సోమవారం, మార్చి 23, 2009

శంకరాభరణం

తులసి (మంజు భార్గవి) తన కొడుకు శంకరాన్ని తీసుకుని గోష్పాదాల రేవులో లాంచీ దిగుతుంది. శంకర శాస్త్రి (సోమయాజులు) అప్పుడే గోదావరి లో స్నానం ముగించి, సంధ్య వార్చి ఇంటికి తిరుగుముఖం పడతాడు. రేవు మెట్ల మీద పడ్డ ఆయన పాద ముద్రలకి భక్తితో నమస్కరిస్తుంది తులసి. 'శంకరాభరణం' సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ సీన్ తప్పక గుర్తుంటుంది. తులసి కి శంకర శాస్త్రికి ఉన్న అనుబంధం ఎలాంటిదో ఈ ఒక్క సీన్ లోనే చూపించాడు దర్శకుడు.

ఈ సీన్ చిత్రీకరణ అనుకున్నంత సులువుగా జరగలేదు. సోమయాజులు నడిచి వెళ్తున్నారు.. మంజుభార్గవి నమస్కరించి షాట్ ఓకే అయ్యేలోగా ఆ ముద్రలు ఎండకి ఆరిపోతున్నాయి. సోమయాజులు ని ఎన్నిసార్లు నడిపిస్తారు? అప్పుడు దర్శకుడు కే. విశ్వనాధ్ తన సహాయకులకి ఓ సూచన ఇచ్చారు. ఆ సూచన ప్రకారం వాళ్ళు సోమయాజులు కాళ్ళకి కొబ్బరి నూనె రాసి నడిపించారు.. ఆ ముద్రలకే మంజు భార్గవి నమస్కరించింది.

'ఏ తీరుగా నను దయచూసెదవో' పాట షూటింగ్. చిన్న పిల్లవాడు శంకరం ఆ పాట పాడుతుంటే శాస్త్రి గారమ్మాయి శారద (రాజ్యలక్ష్మి) వాడివంక ప్రేమగా చూడాలి. షాట్ తీయబోతుంటే, రాజ్యలక్ష్మి ముఖం అలసటగా ఉండడం గమనించారు విశ్వనాధ్. ఆమెని ఓ గంట నిద్రపోయి రమ్మని ఈ లోగా వేరే సీన్స్ షూట్ చేశారు. విశ్రాంతి తీసుకుని వచ్చిన రాజ్యలక్ష్మి ముఖం తేటగా ఉండడం తో ఆ సీన్ తీశారు.

పెళ్లి చూపుల్లో 'సామజ వర గమనా' పాట స్వరం తప్పు పాడాక, శారద పశ్చాతాపం తో తండ్రి దగ్గర తప్పు సరరించుకుని పాడే సీన్ తీస్తే ఆ రోజుకి షూటింగ్ అయిపోతుంది. కాని కరెంట్ పోయి చాలా సేపటి వరకు కరెంట్ రాలేదు. సాయంత్రం ఏడు దాటడంతో ఇక షూటింగ్ ఉండదని అనుకున్నారు అందరు.. ఐతే కరెంట్ వచ్చాక షూటింగ్ పూర్తి చేశారు.

'శంకరాభరణం' పాటలన్నీ వేటూరే రాశారు. విశ్వనాధ్ కథ చెప్పగా విని 'ఓంకార నాదాను సంధానమౌ..' పాటను అప్పటకప్పుడే ఆశువుగా చెప్పేశారు. ఐతే షూటింగ్ మొదలైపోయినా చివరిపాట పూర్తి కాలేదు. మహదేవన్ డేట్స్ దొరక్కపోవడం వల్ల. అనారోగ్యం తో ఆస్పత్రిలో చేరిన వేటూరి హాస్పిటల్ బెడ్ మీద పడుకునే ఆ పాట డిక్టేట్ చేశారు.

ఇక రికార్డింగ్ ఐతే 'ఓంకార నాదాను' తోనే మొదలు పెట్టారు. రికార్డింగ్ కి రాలేనని జానకి చివరి నిమిషంలో కబురు చేశారు. పాటలో తను పాడే భాగం చాలా తక్కువగా ఉండడమే కారణం. బాలు ఆవిడని కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. 'సామజవరగమనా' పాట రికార్డింగ్ పూర్తయ్యాక జానకి 'మంచిపాట దొరికింది' అని సంతోష పడ్డారు.

'శంకరా నాద శరీరా పరా' షూటింగ్ మద్రాస్ దగ్గరలో ఉన్న ఒక శివాలయంలో.. విజయ స్టూడియో నుంచి చెత్తని కిలోల్లెక్కన కొనుక్కొచ్చారు. వర్షం ఎఫెక్ట్ కోసం తెచ్చిన ఫైర్ ఇంజిన్ సరిగా పని చేయకపోవడంతో సోమయాజులు ని చాలా సార్లు తడపాల్సి వచ్చింది. 'ఈ దేహాన్ని మీకు అప్పగించేశాను.. మీ ఇష్టం' అన్నారాయన నవ్వుతూ. ఆ పాటలో మెరుపుల ఎఫెక్ట్ కోసం కొవ్వొత్తులని వెలిగించి ఆర్పారు. 'దొరకునా ఇటువంటి సేవ' పాట ని రాజమండ్రి లో రెండు రోజులపాటు అవిశ్రాంతం గా తీశారు. ప్రొడక్షన్ వాళ్ళంతా తిండి, నిద్ర లేక వేల్లాడబడి పోయారు.

నేను 'శంకరాభరణం' షూటింగ్ కనీసం ఒక్క సీన్ కూడా చూడలేదు. మరి ఈ విశేషాలన్నీ ఎక్కడివంటే ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేసిన వంశీ రాసిన 'వెండితెర నవలలు' అన్న పుస్తకం లోవి. 'శంకరాభరణం' తో పాటు 'శుభోదయం' 'సీతాకోక చిలుక' 'అన్వేషణ' సినిమాల కథల్ని వంశీ మార్కులో చదవొచ్చు. సాహితి ప్రచురణలు ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 100.

17 కామెంట్‌లు:

  1. శంకరాభరణం చిత్రం మొత్తం మరొకసారి కాళ్ళ ముందు కనిపించిందండి. మంచి చిత్రం గుర్తు చేసారు.

    మూడో పేరాలో కొన్ని చోట్ల 'పాట' కి బదులు 'పాత' అని వచ్చింది... ఒకసారి గమనించండి.

    రిప్లయితొలగించండి
  2. మీరు మొత్తానికి "భలేవారు" మీరేదో సినిమా షూటింగ్ లో వున్నట్లు ,అందులో నటించారో,దర్సకత్వం వహించారో ,నిర్మించారో అనుకున్న :)

    రిప్లయితొలగించండి
  3. పుస్తకాన్ని చాలా బాగా పరిచయం చేశారు.

    రిప్లయితొలగించండి
  4. బావున్నాయండీ విశేషాలు.. అదీ మనకిష్టమయిన సినిమా గురించయితే ఇంకా బావుంటాయి..

    రిప్లయితొలగించండి
  5. బావుందండీ ....మీరు పుస్తకాన్ని పరిచయం చేసిన తీరు .

    రిప్లయితొలగించండి
  6. @చైతన్య: టపా పోస్ట్ చేశాక, వ్యూ బ్లాగ్ ఆప్షన్ లో చదివి తప్పులు సవరించడం నా అలవాటు. ఈ టపా పోస్ట్ చేయగానే సిస్టం డౌన్ అయ్యిందండి. అందువల్ల తప్పులు వెంటనే సరి చేయలేక పోయా.. నిశితంగా చదివి సూచన చేసినందుకు ధన్యవాదాలు.. మరింత జాగ్రత్తగా రాయాలి నేను..
    @చిన్ని: భలే జోకులేస్తారండి మీరు :) ధన్యవాదాలు
    @భవాని: ధన్యవాదాలు.
    @గీతాచార్య: మీరు ఇంగ్లీష్ లో చెప్పినా విషయం అర్ధమైందండీ :) ధన్యవాదాలు
    @ఉమాశంకర్: శంకరాభరణం సినిమాని ఇష్టపడని వాళ్ళు అరుదు అనుకుంటానండి. ధన్యవాదాలు.
    @పరిమళం: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. నేను చందాదారుగా నెల నెలా వచ్చే "తెలుగు నాడి" మాసపత్రికలో ఒక శీర్షికలో విశ్వనాథ్ తన స్వగతంగా ఈ సినిమా చిత్రికరణ గురించిన అనుభవాలు చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారిని కొద్ది రోజులపాటు మరే సినిమాకి పాడకుండా దీనిమీదనే దృష్టిపెట్టించటం కోసం తను బాలు గారి తండ్రిని [వారు బంధువులని కూడా తెలిపారు] అనుమతి అడగటం అందులో ప్రస్తావించారు.

    ఈ వివరాలు బావున్నాయి. అన్నట్లు వంశీ గారి "మా పసలపూడి కథలు" చదివారా? అవొక ఆణిముత్యాలు. మీరిదవరలో ఆ కథల సంపుటిని పరీచయం చేసివుంటే మన్నించండి. గుర్తుకొచ్చి వ్రాసాను.

    రిప్లయితొలగించండి
  8. మురళి గారు,
    బాగుంది అండి. నేను అప్పట్లో ఎక్కడో విన్నా బాలు గారు శంకరా పాడితే నిజం గానే వాన వచ్చిందని నిజమేనా?
    అవును ఉమ శంకర్ గారి బ్లాగ్ లో చూసేను మీ బ్లాగ్ వెతికేను నాకు ఆ గణేష్ కథ కనపడలేదండి.. ఎక్కడ వుందో చెప్పరు కొంచం ప్లీజ్ ...

    రిప్లయితొలగించండి
  9. @ఉష: 'మా పసలపూడి కథలు' చదివానండి.. చదువుతూ ఉన్నాను.. ఇంకా వాటి గురించి నా బ్లాగు లో రాయలేదు. బాలు వేరే సినిమాలకి పాడలేదని వంశీ కూడా రాశాడు. ధన్యవాదాలు.
    @భావన: ధన్యవాదాలు. వర్షం సంగతి తెలియదండి. వంశీ రాయలేదు మరి. ఇక మా గణేష్ కథ ఈ లింక్ లో చూడండి: http://nemalikannu.blogspot.com/2009/01/blog-post_26.html

    రిప్లయితొలగించండి
  10. మీరు ఉదహరించిన పుస్తకం నేను చదవలేదు కాని... శంకరాభరణం విడుదలయిన తరువాత వంశీ గారు ఆ సినిమా పై ఒక పుస్తకం రాసారు. అప్పట్లో కొన్ని సినిమాల పై పుస్తకాలు వచ్చేవి. నాకు గుర్తున్నంత వరకు.. సీతాకోక చిలుక, బుద్ది మంతుడు .. నేను చదివినవి. ఇక శంకరాభరణం విషయానికి వస్తే... మెరుపులు కోసం వాడింది కొవ్వొత్తులు కాదు.. వెల్డింగ్ పరికరం, అలాగే బ్లోయర్ను సుడిగాలి కోసం వాడారని వంశీ గారు రాసారు. claimax శీను తెల్లార్లు తీయాల్సి వచ్చినదట. ఎందుకంటే సోమజాజులు గారు పెద్ద ఆఫీసర్ కావడం వలన ఆ రోజు విపరీతమైన ఫోన్లు వచ్చాయట. అందుకని ఆ సీనులో ఉండే ప్రేక్షకులు చాలా మంది బయటకి వెళ్లిపోతుంటే బ్రతిమాలి కూర్చో బెట్టాల్సి వచ్చినదని రాసారు. ఇంకా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి ఆ పుస్తకంలో.

    రిప్లయితొలగించండి
  11. కృష్ణారావు జల్లిపల్లి: అదే పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించారని సందేహం అండి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  12. Interesting tidbits.
    అమెరికా తెలుగు పత్రిక తెలుగునాడీలో ఇటీవల శంకరాభరణం సినిమాగురించి ఒక వ్యాసం వేశారు. అందులో కూడా నిర్మాణానికి సంబంధించిన చాలా విశేషాల్ని చెప్పారు.
    పైనెవరో వంశీ పసలపూడి కథలని ఆణీముత్యాలని వర్ణించారు. వారు కానీ మీరు కానీ ఆ వివరమేవిటో రాస్తే బాగుంటుంది. ఎందుకంటే నేనవి చదివినప్పుడు నాకలా అనిపించలేదు.

    రిప్లయితొలగించండి
  13. అయివుండవచ్చు. ఇంకో రెండు విశేషాలు. శంకరాభరణం కథ విశ్వనాధ్ గారు విమాన ప్రయాణం చేస్తుండగా మదిలో రూపు దిద్దుకోందని వంశీ గారు రాశారు.
    ఈ సినిమా విడుదల అయ్యి వీర విహారం చేస్తుండగా నిర్మాత అయిన శ్రీ ఏడిద నాగేశ్వర రావు గారు విజయోత్సవ సభల కోసం రష్యా కి విశ్వనాధ్ గారిని, విశ్వనాథ్ గారి అమ్మాయిని తీసుకెళ్ళారు. కాని చిత్ర విజయంలో పాలు పంచుకున్న శ్రీ మహదేవన్ గారిని తీసికేల్లలేదు. ఈ విషయాన్ని కొంతమంది విలేఖరులు మహదేవన్ గారిని అడిగితె.. శంకరాబరణం విజయానికి సంగీతం కారణం కాదేమోనని నిర్మాతలు బావించి ఉండవచ్చు అని వాపోయారు. (అలనాటి జ్యోతిచిత్రలోనిది ఈ వార్త).

    రిప్లయితొలగించండి
  14. @కృష్ణారావు జల్లిపల్లి: విమాన ప్రయాణ విషయం నేను చదివిన పుస్తకం లోనూ ఉండండి. మహదేవన్ విషయం కొత్తగా వింటున్నా. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. bagundandi malli aa cinema ippude choosinattuga vundi.
    malli chinna requestandi murali garu..maa andariki saagara sangamam choopinchagalara mee nemali kannu to..
    ila demand chesanani koppakandi murali garu..
    nakento istamyna aa cinemani mee nemali kanti to choodalani na abhilasha..!!

    రిప్లయితొలగించండి
  16. @ప్రణీత: 'సాగర సంగమం' నాక్కూడా చాలా ఇష్టమైన సినిమా అండి.. అసలు ఆ సినిమాని ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. తప్పక రాస్తాను ఎప్పుడైనా... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి