గురువారం, జనవరి 28, 2016

ఎక్స్ ప్రెస్ రాజా

స్క్రీన్ టైంని గౌరవించే దర్శకుడు ఎలాంటి కథని ఎంచుకున్నా ప్రేక్షకుడిని చివరికంటా థియేటర్లో కూర్చోపెడతా డనడానికి తాజా ఉదాహరణ మేర్లపాక గాంధీ. 'స్వాతి' మార్కు సరసమైన సీరియళ్ళ రచయిత మేర్లపాక మురళిగారబ్బాయి దర్శకత్వంలో వచ్చిన 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా సంక్రాంతి పోటీని తట్టుకుని థియేటర్లలో నిలబడిందని తెలియగానే చూసేందుకు మొదలుపెట్టిన ప్రయత్నాలు ఎట్టకేలకి ఫలించాయి. దర్శకుడికి మాత్రమే కాదు, సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.

సినిమా కథలో సింహభాగం రోడ్డు మీదే జరిగితే అలాంటి సినిమాలకి 'రోడ్ మూవీ' లని పేరు. శర్వానంద్-సురభి జంటగా వచ్చిన 'ఎక్స్ ప్రెస్ రాజా' కథ ఎనభైశాతం రోడ్డు మీదే జరుగుతుంది. ప్రధాన పాత్రలు ఇళ్ళలో కన్నా, రోడ్ల మీదే ఎక్కువసమయం గడుపుతాయి. కథ కూడా కొత్తదేమీ కాదు. సింగల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న ప్రేమకథ. అయితే, ఆ పాయింట్ బలంగా ఉండడం, అల్లికలో శ్రద్ధ చూపించడం వల్ల ఆరంభంలో మొదలైన ఆసక్తి ఎండ్ టైటిల్స్ వరకూ ఏకరీతిలో కొనసాగింది.

హాస్యాన్నీ, ఉత్కంఠతనీ సమపాళ్లలో రంగరించి రాసుకున్న స్క్రిప్టులో ప్రేమకథని ప్రయాణాలూ, చేజింగులూ డామినేట్ చేసేసిన భావన కలగడం, చివరి పాట ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకునేలా ఉండడం మినహా, వంక పెట్టడానికేమీ లేదీ సినిమాలో. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఇవ్వడం మాత్రమే కాదు, ప్రారంభాన్నీ, ముగింపునీ కూడా ఇచ్చే విధంగా కథ రాసుకోవడం వల్ల ఎక్కడా అనవసర పాత్రలకీ, సన్నివేశాలకీ చోటు లేకపోయింది. చూస్తున్నంత సేపూ 'బొంబాయి ప్రియుడు' సినిమాలో డైమండ్ మొదలు, 'యమలీల' సినిమాలో చెల్లిపెళ్ళి వరకూ చూసేసిన సినిమాలు చాలానే గుర్తొచ్చినా, సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు.


చిన్ననాటి అనుభవాల కారణంగా కుక్కల్ని విపరీతంగా ద్వేషించే రాజా (శర్వానంద్), ఉద్యోగం కోసం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ పెంపుడు కుక్కపిల్లని ప్రాణంగా ప్రేమించే అమ్మూ (సురభి) తో ప్రేమలో పడతాడు. రాజా చేసిన ఓ పని కారణంగా తప్పిపోయిన ఆ కుక్కపిల్ల చిన్న విలన్ దగ్గరికి చేరితే, తన ప్రేమని గెలిపించుకోడం కోసం ఆ కుక్కపిల్లని దొంగిలిస్తాడు. చిన్న విలన్ భవిష్యత్తు మొత్తం ఆ కుక్కపిల్లతో ముడిపడి ఉంది. హీరోయిన్ కి మెయిన్ విలన్ తో పెళ్లి నిశ్చయం కావడంతో కథ నెల్లూరికి మారుతుంది. అక్కడ మెయిన్ విలన్ తల్లికీ ఒకానొక కారణానికి ఆ కుక్కపిల్ల కావాలి. అంతే కాదు, అనూహ్యంగా ఓ కేసులో చిక్కుకున్న హీరో తండ్రిని రక్షించగలిగేదీ ఆ కుక్కపిల్లే!!

ఓ మామూలు కుక్కపిల్లకి ఇంతలేసి శక్తులు ఎలా వచ్చాయీ అంటే, దర్శకుడు పగడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్ వల్ల. క్లాసూ, మాసూ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చే విధంగా రాసుకున్న స్క్రీన్ ప్లే వల్ల. ఏ పాత్ర విషయంలోనూ, ఏ సన్నివేశంలోనూ కుక్కపిల్లని మర్చిపోలేదు దర్శకుడు. చివరికి విలన్ కీ, హీరోకీ మధ్య వచ్చే కాన్ ఫ్లిక్ట్ కి కూడా హీరోయిన్ కన్నా ముందుగా కుక్కపిల్లే కారణం! విలన్ తల్లి వీరభద్రమ్మగా చేసిన ఊర్వశి థియేటర్ నుంచి బయటకి వచ్చాక కూడా గుర్తొచ్చి నవ్విస్తుంది. హీరో స్నేహితులుగా ప్రభాస్ శ్రీను, సప్తగిరి లకి పూర్తి నిడివి పాత్రలు దొరికాయి.

'జబర్దస్త్' హాస్యనటులు ధనరాజ్, శంకర్ లవి చిన్న పాత్రలే అయినా అవి లేకపోతే కథలో మలుపుల్లేవు.హరీష్ ఉత్తమన్ స్థానంలో ఎవరన్నా తెలుగు విలన్ని (కనీసం కొత్త నటుడు) తీసుకుని ఉంటే బాగుండేది. పోసాని, నాగినీడు, సూర్య, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. శర్వానంద్ సినిమా అనగానే 'పర్లేదు చూడొచ్చు' అన్న నమ్మకాన్ని సినిమా సినిమాకీ పెంచుకుంటున్నాడు. సురభికి బలమైన సన్నివేశాలు పెద్దగా లేవు. ప్రవీణ్ లక్కరాజు  నేపధ్య సంగీతం 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' ని గుర్తు చేసింది. మొత్తం మీద అందరికీ నచ్చే సినిమా 'ఎక్స్ ప్రెస్ రాజా.'

3 వ్యాఖ్యలు:

జ్యోతిర్మయి చెప్పారు...

బుధవారం (మా భాషలో వీక్డే) రాత్రి సినిమాకి వెళ్ళామేమో థియేటర్ లో ఇద్దరమే కూర్చుని చూశాం. :)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఆసక్తి కాస్త తగ్గుతుందేమో అనిపించగానే కొత్త పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడండీ.. గుడ్ మూవీ.. నాకు కూడా నచ్చింది.

మురళి చెప్పారు...

@జ్యోతిర్మయి: తెరమీద నెల్లూరు చూడగానే నెల్లూరు మిత్రులంతా అప్రయత్నంగా గుర్తొచ్చారండీ.. ధన్యవాదాలు..
@వేణూ శ్రీకాంత్: అవునండీ.. స్క్రీన్ ప్లే నే హీరో సినిమాకి.. 'వసంత కోకిల' పాత్ర హైలైటసలు!! ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి