బుధవారం, ఏప్రిల్ 20, 2011

కోనంగి

నామీద నాకు బాగా కోపం వచ్చిన కొన్ని సందర్భాలలో ఇదొకటి. దాదాపు పది నెలల క్రితం, 'నారాయణరావు' చదివిన హాంగోవర్ లో ఉండగా అడివి బాపిరాజు రాసిన మిగిలిన నవలలన్నీ సంకలనాలుగా విడుదల చేశారు విశాలాంధ్ర వాళ్ళు. అన్నీ వెంటనే కొనేశాను. కాకపొతే, అంత వెంటనేనూ చదవకుండా పక్కన పెట్టి ఉంచి ఇతరత్రా పుస్తకాలు ఒకటొకటిగా పూర్తి చేయడం మొదలు పెట్టాను. మొన్నోరోజు ఎందుకో బాపిరాజు గారు గుర్తొచ్చి, 'కోనంగి' ని పైకి తీశాను. చదివినంతసేపూ, పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను, ఈ పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకుని కూడా చదవనందుకు.

కథ 1939 లో ప్రారంభమై తర్వాతి నాలుగేళ్ల కాలంలోనూ భారత స్వాతంత్ర పోరాటం తీరుతెన్నులనూ, అంతర్జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పులనీ నిశితంగా చిత్రిస్తూ 'కోనంగి' గా పిలవబడే కథానాయకుడు కోనంగేశ్వరరావు జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులని ఉత్కంఠభరితంగా పాఠకుల కళ్ళముందు ఉంచుతుంది. ఒక్క కోనంగి కథేనా? అతనికి అన్నిరకాలా సరిజోడి అయిన నాయిక అనంతలక్ష్మీ, ఆమె తల్లి జయలక్ష్మి, స్నేహితుడు మరియు కమ్యూనిస్టు డాక్టర్ రెడ్డి, అనంతలక్ష్మి మీద కన్నేసిన చెట్టియార్ ఇంకా అనేకానేకమంది కథ.

కోనంగి 'నారాయణరావం'త అందగాడు కాదు. ఆకర్షించే రూపం. మాటల పోగు. ముఖ్యంగా హాస్యభరితంగా మాట్లాడడం, కార్యసాధన చేయడం కొనంగికి వెన్నతో పెట్టిన విద్యలు. బందరులో బీయే పాసయ్యి, బతుకు తెరువు వెతుక్కుంటూ మద్రాసొచ్చిన కోనంగి, జీవితంలో స్థిరపడడం కోసం చేసిన మొదటి ప్రయత్నం వివాహం. 'హిందూ' పత్రికలో వరుడికోసం ఇచ్చిన ప్రకటన చూసి, సీతాదేవి అనే బాల వితంతువుని వివాహం ఆడడానికి మద్రాసులో అడుగు పెడతాడతడు. సీతాదేవి అతణ్ణి తిరస్కరించడం, కోనంగి అనంతలక్ష్మి తో తొలిచూపులోనే ప్రేమలో పడడం దాదాపు ఒకేసారి జరుగుతాయి.

అనంతలక్ష్మి మధురవాణి వంశీకురాలు. అయితే ఆమె తల్లి జయలక్ష్మిని ఓ ధనవంతుడైన అయ్యంగారు పెళ్లాడేడు. అయ్యంగారు అకాల మరణం తర్వాత మరో పురుషుడిని తన జీవితంలోకి రానివ్వలేదు జయలక్ష్మి. కుమార్తెని తన వృత్తిలో ప్రవేశింపనివ్వక ఒకరికి ఇల్లాలిని చేయాలన్నది జయలక్ష్మి కోరిక. క్వీన్ మేరీ కళాశాలలో చదువుతున్న అనంతలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లో మేటి. అన్నింటా తరగతిలో ప్రధమురాలు. లలితకళల్లో అభినివేశం ఉంది. చక్కటి కవిత్వం రాస్తుంది. తనకి తెలుగు ట్యూషన్ చెప్పగల ఉపాధ్యాయుడి కోసం ఆమె వెతుకుతున్న సమయంలో ఉద్యోగం వెతుక్కుంటున్న కోనంగి తారసపడతాడామెకి. తొలిచూపులోనే కోనంగి పట్ల ఏదో తెలియని అభిమానం ఏర్పడుతుంది అనంతలక్ష్మికి.

కోనంగిది చిత్రమైన కథ. వితంతువైన తల్లికి, ఓ ధనవంతుడితో ఏర్పడ్డ సంబంధం కారణంగా జన్మిస్తాడు అతడు. తను చేసిన తప్పు కొడుకు రూపంలో కనిపిస్తూ ఉండడంతో అతణ్ణి దగ్గరకి తీయలేదు ఆ తల్లి. కోనంగి తండ్రి ఆస్తిని స్వీకరించడానికీ అంగీకరించదు. ఎన్నో ఇబ్బందులు పది చదువు పూర్తి చేసిన కోనంగి ఉద్యోగం కోసం మద్రాసు చేరతాడు. యుద్ధం రోజులు కావడంతో ఉద్యోగం దొరకడం అంత సులభం కాదని అర్ధమవుతుంది. దొరల కంపెనీలో సేల్స్ మెన్ గా చేరి తన మాట చాతుర్యంలో ఊహించని రీతిలో అమ్మకాలు పెంచిన కోనంగి, తనతో పనిచేసే ఆంగ్ల యువతి సారా తో ఏర్పడ్డ స్నేహం కారణంగా ఉద్యోగం పోగొట్టుకుంటాడు.

తిరిగి కంపెనీ వారు ఉద్యోగానికి ఆహ్వానించినా, దొరల పాలనకి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమం జరుగుతున్న సమయంలో తాను దొరల కంపెనీలో పనిచేయడం సమంజసం కాదని భావించి తిరస్కరిస్తాడు. ఓ హోటల్లో సర్వర్ గా పనిచేస్తూనే, అనంతలక్ష్మి కి పాఠాలు చెబుతూ ఉంటాడు. అనంతలక్ష్మి ని తనదాన్ని చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న చెట్టియార్, కోనంగి-అనంతలక్ష్మి ల అనుబంధాన్ని అనుమానించి కోనంగిపై హత్యాయత్నం చేయిస్తాడు. ఆ సమయంలో తనకి వైద్యం చేసి బతికించిన డాక్టరు రెడ్డితో గాఢమైన స్నేహం ఏర్పడుతుంది కోనంగికి.

రాజకీయంగా కోనంగిది గాంధీ మార్గం. రెడ్డి కమ్యూనిస్టు. ఈ భేదం వారి స్నేహానికి అడ్డు రాకపోగా, రెండు మార్గాలలోనూ ఉన్న మంచి చెడ్డలు చర్చకి వస్తూ ఉంటాయి. రెడ్డి ప్రోద్బలంతో 'దుక్కిటెద్దులు' అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తాడు కోనంగి. ఆ సినిమా విజయవంతమైనా, సినిమాల్లో కొనసాగడానికి ఇష్టపడడు. వివాహానికి వెలుపల ఉండే శారీరక సంబంధాల మీద గౌరవం లేని కోనంగి తనతో సంబంధం కోరిన సారానీ, సిని కథానాయికనీ సున్నితంగా తిరస్కరిస్తాడు. మరోవంక, అనంతలక్ష్మి తో కోనంగి ప్రేమ ఫలించి, జయలక్ష్మి అంగీకారంతో వారిద్దరి పెళ్ళీ జరుగుతుంది. తొలిరాత్రి జరిగిన మరునాటి ఉదయాన్నే అనూహ్య పరిస్థితుల్లో కోనంగినీ, డాక్టరు రెడ్డినీ ఓ కుట్ర కేసులో అరెస్టు చేస్తారు పోలీసులు.

జైల్లో ఉన్న కోనంగికి అనంతలక్ష్మి మీద అనుమానం కలిగే విధంగానూ, అటు అనంతలక్ష్మికి కోనంగిపై దురభిప్రాయం కలిగేలాగా ఆకాశ రామన్న ఉత్తరాల పరంపర మొదలవుతుంది. కోనంగి జైలు నుంచి విడుదలయ్యాడా? అనంతలక్ష్మిని కలిశాడా? అసలు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? భవిష్యత్తు కార్యాచరణని ఎలా నిర్ణయించుకున్నాడు? తదితర ప్రశ్నలకి సమాధానమే 'కోనంగి' నవల. చదువుతుండగా దాదాపు ఇదే కథాకాలంతో వచ్చిన నవలలు 'మాలపల్లి,' 'చదువు' 'రామరాజ్యానికి రహదారి' ఇత్యాదులన్నీ గుర్తొచ్చాయి. నవల పూర్తి చేశాక కోనంగిని మాత్రమే కాదు, అనంతలక్ష్మినీ మర్చిపోలేం. ఆనాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, సిని, నాటక, పత్రికా రంగాలు అక్కడి పరిస్థితులు వీటన్నింటినీ నిశితంగా చిత్రించిన 'కోనంగి' నవల తెలుగు నవలా సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళంతా తప్పక చదవాల్సిన పుస్తకం. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 286, వెల రూ. 150). బాపిరాజు ఇతర రచనలన్నీ వరుసగా చదివేయాలని బలంగా నిర్ణయించుకున్నానని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ..

3 కామెంట్‌లు:

 1. రాజకీయాలే కాకుండా స్త్రీ అభ్యుదయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాసిన గ్రంధం ఇది. ఆ రోజుల్లో ఇటువంటి రచనలే జాతిని అభివృద్ధి చేయటానికి దోహదం చేసాయి. స్త్రీల సమస్యలను తీర్చటంలో స్త్రీల కన్నా పురుషులే ఎక్కువ కృషి చేసినట్లున్నారు. ఎన్ని విషయాలాను ఈ గ్రంధంలో చర్చించారండి. నిజంగా చాలా మంచి పుస్తకం. ఉందిగా మా లైబ్రరీ:) చదువుతాలెండి.

  రిప్లయితొలగించు
 2. " కోనంగి " చదవాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను . కాని ఆ గ్రాంధికము చదివే ఓపిక లేక ఊరుకుంటున్నాను . బాగుందండి పరిచయము .
  యద్దనపూడి నవల " సెక్రెటరీ " ఈ కోనంగి కి కాపీ అని ఎక్కడో చదివాను . కాని మీరు పరిచయము చేసిన కథ తో సెక్రటరీ కీ పోలికే లేదు !

  రిప్లయితొలగించు
 3. @జయ: నిజమేనండీ.. చాలా అంశాలని స్పృశిస్తూ సాగినన నవల.. అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకపోవడం ప్రత్యేకత.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
  @మాలాకుమార్: 'సెక్రటరీ' తో అస్సలు పోలిక లేదండీ.. ఏ మాత్రం కనిపించినా ఆ విషయం రాసి ఉండేవాడిని కదా :)) మరీ గ్రాంధికం ఏమీ లేదండీ.. పర్లేదు చదివేయగలరు మీరు.. విశాలాంధ్ర వాళ్ళు కొత్త ప్రింట్ వేశారు.. చదివేసి, ఓ టపా రాసేయండి మరి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు