సోమవారం, మార్చి 09, 2009

ఏం చూడాలి?

తెలుగు సినిమాలకు కరవొచ్చిందా? అవుననే అనిపిస్తోంది, గడిచిన రెండు నెలలుగా పరిస్థితి చూస్తుంటే. 'అరుంధతి' తర్వాత ఇప్పటివరకు సరైన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. 'అరుంధతి' నిర్మాతలకి ఇది కలిసొచ్చే అంశమే ఐనప్పటికీ, క్రమం తప్పకుండా సినిమాలు చూసే నాలాంటి ప్రేక్షకులకి ఎంత ఇబ్బంది? ఫిబ్రవరి నెల మొత్తానికి నేను థియేటర్ లో చూసినవి రెండే..'అరుంధతి''వినాయకుడు' అవికూడా రెండోసారి. గడిచిన వారం రోజుల్లోనూ చూసింది 'దోస్తానా' అనే హిందీ చిత్ర రాజం. అదికూడా అనుకోని పరిస్థితుల్లో.

గడిచిన నెలలో చూడాలనుకుని చివరి నిమిషంలో విరమించుకున్న సినిమాలు రెండు. 'కొంచం ఇష్టం కొంచం కష్టం' 'స్లండాగ్ మిలియనీర్.' మొదటి సినిమా చూడొద్దని ఓ ఫ్రెండ్ చివరి నిమిషంలో హెచ్చరించడంతో విరమించుకున్నా.. ఇక రెండో సినిమా చూద్దామనుకుంటుండగానే అది ఆస్కార్ కి నామినేట్ కావడం, మీడియా లో విస్తృతంగా వార్తలు, సమీక్షలు రావడం.. అవి చదివాక సినిమా చూడాలనే కోరిక సన్నగిల్లడం జరిగింది. చూడకూడదు అనైతే ఇంకా నిర్ణయించుకోలేదు. సినిమాలు చూడక పోవడం ఓ రకంగా మంచి చేసింది.. ఆ టైం ని పుస్తకాలు చదవడం కోసం వినియోగించా.. 'మృచ్చకటికమ్' అలా చదివిందే.

పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో చూడదగ్గ సినిమాలు వచ్చే అవకాశాలు ఏవీ కనిపించడం లేదు. పరిక్షల సీజన్, ఎలక్షన్ సీజన్ కూడా కావడంతో కొత్త సినిమాలు పెద్దగా విడుదల కాకపోవచ్చు. అయినా నటీనటులే రోడ్ల మీద కనిపిస్తారు కాబట్టి ప్రేక్షకులు కూడా సినిమాల కోసం ఎదురు చూడరేమో.. పరభాషా సినిమాల విషయానికి వస్తే ఢిల్లీ-6 సినిమా చూద్దామా అని ఆలోచిస్తున్నా. మంచి సినిమాలు ఏవీ రాకపోతే పాత సినిమాల డీవీడీ లు ఎలాగో ఉండనే ఉన్నాయి.

ఉదయం రోడ్డు మీద వెళ్తుంటే 'ఆకాశమంత' పోస్టర్ కనిపించింది. త్రిష టీనేజ్ అమ్మాయి గా కనిపించడం కోసం డైటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. నాకు ఒక్కసారిగా పాత సినిమాలు గుర్తొచ్చాయి. రామారావో, నాగేసర్రావో పరిగెత్తుకుంటూ కన్నాంబ దగ్గరికి వచ్చి 'అమ్మా నేను బీయే పాసయ్యానమ్మా..' అని చెప్పగానే, ఆవిడ ఫోటోలో పూల దండ వెనుక నవ్వుతున్న ఎస్వీఆర్ వైపు చూసి గాద్గదికంగా 'మీ నాన్నగారి ఆశయం నెరవేర్చావు నాయనా..' అంటూ జలజలా ఆనంద భాష్పాలు రాల్చడం కళ్ళ ముందు మెదిలింది.. అలాంటి పాత్రలకోసం అప్పటి వాళ్ళెవరూ డైటింగులు అవీ చేయలేదు.. జనం కూడా 'పిల్లల తండ్రుల్లా ఉన్నవాళ్ళు బీయే పాసవ్వడం ఏమి'టనీ అనుకోలేదు.. ఇప్పుడేమిటో పాత్రోచితంగా ఉండడం కోసం హీరోలు కండలు పెంచే, హీరోయిన్లు డైటింగులు చేసే ట్రెండ్ వచ్చింది.

ఈనాడు ఓ చల్లని వార్త చెప్పింది. ఈటీవీ సుమన్ని ఇక వెండి తెరపై చూడొచ్చు. ఓ భారీ పౌరాణిక చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. అప్పట్లో భారీ యెత్తున ప్రకటనలిచ్చిన 'ఉషా పరిణయం' ఏమైందో తెలియదు. కొత్తగా రాబోతున్న పౌరాణిక చిత్రంలో ప్రభాకర్ ఉంటాడా ఉండడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. వెండి తెర ప్రవేశం అంటే, బుల్లితెర మీద కూడా మళ్ళీ వీర విహారం మొదలు పెడతాడా అని స్నేహితులు కొందరు ఆత్రంగా ఎంక్వైరీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు బయటికి రావడానికి కొంచం సమయం పట్టేలా ఉంది. సుమన్ పునరాగమనంతో తెలుగు బ్లాగులకి కూడా కొత్త కళ వస్తుంది కదా...

10 వ్యాఖ్యలు:

 1. ఈనాడు ఓ చల్లని వార్త చెప్పింది.....బాబోయ్ మీరు సుమన్‌కి పంఖానా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సుమన్ పునరాగమనంతో తెలుగు బ్లాగులకి కూడా కొత్త కళ వస్తుంది కదా....
  ఎంత మంచి వార్త చెప్పారు సార్.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఢిల్లీ-6 చూసాను. నాకెందుకో సినిమా అంతగా నచ్చలేదు. ఇతమిద్దంగా కారణమిదని చెప్పలేను గానీ, ఎందుకో సినిమాలో పూర్తిగా లీనం కాలేక పోయాను. ఒకవేళ మీరు చూస్తే, సమయం దొరికితే, మీ అభిప్రాయం చెప్పండి ఇక్కడైనా లేదా ఈ-మెయిల్లో

  టీవీ కంటే, వెండితెరే బెటరేమో, ఒక రెండు గంటల్తో పీడా వదులుద్ది.. ప్రభాకర్ ది ఏదో ప్రోగ్రాం చూసా "జగడం" అనుకుంటా..ఒక అరగంట వరకూ తేరుకోలేకపోయా.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. 'ఆకాశమంత'సినిమా బాగుంది. రిలీజ కాకుండా ఎలా తెలుసా అని అడక్కండి. నేను తమిళ్ లో ఆల్రెడీ చూసేసా."అభియుం-నానుమ్" దీని పేరు. అతిగా కూతుర్ని ప్రేమించే తండ్రికథ ఇది. హృద్యంగా చూపించారు. తమిళ్ లో ప్రకాశ్ రాజ్ ఈ చిత్ర నిర్మాత. ఈ సినిమా నాదగ్గరుంది. హైదరాబాద్ వాళ్ళూ...కాచుకోండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పోనిలే మురళీ ఎడారిలో ఒయాసిస్సు లాగ చల్లని వార్త చెప్పారు సుమన్ మళ్ళీ వెండి తెరపై చూడొచ్చని.సూపర్ స్టార్ కృష్ణ నటించడం తగ్గాక(బాలయ్య ఆ లోటు పూర్తి చేస్తున్నా)ఎవర్ని చూసి జోకులేసుకోవచ్చో తెలియక చస్తున్నా నిజంగా మంచి శుభ వార్త.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @సిరిసిరిమువ్వ: అవునండి..మీ అందరిలాగే :) ధన్యవాదాలు.
  @krishnarao jallipalli: :) ఈనాడు సినిమా పేజి లో నిలువెత్తు ఫోటో తో సహా వేశారండి. ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: ఢిల్లి-6 గురించి నా స్నేహితుడు కూడా మీరు చెప్పినట్టే చెప్పాడండి.. మీ వ్యాఖ్య చదివాక చూడకపోవడం వైపే మొగ్గు చూపుతున్నా.. ధన్యవాదాలు.
  @కత్తి మహేష్ కుమార్: ఐతే తెలుగు వెర్షన్ కోసం ఎదురు చూస్తాను.. ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: నేను థియేటర్ల ముందు సుమన్ నిలువెత్తు కటౌట్లు అవీ ఊహించుకుంటున్నానండి :) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. తండ్రీ కొడుకులు మళ్ళీ కలుసుకున్నారా??? నేను మళ్ళీ పేపరు రోజూ చదవడం మొదలు పెట్టాలి :(

  ప్రత్యుత్తరంతొలగించు
 8. తారకరత్న సినిమా చూశానండి.
  ఇంక ఎవరి వారసుల సినిమాలూ నన్ను
  బెదిరించలేవు. నేను సిద్ధమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @నేస్తం: పేపర్ చదవడం కుదరకపోతే రోజూ బ్లాగులైనా చూస్తూ ఉండండి :) ధన్యవాదాలు.
  @భవాని: ఐతే మీరు కరడుగట్టిన ప్రేక్షకులన్న మాట :) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. "స్లమ్ డాగ్ మిల్లియనేర్" నాకైతే బాగానచ్చిందన్డీ.ఎప్పుడన్నా వీలు పడితేచూడండి. 'కొంచం ఇష్టం కొంచం కష్టం' కూడా నాకైతే నచ్చింది.పాటలతోసహా.

  ప్రత్యుత్తరంతొలగించు