బుధవారం, జనవరి 06, 2016

కలల రాజధాని

ఆంధ్రుల కలల రాజధాని 'అమరావతి' నిర్మాణానికి అనుకోని విధంగా ఓ చిన్న ఆటంకం వచ్చింది. రాజధాని నిర్మాణం కోసం పాఠశాల విద్యార్ధులు ఒక్కొక్కరి నుంచీ తలకి పది రూపాయల చొప్పున నిర్బంధ చందా వసూలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలని కొట్టేస్తూ తీర్పునిచ్చి హైకోర్టు స్వతంత్రంగా వ్యవహరించింది. ఓ బృహత్కార్యం తలపెట్టినప్పుడు ఇలాంటి చిన్నా చితకా ఆటంకాలు మామూలే కాబట్టి, వీటిని పెద్దగా పట్టించుకోనవసరంలేదు.

నిజానికి రెండు తెలుగు దినపత్రికలు, నాలుగైదు వార్తా చానళ్ళలో 'అమరావతి' గ్రాఫిక్స్ రూపాలని చూసీ చూసీ చాలా మంది తెలుగు ప్రజలకి కొత్త రాజధాని ఎలా ఉండబోతోందో అర్ధమైపోయింది. రాబోయే రాజధానిలో చూడబోయే వింతలూ, విడ్డూరాల విశేషాలకైతే అంతేలేదు. ప్రభుత్వం చెప్పేవి కొన్నైతే, ప్రజలకి మరింత బాగా విషయాన్ని అర్ధం చేయించడంలో భాగంగా పేపర్లు, చానళ్ళూ రంగులద్ది చూపిస్తున్నవి మరికొన్ని. మొత్తం మీద 'ఇదిగో రాజధాని' అంటే 'అదిగో సింగపూర్' అనే విధంగా తయారయింది పరిస్థితి.

విశాలమైన రహదారులు, ఆకాశ హర్మ్యాలు, సుందర ఉద్యాన వనాలు, ఏడు తారల హోటళ్ళు, హైక్లాసు జూదశాలలు... ఒకటేమిటి? పర్సు నిండా డబ్బున్న వాడికి కావాల్సిన సకల సౌకర్యాలూ 'అమరావతి' లో ఉండబోతున్నాయి. కొత్త రాజధానిలో వ్యాపారులంటే సింగపూర్, జపాన్ వారే.. ఉద్యోగులంటే లక్షల్లో జీతాలు తెచ్చుకునే సాఫ్ట్వేర్ నిపుణులు మాత్రమే. వీళ్ళకి అవసరం అయ్యేవి, అవసరం అవ్వబోయేవి అన్ని సౌకర్యాలూ 'అమరావతి' లో ఉంటాయి. వెతికి చూసినా సామాన్యుడి ప్రస్తావన మాత్రం ప్లాన్లలో ఎక్కడా కనిపించడం లేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సామాన్యుడి కోసమంటూ ఎలాంటి ఏర్పాట్లూ లేని రాజధాని కోసం సామాన్యుడు నిర్బంధంగా చందాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశించడం. పైగా, "పది రూపాయలంటే చిన్న మొత్తమే కదా?!" అంటూ సంబంధిత మంత్రి గారు ఆశ్చర్యం ప్రకటించడం.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు నుంచి చూసినప్పుడు పది రూపాయలు అంటే పది కేజీల బియ్యం. దాదాపుగా, పేద కుటుంబానికి సగం నెల ప్రధాన గ్రాసం. ఓ వంక  పదిరూపాయలకి పది కేజీల బియ్యం ఇస్తూ, మరో వంక 'చిన్న మొత్తం' అనడం విచిత్రమే..

ఇప్పటికే ఆన్లైన్ లో జరిపిన ఇటుకల అమ్మకంలో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని రికార్డు సంఖ్యలో 'ఇ'టుకలు కొనుగోలు చేసేశారు, రాజధాని కోసం. జరపబోయే మహా నిర్మాణానికి ఇటుకలు ఒక్కటే ఉంటే సరిపోతుందా? మిగిలిన సంబారాల మాటేమిటి? దుష్ట కాంగ్రెస్ పచ్చని రాష్ట్రాన్ని రెండు గా చీల్చి, ఆంధ్రులని రోడ్డున నిలబెట్టింది. మిత్ర బీజీపీ ప్రత్యేక హోదా విషయంలో పెదవి విప్పడంలేదు. అయినప్పటికీ, రాజధాని నిర్మాణం కోసం మాన్య ముఖ్యమంత్రి అహరహం శ్రమిస్తున్నారు. శ్రమ అయితే వారు పడగలరు కానీ, డబ్బు మరీ? అది ప్రజలనుంచి రావాల్సిందే.

ఎవరికి తప్పినా ప్రజలకి తప్పదు కాబట్టీ, వారు తప్పించుకోలేరు కాబట్టీ రాజధాని నిర్మాణం కోసం త్యాగాలు చేయాల్సిందే. భూముల సేకరణతో మొదలైన ఈ త్యాగాల పరంపర ప్రస్తుతం నిర్బంధ చందాల మీదుగా కొనసాగుతోంది. ఇప్పటికైతే హైకోర్టు కలుగజేసుకుంది..  కానీ ఈ పరంపర ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చూపాలంటే ప్రపంచ స్థాయి రాజధాని రావాల్సిందే.. అందుకోసం సామాన్యులంతా ఏదో ఒక రూపంలో త్యాగాలు చేయాల్సిందే. కలల రాజధాని కాస్తా పీడకలల రాజధాని అవ్వబోతోందా? అన్న సందేహానికి చోటే ఇవ్వకూడదు. రంగురంగుల 'అమరావతి' గ్రాఫిక్స్ రూపాన్ని గుర్తుచేసుకుని గర్వపడాలి..

7 వ్యాఖ్యలు:

Haribabu Suranenii చెప్పారు...

అంతా దొంగ_కొడుకులే
##@@&&***##

Lookwithin చెప్పారు...

Well said

అజ్ఞాత చెప్పారు...

కలలు కనమని కలాం గారు చెప్పారు కదండి. కలల రాజధాని ఎప్పటికైనా నిజం కాకపోతుందా? మొన్నటి దాకా తెలంగాణా కూడా కలే, కాని నిజం అయింది.
రాజధాని విషయంలో అంతా పారదర్శకంగా లేకపోవటం నిజమే కాని, వీలైతే ఇ-టుకలు కొనాలి కాని రాళ్ళెయ్యకూడదని నా అభిప్రాయం.

SRV JYOTHISHALAYAM చెప్పారు...

తప్పదంటారా?

త్యాగాలన్నీ ఎప్పుడూ ప్రజలే చెయ్యాలా? లగడపాటులూ, రాయపాటులూ, జీవీకేలూ, జీవీయార్ లూ, రామోజీలూ, డాక్టర్ రెడ్డీస్ లూ, అపోలో లూ, నాట్కోలూ ఏ త్యాగాలూ చెయ్యరా? వీళ్ళెవరూ అమరావతి కోసం ఒక్క ఇటుకైనా కొన్నట్లు వార్త రాలేదే ఇప్పటి దాకా? మనం ఆల్రెడీ మద్రాసుని త్యాగం చేశాం. హైదరాబాదుని త్యాగం చేశాం. హంపీని త్యాగం చేశాం. ఇంకా ఏం చెయ్యాలి?

సూర్యుడు చెప్పారు...

"దుష్ట కాంగ్రెస్ పచ్చని రాష్ట్రాన్ని రెండు గా చీల్చి, ఆంధ్రులని రోడ్డున నిలబెట్టింది."
This is what is giving you an opportunity to build a world class Capital ("ప్రపంచ స్థాయి రాజధాని రావాల్సిందే"), right?

"మిత్ర బీజీపీ ప్రత్యేక హోదా విషయంలో పెదవి విప్పడంలేదు."

Whose friend (మిత్ర బీజీపీ)?

"రంగురంగుల 'అమరావతి' గ్రాఫిక్స్ రూపాన్ని గుర్తుచేసుకుని గర్వపడాలి."

he he he, will it provide food to the common man?

"రాజధాని నిర్మాణం కోసం మాన్య ముఖ్యమంత్రి అహరహం శ్రమిస్తున్నారు. శ్రమ అయితే వారు పడగలరు కానీ, డబ్బు మరీ? అది ప్రజలనుంచి రావాల్సిందే."

Any funds coming for the Capital is peoples money only. How do the Govt. get money, it is all tax payers money. Isn't it?

Ultimately who makes money in these constructions?

మురళి చెప్పారు...

@హరిబాబు సూరనేని: మీ ఆగ్రహం అర్ధమవుతోందండీ.. ధన్యవాదాలు
@Look Within: ధన్యవాదాలండీ..
@బోనగిరి: పగటి కలలు కనమనలేదు కదండీ.. ఇటుకలతో పాటు రాళ్ళు కూడా అవసరమే కదండీ నిర్మాణానికి :) ..ధన్యవాదాలు

మురళి చెప్పారు...

@ఎస్సార్వీ జ్యోతిషాలయం: వాళ్ళు త్యాగాలు చేయిస్తారండీ మరి.. .ధన్యవాదాలు..
@సూర్యుడు: ఎవరికి దుష్ట కాంగ్రెసో వారికే మిత్ర బీజేపీ అండీ.. ఏదైనా ప్రజల సోమ్మేనండీ.. కాకపొతే, కేంద్రం నుంచి ఫండ్స్ వస్తే రాష్ట్ర ప్రజల మీద అదనపు పన్నుల బాదుడు కొంచమైనా తగ్గే వీలుంది.. ఇక, ఎవరు బాగు పడతారు అన్నదైతే బహిరంగ రహస్యమే కదండీ.. ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి