బుధవారం, ఫిబ్రవరి 25, 2009

మన విశ్వనాథం..

"పైకి అలా కనిపిస్తాడు కాని, విశ్వనాథ్ చాలా రొమాంటిక్.." అంటూ ఫోనులో సంభాషణ మొదలుపెట్టాడు నా స్నేహితుడు. సాక్షి దినపత్రిక వాళ్ళు రెండు రోజులపాటు ప్రచురించిన విశ్వనాథ్ 'డబుల్ ధమాకా' చదివాక మా ఇద్దరిమధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. "ఎప్పుడో టీనేజ్ లో జరిగిన సంఘటన కూడా గుర్తుందంటే..వా.." మళ్ళీ తనే.. "నాకు కనక ఇంటర్యూ చేసే అవకాశం దొరికితే ఒకే ఒక్క ప్రశ్న అడిగేవాడిని.." ఊరించాను నేను. "ఏమిటో.." ఊహించమని ఓ అవకాశం ఇచ్చి, నేనే చెప్పేశా.."అసలు చిన్నబ్బాయి, స్వరాభిషేకం సినిమాలు ఎందుకు తీశారు అని అడిగే వాడిని." తను ఒక్క క్షణం కూడా ఆగలేదు "నా దృష్టిలో ఆ రెండూ విశ్వనాథ్ సినిమాలే కాదు. చిన్నబ్బాయి చూడలేదు కానీ, స్వరాభిషేకానికి బలైపోయా.." తనని పూర్తీ చేయనీయకుండా నేను అందుకున్నాను.."నేను రెండూ చూశా స్వామీ..వంశీ చెత్త సినిమాలు తీస్తే సరిపెట్టుకున్నా..కానీ విశ్వనాథ్ కూడా అదే పని చేయడం మింగుడు పడలేదు.."

"వంశీ కథ వేరు..అయినా విశ్వనాథ్ వి చాలా వరకు అవార్డు సినిమాలే.." నాకెందుకో సరదాగా తననో ప్రశ్న అడగాలని అనిపించింది. "విశ్వనాధ్ సినిమాల్లో ఆస్కార్ కి ఎంట్రీ పంపిన సినిమా ఏమిటి?" క్విజ్ మాస్టర్ లెవెల్లో అడిగా.. "శంకరాభరణమా..సాగర సంగమమా?" తన ఎదురు ప్రశ్న.. "రెండూ కాదు.." ప్రయత్నించ మన్నట్టుగా నేను. "ఉహు..గుర్తు రావడం లేదు.." నేను కమలహాసన్ సినిమా అని చెబుదామనుకునే "స్వాతిముత్యం" అనేశాను. "నిజమే..అందరూ కమల్ ని మెచ్చుకుంటారు కానీ రాధిక కూడా చాలా బాగా చేసింది కదా.." అందులో అభ్యంతరం ఏం ఉంటుంది.. "నిజమే.. నిర్మలమ్మ చనిపోయే సీన్ లో ఒక చిన్న ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది..కమల్ అప్పుడే తాళి కడతాడు. వీడితో జీవితమంతా ఎలా అన్న అర్ధం వచ్చే చిన్న ఎక్స్ ప్రెషన్" గుర్తు చేసుకున్నాను నేను. "స్వాతికిరణం లో కూడా అంతే కదా..పిల్లవాడు చనిపోయినప్పుడు కళ్ళతోనే నటిస్తుంది..విశ్వనాధ్ సినిమా కాకపోయినా పల్నాటి పౌరుషం లో కూడా రాధిక నటన చాలా బాగుంటుంది.." నేను అందుకున్నా "అవును తాళి తెంచి చరణ్ రాజ్ మీదకి విసిరే సీన్.."

"విశ్వనాథ్ సినిమాల్లో నాకు బాగా చేయలేదు అనిపించిన హీరోయిన్ సుహాసిని ఒక్కర్తే.. సిరివెన్నెల లో తను ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది.." తను చెప్పగానే నేను ఆ సినిమా గుర్తుచేసుకున్నా.. "నిజమే బెనర్జీ బాగా డామినేట్ చేసినట్టు అనిపించింది...ఆమని తో సహా అందరూ బాగా చేశారు. శుభసంకల్పం లో చనిపోయే సీన్ లో ఆమని నటన చాలా బాగుంటుంది.." తను కొనసాగిస్తూ "కమల్ పక్కన చేయడం ఓ పరీక్ష.. నటనే కాదు, విశ్వనాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు.." పక్కన ఎవరూ లేకపోవడంతో నేను ధైర్యం చేసి "అవును.." అంటూ "మౌనమేలనోయి..." హమ్ చేశా.. నా హింస నుంచి తప్పించుకోవడం కోసం అనుకుంటా.. "ఆ పాటలో జయప్రద చాలా బాగుంటుంది కదా.." ఈసారి తనని నేను చెప్పనివ్వలేదు "కానీ మేకప్ చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా విశ్వనాధ్ హీరోయిన్లకి మేకప్ ఉండదు.. కానీ ఈ అమ్మాయి చాలా హెవీ మేకప్ లో ఉంటుంది.." అన్నా..

"మేకప్ లేకపోవడంఅంటే గుర్తొచ్చింది. సుమలత ఎంత సింపుల్ గా ఉంటుంది.. శ్రుతిలయలు ఒక్కటే కదా..విశ్వనాధ్ తో.." నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.. "శుభలేఖ లో హీరోయిన్..స్వయంకృషి లో చిన్న రోల్..ఆ అమ్మాయి మాట తీరు వెరైటీ గా ఉంటుంది.." తను ఏమీ మాట్లాడలేదు. బహుశా సుమలత ని గుర్తు చేసుకునే ప్రయత్నం కావొచ్చు. "అసలు స్వాతిముత్యం కథ కమల్ కోసం రాసిందంటే ఆశ్చర్యం వేసింది..కథ రాసుకుని కమల్ ని ఎన్నుకున్నారనుకున్నా.." తను హీరోయిన్ల నుంచి టాపిక్ మారిస్తే, పక్కన ఎవరో (?) ఉండి ఉంటారని అర్ధమైంది. "అవును.. గొబ్బెమ్మల సీన్ గురించి వివరణ బాగుంది కదా.." తను వెంటనే స్పందిస్తూ "నేను ఇది చదివే వరకు, గొబ్బెమ్మ సీన్ కథ చెప్పడం కోసమే అనుకున్నా.. కాజువల్ గా తీసిందంటే నమ్మకం కలగడంలా.." ఇప్పుడు నావంతు.."శంకరాభరణం లో కూడా కొన్ని సీన్ల గురించి ఇలాంటి విశ్లేషనలే చేశారు..అవి అంతే.." నేను తన స్పందన కోసం ఎదురు చూస్తుండగా .."వేరే ఫోన్ వస్తోంది.. మళ్ళీ చేస్తా.." అని వినిపించింది.

'సాక్షి' వ్యాసాల్లో మొదటి భాగం ఇక్కడ రెండో భాగం ఇక్కడ చదవొచ్చు.

6 వ్యాఖ్యలు:

 1. మురళి గారూ..
  బావుందండీ మీ స్నేహితుల సంభాషణ.
  చదువుతూ మధ్యలో అనుకున్నాను. ఇప్పుడు సాక్షికెళ్ళి వెతకాలి ఆ వ్యాసాలూ ఎక్కడున్నాయో అని.
  నా విన్నపం మీరు వినేసినట్టుగా.. చివరలో లింక్స్ ఇచ్చారు.
  ధన్యవాదాలు.
  ఈ ఇంటర్వ్యూ గురించి మీరు చెప్పకపోయి ఉంటే.. అద్భుతమైన అవకాశాన్ని మిస్ అయిపోయేదాన్ని.
  You made my day happy :)

  విశ్వనాథ్ గారు మళ్ళీ సినిమా తీస్తే బావుండు అని తరచూ అనిపిస్తూ ఉంటుంది నాకు:(

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ సందర్బంలో ఒక పాట గుర్తోస్తుందండి ,"సరిలేరు నీకెవ్వరు" ఏదైనా చదివించేటువంటి నైపుణ్యం ,తమరి రాతల్లో ,మాటల్లో ఉంటాదని రుజువైందండి .అందుకోండి మా అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. విశ్వనాధ్ సినిమాలు కధా పరంగా , నాణ్యత పరంగా సగటు ప్రేక్షకునికి మినిమం గ్యారెంటీ సినిమాలు. శంకరాభరణం హిట్ అయినప్పుడు సోమయాజులు గారు, ఆ చిత్రం యూనిట్ అంధ్రా అంతా తిరిగినట్టు గుర్తు. మాఊళ్ళో మా స్కూలు ప్లే గ్రవుండు లొ పేద్ద సభ జరిగితే, అప్పటికి చిన్నపిల్లోణ్ణయినా చాలా ఆసక్తిగా చూసా ఆద్యంతమూ..

  రాధిక గారి నటన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి: మీరు "పట్నం వచ్చిన ప్రతివతలు","మూడు ముళ్ళు" చూసారా? ఏమి నటనండీ బాబూ... ఇంకా చాలా సినిమాలు ఉండొచ్చు .. గుర్తు రావడం లేదు. నావరకు నాకు ఈ రెండూ హైలెట్.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @మధురవాణి: నేను కూడా అనుకుంటూ ఉంటానండి..విశ్వనాథ్ ఓ 'మంచి' సినిమా తీస్తే బాగుండును అని.. ధన్యవాదాలు.
  @చిన్ని: చాలా పెద్ద మాట వాడేశారండి..మీ అభిమానానికి కృతజ్ఞతలు.
  @ఉమాశంకర్: ఎంత చిన్న పాత్రలో అయినా తనదైన ప్రత్యేకత చూపే నటుల్లో రాధిక ఒకరండి. మీరు చెప్పిన రెండు సినిమాలూ చూశాను. 'అభిలాష' లో కూడా మంచి పాత్ర. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళీ,
  విశ్వనాథ్ నాకు నచ్చిన అభిమాన దర్శకుల్లో ఒకరు.వారి ఇంటర్వ్యూ వ్యాసాల్ని(లింకులిచ్చి)తెలియచేసినందుకు ధన్యవాదాలు.
  ఇకపోతే రాధిక ఒక సహజ నటి,దర్శకత్వం చేసే వాడికి దమ్ముండాలే కానీ రాబట్టుకోడానికి ఎంతయినా ఉంది నటనాప్రావీణ్యం ఆమె దగ్గర.

  ప్రత్యుత్తరంతొలగించు