బుధవారం, ఏప్రిల్ 27, 2011

మాడంత మబ్బు

తెలుగు కథకుల్లో రాశిలో తక్కువే అయినా, వాసిలో ఎంచదగ్గ కథలు రాసినవాళ్ళు ఎందరు? ఈమధ్యనే సి. రామచంద్ర రావు 'వేలు పిళ్ళై' సంకలనం చదవడం పూర్తి చేయగానే తలెత్తిన ప్రశ్న ఇది. వెంటనే తట్టిన పేరు నిడుమోలు కల్యాణ సుందరీ జగన్నాథ్. బుక్ రాక్ లో వెతికితే ఆవిడ కథా సంకలనం 'అలరాస పుట్టిళ్ళు' కనిపించింది. పేజీలు తిప్పుతూ నాకు బాగా నచ్చిన కథ 'మాడంత మబ్బు' దగ్గర ఆగాను.

ఓ తరం సంస్కృతీ సంప్రదాయాలను, మానవ మనస్తత్వంలో వైచిత్రిని ఇంకా ప్రకృతి వివిధ రూపాల్నీ చిత్రించడంలో అందెవేసిన చేయి కల్యాణ సుందరి గారిది. కథ ముగింపుని గురించి చిన్నపాటి క్లూలు ఇస్తూనే, వేగవంతమైన కథనంతో ఆసాంతమూ ఊపిరి బిగబట్టి చదివేలా కథను నడపడం ఈవిడ శైలి. కథల్లో అధికశాతం విస్తృతమైన కాన్వాస్ కలిగి ఉంటాయి. అంతే కాదు, విషాదాంతాలే ఎక్కువ.

పల్లెటూరి ఆలూమగలు భాగ్యం, పెద్దిరాజుల కథ ఈ 'మాడంత మబ్బు.' కొల్లేరు పక్కనుండే పల్లెటూళ్ళో కాపురం. పెద్దిరాజు వృత్తి వ్యవసాయం. చిన్నప్పుడే తల్లితండ్రుల్ని కోల్పోయిన భాగ్యాన్ని తనదగ్గర ఉంచి పెద్ద చేసి, కొడుకునిచ్చి పెళ్లి చేసింది అత్తయ్య. తనవారెవరూ లేరన్న లోటు కనిపించని విధంగా భాగ్యాన్ని చూసుకుంటూ ఉంటాడు పెద్దిరాజు. పెళ్ళయ్యాక పెద్దిరాజు తల్లి కాలం చేస్తుంది. భాగ్యనికింకా చిన్నతనం వదలలేదు. పెద్దిరాజుకి భాగ్యం అంతే ఎంత ప్రేమ ఉందో, అంత అనుమానమూ ఉంది. ఆ అనుమానంతో అతనేమన్నా అన్నా "బావ కాకపొతే నన్ను ఇంకెవరు అంటారు?" అని సరిపెట్టేసుకుంటూ ఉంటుంది భాగ్యం.

ఆ ఏడు చేను ఈనిన వెంటనే సుంకు మీద వాన ముసుళ్ళు పట్టాయి. పంట నష్టం. ఎలాగో కాలక్షేపం చేశారు. ఆ మరుసటి ఏడూ అంతే. తర్వాత ముంపు వచ్చింది, వరుసగా రెండేళ్ళు. అసలు ముంపు వస్తుందని భాగ్యానికి ముందే తెలుసు. తొలకరికి ముందు పక్క ఊళ్ళో ఉన్న చుట్టాలని చూసి వస్తూ ఉంటే, ఎండి ఉన్న కొల్లేరులో అక్కడక్కడ పెరిగిన జమ్ములో కొంగలు నిలువెత్తున్న గూళ్ళు కట్టుకున్నాయి. పక్షులు అంత ఎత్తులో గూళ్ళు కట్టుకున్నాయంటే ముంపు వస్తుందనే కదా అర్ధం!

పూలమ్మిన చోట కట్టెలమ్మలేక రామగిరి పాడు కి కూలి పనికి వెళ్ళిపోయాడు పెద్దిరాజు, తన పొలాన్ని మునసబు గారికి కౌలుకిచ్చి. భాగ్యం 'తనూ వస్తా' నంది కానీ, "బస్తీ నమ్మకూడదు. అక్కడికొద్దు" అంటూ కళ్ళెర్రజేశాడు పెద్దిరాజు. అంతలోనే ప్రేమ చూపించాడు. వచ్చేటప్పుడు ఆమెకిష్టమైన జలతారు చందమామల నల్ల జరీచీర తెస్తానన్నాడు. పెద్దలు ఇచ్చినదాన్ని, తర్వాతి వాళ్లకి ఇవ్వడానికి తనకి కొన్నాళ్ళపాటు పట్నవాసం తప్పదన్నాడు. భాగ్యానికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. పెరట్లో బూరుగు చెట్టు పువ్వు పూసి కాయ కాసింది. మృగశిర ప్రవేశించింది.

ఆవేళ, దూరాన్న పొలాల మీద చిన్న మబ్బు పట్టినట్టు కనిపించింది. పట్నం నుంచి పెద్దిరాజు వస్తున్నట్టు శేషయ్య ద్వారా తెలిసింది భాగ్యానికి. ఆమెకది పండుగే అయింది. "మాడంత మబ్బు పట్టే మంగళగిరి మీద.. కురిసెను తిరుపతిలో కుంభవర్షాలు.. కుంభ వర్షాల్ కురిసె స్తంభాలె తడిసె.. వెంకన్న కూచున్న వెండరుగు తడిసె.. మంగమ్మ కూచున్న మండపమే తడిసె.." అని పాడుకుంటూ ఇల్లంతా సర్దింది. గబగబా వంట చేసింది. రెండు పీటలు వాల్చి, కంచాలు పెట్టింది. మంచి చీర ఎంచి కట్టుకుంది. పక్క సిద్ధం చేసింది.

అప్పుడు గుర్తొచ్చింది, అతనికి భోజనం చేశాక బెల్లంగడ్డ నోట్లో వేసుకునే అలవాటు ఉందని. ఇంట్లో బెల్లం లేదు. ఎప్పుడూ బయటికి వెళ్లకపోయినా, ఆ చినుకుల్లో వీధి చివర భూషణం గారి కొట్టుకి వెళ్ళింది, అతనికి ఇంటి ముందర దారి తెలియడానికి లైటు పడేటట్టు కిటికీ తెరిచి పెట్టి, తలుపు గొళ్ళెంపెట్టి. అతను వచ్చాడా? ఆమె ప్రేమని అర్ధం చేసుకున్నాడా?? ...కుసుమ బుక్స్ ప్రచురించిన కల్యాణ సుందరి ఇరవై కథల సంకలనం 'అలరాస పుట్టిళ్ళు' కథా సంకలనం పేజీలు 298, వెల రూ. 60. (అన్ని పుస్తకాల షాపులు.) 'అలరాస పుట్టిళ్ళు' నాటికను గురించి నా టపా ఇక్కడ.

2 కామెంట్‌లు:

  1. మురళి గారూ

    ఇప్పుడే పాలగుమ్మి గారి "ఆ మంగళవారం నాడు" చదివాను. మీ కథ ఉత్పరివర్తనం గుర్తొచ్చింది. వెంటనే చెప్పాలనిపించింది.


    వాసు

    రిప్లయితొలగించండి
  2. @వాసు: కథ ప్రారంభం, ముగింపు ఒకే సన్నివేశంతో కావడం వల్ల మీకు 'ఉత్పరివర్తనం' గుర్తొచ్చి ఉండొచ్చండీ.. ఏమైనప్పటికీ అయ్యాం వెరీ హాపీ.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి