ఆదివారం, ఫిబ్రవరి 15, 2009

నాలుగు కథలు

తెలుగు కథలు క్రమం తప్పకుండా చదివే వాళ్ళకి కె. ఎ. ముని సురేష్ పిళ్ళె పేరు తెలిసే ఉంటుంది. శ్రీకాళహస్తి కి చెందిన ఈ జర్నలిస్టు సబ్జక్ట్ ను ఎంచుకోవడం నుంచి, కథ నడక, ముగింపు విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. చుట్టూ జరిగే సంఘటనలనే కథావస్తువులుగా తీసుకునే పిళ్ళె, ప్రతి అంశాన్నీ చాలా నిశితంగా పరిశీలించి కథలుగా మలుస్తారనిపిస్తుంది ఆయన కథలు చదివినప్పుడు. పిళ్ళె రాసిన నాలుగు కథల గురించి ఇప్పుడు చెబుతాను. ఈయన పేరు నాకు మొదట తెలిసింది 'అనాది-అనంతం' అనే కథ చదివినప్పుడు. ఐదేళ్ళ క్రితం ఈనాడు ఆదివారం అనుబంధం లో చదివానీ కథ. కథను నడిపించిన తీరు యండమూరి 'వెన్నెల్లో గోదారి' ని గుర్తు చేస్తుంది. అంటే ప్రతి పాత్రా తన కథను తనే చెప్పుకుంటుంది.

'అనాది-అనంతం' కథలో ప్రధాన పాత్రలు మూడు. ఓ భూస్వామి(నరసారెడ్డి), జీతగాడు (చలమయ్య), జీతగాడి కొడుకు (లక్ష్మీనారాయణ). చలమయ్య తన కొడుకుని చాలా కష్టపడి చదివించి ఓ ప్రభుత్వాధికారి ని చేస్తాడు. కొడుకు, కోడలు, మనవలతో ఊరికి వచ్చి ఉంటే జీతగాళ్లుగా, కూలీలుగా బ్రతుకున్న కొందరైనా స్ఫూర్తి పొంది వాళ్ల పిల్లల్ని చదివిస్తారన్నది అతని ఆలోచన. కొడుక్కి ఊరు రావడం ఇష్టం ఉండదు. ఆ మురికిలో తన పిల్లలు ఉండలేరు అంటాడు. పైగా ఊరంతా తనని జీతగాడి కొడుకుగా మాత్రమే చూస్తుందని, ఓ అధికారిగా గుర్తించదనీ అతని ఫిర్యాదు. ముఖ్యంగా భూస్వామి వ్యవహార శైలి అతనికి నచ్చదు. ఇక భూస్వామి, "వాడు ఇవ్వాలంటే ఆఫీసరు అయాడు కానీ, చిన్నప్పటినుంచీ మనకి తెలిసినోడే కదా.. ఆ చనువుతో మాట్లాడితే తప్పా? ఆఫీసరైనంత మాత్రాన జీతగాడి కొడుకు కాకుండా పోతాడా?" అంటాడు. లక్ష్మీనారాయణకి ఇతరులు బాగు పడడం ఇష్టం ఉండదనీ, అది ఒప్పుకోలేక తనని తప్పు పడుతున్నాడనీ నరసారెడ్డి ఫిర్యాదు.

రెండో కథ 'రాతి తయారీ' మీడియా మీద ఎక్కుపెట్టిన బాణం. జనం చావులని సొమ్ము చేసుకునే ఎలక్ట్రానిక్ మీడియాని ఎండగడతారీ కథలో. కథంతా ఓ టీవీ చానల్ రిపోర్టరు, కెమెరామన్ ల మధ్య సంభాషణ రూపంలో ఉంటుంది. ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అతని కుటుంబ సభ్యుల ఎమోషన్స్ తో సంబంధం లేకుండా 'షాట్స్' కోసం 'బ్రేకింగ్ న్యూస్' కోసం రిపోర్టర్లు, కెమెరామెన్లు ఎలా ఆరాట పడతారో కళ్ళముందు ఉంచుతుంది ఈ కథ. ఆయా న్యూస్ లు సంపాదించమని వారికి పైనుంచి వచ్చే వత్తిళ్ళు, రాత్రంతా నిద్రమానుకుని పనిచేసినా, ఉదయాన్నే ఫోన్ రాగానే పరిగెట్టడం..ఇలా నాణేనికి ఉన్నా రెండోవైపునీ చూపుతారు. ఆత్మహత్య చేసుకున్న కొడుకు కోసం గుండెలవిసేలా ఏడ్చిన ముసలి తల్లి మరణాన్ని సదరు రిపోర్టరు, కెమెరామెన్ 'ఎక్స్ క్లూసివ్' న్యూస్ గా సంపాదించడం ఈ కథ ముగింపు. ఈ కథని చదివాకా, టీవీ చానళ్ళలో వచ్చే మానవీయ కథనాల తెరవెనుక కథలని గురించి ఆలోచించకుండా ఉండలేము.

రోడ్డు విస్తరణ లాంటి ప్రభుత్వ పథకాలని ఆపడానికి వ్యాపారులు ఎంచుకునే మార్గాలు, అందుకు అవసరమైతే దేవుడిని కూడా ఎలా వాడుకుంటారో చెప్పే కథ 'గార్డు వినాయకం భజే.' కథాస్థలం శ్రీకాళహస్తి. కథంతా హాస్య, వ్యంగ్య ధోరణిలో సాగుతుంది. కోటకు కాపలా గా రాజులు కట్టిన వినాయకుడి గుడిని ఊళ్ళో పెద్దలే కాదు పిల్లలుకూడా పట్టించుకోరు. పరీక్షలప్పుడు మాత్రం ఓ సారి ఆగి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆ గుడి శిధిల దశకి వచ్చేశాక ఉన్నట్టుండి జనంలో కదలిక మొదలవుతుంది. గుడికి మరమ్మతులు చేయించి ఉత్సవాలు జరిపే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే, రోడ్డు విస్తరణలో భాగంగా గుడిని కూలగొట్టాలని అధికారులు నిర్ణయిస్తారు. గుడిని కొట్టేస్తే, రోడ్డు మార్జిన్ లో ఉండే షాపులనూ కొట్టేస్తారు. దానిని అడ్డుకోడానికి వ్యాపారులు వేసిన ఎత్తుగడే గుడికి మరమ్మతులు. "ఆ వినాయకుడిది ఇప్పుడూ గార్డు బతుకే" అంటారు రచయిత చివర్లో.

నాలుగోదీ, నాకు బాగా నచ్చిందీ 'పూర్ణమూ..నిరంతరమూ..' 'పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే' (మొత్తం లో నుంచి మొత్తాన్ని తీసేస్తే మొత్తం మిగులుతుంది) అన్న వేదవాక్కుని మానవ సంబంధాలకి అన్వయిస్తూ రాసిన కథ. ఎవరైనా చనిపోయినప్పుడు, అంత్యక్రియలకు ఎందుకు వెళ్ళాలి? చనిపోయిన మనిషికి మనం వెళ్ళినట్టు తెలియదు కదా. అప్పటిదాకా ఆమనిషిని పట్టించుకోనివాళ్ళు కూడా చనిపోగానే దండలు వేసి, కాళ్ళకి మొక్కి ఆ శవాన్ని దేవుడిని చేసేస్తారెందుకు? ఇవి ఈ కథ లో రచయిత లేవనెత్తే ప్రశ్నలు.

ఓ తల్లి, తండ్రి, వాళ్ళకో ఇంట్రావర్ట్ కొడుకు. కొడుకు తన స్నేహితురాలి తల్లి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వెళ్లి వస్తాడు. అదే సమయంలో తండ్రి ఓ విల్లు రాస్తాడు. తను చనిపోయాకా తన కళ్లు, శరీరం దానం చేయాలనీ, శవాన్ని చూడడానికి ఎవరూ రాకూడదనీ. ముందుగా ఆ విల్లును తన స్నేహితుడికి చూపిస్తాడు. ఆ స్నేహితుడు తిట్టి వెళ్తాడు. అంత్యక్రియల నుంచి వచ్చాక కొడుక్కి చూపిస్తాడు. చాలా మామూలుగా విల్లును చదివిన కొడుకు, 'ఎవరూ రాకూడదు' అన్న విషయం దగ్గర అభ్యంతరం చెబుతాడు. "ఎవరైనా చనిపోయినప్పుడు మనం వెళ్ళేది, చనిపోయిన వాళ్ల కోసం కాదు నాన్నా. వాళ్ల చుట్టూ ఉన్నవాళ్ళ కోసం. వాళ్లు వైరాగ్యంతో ఉంటారు, మనకి ఎవరూ లేరు అనుకుంటారు, ఎవరికోసం బతకాలి అంకుంటారు. మనం వెళ్ళడం ద్వారా, మీకు మేమంతా ఉన్నాం అని చెప్పడానికి. నువ్వు చనిపోయాక వచ్చేవాళ్ళు నాకోసం వస్తారు. వాళ్లు రావద్దని నువ్వెలా అడుగుతావు?" అంటాడు కొడుకు.

చివరి రెండు కథలూ ఆదివారం ఆంధ్రజ్యోతి లో వచ్చాయి. ఇవి కాకుండా ఇంకేమైనా రాశారేమో తెలియదు. పిళ్ళె తన కథలతో ఓ కథాసంకలనం తెస్తారని ఎదురు చూస్తున్నా..

9 కామెంట్‌లు:

  1. మురళిగారు ,ఈ కథలను నేను చదివానండి ,ఒక ఫ్రెండ్ మంచి కథలని ఎంపిక చేసి నాకు ప్రెజెంట్ చేసారండి,మరొకసారి చదువుతానండి.ముఖ్యమ్గా కూలివాని కొడుకు ఆఫీసర్ కథ నచిందండి .మీరు మంచి కథలను పరిచయం చేస్తున్నారు.మేరు నాయికలు లో మధురవాణి ,సాయమ్కాలంలో నవనీత ని పరిచయం చేసారు ,,మరి "వేయి పడగలో " గిరిక ను ఎపుడు పరిచయం చేస్తారు..ఎదురు చూస్తో ......

    రిప్లయితొలగించండి
  2. @చిన్ని: మీకు గిరిక అంటే చాలా అభిమానం అనుకుంటా. మీ బ్లాగులో మీరే రాయండి. నా బ్లాగులు చదువుతున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మీరుదహరించిన అన్ని కధలూ బావున్నాయి ముఖ్యంగా చివరి కధ..

    రిప్లయితొలగించండి
  4. @ఉమాశంకర్: ధన్యవాదాలు. అది నాక్కూడా బాగా నచ్చిన కథ..

    రిప్లయితొలగించండి
  5. బాగా చదివేవారు బాగా రాస్తారనడానికి మునిసురేష్ ఉదాహరణ. ఆయన నాకు ఈనాడులో సీనియర్ సహోద్యోగి. మిత్రులు. పూర్ణమూ నిరంతరమూ చదవక ముందు నేను కూడా అంత్యక్రియల తంతు, అంతమంది వెళ్లడమూ వేస్టనిపించేది. తర్వాత మాత్రం ఏ కబురు తెలిసినా తప్పక వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. మంచి కథలను గుర్తు చేసినందుకు మీకు, రాసినందుకు సురేష్ గారికీ, ఈ వేదిక మీద ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. బాగా చదివేవారు బాగా రాస్తారనడానికి మునిసురేష్ కథలు మంచి ఉదాహరణలు. వాటిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. సురేష్ నాకు ఈనాడులో సీనియర్ సహోద్యోగి. మిత్రులు.

    రిప్లయితొలగించండి
  7. మంచి కథల్నీ మంచి రచయితనీ పరిచయం చేశారు. రాతితయారీ, పూర్ణమూ నిరంతరమూ కథలు కథాసాహితి వారి వార్షిక ఉత్తమ కథల సంకలనాలలో చోటు చేసుకున్నాయి.

    రిప్లయితొలగించండి
  8. @అరుణ పప్పు, కొత్తపాళీ: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  9. రాతి తయారీ'కి తానా కథల పోటీ (2005)లో ప్రథమ బహుమతి వచ్చింది.

    జంపాల చౌదరి

    రిప్లయితొలగించండి