శనివారం, ఫిబ్రవరి 14, 2009

టమాటాలు

న్యూస్ పేపర్ల వాళ్ళకి ఎరుపు రంగంటే భలే ఇష్టం. ఏదైనా ప్రమాదం జరగడం ఆలస్యం, మర్నాడు పేపర్ రక్తం వోడుతూ ఉంటుంది. ముట్టుకుంటే చేతికి రక్తపు మరకలు అవుతాయేమో అనిపించే లాంటి ఫొటోలతో మొదటి పేజిలను అలంకరించి పంపుతారు. ఇప్పుడు కూడా పేపర్లు ఎరుపెక్కాయి.. ఈ సారి రక్తంతో కాదు..టమాటాలతో.. కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే, కడుపుమండిన రైతులు పండించిన పంటను పోలీసుల కళ్లు కప్పి అసెంబ్లీ ముందు పారబోసినప్పుడు పేపర్లన్నీ ఎర్రని ఫొటోలతో పాటు తమదైన శైలిలో వ్యాఖ్యానాలనీ ప్రచురించాయి. అక్కడితో వాటి పని ఐపోయింది. కాని రైతులపనే ఎటూ తెలియకుండా ఉంది.

మనదేశంలో ప్రతి ఉత్పత్తి దారుడూ తన ఉత్పత్తికి ధర నిర్ణయించుకుంటాడు, రైతు తప్ప. ఏ పంట అయినా కానివ్వండి, పంట కోతకి వచ్చే సమయానికి ఆకాశాన్నంటే ధరలు, రైతు ఆ పంటను మార్కెట్ కి తెచ్చేసరికి నామమాత్రమైపోతాయి. పండించిన పంట నిల్వ ఉంచగలిగేది ఐతే, నిల్వ ఉంచే స్తోమతు తనకు ఉంటే ఆ రైతు దానిని గోదాములో దాచి మంచి ధర వచ్చినప్పుడు దానిని అమ్ముకో గలుగుతాడు. అలాకాక, ఆ పంట త్వరగా చెడి పోయేది ఐతే..వచ్చిన ధరే మహాప్రసాదం అనుకోవాలి. ఆ ధరకు అమ్ముకోడానికి మనసు ఒప్పుకోకపోతే, అందుకు ప్రత్యక్ష కారణం ఎవరో తెలియకపోతే.. కడుపుమండి ఆ పంటను నాశనం చేయాలి. అంతకన్నా రైతుకి మరో దారి లేదు. అది టమాటా కావొచ్చు లేదా మావిడి పళ్ళు కావొచ్చు..జరుగుతున్నది ఇదే.

రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాల్లో చిత్తూరు ఒకటి. అక్కడి భౌగోళిక పరిస్తితులు అన్ని పంటలకూ అనుకూలం కాదు. నీటి పారుదల సౌకర్యమూ తక్కువే. అక్కడి రైతులు పండించగలిగే కొద్ది పంటల్లో టమాట ఒకటి. అదేం చిత్రమో, టమాట పిందె దశలో ఉన్నప్పుడు కిలో రూ.25 ఉన్న ధర, పంట చేతికి వచ్చేసరికి కిలో 25 పైసలకు పడిపోతుంది. సీజన్లో మదనపల్లె వైపు వెళ్ళే రోడ్ల పక్కన రాశులు గా పోసిన టమాటాలు వుసూరుమనిపిస్తాయి. యెంత పెట్టుబడి పెట్టి, ఎన్ని కష్టాలు పడితే పంట చేతికి వస్తుందో గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన వారికి తెలిసిన విషయమే. ఆ పంట కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా వెనక్కి ఇవ్వకపోతే రైతు ఎంత క్షోభ అనుభవిస్తాడో ఊహకి అందే విషయమే. అయినా, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు..ప్రతీ సంవత్సరమూ ఇదే కథ. రైతు పంటను రోడ్డున పోసేది పంట ఎక్కువై కాదు, అది తనని దగా చేసిందన్న కడుపు మంటతో.

ఎయిర్ కండిషన్డ్ గోడౌన్ల నిర్మాణం, ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు లాంటి జనాకర్షక పథకాలు నాయకుల వాగ్దానాల రూపంలో ఎన్నోసార్లు గాలిలో కలిశాయి. రైతుల సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. ఓ పక్క ఆహార సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలని అంతర్జాతీయ వేదికలమీద చర్చలు జరుగుతోంటే, మరో ప్రత్యామ్నాయం లేక విలువైన పంటను నేల పాలు చేసే పరిస్థితుల్లో మన రైతులు ఉన్నారు. నేలపాలైన పంట national waste కాదా? ఏదైనా ఉత్పత్తికి తగిన ధర లేకపోతె, ఉత్పత్తిదారులు సమ్మె చేస్తారు, అధికారంలో ఉన్నవారితో లాబీయింగ్ చేసి, రకరకాల వత్తిడులు తెచ్చి తమకు కావాల్సింది సాధించుకుంటారు. కాని, రైతులు అలా చేయలేరు. వాళ్లు చదువుకున్న వాళ్లు కాదు..మిగిలిన ఉత్పత్తిదారులకన్నా అమాయకులు. సమ్మె చేయలేరు. పాలకులని ప్రభావితం చేయగలిగే సంఘటిత శక్తి వారిలో లేదు. వారికి తెలిసిందల్లా కడుపు నిండా అన్నం పెట్టడం, కడుపు మండినప్పుడు ఇలా పంటను పారబోసి రాజకీయనాయకులకి ఒక్క రోజుకి సరిపోయే ఆరోపణలనూ పత్రికలకూ కొన్ని కాలాల వార్తలను, ఫోటోలను ఇవ్వడం మాత్రమే.

3 వ్యాఖ్యలు:

  1. ఎయిర్ కండిషన్డ్ గోడౌన్ల నిర్మాణం, ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు లాంటి జనాకర్షక పథకాలు నాయకుల వాగ్దానాల రూపంలో ఎన్నోసార్లు గాలిలో కలిశాయి.....అన్నీ నిర్మాణాలు జరుగుతున్నాయి,జరిగాయి,జరుగుతాయి కూడా.కానీ వాటిని ఎలా,ఎందుకు,ఎవరి ప్రయోజనాలను సంరక్షించటానికి ఉపయోగిస్తున్నారు అన్నది అసలు ప్రశ్న.ఆపార్టీఈపార్టీ అని లేకుండా రాజకీయనాయకుల్లో అధికశాతం రైతుకుటుంబాలకు చెందినవారే అయినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే,అదే అసలు విషాదం :(

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @రాజేంద్రకుమార్ దేవరపల్లి: ఇదంతా నాయకులకి తెలియకపోవడం వల్ల జరుగుతోందని అనుకోలేము. తెలిసీ ఏమి చెయ్యలేకపోడానికి వాళ్ల కారణాలు వాళ్ళకి ఉన్నాయని అనుకోవాలి. మీకు ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. అందువల్లనే రైతు కూడా వ్యవసాయం మానేసి ఉద్యొగానికి వచ్చాడు. ఇష్టమై కాదు కడుపు నింపుకొవాలన్న కస్టం తో.

    ప్రత్యుత్తరంతొలగించు