ఆదివారం, ఫిబ్రవరి 01, 2009

చదివే అలవాటు..

సాధారణంగా అబ్బాయిలు తండ్రిని అనుకరిస్తారు. కాని చిన్నప్పడు నా మీద అమ్మ ప్రభావం ఎక్కువగా ఉండేది. అమ్మ వెనకాలే తిరగడం, తనతో కబుర్లు చెప్పడం, తను చెప్పేవి వినడం జరుగుతూ ఉండేది. బడిలో జరిగే విషయాలు, దారిలో చూసిన వింతలు, స్నేహితులతో చెప్పిన, విన్న కబుర్లు.. ఇలా అన్నీ అమ్మతో చెప్పడం అలవాటు. అమ్మకి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. ఎంతగా అంటే కిరాణా సరుకుల పొట్లాలతో వచ్చిన కాగితాలు కూడా విడవకుండా చదివేది. అమ్మమ్మ వాళ్ళింట్లో తాతగారితో సహా అందరూ పుస్తకాలు చదువుతారు. ఆ అలవాటు అమ్మకి వచ్చింది. అమ్మ దగ్గర ఓ సందుగం పెట్టెడు పుస్తకాలు ఉండేవి. నవలలు మొదలు వార పత్రికల వరకు రకరకాల పుస్తకాలు.

అమ్మ తనకి తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ ఉండేది. తన దగ్గర ఉన్నవి పక్కిళ్ళ వాళ్ళకి ఇచ్చి, వాళ్ల దగ్గర ఉన్న పుస్తకాలు నాతో తెప్పించుకుని చదివేది.. ఇదిగో ఇలా అమ్మకి పోస్టుమాన్ ఉద్యోగం చేసిపెట్టే క్రమంలో నాకు పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. వాళ్ల ఇళ్ళ దగ్గరినుంచి మా ఇంటికి వచ్చే దారిలో పుస్తకాలు తిరగేయడం..కార్టూనులు చదివి అర్ధం చేసుకోడంతో నా చదివే అలవాటు మొదలైంది. ఇది నేను రెండో తరగతి లో ఉన్నప్పటి సంగతి. కార్టూనులు, బాక్సులలో రాసే జోకులను స్కూల్లో ఫ్రెండ్స్ కి చెప్పడం ద్వారా వాళ్ల దగ్గర 'వీడికి చాలా తెలుసు' అనే ఇంప్రెషన్ కొట్టేసే వాడిని. తెలుగు వాక్యాలు చాలా వేగంగా చదవడం అలవాటు అవ్వడంతో యేడాది తిరిగేసరికల్లా మినీ కథలు చదివేయగలిగాను. ఐతే చిన్న కండిషన్.. అమ్మ చెప్పినవి మాత్రమే చదవాలి.

మామూలు రోజుల్లో కన్నా వేసవి సెలవుల్లో పుస్తకాలు చదవడం ఎక్కువగా ఉండేది. నా ఫ్రెండ్స్ అందరు గూటిబిళ్ళ, కబడ్డీ, బచ్చాలు ఆడుతుంటే నేను ఇంట్లో కూర్చుని యువ, జ్యోతి, ఆంధ్రప్రభ చదివే వాడిని. బయటికి వెళ్లి ఆడుకోడానికి నాన్న ఒప్పుకునే వారు కాదు. అలా అని తనకి నేను పుస్తకాలు చదవడమూ నచ్చేది కాదు. కొంచం రహస్యం గా చదవాల్సి వచ్చేది. ఆరో తరగతి కి వచ్చేసరికి మినీ కథల నుంచి సీరియల్స్ వైపుకి పెరిగింది నా చదువు. అప్పుడే కొత్తగా ఓ అవసరం వచ్చింది నాకు. హైస్కూలు మా పక్క ఊళ్ళో.. ఓ ఏడెనిమిది మంది పిల్లలం కలిసి నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాళ్ళం. దారిలో ఎవరో ఒకరు కథ చెప్పాలి. మిగిలినవాళ్ళు సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లు కాబట్టి వాళ్ళకి సమస్య ఉండేది కాదు. నేను సినిమాలు చూడడం కూడా తక్కువ అయ్యేసరికి పుస్తకాల్లో చదివే కథలు వాళ్ళకి చెబుతూ ఉండేవాడిని. ఈ కథలు వాళ్ళకి ఇంకెక్కడా దొరక్క పోవడం తో నేను చెప్పే కథలకి డిమాండ్ ఉండేది. అప్పటి మా హెడ్మాస్టర్ శ్రీరామమూర్తి గారు స్కూల్ అసెంబ్లీ లో పుస్తకాల ప్రాముఖ్యత గురించి చేసిన ఉపన్యాసం నన్ను ప్రభావితం చేసింది. 'మీరు పెద్దయ్యి ఉద్యోగాల్లో చేరాక ప్రతి నెల జీతం లో కొంత మొత్తాన్ని పుస్తకాలు కొనడానికి కేటాయించండి. కొన్న ప్రతి పుస్తకం చదవండి..' అని తాను దానిని ఒక నియమంగా ఎలా పాటిస్తున్నారో చెప్పారాయన.

ఆరోతరగతి తర్వాత వేసవిసెలవుల్లో నవలా పఠనం మొదలైంది. మినీ నవలలతో మొదలు. అప్పుడే చిలకమర్తి వారి గణపతి చదివాను. గ్రాంధికం కొంత ఇబ్బంది పెట్టినా ఆ రచన నాకెంతో నచ్చింది. నాన్న నా పుస్తకాలు చదవడం మీద పూర్తీ నిషేధం విధించారు. అమ్మకి వార్నింగ్స్ కూడా అయ్యాయి. తర్వాత పుస్తకం ముట్టుకున్నది ఏడో తరగతి పరీక్షలయ్యాకే. హైస్కూల్ పూర్తయ్యేసరికి యద్దనపూడి సులోచనా రాణి నవలలు దాదాపు పూర్తి చేశాను. చదివిన పుస్తకం గురించి అమ్మతో చర్చలు చేయడం జరిగేది. తను చెప్పిందే కరక్ట్ అని అమ్మ ఎప్పుడూ అనలేదు.

పిన్నికి యండమూరి, మల్లాది అంటే ఇష్టం. తన దగ్గర వాళ్ళిద్దరి కలెక్షన్ ఉండేది. యండమూరి నవలలు చదవనిచ్చేది కాని మల్లాది పుస్తకాలు చదవడం తనకి ఇష్టం ఉండేది కాదు. అలా టీనేజ్ లో యండమూరి పుస్తకాలు. డిగ్రీ కి వచ్చేసరికి ఇవి కాకుండా ఇంకేమైనా చదవాలి అనిపించేది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళతో చర్చలు. సరిగా అప్పుడే కన్యాశుల్కం, చివరికిమిగిలేది, అసమర్ధుడి జీవయాత్ర, మహాప్రస్థానం, అమృతంకురిసినరాత్రి లాంటి పుస్తకాలన్నీ పరిచయమయ్యాయి. నాకు నేనుగా పుస్తకాలు కొనుక్కోగలిగే స్తోమతు వచ్చాక నచ్చిన పుస్తకాలు కొని చదవడం మొదలు పెట్టాను.

9 వ్యాఖ్యలు:

 1. అయితే మురళీ గారూ..
  మీరు చిన్నప్పటి నుంచే బాగా చదివేసే వారన్నమాట. అయితే అదృష్టవంతులన్నమాట :)
  నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మిత్రుల దగ్గరినుంచి తీసుకున్న చందమామలు తప్ప పెద్దగా ఏమీ చదవలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు ఆదివారం కథ, పేపర్లో వచ్చే సీరియల్ చదివేదాన్ని. మాస్టర్స్ కూడా అయిపోయాకా గానీ.. నేను నవలలు చదవగలిగాను. ఇంటర్నెట్లో దొరికేవి చదువుతూ ఉన్నాను అప్పటి నుంచీ.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నా 'చందమామ' కథ వేరే పెద్ద కథ అవుతుందండి. ఓపిగ్గా చదివి కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సంతోషం. అప్పుడెప్పుడో గ్రంథాలయాలతో నా అనుభవాలు రాయడం మొదలు పెట్టాను నా బ్లాగులో. వీలుంటే చదవండి.
  http://kottapali.blogspot.com/2008/04/1.html
  http://kottapali.blogspot.com/2008/08/2.html

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @కొత్తపాళీ: తప్పకుండా చదువుతాను. బ్లాగుల్లో నేను చదవాల్సింది చాలా ఉందని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారు,

  బాగున్నాయి అండి మీ జ్నాపకాలు... నేను కుడా చిన్నప్పటినుంచి తెగ పుస్తాకాలు చదివే దాన్ని, దొరికిన పుస్తకం దొరికినట్లు, చందమామ దగ్గరనుంచి... సమ కాలీన ఆంధ్ర సాహిత్యం వరకు.. చలం నా అభిమాన రచయత... చలం గారికోసం ఒక ప్రత్యేకమైన బ్లాగ్ పెట్టి ఆయన కథ లు అందరికి అందించాలని ప్రయత్నం. పూర్తీ అయ్యాక మీకు తప్పక చెపుతాను.. చాలా సంతోషమండి మీ లాంటి సాహితి మిత్రులను కలుసుకున్నందుకు..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @భావన: ధన్యవాదాలు. రచనలని యధాతధంగా బ్లాగులో పెట్టాలంటే కాపీరైట్ కి సంబంధించిన సమస్యలు ఉంటాయండి. పూర్తి వివరాలు నాకూ తెలియవు. బ్లాగు ప్రారంభించే ముందు వివరాలు తెలుసుకుని ప్రారంభించండి. ఎదురుచూసే వాళ్ళలో నేనూ ఒకడిని.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. muraligaaru mee blog chaala baagundi.pranahita E-magazine mail naaku pampamdi.

  E.VENKATESH
  CENTRAl UNIVERSITY.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీ ఈ అలవాటు ఎంతమందికో ఉపయోగపడుతోంది. పాఠశాల ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పుస్తకాలు బహుమతిగా ఇస్తున్నాం. ఆ జాబితా తయారుచేయడానికి వెతుక్కుంటూ మొదటి పేజీ నుండి ఇక్కడివరకూ వచ్చాను. ధన్యవాదాలు మురళి గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @జ్యోతిర్మయి: ఇంత పాత పోస్టుని భలేగా గుర్తుపెట్టుకున్నారండీ.. ఈ టపా మీకు ఉపయోగ పడటం చాలా సంతోషం నాకు. ధన్యవాదాలు.. 

  ప్రత్యుత్తరంతొలగించు