గురువారం, ఫిబ్రవరి 26, 2009

ఆకుపచ్చని జ్ఞాపకం

ఓ భావుకత్వం నిండిన అమ్మాయికి ఆమె భావాలను ఏమాత్రం అర్ధం చేసుకోని, గౌరవించని వ్యక్తి భర్తగా లభిస్తే ఆమె కాపురం ఎలా ఉంటుంది? ఈ కథాంశంతో తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు, మరెన్నో నవలలు వచ్చాయి. కానీ, ఇందుకు విరుద్ధంగా, భావుకుడైన అబ్బాయికి అతన్ని అర్ధం చేసుకోని,చేసుకోడానికి ప్రయత్నించని అమ్మాయి భార్యగా వస్తే... దీనిని కథాంశంగా తీసుకుని వంశీ రాసిన కథే 'ఆకుపచ్చని జ్ఞాపకం.' పుష్కర కాలం క్రితం ఇండియా టుడే పక్ష పత్రికలో ప్రచురితమైన ఈ కథను చదివినప్పుడు అప్రయత్నంగానే 'అద్భుతమైన కథ' అనుకున్నాను. ఆ తర్వాత ఈ కథను చాలా సార్లు చదివాను..నా అభిప్రాయం ఏమీ మారలేదు. ఆద్యంతం ఊపిరి బిగపట్టి చదివించే ఈ కథ నడక సినిమాను పోలి ఉంటుంది. చకచకా మలుపులు తిరుగుతూ ఎప్పటికీ గుర్తుండిపోయే ముగింపుకి చేరుకుంటుంది.

కథానాయకుడు జయరామారావు నాయనమ్మ పెంపకంలో పెరిగినవాడు. జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే వాడు.అతని పెళ్ళికి ముందే నాయనమ్మ కాలం చేస్తుంది. తండ్రి బలవంతం పై ఆస్తిపరుల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఝాన్సీ ని పెళ్లి చేసుకుంటాడు.తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం 'జీవితం'అనే పత్రిక ప్రారంభించి అందమైన జీవితాన్ని గడపడం ఎలాగో పాఠకులకి సలహాలు ఇస్తూ ఉంటాడు. వ్యక్తిగత జీవితంలో మాత్రం అతనికి నిరాశ, నిస్పృహలే.. అతని ఊహల్లో భార్యకి ఝాన్సి కి ఏమాత్రం పోలికలు ఉండవు. అతనికి తన భార్యని చీరలో చూడడం ఇష్టం.ఝాన్సికి నైటీ సౌకర్యం.అతనికి భార్యని బాపు బొమ్మలా పెద్ద జడతో చూసుకోడం ఇష్టం..ఝాన్సీ కి పోనీటెయిల్ అంటే మక్కువ. భార్య తనకి కుంకుళ్ళతో తల స్నానం చేయించాలని అతను అనుకుంటే, బాత్రూం లో ఉన్న షాంపూ తో తల స్నానం చేసిరమ్మంటుంది ఝాన్సీ.వీళ్ళింట్లో పనిమనిషి కమలమ్మ..ఈమెది జయరామారావు మనస్తత్వమే.. ఆమె భర్త వీర్రజుది అచ్చంగా ఝాన్సీ మనస్తత్వం. ఓ గొడవలో వీర్రాజు ప్రాణం పోగుట్టుకున్న తర్వాత ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది కమలమ్మ.

ఝాన్సీ తో రాజీ పడుతున్న జయరామారావుకి టీవీ చానళ్ళ వల్ల పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఆ విషయంలో ఝాన్సీ సలహా అడగాలనుకుంటాడు. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరుగుతుంది. విడాకులు ఇచ్చేస్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఝాన్సీ. బావమరిది ఫోన్ చేసి పత్రికకి కావాల్సిన మూడు లక్షలు తాను ఏర్పాటు చేస్తానని, ఝాన్సీ తో సర్దుకుపోమ్మని కోరతాడు.'ఇక జీవితాంతం రాజీ పడి బ్రతకడమేనా' అన్న నిస్పృహలో ఉన్న జయరామారావుకి కనీసం ఒక్క రోజైనా తన ఊహల్లో భార్యతో జీవితం గడపాలనిపిస్తుంది. అందుకు కమలమ్మే సరైన మనిషి అని నిర్ణయించుకుని తన కోర్కెను ఆమె ముందు వ్యక్త పరుస్తాడు."ఉదయం ఆరు గంటలనుంచి సాయంత్రం ఆరు వరకు నా భార్యగా నటించాలి కమలమ్మా..శరీర సౌఖ్యం తప్ప అన్నీ కావాలి..కాదనకు కమలమ్మా.." అని బతిమాలతాడు. ఏ సమాధానం చెప్పకుండా కోపంగా వెళ్ళిపోతుంది కమలమ్మ.

మర్నాడు చాలా ఆశ్చర్యకరమైన రీతిలో తెల్లవారుతుంది జయరామారావుకి. తలస్నానం చేసి,పట్టు చీర కట్టుకున్న కమలమ్మ కాఫీ కప్పుతో నిద్ర లేపుతుంది అతన్ని. అతనికి ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టి, కపాలేశ్వరుడి గుడికి ప్రయాణం చేస్తుంది. గుడినుంచి తిరిగివచ్చి గాల్లో తేలిపోతున్న జయరామారావుకి 'నేను వెళ్లొస్తాను బాబూ..' అన్నకమలమ్మ గొంతు వినిపిస్తుంది. తెల్లచీరలో,ముఖాన బొట్టు లేకుండా ఉన్న కమలమ్మని చూశాక కాని ఆమె తనకి భార్యగా ఉండేది ఒక్కరోజు మాత్రమే అన్న విషయం గుర్తు రాదు అతనికి. "నన్ను అర్ధం చేసుకునే భార్యతో జీవితం బాగుంటుంది అనుకున్నాను కాని ఇంత మధురంగా ఉంటుందని అనుకోలేదు.. నువ్వు పక్కనుంటే నేను కొండల్ని పిండి చేయగలను, పిండిని కొండ చేయగలను..దయచేసి వెళ్ళిపోకు కమలమ్మా.." అని ఆమె కాళ్ళ మీద పడతాడు. "అమ్మగారు తెచ్చే డబ్బు లేకపొతే మీరు అన్యాయమైపోతారు బాబూ.." అంటుంది కమలమ్మ.."అంతేనా..నాకు ఈ ఆకుపచ్చని జ్ఞాపకాన్ని మాత్రమే మిగులుస్తావా?" అని అడుగుతాడు అతను. "నా జీవితానికి మిగిలింది కూడా ఈ ఒక్క జ్ఞాపకమే బాబూ.." అంటూ వెళ్ళిపోయిన కమలమ్మ అతనికి మళ్ళీ జీవితంలో కనిపించలేదు.

ఎమెస్కో ప్రచురించిన వంశీ కథల సంపుటి 'ఆనాటి వాన చినుకులు' లో ఈ కథను చదవొచ్చు. సంపుటి వెల రూ. 75.

8 వ్యాఖ్యలు:

 1. మా పసలపూడి కథలు చదివి కథా రచయితగా వంశీ అంటే పెద్దగా అభిమానం లేకపోయింది. ఈ కథ ఆసక్తికరంగా ఉంది. మంచి పరిచయం రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నాకు ఆ కథ చాల బాగా నచ్చినదండి చక్కటి కథ గుర్తు చేసారు ,.వంశి కథలు దేని కదేనండి ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి ,,కాని ఎండింగ్తేల్చేస్తారు .,మల్లాది కూడా అలానే చేస్తారు .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మురళి గారూ ! ఓ భావుకత్వం నిండిన అమ్మాయికి ఆమె భావాలను ఏమాత్రం అర్ధం చేసుకోని వ్యక్తి భర్తగా...యండమూరిగారి 13-14-15 ,ఆనందో బ్రహ్మ లో మందాకినీ పాత్రలు చదివాను కానీ ఇంతవరకూ వంశీ కధలు చదవలేదు .చక్కటి పరిచయం .థాంక్స్ .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మంచి కధని పరిచయం చేసారు....

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @కొత్తపాళీ: పసలపూడి కథల్లో కొన్ని చాలా మంచి కథలు ఉన్నాయండి. వంశీ సినిమాల్లాగే సాహిత్యం లోనూ, మంచి, చెత్త రచనలు ఉన్నాయి. ధన్యవాదాలు.
  @చిన్ని: వంశీ సినిమాలకి, సాహిత్యానికీ కూడా ముగింపే సమస్య అండి. సాహిత్యాన్నీ చాలా నిశితంగా చదువుతారన్న మాట.. ధన్యవాదాలు.
  @పరిమళం: వీలయితే చదవండి. అలా అలా గోదారి ఒడ్డుకి తీసుకు పోతాడు వంశీ.. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. nijam muraligaru..chala baguntundee kada. nenu kuda vamsi gari abhimanini. eenadu aadivaram pustakam lo chivari page lo sameeksha chadivi "anaati vana chinukulu" konnanu. chadivanu kuda. naku baga nachina pustakam adi. vamsi gari meeda sri indrakanti sreekantha sharmagaru rasina "mundu mata" chala bagundi. andulonchi marikonni kadhalu meeru chadivi vyakhya rayalani na chinna vinnapam..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @praneeta: తప్పకుండానండి.. మీరు 'మా పసలపూడి కథలు' చదివారా? ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఏదో తేడా ఉందండి.

  ఆకుపచ్చని జ్ఞాపకం అన్న పేరుతో వచ్చిన వంశీ కొత్త పుస్తకంలో 'ఆకుపచ్చని జ్ఞాపకం' పేరుతో వేరే కథ ఉంది. అది స్వాతి సపరివారపత్రికలో ప్రచురింపబడింది అని ఉంది.

  మీరు చెప్పిన కథ 'ఒక రోజు' అన్న పేరుతో ఆనాటి వానచినుకులు రెండో (2008) ఎడిషన్లో ఉంది. కానీ అదే కథ 'ఆకుపచ్చని జ్ఞాపకం' పేరుతో మొదటి (2003) ఎడిషన్లో ఉందా? ఇండియా టుడేలో మొదట వచ్చినప్పుడు కూడా 'ఆకుపచ్చని జ్ఞాపకం' పేరుతోనే ఉందా?

  ఒకే టైటిల్‌తో రెండు కథలు వ్రాసి, మొదటి కథకు పేరు మార్చినట్లున్నారు వంశీ.

  జంపాల చౌదరి

  ప్రత్యుత్తరంతొలగించు