సరస్వతికి పట్టాభిషేకం జరిగింది.
పురవీధుల్లో భక్తిపూర్వక ఊరేగింపు జరిగింది. 'అయ్యో.. అక్కడ లేకపోయానే'
అన్న బాధ ఓపక్కన తొలిచేస్తున్నా, జరిగిన సత్కారాన్ని గురించి తెలిసినప్పుడు
నా మనస్సు ఉప్పొంగింది. శరీరం రోమాంచితం అయ్యింది. నోటమాట రాని ఒకానొక
స్థితి.. 'ఎవరి ఆలోచనో కానీ, ఎదురుగా ఉంటే రెండు చేతులూ ఎత్తి నమస్కరించే
వాడిని కదా' అని పదేపదే అనిపించింది.. ఇంకా అనిపిస్తూనే ఉంది. తిరుపతి
పట్టణ ప్రజలారా, సాహితీ అభిమానులారా.. జోహారు మీకు.. ఎంత గొప్ప కార్యాన్ని
నిర్వహించారు మీరు!!
ఇంతకీ ఏం జరిగింది తిరుపతిలో? అన్ని
నగరాలు, ముఖ్య పట్టణాలలో జరుగుతున్నట్టే తిరుపతిలో పుస్తక ప్రదర్శన
ప్రారంభమయ్యింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో, ఆ
స్వామికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించే శనివారంనాడు జరిగిన ఆ పండుగ
ప్రారంభోత్సవ వేడుక అత్యంత ప్రత్యేకంగా జరిగింది. ఉత్సవమూర్తులకి ఊరేగింపు
జరిపే పల్లకీలో పుస్తకాలని ఉంచి పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు జరిపి..
అదిగో అప్పుడు ఆరంభించారు పుస్తక ప్రదర్శనని. ఎంత గొప్ప ఘట్టమో కదూ..
పల్లకి మోసే భాగ్యానికే కాదు, కనీసం కళ్ళారా చూడగలిగే అదృష్టానికీ
నోచుకోలేకపోయాను కదా..
కవీశ్వరులనే కాదు, వారి కావ్య
కన్నియలనూ తగురీతిన సత్కరించిన మహారాజుగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో
నిలిచిపోయాడు. 'మనుచరిత్ర' రాసి తనకి అంకితమిచ్చిన అల్లసాని వారిని రాయలు
సత్కరించిన రీతిని సాహితీలోకమంతా వేనోళ్ళ వర్ణించింది. 'అప్పుడు పుట్టి
ఉంటే..' అంటూ ఆ వేడుకని తన ఊహల్లో చూసి కడు రమణీయంగా వర్ణించారు దేవులపల్లి
కృష్ణశాస్త్రి. సాహిత్యానికి లభించిన ప్రత్యేక గౌరవాల్లో ముందువరుసలో ఉండే
వేడుక మరి. మరికొంచం వెనక్కి వెళ్తే, గౌడ డిండిమ భట్టుపై శ్రీనాథ కవిరాజు
సాధించిన విజయం, అందుకున్న సత్కారం.. ఇవేవీ మాటలకి దొరికేవి కావు.
రాజులూ,
రాజ్యాలూ పోయి పుస్తక ప్రచురణ ఒక పరిశ్రమగా అవతరించాక, సాహిత్యాన్ని
సత్కరించిన ఘనత తొలితరం ప్రచురణ సంస్థ 'వావిళ్ళ' కి చెందుతుంది. తాము
ప్రచురించిన పుస్తకాలన్నింటినీ మదరాసు మహానగరంలో ఏనుగు అంబారీ పై ఊరేగించి,
సాహిత్యాన్ని తామే దృష్టితో చూస్తున్నారో చెప్పకనే చెప్పారు వావిళ్ళ వారు.
ఆ తర్వాతి కాలంలో, సాహితికి అంతటి సత్కారం లభించిన దాఖలాలు కనిపించడంలేదు.
కారణాలు అనేకం. కాలం తెచ్చిన మార్పులో, స్వయంకృతాలో.. ప్రచురణ సంస్థలు
చాలా ఒడిదుడుకులనే ఎదుర్కొన్నాయి. రాన్రానూ, 'బయింగ్
బుక్స్? బార్బేరియస్!!' అనే తరం ఒకటి తోసుకు వచ్చేసింది.
తెలుగు
నేలకి సంబంధించి, పాతికేళ్ళుగా క్రమం తప్పకుండా ఏటా పుస్తక ప్రదర్శన
నిర్వహిస్తున్న ఘనత విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీది. ఏటా జనవరి నెలలో
పదిరోజుల పాటు స్వరాజ్య మైదానంలో జరిగే పుస్తకాల పండుగని, 'పుస్తక ప్రియుల
పాదయాత్ర' తో ఆరంభిస్తారు వీరు. పుస్తక ప్రియులతో పాటు, ఉత్సాహవంతులైన
చిన్నారులు గడిచిన తరం కవులు, రచయితల వేషాల్లో పాల్గొని పాదయాత్రకి ఓ
నిండుదనం తెస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనలో పుస్తక ప్రియులు ఉంటారు తప్ప,
పుస్తకాలు కనిపించవు.
తిరుపతి పుస్తక ప్రదర్శన విషయానికి
వస్తే, శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ గ్రౌండ్స్ లో భారతీయ విద్యాభవన్ తిరుపతి
శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఈనెల ఎనిమిదో తేదీ వరకూ
కొనసాగుతుంది. సుమారు వంద స్టాల్స్ లో తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యం
లభిస్తోంది. సరస్వతీ దేవి పటంతో పాటు, శ్రీమద్ భగవద్గీత, శ్రీ వెంకటేశ్వర
మహత్యం, ఇంకా మరికొన్ని పుస్తకాలని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి
మహతి ఆడిటోరియం నుంచి ప్రదర్శన స్థలం వరకూ ఊరేగింపు నిర్వహించి, అటుపై
ప్రారంభ సభని జరిపారు నిర్వాహకులు. మాడవీధుల్లో దేవదేవుడికి జరిపే సేవని
అంతే భక్తిభావంతో సాహిత్యానికి జరిపిన తిరుపతి పౌరులని ఒక్కనోటితో ఎంతని
మెచ్చుకోగలను??
(కబురునీ, ఫోటోనీ అందించిన 'ది హిందూ' కి కృతజ్ఞతలు)
కోడలికి మామగారింట సత్కారం ఘనంగా జరిపించారు కదా భలే
రిప్లయితొలగించండిబావుందండి
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: 'కోడలికి మామగారింట' ఎంత బాగా చెప్పారండీ!! ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@రాధిక (నాని): ధన్యవాదాలండీ..