శనివారం, మార్చి 14, 2009

మీరా కళాజ్యోత్స్న

తెలుగు పద్య నాటకం అనగానే ఎవరికైనా గుర్తొచ్చేవి సుదీర్ఘమైన రాగాలు. నటన కన్నా, ఒకరిని మించి మరొకరు రాగాలు తీస్తూ పద్యాలు ఆలపించడం లోనే నటీనటులు పోటీ పడతారు. పూర్వం పల్లెల్లో నాటకాలు ప్రదర్శించినపుడు ఈ పద్యాలకి వన్స్ మోర్లు పడేవి. ముఖ్యంగా 'గయోపాఖ్యానం' 'హరిశ్చంద్ర' వంటి నాటకాల ప్రదర్శన అంటే సగం నాటకం కూడా పూర్తి కాకముందే తెల్లవారిపోయేది. కేవలం పద్యాల కోసమే నాటకాలు చూసేవాళ్ళు అప్పటి తరం ప్రేక్షకులు. కాలం తో పాటే ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పు వచ్చింది. పద్యనాటకాలను ఇష్టపడే వాళ్ళు కూడా సుదీర్ఘ రాగాలను ఆమోదించలేకపోతున్నారు.

ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును గుర్తించి, అందుకు అనుగుణంగా పద్య నాటక ప్రదర్శన లో గణనీయమైన మార్పులు తెచ్చిన సంస్థ విశాఖపట్టణానికి చెందిన 'మీరా కళాజ్యోత్స్న.' ఈ సంస్థ స్థాపకుడు మీగడ రామలింగ స్వామి. రంగస్థలంపై మూడున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు. కేవలం నటుడు మాత్రమే కాదు రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఆహార్య నిపుణుడు - ఒక్క మాటలో చెప్పాలంటే నాటకానికి సంబంధిన ప్రతి పనిలోనూ నైపుణ్యం ఉన్నవాడు. వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకుడైన రామలింగ స్వామి ప్రవృత్తి పద్య నాటకాలు నిర్మించి ప్రదర్శించడం. తర్వాతి తరానికి రంగస్థల శిక్షణ ఇవ్వడం.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నాటకాలకు నంది బహుమతులు ప్రవేశ పెట్టి, పోటీలు ప్రారంభించాక మొదటి మూడు సంవత్సరాల్లో వివిధ విభాలకు గాను మొత్తం 35 నందులను అందుకున్న సంస్థ 'మీరా కళాజ్యోత్స్న.' మరో విశేషమేమిటంటే స్వామి మినహా మిగిలిన అందరూ రంగస్థలానికి కొత్తవారు. నాయిక పాత్రలు పోషించే రత్న శాస్త్రి ఐతే షష్టిపూర్తి కి చేరువైన ఓ బామ్మ గారు. ఒక స్కూలు ప్రిన్సిపాల్. కొత్త స్క్రిప్టు ని తయారు చేయడం మొదలు, దానికి కావలసిన సంగీతం, నాతీనతులకి ఆహార్యం సమకూర్చడం, రిహార్సల్స్ చేయించడం, పోటీలకి ఎంట్రీ పంపడం ఇలా సమస్తమూ ఒంటి చేతి మీద నిర్వహిస్తారు స్వామి.

అది 'అశ్వద్ధామ' కావొచ్చు, 'గుణనిధి' కావొచ్చు లేదా 'చిరు తొండ నంబి' కావొచ్చు.. ఏ నాటకం లోనైనా ప్రేక్షకుల కోసం ఓ సందేశం అంతర్లీనంగా ఉంటుంది. వర్తమాన అంశాలను పరోక్షంగా స్పృశిస్తారు. పద్యాలు వినసొంపుగా ఉంటాయి. పాత్రధారుల నటన తమ పరిధి మేరకు మాత్రమే ఉంటుంది. భారీ సెట్టింగులకి వీరి ప్రదర్శనలు దూరం. చిన్నపాత్రలను మలచడం లో సైతం ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. ప్రతి నాటకం చివరికి వచ్చేసరికి ప్రేక్షకులు నాటకంలో లీనమై రసానుభూతిని పొందుతారు. కేవలం నంది నాటకాల్లో మాత్రమే కాదు, ఆంధ్ర దేశం లో జరిగే అని ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లోనూ పాల్గొన్న 'మీరా కళాజ్యోత్స్న' కళాకారుల ప్రతిభ అనతి కాలంలోనే విదేశాలకూ పాకింది.

కొత్తతరం సరే.. పాత తరం ప్రేక్షకులు ఈ మార్పులని అంగీకరిస్తారా? అన్న సందేహం సహజం. ప్రదర్శన ముగిశాక వీరిని అభినందించే వారిలో పాత తరం ప్రేక్షకులే ముందుంటారు. పద్యాలను ఆలపించడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న స్వామి అప్పుడప్పుడు టీవీల్లో కనిపిస్తున్నారు.. పద్యాలు ఆలపిస్తూ. చిన్న పిల్లలకి పద్యాలు నేర్పించడం ఆయనకి ఇష్టమైన పనుల్లో ఒకటి. వరుసగా ప్రతిసంవత్సరం 'మీరా కళాజ్యోత్స్న' కి నందులు రావడం సహజంగానే కొందరికి నచ్చలేదు. రచ్చ, రాజకీయం చేశారు. నాటక ప్రదర్శనకి అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం. తమ చప్పట్ల ద్వారా అప్పటికప్పుడే వాటిని ప్రకటిస్తారు ప్రేక్షకులు. ఈ రివార్డులు మాత్రం 'మీరా కళాజ్యోత్స్న' కి అందుతూనే ఉన్నాయి.

4 వ్యాఖ్యలు:

 1. నాటకాల గురించి మాకు తెలియని ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు, ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అసందర్భమేమో గానీ మురళీ గారు , మీ బ్లాగులో నెమలి కన్ను చూసినప్పుడల్లా, నాకు మాఇంట్లో ఒక పుస్తకం గుర్తువస్తుంది. 7, 8 తరగతుల్లో అనుకుంటా , మా ఇంటికి ఒక చెంచు వాడు వచ్చాడు. ఇప్పుడేమో కాని, అప్పట్లో చెంచు వాళ్ళు నెమలి ఈకలు విపరీతంగా ధరించేవారు. నేను ఇంట్లో ఎవ్వరూ లేని సమయం కావున, ఒక మానెడు రాగులు పోసి ఒక నెమలి పింఛం కొన్నాను. ఆ పింఛెం ను చిన్న చినా నెమలి కన్నులు గా చేసి పిల్లలు పెడుతుందని ఒక్కో పుస్తకంలో ఒక్కోటి దాచాను. అందులో ఒకటి ఇప్పుడు నాదగ్గర వుండటంతో మా పిల్లలు దాన్ని నా వారసత్వంగా వాళ్ళ పుస్తకాల్లో వంతులు వేసుకుని మరీ వుంచుకుంటున్నరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం...నిజమేనండీ కళాకారులకు అవే నిజమైన నీరాజనాలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @సిరిసిరిమువ్వ, పరిమళం: ధన్యవాదాలు.
  @భాస్కర రామిరెడ్డి: ధన్యవాదాలు. నా నెమలీక కథ ఇక్కడ చదవండి:
  http://nemalikannu.blogspot.com/2009/01/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు