటివి ఉంటే బాగుండు అనిపిస్తోంది.

  పుస్తకాలను మాధ్యమం వాడుకోవడం ఇప్పుడు కష్టమే. తెలుగు చదవడం కష్టం అని పిల్లలు అనుకునే ఈ తరంలో డబ్బు కట్టి పుస్తకాలను కొనండి అనే కంటే మంచి సాహిత్యం వెలువడటానికి దానిని డబ్బు నుండి వేరుపరచడం ముఖ్యం అని నా అభిప్రాయం. మంచి కథలు వ్రాస్తే దానికి మంచి రేటింగ్ లభించి అందరూ చదివేలాగ చెయ్యగలిగితే బాగుంటుంది.

  కుటుంబవ్యవస్థ పాడైపోతున్న ఈ తరుణంలో కథలకు మంచి విషయాలు దొరకట్లేదు అంటున్నారు - నిజమే. కాకపోతే ఈ తరంలో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి -- ప్రేమభంగం, ఆఫీసులో ఒత్తిడి, డబ్బు వెంక ప్రాకులాట వంటి అంశాలను మనసును తాకే విధంగా చెప్పడానికి కావలసింది అనుభవం, భావవ్యక్తీకరణాశక్తి, కోరిక, తీరిక, ఓపిక. ఇవన్నీ కుదరాలంటే రచయితలకు మంచి ప్రోత్సహం ఉండాలి.

  నాకు కథల గురించి ఆట్టే తెలియదు. ఏమైనా పొరబాటుగా మాట్లాడి ఉంటే క్షమించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @DG: నేను చ కింద 'ఒత్తు చ' ఒత్తే ఇచ్చానండీ.. కంప్యూటర్ సమస్య అంటారా?? ..ధన్యవాదాలు.
  @సందీప్: లేదండీ, మంచి పుస్తకాలు వస్తే కొనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు.. పాత పుస్తకాలు కొత్త ప్రింట్లు చూడండి, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.. ఈమధ్య వచ్చిన 'కోతి కొమ్మచ్చి' కాపీని ముందుగా రిజర్వు చేసుకోవాల్సి వచ్చింది.. నిజమే.. రచయితలకి ప్రోత్సాహం ఉండాలి.. అదే సమస్యగా కనిపిస్తోందిప్పుడు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అదేపనిగా వెతుకుతూపోతే ప్రతీకధలోనూ ఏదో ఓ దోషం బయట పడుతుంది - అంటూ తిలక్ కధలో దోషాలు ఎత్తిచూపించాడు బుచ్చిబాబు . దోషాలున్నా అది మంచి కధగా నిలబడటానికి గల కారణాలనూ చూపించాడు.
  గొప్ప కధకులుగా పేరుబడ్డవాళ్ళ కధల్లోకూడా కొన్ని మాత్రమే మంచి కధలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాయి. రాసిన ప్రతీ కధా సాహిత్యంగా నిలబడలేదు . కానీ రాయాలనే తపన గల రచయితనుండీ సాశ్వతమైన సాహితీ ప్రయోజనం పొందే కధ ఒక్కటైనా రావాలంటే దానికి రాస్తూపోవడం తప్ప మరోదారి లేదుకదా !
  తెలుగు కధ పుట్టిన తొలినాళ్ళలో పాశ్చాత్య కధల్తో పోల్చి కధంటే అది ఇదీ ఓ కధేనా అని విమర్సించినవాళ్ళు వున్నారు . ఆ విమర్శల్ని తట్టుకుని ఇదే నా పంధా అని ధైర్యంగా నిలబడ్డవాళ్ళే ఇవాళ మనతో గొప్పరచయితలుగా కీర్తింపబడుతున్నవాళ్ళు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. 90 ల నించీ ఇప్పటిదాకా కొన్ని మంచి కథలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ రావలసినంత, రాగలిగినంత సంఖ్యలో రావడం లేదు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో రచననే వృత్తిగా చేసుకుని సాధించుకున్న వాళ్ళు లేరు. గొప్ప రచయితలుగా పేరుపడినవారందరూ వేరే ఏదో ఉద్యోగం చేసుకుంటూ రచనసాగించినవారే. ఆ పద్ధతే ఇప్పుడూ కొనసాగుతున్నది. ఐతే ముందటితరం రచయితలు రాసినంత తరచుగా ఈ నాటి రచయితలు రాయడం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @లలిత: నిజమేనండీ.. గతమెంతో ఘనకీర్తి సరే, మరి వర్తమానం సంగతి? ఇలా కథలు వస్తూ వస్తూ ఉండగా ఎక్కడో ఓ మంచి కథ తగులుతుంది అంటారు అయితే.. ...ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: రాస్తే బాగుండునన్నదే నా ఆశకూడానండీ.. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. పిడకల వేట:

  మురళి గారూ, ఆ మధ్య మీ బ్లాగు లోనే అనుకుంటా ఒకరు తమ కామెంటులో ఒక ఇండియన్ ఐయేఎస్ ఆఫీసర్ తన ప్రయాణ అనుభవాలతో రాసిన ఒక పుస్తకం గురించి ఇచ్చారు. దాని పేరు ఏమైనా గుర్తుందా మీకు?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @రిషి: నా బ్లాగులో కాదనుకుంటానండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు