మంగళవారం, మార్చి 03, 2009

మృచ్ఛకటికమ్

ముందుగా నా టపా 'నాయికలు-మధురవాణి' చదివి వ్యాఖ్య రాసిన బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆ టపాలో నేను శూద్రక కవి రాసిన 'మృచ్ఛకటికమ్' అనే సంస్కృత నాటకాన్నిగురించి ప్రస్తావించాను. నిజానికి, నేను ఆ నాటకాన్ని చదవలేదు. సంస్కృతం రాకపోవడమే అందుకు కారణం. నేను చేయాలనుకుని చేయలేకపోయిన వాటిలో సంస్కృతం నేర్చుకోవడం ఒకటి. మిత్రులు 'ఈ వయసులో ఇంకేం నేర్చుకుంటాం..' అంటారు కానీ, నేర్చుకోడానికి వయసు అడ్డంకి కాదని నా నమ్మకం. ఇక టపా విషయానికి వస్తే, శూద్రకుడి గురించి తెలుసుకోడానికి ఓ సంస్కృత అధ్యాపకుడిని కలిశాను. ఆయన తన దగ్గరున్న పుస్తకాల్లో ఒకటి నాకు చదవమని ఇచ్చారు. అది ఎం.ఆర్. కాలే పండితుడు ఎడిట్ చేసిన 'మృచ్ఛకటికమ్' నాటకం. 1924 లో ప్రచురించిన ఈ పుస్తకం సంస్కృతం తో పాటు, నా వంటి వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు లోనూ ఉంది. ఆ విశేషాలు..

ఎం.ఆర్. కాలే ప్రకారం 'మృచ్ఛకటికమ్' రచనా కాలం క్రీస్తుకు 200 సంవత్సరాల పూర్వం. రచయిత పేరు శూద్రకుడు. ఇతడు ఒక రాజు, కవిత్వం రాసేవాడు కాబట్టి కవి. నిజానికి ఈ రచన గురించి చరిత్ర కారుల మధ్య ఎన్నో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. 'దశకుమార చరిత్ర' రాసిన దండి ఈ రచన కూడా చేశాడన్న వాదన ఉంది. వివాదాలను పక్కన పెట్టి, కథలోకి వెళ్తే, కథా స్థలం ఉజ్జయిని నగరం. కథానాయకుడు చారుదత్తుడు. ఇతడు ఒక వ్యాపారి. సంపాదించినదంతా దాన ధర్మాలకు ఖర్చుపెట్టి, నిరుపేద గా మారతాడు. వయసులో ఉన్నవాడు, అందగాడు. లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నవాడు. నాయిక అదే పట్టణానికి చెందినా వేశ్య వసంతసేన. గొప్ప సౌందర్యవతి. తొలిచూపులోనే చారుదత్తుడితో ప్రేమలో పడుతుంది. చారుదత్తుడు దివాలా తీయగానే అతని దగ్గర పనిచేసే దాస దాసీ జనమంతా వేరే ఉద్యోగాలు చూసుకుంటారు. మైత్రేయుడు, రధనిక మాత్రం పని చేస్తూ ఉంటారు.

మొత్తం పది అంకాలున్న ఈ నాటకంలో మొదటి అంకం లో పాత్రల పరిచయంతో పాటు, ముఖ్య పాత్రలు రెండూ నాటకీయ పరిణామాల మధ్య కలుసుకుంటాయి. రాజైన పాలకుడి బావమరిది శకారుడు వసంతసేన వెంట పడగా ఆమె చారుదత్తుడి ఇంట్లో తల దాచుకుంటుంది. అతన్ని మళ్ళీ కలుసుకోవడం కోసం, తన నగలను అతని వద్ద దాచి ఉంచుతుంది. మైత్రేయుడి అజాగ్రత్త వల్ల సర్విలకుడు అనే దొంగ వసంతసేన ఆభరణాలను దొంగిలిస్తాడు. ఇతడు వసంతసేన దగ్గర పనిచేసే మదనిక ను ప్రేమిస్తాడు. ఆమెను బానిసత్వం నుంచి విడిపించడం కోసం ఈ దొంగతనానికి పాల్పడతాడు. ఆ నగలు వసంతసేనవే అని గుర్తించిన మదనిక 'చారుదత్తుడు పంపాడని' చెప్పి వసంతసేనకి ఇప్పిస్తుంది. చాటునుంచి వారి సంభాషణ విన్న వసంతసేన మదనికను సర్వికులకుడికి ఇచ్చి పంపుతుంది. మరో పక్క, వసంతసేన ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయని తెలుసుకున్న చారుదత్తుడి భార్య ధూత తన వజ్రాల హారాన్ని మైత్రేయుడి ద్వారా చారుదత్తునికి, అతని ద్వారా వసంత సేనకి అందించేందుకు సిద్ధ పడుతుంది.

ఈ నగల విషయమై మాట్లాడేందుకు చారుదత్తుని ఇంటికి వచ్చిన వసంతసేన, తన ప్రేమను ప్రకటించి అతనితో గడుపుతుంది. మర్నాడు ఉదయం ఆమెను పుష్పకరండక ఉద్యానవనానికి తీసుకురమ్మని బండివాడికి చెప్పి బయటకి వెళ్తాడు చారుదత్తుడు. ఇంట్లో ఆడుకుంటున్న చారుదత్తుని కొడుకు రోహసేనుడు, మట్టిబండితో ఆడుకోనని, తనకి బంగారంతో చేసిన బండి కావాలని మారాం చేస్తాడు. తన నగలన్నీ తీసి ఇచ్చి బంగారు బండి బొమ్మ కొనుక్కోమంటుంది వసంతసేన. ('మృచ్ఛకటికమ్' అంటే మట్టి బండి అని అర్ధం) రధసారధి పొరపాటువల్ల వసంతసేన ఎక్కాల్సిన బండిలో రాజుపై తిరుగుబాటు చేసిన ఆర్యకుడు ఎక్కుతాడు. వసంతసేన శకారుడికి చెందిన బండిలో ఎక్కుతుంది. ఉద్యానవనంలో వసంతసేనను చూసిన శకారుడు, ఆమె తనని తిరస్కరించిందన్న కోపంతో ఆమెని గాయపరిచి, మరణించిందని భావించి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వసంతసేన వల్ల సహాయం పొంది ఉన్న భిక్షువు సంవాకుడు ఆమెని రక్షించి, రహస్య ప్రదేశానికి తీసుకెళతాడు.

నగలకోసం వసంతసేన ని హత్య చేశాడన్న అభియోగంపై చారుదత్తుని న్యాయస్థానం లో ప్రవేశ పెడతారు. వసంతసేన ని భిక్షువు తీసుకెళ్ళిన సమయంలోనే, చెట్టు కూలి ఓ మహిళా మరణించడం, రాజోద్యోగులు ఆ మృతదేహం వసంతసేనది గా భావించడం, పైగా బంగారు బండి బొమ్మ కోసం వసంతసేన రోహసేనుడికి ఇచ్చిన నగలు చారుదత్తుడి ఇంట్లో దొరకడంతో నేరం నిరూపణ అవుతుంది. చారుదత్తునికి ఉరిశిక్ష పడుతుంది. సరిగ్గా ఉరి తాడు బిగించే సమయానికి, భిక్షువుతో కలిసి వసంతసేన రావడంతో శిక్ష రద్దవుతుంది. శకారుడికి శిక్ష పడుతుంది. తిరుగుబాటు చేసిన ఆర్యకుడు రాజు అవుతాడు. చారుదత్తుని బండిలో తప్పించుకున్నందుకు కృతజ్ఞతగా అతన్ని 'కుశావతి' అనే చిన్న రాజ్యానికి పాలకుడిగా నియమించడం తో పాటు వసంతసేనకి అతని భార్య హోదా ఇస్తూ ప్రకటన చేయడం నాటకం ముగింపు.

ఎలాంటి అంచనాలు లేకుండా ఈ నాటకం చదవడం మొదలు పెట్టాను. మొదట్లో పాత్రల పేర్లు కొద్దిగా తికమక పెట్టాయి. ఐతే కథలో పడ్డాక లీనమై చదివాను. నాటకం లో చాలా మలుపులని ఇప్పటికీ సినిమాల్లో వాడుకుంటున్నారు అనిపించింది. ఉరిశిక్ష సీన్ లో ఐతే 'అభిలాష' సినిమా గుర్తొచ్చింది. వందల ఏళ్ళ క్రితమే సంస్కృతం లో ఎంత మంచి సాహిత్యం వచ్చిందో కదా అనిపించింది. వర్ణనలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ, మూల రచనని అర్ధం చేసుకుని చదవగలిగితే బాగుండుననిపించింది. ఆనాటి సమాజంలో ఉన్న విలువలు, ముఖ్యంగా దొంగలు, వేశ్యలు కూడా విలువలు పాటించడం, మనుషుల్లో కనిపించే కృతజ్ఞత చూసినప్పుడు ఇప్పటి రోజులతో పోల్చుకోకుండా ఉండలేక పోయాను. ఒక్కో పాత్రను రచయిత పరిచయం చేసిన తీరు అద్భుతం. కేరక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం రీళ్ళకి రీళ్ళు తినేసే నేటి సినిమా దర్శకులు ఈ నాటకం చదవడం అవసరం. మొత్తం చదవడం పూర్తి చేసేసరికి, ఎలాగైనా సంస్కృతం నేర్చుకుని మిగిలిన మూల గ్రంధాలని చదవాలన్న కోరిక బలపడింది.

12 కామెంట్‌లు:

 1. మురళి గారూ!
  సంస్కృత రచనలు చదవకుండానే జీవితం ముగిసిపోతుందనుకునేదాన్ని. ఈ మధ్యనే కాళిదాస కృత కుమారసంభవం,అభిజ్ఞాన శాకుంతలం హింది అనువాదం చదివాను.
  ఇవేళ మీరు రాసిన మృచ్చకటికం-అనువాదం చదివినందుకు చాలా ఆనందంగా ఉంది.
  మీరు చెప్పినట్టుగా కథలూ, మలుపులూ,వర్ణనలూ అన్నీ ఇప్పటి సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి.

  రిప్లయితొలగించండి
 2. మురళి గారూ ! భాషా పరిజ్ఞానం లేక ,సమయం లేక .....ఇతరత్రా కారణాలేమైతేనేం చదవలేనివారికి మీ బ్లాగ్ ఓ మినీ గ్రంధాలయం .ఇంత మంచి పుస్తకాలనూ ,పాత్రలను పరిచయం చేస్తున్నందుకు అభినందనలు .....ధన్యవాదాలు ....అంటే సరిపోదు కానీ అంతకుమించి ఏమి రాయగలం .

  రిప్లయితొలగించండి
 3. oh!the little clycart ante idenannamata..tamil litt lo dini,prastavana undi. baaga undandi vleseshana.good,murali.

  రిప్లయితొలగించండి
 4. @మందాకిని, పరిమళం, చిన్ని: ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. మురళి గారూ..
  స్కూల్లో తెలుగు, హిందీలోనో.. లేక ఇంటర్ సంస్కృతం సబ్జెక్టు లోనో.. ఎక్కడో గానీ.. ఈ కథ చూచాయగా చదివినట్టు జ్ఞాపకం వస్తున్నది. మొత్తం కాదు గానీ.. కొంత భాగం ఎప్పుడో పాత్యామ్షంగా చదివమేమో అనిపిస్తుంది. చారుదత్తుడు, వసంతసేన పాత్రలు గుర్తొస్తున్నాయి.
  అంతకు మించి ఏమీ జ్ఞాపకం రావట్లేదు. మీకేమన్నా ఐడియా ఉందా??
  ఏ విషయం గురించి అయినా మీరు రాసే పద్ధతి మాత్రం బహు ముచ్చటగా ఉంటుంది సుమా ;)

  రిప్లయితొలగించండి
 6. @మధురవాణి: మా రోజుల్లో ఈ పాఠమ్ ఉన్నట్టు లేదండి.. ఓ సారి తెలుగు మాస్టారు సంస్కృత నాటకాల గురించి చెబుతూ ఈ నాటకం గురించి చెప్పారు. హైదరాబాదు లో ఓ సారి ఈ నాటకం తెలుగు అనువాదం 'మట్టిబండి' ని ప్రదర్శించారు. చూడలేకపోయాను. మీకు చాలా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 1975,76 సంవత్సరాల లో 9గానీ 10వ తరగతి కి గానీ మృచ్చకటికం ఉపవాచకం .నా క్లాసు పుస్తకం కాకపోయినా నేను చదివాను.బాగానే గుర్తుంది.అన్ని పాత్రలూ గుర్తున్నాయి.మళ్లీ ఆ అనువాదం కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు.దొరికితే అదృష్టమే.

   తొలగించండి
 7. క్లుప్తంగా చాలా బాగా రాశారు. 1970 లలో విజయవాడలో పండితులైన దేవరకొండ చిన్నికృష్ణశర్మగారు అనేక సంస్కృత తెలుగు కావ్య నాటకాల కథల్ని బడీవయసు పిల్లలకి అర్ధమయ్యే సులభమైన తెలుగులో చిన్ని చిన్ని పుస్తకాలుగా ప్రచురించారు. వారి పుణ్యమాని, సంస్కృతం నేర్చుకోకపోయినా, కనీసం ఆయా కావ్యనాటకాల మూల కథలు తెలిశాయి నాలాంటి వారికి.
  అటుపైన ఉత్తరభారద్దేశపు ప్రకాశాకులెవరో అనేక సంస్కృత నాటకాలని ద్విభాషా ఎడిషన్లు వేశారు, ఎడమవైపు సంస్కృతం కుడిపక్క ఆంగ్లం. ఇవి నాకు పెంస్లిల్వేణియా విశ్వవిద్యాలయం వారి గ్రంధాలయంలో కనబడ్డయి. అలా చదివాను ఈ నాటకం. కే. లాల్ అనే పండితుడు ప్రచురించిన 4 నాటకాల అనువాద పుస్తకంలో కూడా ఈ నాటకం ఉంది.
  కథ బహు నాటకీయంగా, పలు మలుపులు తిరుగుతూ, ఒకరి రహస్యం ఒకరికి తెలీకుండా, గుట్టుమట్లతో సస్పెన్సుతో సాగుతుంది.
  భారతీయ ్నాటక కళలో పాత్రల్ని ఎస్టాబ్లిష్ చెయ్యడం గురించి ప్రముఖ దర్శకుడూ అడూర్ గోపాలకృష్ణం గారి అభిప్రాయాల్ని నవతరంగంలో చదవండి.
  మురళిగారు, మరోసారి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. @కొత్తపాళీ: 'నాయికలు-మధురవాణి' టపా రాయక పోయి ఉంటే ఈ నాటకాన్ని ఇంత త్వరగా చదివే వాడిని కాదండి. నేను చదివింది కూడా ద్విభాషా ఎడిషనే.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించండి
 9. good post..
  i think i read part of this while doing sanskrit as 2nd language
  I remember seeing some hindi movie too, with Rekha in it, with some twisted storyline involving vatsayana too in this vasanatasena's story!!

  రిప్లయితొలగించండి
 10. mRcCakaTikaM naaTakaanni #'#utsav#'# anna pErutO gireesh karnaaD darSakatvaMlO rEkha vasaMtasEnagaa, taanE sakaaruDigaa SaSikapoor nirmiMcaaDu. caalaa baaguMTuMdi, DeeveeDee cooDaMDi.

  jampaala caudari

  రిప్లయితొలగించండి
 11. ఈ నాటకాన్ని శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి అనువదించారు. మూలం + అనువాదం ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. చాలా అద్భుతమైన పుస్తకం. సంస్కృతం రాకపోయినా ఇది చదివిన తర్వాత కొంత వస్తుంది.

  రిప్లయితొలగించండి