గురువారం, ఫిబ్రవరి 05, 2009

విలాసినీ నాట్యం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంప్రదాయ నృత్య రీతులు ఏవి? ఈ ప్రశ్నకి ఎవ్వరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కూచిపూడి. కొంచం ఆలోచించి చెప్పే జవాబు పేరిణి. కొద్ది మాత్రమే 'ఆంధ్ర నాట్యం' అని చెప్పగలరు. విలాసిని నాట్యం, దేవదాసి నాట్యం, ఆలయ నాట్యం అనే పేర్లు కూడా ఉన్న ఈ నాట్య రీతి నిజానికి కూచిపూడి నృత్యరీతి కన్నా పురాతనమైనది. కొన్ని సామాజిక కారణాలవల్ల పతనావస్థకి చేరుకున్నది. కొందరు నాట్యాచార్యులు, సాహితీ పరిశోధకుల కృషి పుణ్యమా అని కొడిగట్టకుండా మిగిలి, ఉత్సాహవంతులైన నర్తకీ నర్తకులచేత ప్రదర్శింపబడుతోంది. రాజాస్థానాల్లో ఎంతో ఉన్నతమైన జీవితం గడిపిన దేవదాసీల జీవితాల్లో కాలక్రమంలో వచ్చిన మార్పులు ఈ నాట్యరీతి పతనానికి దారి తీశాయి.

దైవారాధనలో దేవ నర్తకి చేసే నాట్యం దేవదాసి నాట్యం. ప్రాచీనమైన దేవదాసీ వ్యవస్థలో ఒకపుడు కులంతో నిమిత్తం లేకుండా సముచిత లక్షణాలున్న ఏ బాలిక అయినా దేవదాసి కావచ్చు. చారిత్రక ఆధారాల ప్రకారం చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుడి కాలం (క్రీ. శ. 848-92) నాటికే ఆంధ్ర దేశం లో స్త్రీ నాట్య సంప్రదాయం ఉంది. రంభా సంప్రదాయం, మేనకా సంప్రదాయం, ఊర్వశీ సంప్రదాయాలు ఆంధ్ర దేశం లో అమలైన దేవదాసీ సంప్రదాయాలు. రంభా సంప్రదాయం ఆంగికాభినయానికి ప్రాధాన్యం ఇవ్వగా, మేనకా సంప్రదాయం సాము గరిడీల తరహా విన్యాసాలకి, ఊర్వశీ సంప్రదాయం సాత్త్వికాభినయానికీ, నవరస ప్రదర్శనకీ పెద్ద పీట వేసింది.

ఆలయాల్లో వేకువ జామున దేవుడికి మేలుకొలుపులు పాడడం నుంచి, రాత్రివేళ పవ్వళింపు సేవ వరకు నృత్యగానాలు ప్రదర్శించిన దేవదాసీలు రాజులు ఇచ్చిన మాన్యాలతో పొట్ట పోసుకుంటూ నిరాడంబర జీవితం గడిపేవారు. కాలక్రమంలో వీరి నృత్యం ఆలయం నుంచి రాజాస్థానానికి మారింది.. ఫలితంగా వీరి జీవన విధానంలోనూ మార్పు వచ్చింది. విలాసాలకు, సౌఖ్యాలకు అలవాటు పడ్డారు. ఇలా దేవదాసి అన్నది ఓ కులంగా మారిపోయింది. రాజ్యాలు, జమీందారీలు అంతరించడంతో దేవదాసీలు 'మేజువాణీ' ల దారిపట్టారు. ఫలితంగా దేవదాసీ నాట్య రీతి గౌరవం తగ్గింది. రాను రాను ఈ కళని ప్రదర్శించే వారు లేక అంతరించే దశకు చేరింది.

సరిగ్గా ఈ దశలోనే కూచిపూడి నాట్య గురువు నటరాజ రామకృష్ణ, కవి, చారిత్రక పరిశోధకుడు ఆరుద్ర, నర్తకి స్వప్న సుందరి వంటి వారు ఈ నాట్య రీతి పై పరిశోధనలు ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంతంలో మిగిలి ఉన్న అతి కొద్ది మంది వృద్ధ కళాకారిణులను కలిసి వారి సాయంతో ఈ నృత్య రీతిని రికార్డు చేశారు. కూచిపూడి, భరతనాట్యం అభ్యసిస్తున్న కొందరు ఔత్సాహికులను ప్రోత్సహించి వారికి ఈ నాట్య రీతిలో శిక్షణ ఇచ్చారు. ప్రదర్శనా పద్ధతిని సిద్ధం చేశారు. రంగాలంకరణ మొదలు, ఆహార్యం వరకు ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశోధించి ప్రదర్శనకు ఓ దారిని ఏర్పరిచారు.

ఈ నాట్యం గురించి తెలియని వారు 'దేవదాసి' అనే పేరు వినగానే రకరకాల ఊహాగానాలు చేశారు, చేస్తున్నారు. నిజానికి ఈ నాట్యరీతిలో భక్తీ, విరహం ఉంటాయి..అశ్లీలత, అసభ్యత ఉండవు. కృష్ణుడి కోసం ఎదురు చూసే సత్యభామ నవరసాలను - కూచిపూడి భామాకలాపానికి పూర్తి భిన్నంగా - ఈ నాట్యరీతిలో చూడొచ్చు. ఇక్కడ నర్తకీ నర్తకులు నాట్యం చేస్తూ పాడతారు. దురదృష్టం ఏమిటంటే సామాన్య ప్రజలతో పాటు, కొందరు నాట్య గురువులు, కళాకారుల్లోనూ ఈ నాట్య రీతి పట్ల చిన్న చూపు ఉంది. పైకి అంగీకరించకపోయినా ఓ తిరస్కార భావం ఏమూలో ఉంది. అది బహుశా కొన్ని తరాలపాటు దేవదాసీలు గడిపిన జీవన విధానం పై వీరికి గల చిన్నచూపు వల్ల కావచ్చు. కళని కళగా మాత్రమే చూసే రోజులు ఎప్పటికి వస్తాయో..

5 వ్యాఖ్యలు:

 1. చాలా తెలియని విషయాలు చెప్పారు. ఆంధ్రనాట్యం అని వినటమే కాని అదీ మేజువాణీ ఒకటే అని కూడా తెలియదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @ఉమాశంకర్: ధన్యవాదాలు
  @సిరిసిరిమువ్వ: ముందుగా మీకు ధన్యవాదాలు. ఒక చిన్న విషయం గమనించండి.. ఆంద్ర నాట్యానికి, మేజువాణికి శాస్త్రీయ నృత్య ప్రదర్శనకి, రికార్డింగ్ డాన్స్ ప్రదర్శనకి ఉన్నంత తేడా ఉంది. అవకాశం దొరికితే ఈ నాట్య ప్రదర్శన ఒక్కసారి చూడండి. భేదం మీకే అర్ధమవుతుంది. అన్నట్టు మీ పేరు చూడగానే నా చెవుల్లో సుశీల, కళ్ళముందు జయప్రద 'ఝుమ్మంది నాదం' అంటున్నారు..:)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఆంధ్రనాట్యం గురించి తెలుసు. అలాగే కాలక్రమంలో దేవదాసీ వ్యవస్థ వేశ్యా వ్యవస్థగా రూపాంతరం చెందిందన్న విషయం తెలుసు గానీ వాటి నేపధ్యం తెలియదు. మీ ఈ రెండు టపాల వల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగాను.

  ప్రత్యుత్తరంతొలగించు