ఆదివారం, జనవరి 24, 2016

ఏడడుగులు ...

రోజులు వారాలుగా, వారాలు నెలలుగా చూస్తుండగానే తిరిగిపోయి మరో ఏడాది గడిచిపోయింది. 'నెమలికన్ను' ఏడేళ్ళు పూర్తిచేసుకుని ఎనిమిదో ఏట అడుగుపెడుతోంది. ఒకానొక చిత్తచాంచల్యానికి 'సెవెన్ ఇయర్స్ ఇచ్' అని ఓ ముద్దుపేరు పెట్టాడు ఇంగ్లీష్ వాడు. అది పెళ్ళికి సంబంధించిందే అయినప్పటికీ, ఏడేళ్ళు అనుకోగానే అప్రయత్నంగా గుర్తొచ్చేసింది. అమంగళం ప్రతిహతమగుగాక! పుట్టినరోజు కాబట్టి, గడిచిన ఏడాది తాలూకు  బ్లాగింగ్ పరిణామాలని గురించి మాట్లాడుకుందాం..

పరిమాణం పరంగా గతేడాదితో పోలిస్తే పోస్టుల సంఖ్య తక్కువే. అయితే, వెనక్కి చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించేలా రాశికి అరడజను కథలు రాశాను. 'గులాబీరంగు వోణీ' తో మొదలుపెట్టి, 'వర్ణచిత్రం,' 'తెరవెనుక,' 'అడివిదారి,' 'గుడి ఎనక నాసామి' మరియు 'అర్జున మంత్రం' అచ్చేశాను. వీటిలో మొదటి కథకి బోల్డన్ని ప్రశంసలూ, చివరిదానికి తగుమాత్రం విమర్శలూ అందుకున్నాను. పోస్టుల సంఖ్య తగ్గడానికి ఈ కథల పెరుగుదల కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనిపిస్తోంది.

పోస్టుల విషయంలో స్పందించినట్టే, కథల విషయంలోనూ ముక్కుసూటిగా అభిప్రాయాలు చెప్పి నాకు తోడ్పడుతున్న బ్లాగ్మిత్రులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. గతంతో పోల్చినప్పుడు బ్లాగు పాఠకులు పెరగడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్న మరో విషయం. గతేడాది రాసిన మొత్తం టపాల్లో అత్యధిక సంఖ్యలో పాఠకులు చదివిన పోస్టు 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.' నిజానికి ఏడాది కాలంలో చూసిన వాటిలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది. బోల్డంత నాటకీయత ఉన్నప్పటికీ సినిమాని ఆస్వాదించడానికి అదేమీ అడ్డంకి కాలేదు మరి.


కొత్త పుస్తకాలు చదివే విషయంలో అసంతృప్తి కొనసాగింది. చదివిన వాటిలో 'కరుణకుమార కథలు,' 'దేవర కోటేశు,' 'భూచక్రం,' 'కొల్లాయిగట్టితేనేమి' నవలలు మళ్ళీ చదివించాయి. శ్రీపాద వారి సమగ్ర సాహిత్యం కోసం ఎదురు చూడడంలోనే ఏడాది గడిచిపోయింది. పుస్తకం చేతికి రావడం ఇక 'మనసు' వారి దయ. పాత పుస్తకాల రివిజన్ మాత్రం కొంచం సంతృప్తికరంగానే సాగింది. ఏడాది కాలంలో మరణ వార్తలు కొంచం ఎక్కువగానే విన్నాను. సినీ, సాహితీ రంగాల ప్రముఖులతో పాటు వ్యక్తిగతంగా ఆప్తులైన వారూ దూరమయ్యారు. కాలం తన పని తను చేసుకుపోతోంది.

సినీసంగీత, సాహిత్య రంగాలవారిని కొందరిని కలుసుకునే అవకాశాలు అనుకోకుండా దొరికాయి. అయితే, ఆ కబుర్లని బ్లాగ్మిత్రులతో పంచుకోడం మాత్రం వీలుపడలేదు. సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావించాలి ఆ సంగతులని. కాలం తెలియకుండా గడిచిపోవడం అనేది నిత్య సత్యమే అయినా, ఈసారి మాత్రం మరింత వేగంగా ఏడాది గడిచిపోయినట్టు అనిపిస్తోంది, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే. గత పుట్టినరోజున రాసిన పోస్టు ఇప్పుడు చదువుకుంటే, అందులో రాసిన 'చేయాల్సిన పనులు' దాదాపుగా అలానే ఉండిపోయాయి. కాలం పరుగుని అందుకోవాల్సిందే.

వ్యాఖ్యలు, మెయిల్స్ ద్వారా నా బ్లాగింగుని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కామెంట్ బాక్సుని ఉపయోగించడానికి ఇబ్బందులు ఉన్నవారు, వ్యాఖ్య కన్నా వివరంగా అభిప్రాయం పంచుకోవాలి అనుకున్నవారూ తప్పకుండా మెయిల్ చేయచ్చు. ఇక, అక్షరాల్లో కమిట్ అవ్వడం కొంచం కష్టమైన పనే కానీ, చదవాల్సినవీ, రాయాల్సినవీ చాలానే ఉన్నాయి. చూస్తుండగానే ఏడేళ్ళు పూర్తయ్యాయంటే ఆశ్చర్యం, ఆనందం.. అయితే, There is a long way to go..

16 వ్యాఖ్యలు:

నీహారిక చెప్పారు...

Happy Blogging !

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు. అయితే ఇక మీది బ్లాగ్ పాఠకులతో ఏడడుగుల అనుబంధం అన్నమాట.
వచ్చే నెల నేను కూడ ఏడేళ్ళు పూర్తి చేసుకుంటున్నాను. కాని మీరు వ్రాసినదాంట్లో ఏడో వంతు కూడ వ్రాయలేకపోయాను.

కొత్తావకాయ చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు!

అజ్ఞాత చెప్పారు...

Entho paripakvata to rastarandi ye vishayamyna. Mee gnapakala nu khachhitam ga varanikosaranna chaduvutanu. Kaneesam aaru samvatsaraluga chaduvutunnanu.

Hima bindu చెప్పారు...

బ్లాగ్ గురువులకి అభినందనలు ! అప్పుడే ఇంత సీనియారిటీ వచ్చేసిందా నాకయితే ఫస్ట్ క్లాసు నుండి స్కూల్ ఫైనల్ చేరిన ఫీలింగ్ కలుగుతుంది మీరు నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకున్నారు నేనేమో అత్తెసరు మార్కులతో ప్రమోట్ అవ్వుతున్నాను అయితేనేమి నాకో బ్లాగ్ వుందని మురిసిపోతాను ;-) మీ వెనుక రెండు వారాల్లో నా పుట్టిన రోజు (బ్లాగ్ ) వచ్చేస్తుంది హ్యాపీ BIRTH DAY

Zilebi చెప్పారు...

శుభాకాంక్ష ల తో !

నెమలి కన్నులు చూడ చక్కన
' నెమలి కన్ను ' చదువ చంపకమాల
నెమలి కి అందం కన్నులు చందం నడకలు
' నెమలి కన్ను ' కి అందం విలక్షణం
చందం పుస్తక పరిచయం!
ఛీర్స్
జిలేబి.

సుభగ చెప్పారు...

ఏడు పుట్టినరోజులంటే మాటలు కాదు. ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి. ఆ రెంటినీ సమానంగా ప్రదర్శించారు. అందుకోండి మా అభినందనలు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

శుభాభినందనలు మురళీ గారూ

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈసారే కాదు, ప్రతిసారీ ఏడాది వేగంగా గడిచిపోయినట్లే అనిపిస్తుందండి మురళి గారూ. ప్రతి వేసవిలోను ఇంత ఎండలు మునుపెన్నడూ చూడలేదు అనుకోరూ, అలాగన్నమాట :) సహజం.
ఏడు సంవత్సరాలు బ్లాగుని విజయవంతంగా నడిపించారు, అభినందనలు. మీ బ్లాగ్ ఇలాగే మంచి టపాలతోను,అభిమానులతోను ఎల్లప్పుడూ కళకళలాడుతుండాలి.

పరిమళం చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు మురళిగారు

జ్యోతిర్మయి చెప్పారు...

ఎవరికోసమో కాక అలా రాసుకుంటూ పోతున్న మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది మురళి గారు. బ్లాగులు చదవడం మొదలుపెట్టిన దగ్గరనుండి మీరు రాసిన ప్రతి పోస్ట్ చదువుతున్నాను. ఎన్నడూ నిరుత్సాహపరచలేదు. మీ బ్లాగు ఏడేళ్ళు పూర్తిచేసుకున్నదంటే సంతోషంగా ఉంది. మీకు హృదయపూర్వక అభినందనలు.

లక్ష్మి చెప్పారు...

మనఃపూర్వక అభినందనలు మురళి గారు, మళ్ళా బుజ్జి మురళి కబుర్లు ఎప్పుడు చెప్తారా అని అనునిత్యం ఎదురు చూస్తూ....

మురళి చెప్పారు...

@నీహారిక: ధన్యవాదాలండీ
@బోనగిరి: నెంబర్లదేం ఉందండీ.. మనకోసం మనం రాసుకునే పోస్టులే కదా.. ధన్యవాదాలు
@కొత్తావకాయ: ధన్యవాదాలండీ

మురళి చెప్పారు...

@ప్రసూన: ఓహ్.. చాలా సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు
@హిమబిందు: హహహా.. బ్లాగు గురువు.. ఏనాటి మాటా! గుర్తుచేసుకుంటే నాకూ అప్పుడే ఇన్నేళ్ళు గడిచిపోయాయా అనిపిస్తూ ఉంటుందండీ.. ధన్యవాదాలు
@జిలేబి: చంపకమాలే!! మీ అభిమానం అండీ.. ధన్యవాదాలు

మురళి చెప్పారు...

@సుభగ: క్రమం తప్పకుండా చదువుతూ, నిర్మొహమాటంగా తప్పొప్పులు చెబుతున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు; ధన్యవాదాలండీ
@విన్నకోట నరసింహారావు: నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానండీ.. ధన్యవాదాలు

మురళి చెప్పారు...

@పరిమళం: ధన్యవాదాలండీ
@జ్యోతిర్మయి: బ్లాగంటేనే మనకోసం మనం రాసుకునేది కదండీ.. మీ ప్రోత్సాహం మరువలేనిది.. ధన్యవాదాలు..
@లక్ష్మి: బుజ్జి మురళి.. హామీ ఇవ్వలేను కానీ, తప్పకుండా ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి