బుధవారం, మార్చి 18, 2009

నాయికలు-కోకిల

కోకిల అనగానే ఏం గుర్తొస్తుంది? మెరిసే నల్లని చాయతో లేతాకుపచ్చని మావి కొమ్మల గుబురులో దాగి తీయని పాటలు వినిపించే ఓ పక్షి.. పెద్ద పెద్ద కళ్ళు, పల్చని పెదవులు, పట్టు కుచ్చు లాంటి పొడవైన కురులు, బాగా కాచిన పాలమీద కట్టే మీగడ తరక లాంటి దేహ ఛాయ, చిలుక పలుకులాంటి స్వరం కలబోసిన సౌందర్య రాసి పేరు కూడా కోకిలే.. ఈ కోకిల మామిడి కొమ్మల్లో స్వేచ్చగా విహరించే వనప్రియ కాదు.. కూలిపోబోతున్న రాజ మహల్లో పంజరం లాంటి కట్టుబాట్ల మధ్య ఒంటరి జీవితం గడుపుతున్న ఇరవయ్యేళ్ళ సుకుమారి.. రాజ్యాన్ని కోల్పోబోతున్న రాకుమారి.. వంశీ సృష్టించిన 'మహల్లో కోకిల.'

గోదారి ఒడ్డున ఉన్న వెంకట నారాయణపురం అనే పల్లెటూరి కోటలో జమీందారు గారి గారాల పట్టి కోకిల. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన కోకిల అన్న చందర్ తో కలిసి ఆ బంగ్లా లో ఉంటూ ఉంటుంది. ఆస్తులు కోల్పోతున్నా ఆచార, సంప్రదాయాలను కోల్పోడానికి ఇష్టపడని చందర్ కోకిలను పరదాల మాటునే పెంచుతాడు. అన్నగారంటే ఎడతెగని భయం కోకిలకి.. బంగ్లాలో ఇద్దరే ఉంటున్నా, అవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఆ అన్నా చెల్లెళ్ళు. కాలక్షేపం కోసం రకరకాల పక్షుల్ని పెంచుతూ ఉంటుంది కోకిల. ఆ పక్షులకి మాటలు నేర్పుతాడు చందర్. వాటిలో మనుషుల కనుగుడ్లు పీకి తినే ప్రమాదకరమైన అగ్గి పక్షి కూడా ఉంటుంది.

పైకి ఆచారాలు, సంప్రదాయాలు అంటూ మాట్లాడే చందర్ ఓ నర్సు 'మాయ' ని రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. ఆస్తులకి సంబంధిన చివరి కేసు కోర్టు లో ఉండగా ఈ నిజం కోకిలకి తెలుస్తుంది. అదే సమయంలో ఊరిలోకి వచ్చిన పగటివేషగాడు శివుడితో అనుకోని పరిస్థితుల్లో మాట్లాడుతుంది కోకిల. తన అన్నగారు కాకుండా ఆమె జీవితంలో మాట్లాడిన తొలి పురుషుడు శివుడు. తన బందిఖానా జీవితం గురించి, దానిమీద తనకి గల విరక్తి గురించి అతనికి వివరంగా చెబుతుంది. ఆమెకి బయటి ప్రపంచం చూపిస్తాడు శివుడు. కోర్టులో ఆస్తి పోగొట్టుకుని కోటకి తిరిగొచ్చిన చందర్ కి కోకిల విషయం తెలిసి శివుడిని హత్య చేయమని పురమాయిస్తాడు.

అగ్గి పక్షి చందర్ ని పొడిచి పొడిచి చంపుతుంది. తను రాజ వంశానికి చెందిన దాన్నన్న రహస్యం ఎక్కడా చెప్పొద్దని కోకిల నుంచి మాట తీసుకుని మరణిస్తాడు చందర్. మాయ తో కలిసి మద్రాసు చేరుకున్న కోకిల నర్తకి గా స్థిరపడుతుంది. మాయ మరణానంతరం, తన దగ్గర సెక్రటరీ గా చేరిన దేవదాస్ ప్రోత్సాహంతో సినిమాల్లో చేరుతుంది కోకిల. పెద్ద తారగా మారడంతో ఆమె గతం మీద పత్రికలకి ఆసక్తి పెరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తన గతం చెప్పాల్సివస్తుంది కోకిలకి. ఆమె జీవిత చరిత్ర సంచలనం సృష్టిస్తుంది.

శివుడు బతికే ఉన్నాడన్న నిజం తెలుస్తుంది దేవదాస్ కి. ఐతే కోకిల ఆ విషయం నమ్మదు. రాఘవరావు అనే వృద్ధుడిని వివాహం చేసుకుంటుంది ఆమె. యెంతో కష్టపడి శివుడి ఆచూకీ పట్టుకుంటాడు దేవదాస్. అతను వెంకట నారాయణ పురం లో ఉన్నాడని తెలుసుకుని కోకిలని అక్కడికి తీసుకెళతాడు. అక్కడకి వాళ్ళు చేరుకునేసరికే శివుడు మరణిస్తాడు. అతని దేహం పై పడి కోకిల మరణించడం నవల ముగింపు. ఇదే నవలకి చాలా మార్పులు చేసి 'సితార' సినిమా తీశాడు వంశీ.

ప్రముఖ నర్తకి కోకిల నృత్య ప్రదర్శనకి టిక్కెట్లు దొరకక దేవదాస్ అతని స్నేహితుడు తిలక్ వెనక్కి రావడంతో కథ ప్రారంభం అవుతుంది. తర్వాత దేవదాస్ కోకిల సెక్రటరీ గా చేరి ఆమెకేదో గతం ఉందని గమనించి, అది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కోకిలకి ఓ సినిమా అవకాశం రావడం, అది ఫ్లాప్ కావడం తో అటు నృత్యం, ఇటు సినిమాలు లేక ఆమె బికారి గా మారుతుంది. అనుకోకుండా దొరికిన మరో సినిమాతో ఆమె గొప్ప హీరోయిన్ అవుతుంది. ఈ క్రమం లో ఆమె గతం చెప్పాల్సివస్తుంది.

కోకిల మానసిక సంఘర్షణ నవల మొత్తం ఉంటుంది. పాఠకులకి కోకిల పాత్ర పట్ల ఆసక్తి, సానుభూతి కలుగుతాయి. ఆమె తన వంశ చరిత్రని తెలుసుకోవడం, శివుడితో బయటికి వెళ్ళడం గుర్తుండి పోతాయి. 'మంచుపల్లకీ' సినిమా ఫెయిల్ అయ్యాక ఎమెస్కో క్రౌన్ సిరిస్ వాళ్ళు పెట్టిన నవలల పోటీకి ఈ నవల పంపానని, బహుమతి గా వచ్చిన పది వేల రూపాయలు కొన్ని నెలలపాటు తన కుటుంబ ఖర్చులని గట్టెక్కించాయని తన 'ఫెయిల్యూర్ స్టొరీ' లో చెప్పాడు వంశీ. ఈ నవలతో పాటు సినిమా కూడా హిట్ అయ్యి, సినిమా రంగంలో వంశీ కి ఓ చోటు ఇచ్చింది.

వంశీ మార్కు వర్ణనలు నవల నిండా బోలెడు. ఐతే వర్తమానాన్ని రాయడానికి భవిష్యత్లా రాసే వంశీ అలవాటు ఒక్కటే ఇబ్బంది పెడుతుంది. 'ఆమె నాట్యం చేస్తోంది' అనడానికి బదులు 'ఆమె నాట్యం చేస్తుంది' అనడం లాంటివి. వంశీ మిగిలిన నవలలతో పోల్చినా ఈ నవల ప్రత్యేకమైనదే..చక్కని కథ, చిక్కని కథనం, సొంపైన వర్ణననలు ఆసాంతం చదివిస్తాయి. ఎమెస్కో ప్రచురించిన 'మహల్లో కోకిల' వెల రూ. 70. సినిమా చూసినప్పటికీ, సాహిత్యాభిమానులు చదవ దగ్గ నవల.

6 వ్యాఖ్యలు:

 1. అవునండీ !సితార సినిమా అప్పట్లో పెద్ద హిట్ .భానుప్రియ తొలి పరిచయమనుకుంటాను .మీరు రాసిన వంశీ గారి కధానాయిక వర్ణనకి సరిగ్గా సరిపోతుంది .పుస్తకం చదవలేదు .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగుందండి మీరిలా అందమైన నాయికలను పరిచయం చేస్తూ పోతుంటే పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెడతారేమో అలాంటి అమ్మాయిలే కావాలని ,.సరేనండి పనిలోపనిగా యద్దనపూడి నాయకుల్ని పరిచయం చెయరూ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేను నవల చదివి సినిమా చూసాను.
  కోకిల పాత్రకి భానుప్రియగారు న్యాయం చేసారు అనిపించింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నేనూ నవల చదవలేదు. చాలా మంచి సినిమా. ఆ పాత్రకి సినిమాలో భానుప్రియ మాత్రమే న్యాయం చేయగలదు అన్నరీతిలో నటించింది.

  గుర్తు చేశారు కాబట్టి ఇంకోసారి చూడాలి వీలుదొరికినపుడు..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వంశీ కి present continous tense ని simple present tense లో చెప్పడం అలవాటే! పసలపూడి కథలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆనాటి వానచినుకులు, రవ్వలకొండ ఇంకా ఇతరాలు కూడా అంతే!

  నవల చదివినపుడు సినిమా తీయడానికి స్క్రీన్ ప్లే చాలా కష్టపడి రాయాలి అనిపిస్తుంది. కానీ సినిమా కూడా నవలంత బాగుంటుంది.

  చిన్న సూచన ఏమిటంటే మీరు కథ చెప్పడమే కాక నాయిక ను ఇంకొంచెం విశ్లేషిస్తే బాగుంటుంది కదా అని!(ఏ నాయిక అయినా)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @పరిమళం: వీలయితే పుస్తకం చదవండి.. ధన్యవాదాలు.
  @చిన్ని: ఈ తరం అబ్బాయిలు, అమ్మాయిలు చాలా ప్రాక్టికల్ అనిపిస్తోందండి.. కాబట్టి ఆ ప్రమాదం ఉండక పోవచ్చు :) యద్దనపూడి నవలలు నాకూ ఇష్టమే.. ఆవిడ నాయికల గురించి రాద్దాం అనుకుంటున్నా.. నాయకులు అంటే రాజశేఖరమా..?:) ధన్యవాదాలు.
  @పద్మార్పిత: నాకైతే భానుప్రియ ను చూసే కోకిల పాత్ర సృష్టించాడని సందేహం.. ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: చూసేయండి.. ధన్యవాదాలు.
  @సుజాత: నిజమేనండి.. ఈ టపా చూశాక నాకూ అనిపించింది.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు