మంగళవారం, ఫిబ్రవరి 24, 2009

పరిషత్తులు

నాటకం అంటే ఏమాత్రం ఆసక్తి ఉన్నవారికైనా పరిషత్ నాటకాలు జరుగుతున్నాయంటే పండుగే. నటీనటులు, సాంకేతిక నిపుణుల తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు ఈ పరిషత్తుల కోసం. నాటకాల పోటీలనే పరిషత్తులు అని పిలుస్తారు. ఇప్పుడంటే ప్రభుత్వం ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తోంది కానీ, అంతకు ముందు వరకూ కళాకారుల ప్రతిభా ప్రదర్శనకి పరిషత్తులు మాత్రమే వేదికలుగా నిలిచేవి. నాటక జనం, ప్రేక్షక మహాశయులతో పాటు పరిషత్తుల కోసం ఎదురు చూసే ఎదురు చూసే మరో వర్గం ఉంది. వీళ్ళు సినిమా, టీవీ జనం. అవును, దాసరి నారాయణ రావు నుంచి తేజ వరకు, వంశీ నుంచి కృష్ణవంశీ వరకు మన దర్శకులలో చాలా మంది నటీనటులను నాటక పరిషత్తుల నుంచి ఎంచుకుంటారు. నేను హీరో హీరోయిన్ల గురించి చెప్పడం లేదు, కేవలం నటీనటులను మాత్రమే. నాటక రంగం నేపధ్యంగా సిని రంగంలో రచయితలుగా, దర్శకులుగా నిలదొక్కుకున్న వాళ్లు ఇప్పటి తరంలో కూడా చాలామంది ఉన్నారు.

ఉభయగోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ద్రాక్షారామం, పాలకొల్లు లతో పాటుగా రాష్ట్రం నలుమూలలో ఎన్నో చోట్ల ప్రతి ఏటా క్రమం తప్పకుండా పరిషత్తు నాటకాలు జరుగుతూ ఉంటాయి. సిని రచయితలైన పరుచూరి సోదరులు 'పరుచూరి రఘుబాబు స్మారక పరిషత్తు' పోటీలని ప్రతియేటా హైదరాబాద్ రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఉంటారు. అక్కినేని నాగేశ్వర రావు పరిషత్తు హైదరాబాద్ లో పోటీలు నిర్వహించే మరో ముఖ్యమైన సంస్థ. సిని గ్లామరు ఉండడంతో ఈ పరిషత్తులలో నాటకాలు ప్రదర్శించడానికి నటీనటులు ఉత్సాహం చూపుతూ ఉంటారు. తిరుపతి లో ఏటా పోటీలు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ ప్రభుత్వ 'నంది' అవార్డుల మాదిరిగా 'గరుడ' అవార్డులు ప్రకటిస్తుంది. ఈ పోటీలలో చాలా వాటికి సిని రచయితలూ, దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా, నటీనటులు ముఖ్య అతిధులుగా మెరిసి నాటకాల్లో నటించేవారికి తమ భవిష్యత్తు ను గురించి కలల్లో తేలే అవకాశం కల్పిస్తూ ఉంటారు.

సాధారణంగా పరిషత్తు నాటకాలు నాలుగురోజులో, వారం రోజులో జరుగుతాయి. నిర్వాహకుల అభిరుచిని బట్టి సాంఘిక నాటకం, నాటిక, పౌరాణిక నాటకం, జానపద/చారిత్రిక నాటకం విభాగాల్లో పోటీలు జరుగుతూ ఉంటాయి. విజయవాడ 'అభిరుచి' వంటి సంస్థలు కేవలం హాస్య నాటిక పోటీలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలు జరిగేది నాలుగు రోజులే అయినా, నిర్వాహకులు, నాటక సంస్థల వాళ్లు తేరా వెనుక మూడు నుంచి నాలుగు నెలలు కష్ట పడతారు. పోటీలు జరుగుతాయని ప్రకటించడం మొదలు, స్క్రిప్టులను ఆహ్వానించడం, వాటిని స్క్రీనింగ్ చేయడం, ఆయా ఊళ్ళకి వెళ్లి ప్రదర్శన రిహార్సల్ చూసి నాటకం/నాటికను ప్రదర్శనకు ఎంపిక చేయడంతో పాటు, నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం నిర్వాహకుల విధులు.

ఇక నాటక సంస్థల వాళ్ళైతే కొత్త నాటకం/నాటిక ఎంచుకోవడం, నటీనటుల ఎంపిక, రంగాలంకరణ, సంగీతం, ఆహార్యం నిర్ణయించడం, రిహార్సల్ చేయడం..ఇలా ఆ రెండు మూడు నెలలూ బిజీ బిజీ. ఈ పరిషత్తుల కోసం ఉద్యోగాలకి సెలవు పెట్టి కృషి చేసేవాళ్ళూ ఉన్నారు. నాటకం తయారు చేయడానికి అయ్యే ఖర్చూ తక్కువేమీ కాదు. చాలా సంస్థలు ఒకే నాటకాన్ని వేర్వేరు పరిషత్తుల్లో ప్రదర్శించడం ద్వారా ఖర్చును ఆదా చేస్తున్నారు. ఈ మధ్యనే కొన్ని పరిషత్తులు 'నాటకం ఏ ఇతర పరిషత్తు లలోనూ ప్రదర్శింపబడి ఉండకూడదు' అని నిబంధనలు పెడుతున్నాయి. ప్రదర్శనకి ఎంపిక అవడం ఒక ఎత్తు, అయ్యాక బహుమతి కోసం చేసే కృషి మరో ఎత్తు. ప్రదర్శన మొత్తానికి బహుమతి తెచ్చుకోవాలని రచయితా, దర్శకుడు తాపత్రయ పడితే నటీనటులు, ముఖ్యంగా సీనియర్లు, వ్యక్తిగత బహుమతులపై దృష్టి పెడతారు. ఫలితంగా నాటకంలో లేని డైలాగులు, రిహార్సలు లో లేని మలుపులు స్టేజి మీద వినిపిస్తూ/కనిపిస్తూ ఉంటాయి.

వీళ్ళదేం ఉంది కాని, ఖద్దరు ధరించి, గన్మేన్లు వెంట రాగా, నిర్వాహకులతో ఉన్న మొహమాటం కొద్దీ చివరి రోజున చివరి ప్రదర్శన ఓ ఐదు నిమిషాలు చూసి ఉద్వేగభరితంగా ప్రసంగించి కంట తడి పెట్టేస్తారు అసలైన నటులు. నాటక రంగం చనిపోతోందని, మనమందరం బతికించుకోవాలనీ పిలుపు ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా నాటక రంగం చనిపోయే స్థితిలోనే ఉంటే ఇన్ని పరిషత్తులు ఎలా జరుగుతున్నాయో, జనం నుంచి అంత స్పందన ఎలా వస్తోందో వీళ్ళు చెప్పరు.. చెప్పలేరు.

3 వ్యాఖ్యలు:

 1. మురళి గారూ ! నాటక ప్రదర్శనల గురించి చక్కటి వివరణ రాశారు .రాజమండ్రి దేవి చౌక్ దగ్గర ఇప్పటికీ దసరాకి నాటక ప్రదర్శనలు తప్పకుండా ఉంటాయి .కాని ఇప్పుడు నాటక రంగానికి ఆదరణ తగ్గిందనేది వాస్తవం .మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ల ఊరిలో జాతరలు , దేవి నవరాత్రులు ,గణపతి నవరాత్రులు ,శ్రీరామ నవమి మొదలైన వాటికి చింతామణి ,హరిశ్చంద్ర ,గయోపాఖ్యానం,రాయబారం .........వంటి నాటకాలు ప్రదర్శించేవారు .ఇంచుమించుగా పల్లె ,పట్నం అనే తేడా లేకుండా నాటక ప్రదర్శనలు జరిగేవి .తర్వాత కాలానుగుణంగా ,ఖర్చురీత్యా కూడా (ఒక డ్రామాకి అయ్యే ఖర్చుకి 10 సినిమాలోస్తాయ్ మరి ) ఆలోచించి నాటకాలు మానేసి ఆస్థానంలో సినిమాలూ ,మ్యూజికల్ నైట్ లూ వచ్చేశాయి .ఇక నాటకాలు కొన్ని పట్టణాలకూ ,పరిషత్తులకూ పరిమితమైపోయాయి .ఏదో జీవనాధారం ఉండి ,హాబీ గా నటించేవారూ ,బాగా పేరున్న కళాకారులూ మాట పక్కన పెడితే ,నాటక రంగాన్ని నమ్ముకున్న వందలమంది కళాకారుల కుటుంబాలు దీన స్థితి అనుభవిస్తున్నాయ్ .రాస్తూంటే మీ పోస్ట్ కంటే కామెంట్ పెద్దదయ్యేలా ఉంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగా చెప్పారు. సుమారు పది పదిహేనేళ్ళుగా అమెరికానించి అజోవిభోకందాళం ఫొఉండేషను వారు ప్రతి జనవరిలోనూ ఒక తెలుగు నగరంలో నాటికల పోటీలు నిర్బ్వహిస్తున్ణారు.
  అదంతా అలా ఉండగా మీర్రాసిన చివరి పేరా సెబాసు. వాళ్ళ నటాన ముండు ఏ పరిషత్తు నటనా సరితూగదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @పరిమళం: కాలానుగుణంగా అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చినట్టే నాటకరంగం లోనూ మార్పులు వచ్చాయండి. కేవలం నాటకం మాత్రమే ఎంటర్టైన్మెంట్ గా ఉన్న రోజులనాటి ఆదరణే ఇప్పుడూ ఉండాలనుకోవడం అత్యాశ కదా.. మన నాయకులు చెబుతున్న మరణించే స్థితిలో ఐతే ఈ రంగం లేదండి..టీవీలు, సినిమాల్లో అవకాశాల కోసం ఐతే కానివ్వండి, తమ టాలెంట్ ప్రదర్శించే అవకాశం కోసం కానివ్వండి..ఇప్పటికీ కొత్త నటులు వస్తున్నారు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: అజోవిభో వారి పరిషత్తు ఒకటి చూశానండి చాలారోజుల క్రితం. సాహిత్య రంగంలో కూడా వారు మంచి కృషి చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు