ఆదివారం, మార్చి 01, 2009

పులిహోర

ఆదివారాన్ని రొటీన్ కి భిన్నంగా గడపాలనుకుని చివరికి రొటీన్ గా గడిపేయడం చాలాసార్లు జరిగింది. అందుకే ఇవాళ రొటీన్ కి భిన్నంగా గడపడం లాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదు. బారెడు పొద్దెక్కాక నిద్రలేచి పేపర్లు ముందేసుకుని కూర్చున్నా.. సింగీతం-గొల్లపూడి ల డబుల్ ధమాకా చదివి, ఆదివారం అనుబంధాలు తిరగేశాక అప్పుడు అనిపించింది ఏదైనా వెరైటీ గా చేద్దాం అని.

ఆలోచించి..చించి..వంట దగర ఆగాను. వేసవి వచ్చేస్తోంది కాబట్టి అప్పుడు తినలేనిది ఏమైనా చేయాలనుకోగానే సూపర్ మార్కెట్ లో కొన్న రెడీమేడ్ పులిహోర పేకెట్ కి మోక్షం రాలేదన్న విషయం గుర్తొచ్చింది. 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని' ఎదురు చూడకుండా మనమే దాని సంగతి చూద్దాం అనుకున్నా. జింబో నగర ప్రవేశం తరహాలో వంటింటి ప్రవేశం చేసి పులిహోర అనే వంటకాన్ని పూర్తి చేసిన కథా క్రమంబెట్టిదనిన...

నాకు అస్సలు వంట అంటే ఏమిటో తెలియకుండా ఇంతటి మహా ప్రయత్నానికి ఒడిగట్టాననుకుంటే పొరపాటే.. థాంక్స్ టు అమ్మ.. చిన్నప్పుడు అసిస్టంట్ కుక్ గా పనిచేసిన అనుభవం ఉంది. అద్భుతంగా కాదు కాని, ఓ మాదిరిగా వండ గలను. పులిహోర చేయడానికి అన్నం కావాలి కదా.. 'పులిహోరకి అన్నం మేకుల్లా ఉండాలి' అని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. మేకుల్లాంటి అన్నం కోసం అమ్మ పడ్డ తిప్పలూ గుర్తొచ్చాయి.

ఎక్కువ గంజి వార్చి, మూతపైన కణ కణలాడే నిప్పులు వేసి.. ఇప్పుడు అలాంటి బాధలు లేవు. నీళ్ళు కొంచం తక్కువ పోసి కుక్కర్ లో బియ్యం పెట్టి, తదుపరి కర్తవ్యం ఆలోచించా.. 'ఆడుతూ పాడుతూ పని' చేయాలని సావిత్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. సినిమా సావిత్రే.. 'వూపుతు విసరుతు గూడేస్తూ' చెప్పింది కదా.. 'బొమ్మరిల్లు' పాటలు పెట్టా.. 'అపుడో ఇపుడో..' పాట అయ్యిందో లేదో కుక్కర్ విజిల్ ఊదేసింది.

అప్పుడు రెండో స్టవ్ మీద బాండీ పెట్టా.. వేడెక్కాక కొంచం ఉదారంగా నూనె పోసి, ఏమేం వేయాలా అని నూనె కాగే వరకు ఆలోచించి నూపప్పు, శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు వేశా.. నిలువుగా కోసిన ఓ అరడజను పచ్చి మిరపకాయలు నూనెలోకి జారవిడిచా.. 'పులిహోర పోపులో పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేగ కూడదురా..' చిన్నప్పుడు ఓ పళ్ళెం లోకి నాకోసం తీసిన పల్లీలు ఊదుకుని మింగుతుండగా అమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ప్చ్.. అప్పటికే ఆలస్యం అయిపొయింది. పచ్చిమిర్చి రంగు మారి ముదురు రంగులోకి వచ్చేశాయి.

రెడీ మిక్స్ ప్యాకెట్ కత్తిరించి మొత్తం పదార్ధాన్ని బాండీ లోకి వంచా.. ఇప్పుడు వంట చేసే పుణ్య పురుషులకి ఓ సూచన. మీరు వంట చేసేటప్పుడు ఎవర్నీ వంట ఇంట్లోకి రానివ్వకండి.. వంట అనేది చాలా ఏకాగ్రత తో చేయాల్సిన పని. ఇది ఎందుకు చెబుతున్నానంటే మిక్స్ ని బాండీ లోకి వంచగానే ఫోన్ మోగింది. కొలీగ్ నుంచి..వద్దనుకుంటూనే తీశా. 'పులిహోర చేస్తున్నా'నని కొంచం గర్వంగానే చెప్పాను. ఫోన్ అయ్యేసరికి బాండీ లో పదార్ధం అప్పటి వరకు రంగురంగులలో ఉన్నదల్లా కృష్ణవర్ణంలోకి మారడం మొదలు పెట్టింది.

'పొయ్యిమీద వంటకం పాడవుతోందనిపిస్తే వెంటనే వెంటనే గిన్నెని పొయ్యిమీంచి దింపెయ్యాలి' అమ్మ చెప్పిన చిట్కానే.. గిన్నె దించే బదులు, స్టవ్ ఆపేశా.. కుక్కర్ మూత తీసి, మేకుల్ని.. అదే అన్నాన్ని.. బాండీ లోకి వంచా.. అన్నం వేడి చల్లరేవరకు గరిటె తోనూ తర్వాత చేతితో కలపడం మొదలు పెట్టా.. 'బొమ్మని గీస్తే నీలా ఉంది..' పాట వస్తోంది.. నాకు ఎప్పటిలాగే చినరాయుడు లో 'బుర్రుపిట్ట..' పాట గుర్తొచ్చింది.

బాండీ లో ఉన్నదాన్ని చూస్తే ఎక్కడా పులిహోర లా అనిపించడం లేదు. ఘుమఘుమలు కూడా లేవు. కొంచం రుచి చూశా.. 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' లో రవితేజ చేసిన పులిహోర రుచి చూసి కల్యాణి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లాంటిది ఈ వంటకానికి రావడం కల్ల అన్న విషయం అర్ధమైపోయింది. 'వంట బాగుండాలంటే వండే వాళ్ళ కష్టం తో పాటు తినే వాళ్ళకి దంతసిరి కూడా ఉండాలిరా..' అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాటలు వోదార్చాయి.

అయినా నేనేమీ అద్భుతమైన వంట చేయాలని మొదలు పెట్ట లేదు కదా.. సందర్భోచితంగా 'నమ్మక తప్పని నిజమైనా' పాట వచ్చింది. మొత్తానికి పులిహోర మిగల్లేదు. మిగిలిందల్లా గోళ్ల చివర పసుపు రంగు మాత్రమే..

16 వ్యాఖ్యలు:

 1. అయినా ఈ రెడీ మిక్స్ లు ఎందుకండి?? చక్కగా నిమ్మకాయతో చేసుకోక......

  ఇలాంటి సమయమ్లోనే మన ప్రాజెక్ట్ మేనేజర్నో, టీమ్ లీడ్ నో లంచ్ కి పిలవాలన్న ఆలోచన రాలేదా మీకు......

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళి: హ హ హ... ఆపకుండా అరగంట నవ్వేను మీ పులిహోర తలుచుకుని.... అందుకే మరి multitasking చేయటం నేర్చుకోవాలి.. అమ్మ అది చెప్పి వుండరు ఎందుకంటే అప్పట్లో అమ్మ కు పులిహోర పోపు వేసేక ఫోన్ చేసి కబుర్లు చెప్పే స్నేహితులు వుండి వుండరు..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అర్దం కాలేదు, రెడీమేడ్ అన్నారు, మాన్యూల్ గా చేసినట్టున్నారు!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళి గారూ ! మీరు మొదలుపెట్టిన వైనం చూసి భోజనానికి వచ్చేద్దామనుకున్నా !ప్చ్ ......నాక్కూడా దంతసిరి ఉన్నట్టు లేదు .అన్నట్టు ఉప్మాలూ ,పులిహోరాలూ చేయడానికి రెడీ మిక్స్ లని నమ్ముకోకండీ బాబూ .....నేనూ ఘోరంగా దెబ్బతిన్నా .....

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పోనిలే నీలాగే నేనూ అని అబద్దం చెప్పలేను [ఆవలీలగా 20lb bag of rice తో పులిహోర అదీ scratch నుంచి చేసిపడేసిన చేతులివి, సో మీలా ఎందరో మీరు వంటరి కాదని మాత్రం చెప్పగలను, అబ్బా పులిహోర పెద్ద పని, నాకు అన్నం కుదిరితే పులుసు చెడతది, లేదంటే రెండూ చెడతాయనే కొందరు మిత్రులున్నారు కనుక. ఇక పోతే మిగిలిన అన్నాన్ని నిమ్మకాయతోనో, చింతపండుతోనో పులిహోరగా చేసి చేసి ఆ మధ్య మిగిలకుండా వండటం నేర్చుకున్నాలేండి. మనలో మాట cooking classes ఇమ్మంటారా? ;) మా నాన్నగారికి వంటల పిచ్చి, ఆదివారాలు వస్తే బూడిద గుమ్మడి సూప్ అనో, కొత్తిమీర మురబ్బా అనో ప్రాణం తీసేవారు. మాలాగే పాపం కాబోలు మీ ఇంట్లోని వారు ... హ హ హ్హా..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఒకసారి పులిహోర మిక్స్ తో పులిహోర చేస్తే ఒకటే ఇసక. అప్పట్నుంచి పులిహోర ఇన్ స్టెంట్ మిక్స్ ఎప్పుడూ వాడలేదు.. :(

  మీ పులిహోర పుణ్యమా అని "బొమ్మరిల్లు" పాటలు మరోసారి విన్నా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @జ్యోతి: :) ధన్యవాదాలు..
  @శేఖర్ పెద్దగోపు: సూపర్ మార్కెట్ కెళ్ళిన బలహీన క్షణంలో కోనేస్తూ ఉంటామండి పేక్ లు. మీ ఐడియా బాగుంది. ఎవరైనా భోజనానికి పిల్చినప్పుడు కొంచం ఆలోచించి వెళ్ళాలన్న మాట. ధన్యవాదాలు..
  @భావన: నిజమేనండి, నేర్చుకోవాల్సిందే.. ధన్యవాదాలు.
  @మధు: ఒక్కసారి రెడీ మేడ్ తో చేసి చూడండి. అర్ధం అవుతుంది. ధన్యవాదాలు.
  @పరిమళం: పూర్తిగా చదివాక కూడా వద్దామనే అనుకున్నారా.. ఎంత ధైర్యవంతులండీ మీరు :) ధన్యవాదాలు.
  @ఉష: మీ మిత్రులకి చెప్పండి..పులిహోర అని మొదలు పెట్టినంత మాత్రాన అది చివరికి 'పులిహోర' రూపం లోనే రానవసరం లేదని :) ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: నేనూ ఎప్పటికప్పుడు ఈ మిక్స్ లు ఇంక వద్దు అనుకుంటా.. అయినా కొనేస్తూ ఉంటా.. కాపీలు అవీ చేసినా దేవిశ్రీ కొన్ని మంచి పాటలు కూడా చేశాడు. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మురళి గారూ..
  ఇంతకీ పులిహోర మిక్స్ ఏ కంపెనీది?
  'MTR పులియోగరే' or ప్రియ నా? MTR ది మాత్రం బాగా ఆకలేసినప్పుడు కాస్త రుచిగానే అనిపిస్తుంది. కానీ.. ఆ రుచికీ, మన పులిహోరకీ ఏ మాత్రం సంబంధం ఉండదు.
  అయినా.. మిక్స్ కలిపే టైం లో నిమ్మకాయ పులిహోర కలిపేసుకోవచ్చు కదండీ.. ;)
  నా స్నేహితుడొకరు సిట్రిక్ ఆసిడ్ క్రిస్టల్స్ (తినదగినవే) నీళ్ళల్లో కలిపి నిమ్మ రసానికి బదులు వాడి పులిహోర చేస్తాడు. రుచి మాత్రం నిమ్మ కాయ కాదని మీరు చెప్పినా ఎవరూ నమ్మరు. అంత బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మరి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @మధురవాణి: ఒక సారి మా ఇంట్లో MTR మిక్స్ తో వంట చేస్తుంటే మా పక్కింట్లో కొత్తగా దిగిన వాళ్ళు 'మీరు తమిళియన్సా?' అని అడిగారు (ఆ వాసన మహిమ). అప్పటినుంచి MTR విషయం లో కొంచం జాగ్రత్తగా ఉంటున్నాం. వాడింది ప్రియ మిక్స్ అండి. చెప్పానుగా బలహీన క్షణాల్లో కోనేస్తూ ఉంటానని. సిట్రిక్ ఆసిడ్ క్రిష్టల్స్ తో ఓ పెళ్ళిలో పులిహోర చేయడం చూసి ఔరా అనుకున్నా.. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఆ అనుభవం కూడా మీ అందరితో పంచుకుంటా :) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. quite hilarious.
  అవునూ, పక్కింటి వారితో మీరు తమిళియంసా అని అడిగించుకుంటే అంత కినుక యేల? పోన్లెండి, వేలి గోళ్ళ చివర పసుపన్నా మిగిలింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @కొత్తపాళీ: కినుక కాదండి, తెలుగు గుబాళింపు కోసం తాపత్రయం. అరవ పులిహోర ని తక్కువ చేసే ఉద్దేశం లేదు. నాకు ఇష్టం కూడా.. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మీరు ఎన్ని సినిమా పాటలు పాడినా చదువుతున్నంత సేపు నాకు అమ్మ చెప్పింది టైటల్ సాంగ్ గుర్తొచ్చింది

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @Subrahmanya Chaithanya Mamidipudi: :-) :-) అలా అంటారా? ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మీరూ నలభీముల కోవకే చెందుతారన్నమాట. మరి ఇంకెందుకాలస్యం..షడ్రసోపేతమైన విందునేర్పాటుచేసేయండి నెమలికన్నులో..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. కొత్త టపాలు రాయకపోతే ఏం చేస్తాం? ఇలా పాత టపాలు చదువుకుంటూ ఉంటాం...:)

  ప్రత్యుత్తరంతొలగించు