శనివారం, జనవరి 02, 2016

చదువులలోని సారమెల్ల ...

ఇంజినీరింగ్  చదువుతున్న ఓ నలుగురు కుర్రాళ్ళ మధ్య జరిగిన సంభాషణని వినాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోకుండా. వాళ్ళు మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్ధులని వాళ్ళ మాటల్ని బట్టి అర్ధమయింది. సుమారు ఇరవై నిమిషాల వ్యవధిలో ముప్ఫై ఒకటో తారీఖు రాత్రి కొట్టిన మందు తాలూకు హేంగోవర్ మొదలు రేణూ దేశాయ్, ఎస్జే సూర్య కలిసి లంచ్ చేసి, ఆ ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేయడం వరకూ ఎన్నో విషయాలు వాళ్ళ మధ్య చర్చకి వచ్చాయి. వాళ్ళెవరూ కూడా, వాళ్ళ మాటల్ని ఎవరూ వినకూడదు అనుకోలేదు.

"అనవసరంగా ఇంజినీరింగ్ లో చేరి బోల్డంత ఫీజులు కడుతున్నాం.. మామూలు డిగ్రీలో చేరితే సరిపోయేది.." ఓ కుర్రాడు అన్న ఈ మాట కారణంగానే నేను వాళ్ళ సంభాషణ మీద దృష్టి పెట్టాను. మామూలు డిగ్రీల వాళ్ళకీ, ఇంజనీరింగ్ వాళ్ళకీ కూడా ఒకేరకం ప్లేస్మెంట్స్ వస్తూండడం నుంచి వాళ్ళకా అభిప్రాయం కలిగిందని అర్ధమయ్యింది. "కాలేజీలో ఏం చెబుతున్నారో, మనం ఏం చదువుతున్నామో మనకే తెలియడం లేదు. మనకేదన్నా డౌట్ వస్తే ఫ్యాకల్టీనే కాదు, హెచ్ ఓ డీ కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇన్స్టిట్యూట్ లో చేరి నేర్చుకోవాల్సి వస్తోంది," అన్నాడొకతను.

"నేను-శైలజ బాగుందిట. నిన్న హ్యాంగోవర్ గా పడుకుండిపోయాను. ఇవాళ వెళ్దామా మనం?" గొంతు కొంచం కీచుగా ఉంది. "నేనూ అందుకే చూళ్ళేదు" అన్న మాట పూర్తవకుండానే మరొకతను అందుకున్నాడు."నేను ఏం అడిగినా 'అది ఇంపార్టంట్ కాదమ్మా' అంటాడు ఫ్యాకల్టీ. హెచ్ ఓ డీ మేడం దగ్గరికి వెళ్తే 'ఇది మీ ఫ్యాకల్టీని అడగాలమ్మా' అంటుంది. బీ టెక్ అయిపోతోంది, ఇంకా సి లాంగ్జేవ్ కూడా సరిగ్గా రాదంటే నవ్వుతారు జనాలు," వెనక్కి తిరిగి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాను.

"ట్విట్టర్ చూసేరా? రేణూ దేశాయ్, ఎస్జే సూర్యాతో లంచికెళ్ళి ఫోటోలు పెట్టింది. సూర్యా అంటే 'ఖుషి' 'నాని' డైరెక్టరు. ట్విట్టర్ లో పెట్టకుండా ఉండాల్సింది" మళ్ళీ కీచుగొంతే. "ల్యాబ్ లో సగం సిస్టమ్స్ మెయింటెనెన్స్ లో ఉన్నాయి. ఎప్పుడు బాగవుతాయో తెలీదు. ఫీజులు మాత్రం తగ్గించరు.. కేంపస్లొచ్చినప్పుడు తప్ప ల్యాబెప్పుడూ ఖాళీగానే ఉంటోంది. వైఫై అన్నా ఇస్తే మన లేప్టాపులు పట్టుకెళ్ళచ్చు.." ఫ్యాకల్టీ మీద కంప్లైట్ ఉన్న కుర్రాడే.. మొబైల్లో న్యూ ఇయర్ మెసేజీలు డిలీట్ చేస్తూ వింటున్నా.

"కేంపస్ లో ఏమేం కొచ్చిన్స్ వొస్తాయి?" ఒకతని కుతూహలం. "ప్రోగ్రామింగ్ గురించి అడుగుతారు," అని మరొకతని సమాధానం. "ఎన్నెక్కువ ప్రోగ్రాములోస్తే అంత త్వరగా కేంపస్ వస్తుందంటున్నారు. కాలేజీ ఫీజు, బయట ఇన్స్టిట్యూట్ లకి ఒక్కో ప్రోగ్రాముకింతని వేరే ఫీజు. మొత్తం లెక్కేస్తే చాలా అవుతోంది. అదే ఏ బీఎస్సీ లోనో చేరిపోయి, బయట కోర్సులు నేర్చుకుని ఉంటే ఇంజినీరింగ్ ఫీజు కలిసొచ్చేది," వివరించినతను ఫైనల్ ఇయర్ అనుకుంటా. "సర్దార్ గబ్బర్ సింగ్ పరిస్థితేంట్రా ?" కీచుగొంతు. ఆ ముఖ్యమైన ప్రశ్నని మిగిలిన ముగ్గురూ పట్టించుకోలేదు.

"ఇప్పుడేనా మనం సీరియస్ గా కష్ట పడకపోతే కేంపస్ రాదు. కేంపస్ రాకపోతే ఫ్రీడం ఉండదురా. జాబ్ కొట్టామంటే చాలు.. మనం ఏం చేసినా అడిగేవాడుండడు. సి, డాట్ నెట్, జావా నేర్చుకుంటే చాలు ఏదో ప్లేస్మెంట్ కొట్టెయ్యొచ్చు. కాలేజీని నమ్ముకుంటే కష్టం.." ఇతనొక్కడే సీరియస్ గా మాట్లాడుతున్నాడు.  "రేయ్.. నేను-శైలజ కి టికెట్లు బుక్ చేస్తున్నాను.. ఎవరొస్తారో చెప్పండ్రా.." కీచుగొంతు ప్రశ్న పూర్తవ్వకముందే వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. 

7 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...


క్రింద నేల ఉందని ఎరుకలో ఉన్న మనుషుల్లా ఉన్నారు :) సీ జావా యు నో :)

జిలేబి

Hima bindu చెప్పారు...

😀

నీహారిక చెప్పారు...

నెలకి రెండు కోట్లు జీతం ఆఫర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటున్న కంపెనీలు ఉన్నాయి. అంత పెద్ద ప్రోగ్రాం లు ఏమి చేసి ఉంటారా అన్న డౌట్ వస్తుంది నాకు. అంత మేధస్సు ఉన్నవాళ్ళు మనదేశం కోసం ఒక ఫేస్ బుక్ కానీ గూగుల్ ప్లస్ కానీ తయారుచేయడం లేదెందుకా అని మరో డౌట్....ఎన్నికలకు ముందు విదేశీ కంపెనీల ఉత్పత్తులు వాడొద్దు అని తెగ ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు ఎన్నికైన తర్వాత విదేశీ ప్రచార సాధనాలనే ఎందుకు వాడుతున్నారు అనేది నాకు అర్ధం కాని మరో ప్రశ్న !(కోట్ల ఆస్థి ఉండి కూడా) ఈ ఆర్ధిక అసమానతలవల్ల మాలాంటి వాళ్ళం(కొడుకు ఉన్న) తట్టుకోలేకపోతున్నాం ! కాలేజీ ల సంగతి అడగొద్దు..చెప్పనక్కరలేదు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఇంట్రెస్టింగ్..

అజ్ఞాత చెప్పారు...

మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు ఇంతకంటే బాగా ఎలా ఉంటాయి?
అయినా ఇప్పుడు ఫీజులు కట్టి చదివేవాళ్ళ కంటే రీఎంబర్స్‌మెంట్ స్కీములో చదివేవాళ్ళే ఎక్కువ అనుకుంటా!

మురళి చెప్పారు...

@జిలేబి: నో..నో.. ధన్యవాదాలండీ..
@హిమబిందు: చాన్నాళ్ళకి చూశానండీ ఇక్కడ!! విషయం ఏమిటంటే ఓ తప్పని గేదరింగ్ లో చెవిన పడ్డ విషయాలు.. ..ధన్యవాదాలు..
@నీహారిక: భారీ ఫీజులు కట్టి, భారీ కాలేజీల్లో చదివే వాళ్లకి భారీ ఉద్యోగాలండీ.. ఎంత చెట్టుకి అంత గాలి కదా.. ..ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@బోనగిరి: చాలా కాలేజీల్లో సరైన ఫాకల్టీ కూడా లేరని విన్నానండీ.. కంట్రోల్ ఒకటి బాగా తక్కువ.. ..ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి