బుధవారం, మార్చి 11, 2009

మార్పు

మా బామ్మ (నాయనమ్మ) కి ఎనిమిదేళ్ళ వయసప్పుడు తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఉండగా, మా ముత్తాత (తాతయ్య వాళ్ళ నాన్న) వాళ్ళ ఇంటికి వెళ్లారట. బామ్మ వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడి, దూరంగా ఆడుకుంటున్న బామ్మని చూపించి 'అదిగో ఆ ఎర్ర గౌను వేసుకున్న పిల్లే మీ కోడలు' అని చెప్పారట. పెళ్ళికి బంధువులని పిలవడం మొదలు పెట్టే వరకు తాతయ్యకి తన పెళ్లి అనే విషయమే తెలియదట.

అర్ధరాత్రి ముహూర్తానికి నిద్రకి జోగుతున్న బామ్మ మెడలో ఆయన తాళి కట్టేశారు. వీధి బడి ముఖం కూడా తెలియని బామ్మ తన వాళ్ళందరిని వదిలి కాపురానికి వచ్చేసింది తన లక్కపిడతల బుట్ట తో సహా.. . తాతయ్య నాయనమ్మ కలిసి కాపురం చేసి ఎనిమిది మంది పిల్లల్ని కన్నారు. ముత్తాత ఇచ్చిన ఆస్తుల్ని కరిగించి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి పెళ్ళిళ్ళు చేశారు. ఇటు వైపు అమ్మమ్మ, తాతగార్లదీ ఇదే కథ. వీళ్ళకి తొమ్మిది మంది సంతానం.

మా బామ్మకి గానీ, అమ్మమ్మకి గానీ భర్త ఏది చెబితే అదే వేదం. భర్త మాటకి ఎదురు చెప్పడం నేరం. ఇంటి ఖర్చులకి డబ్బు అడగాలన్నా కూడా అతగాడి మూడ్ గమనించి ఓర్పుగా, నేర్పుగా అడగాలి. పుట్టింటికి వెళ్లి రావడానికి ఎంతగానో బతిమాలాలి. ఆ తరం లో ఆడపిల్ల భర్త మరణిస్తే పుట్టింట్లో వితంతువుగా శేష జీవితం గడపాలి. తన పిల్లలు కాని వాళ్లకి చాకిరీ చేస్తూ, అన్నా వదినల మోచేతి నీళ్ళు తాగుతూ.. మరణం కోసం ఎదురు చూడాలి. ఆడ పిల్లకి చదువెందుకు అనే రోజులు. సకేశి అయినా, అకేశి అయినా గోషా పాటించాల్సిందే. భర్తకే కాదు, పెరిగిపెద్దైన మగ పిల్లలకీ వాళ్ళు భయ పడాల్సిందే.

మా అమ్మ, అత్తయ్యల తరం వచ్చే సరికి 'ఆడపిల్లకి చాకలి పద్దు రాసేంత చదువు వస్తే చాలు' అనుకునే రోజులు. మా పెద్దత్త పొరుగూరిలో ఉన్న హై స్కూలికి వెళ్ళడం మా చుట్టుపక్కల నాలుగూళ్ళలో పెద్ద వార్త. మా అత్త సైకిల్ మీద స్కూలుకి వెళ్లడాన్ని మా ఊళ్ళో మా చిన్నప్పటి రోజుల్లో కూడా కథలా చెప్పుకున్నారు. ఆస్తులు కరిగి పోతూ ఉండడం తో కళ్ళు తెరిచారో లేక లోకం పోకడని గమనించ గలిగారో, సంప్రదాయాన్ని ఎదిరించి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించారు తాతయ్య.

చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న అమ్మాయిల పెళ్లి విషయం లోనూ కొంత మార్పు వచ్చింది. అబ్బాయిని పెద్దలే నిర్ణయించినా, పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఒకరికి ఒకరిని చూపించి పెళ్లి చేశారు. ఆ తరం లో విడాకులు తీసుకోవడం పెద్ద వింత. ఆ విడాకులు తీసుకున్న అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం పెద్ద వార్త. 'ఆడది అణిగి ఉండాలి' అన్న మాట చాలాసార్లు విన్నాను.

ఒక తరం ఆలస్యంగానైనా మిగిలిన కుటుంబాలలోనూ ఈ మార్పు వచ్చింది. మగవాడే కుటుంబాన్ని పోషించాలి అన్న దగ్గర నుంచి మగ, ఆడ ఇద్దరూ సంపాదించడం అనే పద్ధతి మొదలైంది. శ్రమ విభజనకి వచ్చే సరికి ఈ తరం మహిళలు ఇంటా బయటా కష్టపడ్డారు. ఎక్కడో తప్ప, చాలా మంది మగవాళ్ళు వంటింటి గడప తొక్కడం నామోషీగా భావించారు. కాలక్రమంలో పెళ్ళిచూపుల ఏర్పాటు తో పాటు, 'అతన్ని చేసుకోవడం నీకు ఇష్టమేనా' అని అమ్మాయిని అడగడం మొదలైంది.

ఆస్తులు, అంతస్తుల స్థానం లో చదువులు, ఉద్యోగాలు ప్రామాణికంగా తీసుకుని పెళ్లి సంబంధాలు చూడడం, ఇరు పక్షాల అంగీకారం తోనే పెళ్ళిళ్ళు జరగడమే కాదు, పెళ్లి తర్వాత భార్యా భర్తలిద్దరూ కలిసి భవిష్యత్తుని నిర్ణయించు కోవడం జరిగింది. పనివిభజన రేఖలు కొద్దిగా చెరిగి, భార్య బయటి పనిలోనూ, భర్త ఇంటి పనిలోనూ సాయపడడం మొదలైంది. విడాకులు, మళ్ళీ పెళ్లి అనేవి సమాజం అంగీకరించ గలిగింది. ఆడ, మగ తేడా లేకుండా సమంగా చదివించడం మొదలుపెట్టారు తలిదండ్రులు.

ఇక ప్రస్తుత తరానికి వస్తే, తాము ఏమి చదువుకోవాలో, ఎలాంటి కెరీర్ లో కొనసాగాలో పిల్లలే నిర్ణయించు కుంటున్నారు. ఆడ, మగ బేధం లేదు. చదువు కోసం, ఉద్యోగం కోసం ఆడపిల్లల్ని కూడా దూర ప్రాంతాలకి, విదేశాలకి పంపిస్తున్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్చ కూడా కొన్ని కుటుంబాల్లో పిల్లలు పొందగలుగుతున్నారు. 'నీ నిర్ణయానికి మేము అడ్డు చెప్పం.. పెళ్లి మాత్రం మన పద్ధతిలో చేస్తాం' అని మా కజిన్ వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఓ ఇతర రాష్ట్రానికి, ఇతర మతానికి చెందినా అబ్బాయితో చేశారీమధ్య.

డబ్బు కోసం భర్త ముందు చేయి చాపాల్సిన లేదా అనుమతి కోసం భర్త ముందు తలవంచవలసిన అవసరం ఇప్పటి అమ్మాయిలకి లేదు. కాపురం లో ఇమడ లేని పక్షంలో విడిగా వచ్చేయమని, తమ మద్దతు ఉంటుందని అమ్మాయికి హామీ ఇస్తున్న తలిదండ్రులు నాకు తెలుసును. చదువు, సంపాదన ఇచ్చిన ఆత్మ విశ్వాసం అమ్మాయిలు తమ ఆత్మాభిమానం విషయంలో రాజీ పడకుండా ఉండడానికి సహాయ పడుతోంది. కేవలం డబ్బు, పరువు అనే కారణాల కోసం మాత్రమే బలవంతంగా కాపురం చేసే పరిస్తితులు ఇప్పుడు లేవు.

పెళ్ళంటే ఏమిటో తెలియకుండానే వివాహ బంధం లోకి వచ్చేసిన ఓ అమ్మమ్మ ముని మనవరాలు తన పెళ్లిని తానే నిర్ణయించుకుంది. తండ్రి ఇచ్చిన ఆస్తి కరిగిపోతే కుటుంబం నడపడం ఎలా అని మధనపడ్డ ఓ తాతయ్య ముని మనవడు తను, తన భార్య సంపాదిస్తున్న డబ్బుని ఎలా ఖర్చు చేయాలో ఆమెతో కలిసి ప్లాన్ చేస్తున్నాడు. సాంఘిక హోదాని ఒకప్పుడు వ్యవసాయ భూమి సూచిస్తే, ఇప్పుడు దాని స్థానంలో ప్లాట్లు, ఫ్లాట్లు, కార్లు, డిపాజిట్లు భర్తీ చేస్తున్నాయి. గంపెడు పిల్లల్ని కని పెంచడానికి మాత్రమే పరిమితమైన స్థితి నుంచి ఇంటా బయటా నిర్ణయాల్లో భాగం పంచుకునే స్థాయికి మహిళ ఎదిగింది.

నేను చెబుతున్నది ఓ పల్లెటూరి సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో కాలం తెచ్చిన మార్పు. ఈ కుటుంబాన్ని సమాజానికి ప్రతీక గా భావిస్తున్నాను నేను. కొన్ని విషయాల్లో సమాజం కన్నా కొంచం ముందు, మరికొన్ని విషయాల్లో సమాజం కన్నా కొంత వెనుక ఉండి ఉండొచ్చు. కుటుంబంలోని స్త్రీ, పురుష పాత్రల్లో మార్పు ఏమి లేకుండా ఐతే లేదు. 'ఈ మార్పు మంచికా? చెడ్డకా?' అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. ఒకటి మాత్రం నిజం, మార్పు అనివార్యం.

"మార్పు కొందరిని భయపెడుతుంది. కొందరిని జోకొడుతుంది. కొందరిని ఆనందింప చేస్తుంది." -గొల్లపూడి మారుతి రావు ('సాయంకాలమైంది,' పేజి 88)

6 వ్యాఖ్యలు:

 1. బుడి బుడి నడకల నుండి చక్కని నడకల వరకు పరిశీలించిన మీకు ముందుగా నా అభినందనలు.
  చక్కని విశ్లేషణ అందించారు. చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నిజమే, ఆలోచిస్తే చాలా ముందుకు వచ్చేసామనిపిస్తుంది.

  మంచి విశ్లేషణ....

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వెరీ ఇంటరెస్టింగ్. మొన్న మీ బ్లాగులోనే అనుకుంటాను, బహుశా చలం మైదానం గురించి రాసిన టపాకి అనుకుంటాను, మన స్త్రీ పురుషుల పరిస్థితి పెద్దగా మారలేదని ఓ ముక్క రాశాను. సుమారుగా దానికి జవాబు అన్నట్టుగా మీరీ టపా రాశారు. నిజమా, మార్పు బొత్తిగా లేకుండా లేదు. ఏదో కొంత స్వతంత్రత వచ్చినట్టే కనిపిస్తోంది. కానీ ఒక్క క్షణం నిజంగా లోతుగా చూస్తే ఇది డొల్ల అని తేల్తోంది. ముఖ్యంగా రెండు కారణాల వల్ల .. 1. తమకి తాము (కెరీర్లు గానీ జీవిత భాగస్వాముల్ని గానీ) ఎంచుకుంటున్నాము అనుకున్నది నిజంగా తమ వ్యక్తిత్వ బలం వల్ల కాక, చుట్టూతా పనిచేసే సమాజ వత్తిళ్ళ వలన, 2. అసలు పెళ్ళెందుకు చేసుకుంటున్నామో, ఎందుకు చేసుకోవాలో మన యువతీ యువకుల్లో అవగాహన లేదు.
  ఈ రెండు కారణాల వల్లా, చలం మైదానం రాసిన రోజుల్తో పోలిస్తే ఇప్పటికి మన స్త్రీ పురుషుల పరిస్థితి పెద్దగా మారిందని నాకనిపించడం లేదు. అఫ్కోర్సు, అన్ని సూత్రాలకి లాగానే నే చెప్పిన రెండు సూత్రాలకీ ఎక్సెప్షన్లు ఉంటారు, కానీ చాలా చాలా కొద్ది మంది.
  Murali garu, even if we disagree in ideas, let me just say, it is a pleasure to read your blog.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హాయ్ మురళి "స్త్రీ "ని పరిశీలించి న విధము వ్యవస్థ లోని మార్పు చక్కగా వివరించరండి. మీకుఅభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @శృతి, ఉమాశంకర్, నేస్తం, కొత్తపాళీ, చిన్ని: ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు