గురువారం, జనవరి 07, 2016

నాణేనికి మరోవైపు

సుమారు పాతికేళ్ళ క్రితం మాట.. అప్పుడప్పుడే కొత్తగా జనబాహుళ్యంలోకి వస్తున్న 'ప్రపంచీకరణ' అంటే ఏమిటన్న చర్చ జరుగుతోంది."మరేమీ లేదు. అమెరికా ఆర్ధిక వ్యవస్థకి జలుబు చేస్తే, ప్రపంచ దేశాలన్నింటికీ తుమ్ములు రావడం" అన్నాడో పెద్దాయన. ప్రపంచీకరణ కారణంగా మార్కెట్లు పతనం అవుతున్న ప్రతిసారీ ఆయన మాటలు నాచెవిలో రింగుమంటూ ఉంటాయి. తాజాగా, గడిచిన మూడు రోజులుగా షేర్ మార్కెట్ తిరోగమనంలో ఉండడం చూసినప్పుడు సహజంగానే ఆ పెద్దమనిషి మాట మళ్ళీ గుర్తొచ్చింది.

ఆయన భాషలో, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకి వస్తున్న 'తుమ్ములకి' కారణం అమెరికా కాదు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన చైనా. గడిచిన పదేళ్లుగా వెలుగులు విరజిమ్మిన చైనా మార్కెట్టు ఒక్కసారిగా పతనమవ్వడం ప్రారంభమయ్యింది. ఇనుము, ఉక్కు తదితర కమోడిటీస్ అన్నింటికీ చైనా మార్కెట్లో విలువ పడిపోవడంతో మొదలయిన తిరోగమనం, ఆ దేశం తన కరెన్సీ విలువని తగ్గించడంతో వేగం అందుకుంది. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు స్టాక్ ఎక్స్చేంజి కార్యకలాపాలని సగంలోనే ఆపేసింది చైనా.

మామూలప్పుడు మన శరీరంలో ఏదన్నా చిన్న తేడా చేస్తే, ఒకట్రెండు రోజుల్లో సర్దుకుంటుంది లెమ్మని ఊరుకుంటాం. అదే మనకి జలుబు చేసినప్పుడు ఇంకేదన్నా తేడా చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగెడతాం. ఎందుకంటే, జలుబుతో పాటు వచ్చే అనారోగ్యం ఓ పట్టాన తగ్గదని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు, చైనా జలుబుతో పాటుగా వచ్చిన మరికొన్ని అనారోగ్యాల తాలూకు ఫలితాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. చైనా సరిహద్దు దేశమైన ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబుని పరీక్షించింది. ఇరాన్-సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. లిబియా అశాంతి సరేసరి.

విడివిడిగా చూసినప్పుడు వీటికి ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేసేంత శక్తి లేనప్పటికీ, చైనా మాంద్యం దెబ్బకి విలవిలలాడుతున్న పెట్టుబడిదారులని ఈ అననుకూల పరిస్థితులు ఆచితూచి అడుగేసేలా ప్రోత్సహిస్తున్నాయి. చైనా సంక్షోభం ప్రభావం భారత దేశంతో పాటుగా జపాన్, సింగపూర్ తదితర దేశాలమీదా కనిపిస్తోంది. ఒక్క భారత దేశం సంగతే తీసుకుంటే, బ్యాంకింగ్, భారీపరిశ్రమలు, నిర్మాణ రంగం, ఔషధ పరిశ్రమల షేర్ల ధరలు పతనమయ్యాయి. అమెరికన్ డాలర్ విలువ అరవై ఏడు రూపాయలకి దగ్గరలో ఉంది. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు శరవేగంతో పెరుగుతున్నాయి.

దేశీయంగా మార్కెట్ నష్టాలని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే ప్రయత్నం ప్రపంచ దేశాలన్నింటి వైపు నుంచీ జరగాల్సి ఉండగా, వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. మిగిలిన దేశాలన్నీ కరెన్సీ విలువని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉండగా, అమెరికా ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకుని తన డాలర్ ని బలపరుచుకునే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. పక్క వ్యాపారి నష్టాన్ని తన లాభంగా మార్చుకునే వాణిజ్య మనస్తత్వాన్ని తప్పు పట్టలేం.

ఇదేమీ ఊహించని పరిస్థితి కాదు. భారత దేశం ప్రపంచ విపణిలోకి అడుగుపెట్టినప్పుడు లోతుగా చర్చకి వచ్చిందే. అంతర్జాతీయ వాణిజ్యం తాలూకు లాభ నష్టాల గురించి దేశవ్యాప్తంగా సుదీర్ఘమైన చర్చలే జరిగాయి. అయితే, అప్పట్లో చాలామంది ప్రమాదం కేవలం అమెరికా నుంచి మాత్రమే వస్తుందని ఊహించారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని వ్యాపారాల్లాగే అంతర్జాతీయంగా జరిగే వాణిజ్యమూ భేషుగ్గా ఉంటుంది. వాతావరణంలో తేడాలు వచ్చినప్పుడే నాణేనికి రెండో వైపు కనిపిస్తుంది. తగినంత ఆర్ధిక బలంతో, నిష్పాక్షికంగా పనిచేసే ఒక అంతర్జాతీయ వేదిక ఏర్పాటు జరిగితే ఈ తరహా సంక్షోభాల బారిన పడకుండా మార్కెట్లని రక్షించుకోవచ్చేమో..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి